ప్రముఖ కవి, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్.ఆర్. భల్లం బ్రైన్ స్టోక్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ, ఈ రోజు (21-12-21) తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి అంత్యక్రియలు ఈ రోజు మ.4.00 గం తాడేపల్లిగూడెంలో జరిగాయి… భల్లం గారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయనకు ఆరు నెలల బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు న్యూరో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సిటీ న్యూరో అండ్ కార్డియో హాస్పిటల్స్ లో వారం కిందట బైపాస్ సర్జరీ కూడా జరిగింది ఐసీయూలో ఉన్న ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలం చేశారు. ఈయన కుమారుడు కువైట్ లో ఉంటున్నారు. తండ్రికి అనారోగ్యం ఉండడంతో హైదరాబాదులోనే ఉండి చికిత్స చేయిస్తున్నారు. ఒక కుమారుడు తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నారు. ఉపాధ్యాయుడుగా పాలకొల్లు లంకలకోడేరు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పనిచేశారు. వీరి పూర్తి పేరు భల్లం సూర్య నారాయణ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, పోడూరు గ్రామంలో 1959, జూన్ 1న జన్మించాడు.ఇతను రచయిత,కవిసుధానిధి బిరుదాంకితుడు.
తెలుగు సాహితీ ప్రసంగాల్లో ఎస్.ఆర్. భల్లం దిట్ట. మంచి కవి, రచయిత, మంచి వక్త.
పల్లె నుంచి ఢిల్లీ వరకు సాహితీ ప్రసంగాల్లో ఎన్నో ప్రశంసలు పొందారు.. ఈయన కవితలు వ్యాసాలతో 20కి పైగా గ్రంధాలు ముద్రిత మయ్యాయి. అందులో గూడు వదిలిన గువ్వలు, కొల్లేరు,వేకువపిట్ట, నీటి భూమి లాంటివి కొన్ని. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహితీ ప్రసంగాలను సాహిత్యాన్ని ఎస్.ఆర్. భల్లం విస్తృతంగా ప్రచారం చేశారు. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ తెలుగు మహాసభలలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లిగూడెంలో చారిత్రక నేపథ్యం ఉన్న తెలుగు సాహితీ సమాఖ్యకు ఈయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉగాదిపురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడెమీ వారి పురస్కారం, రంజని కవితా పురస్కారం, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ పురస్కారం,ఎక్స్‌రే అవార్డులు అందుకున్నారు. ఈ తరానికి చెందిన ఓ ప్రముఖ సాహితీవేత్త ను కోల్పోవడం తెలుగు సాహితీ రంగానికి తీరని లోటు. ఆత్మీయ సాహితీ నేస్తానికి… అశేష తెలుగు పాఠకుల పక్షాన అక్షర నివాళులు.
-కళాసాగర్