- యువత స్క్రీన్ టైం తగ్గించి, పఠనం వైపు మొగ్గుచూపాలి: పి. తేజస్వి
తరాలను ప్రభావితం చేసే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని, అక్షరం ఎప్పుడూ ఒక మెరుగైన సమాజాన్ని సృష్టిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ పి. తేజస్వి అన్నారు. విజయవాడ, పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని రామవరపు స్రవంతి రచించిన ‘నచ్చితే మళ్లీ కలుస్తాను’ కథల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం (జులై 29) కళాశాలలోని వెబినార్ హాలులో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం తేజస్వి ప్రసంగించారు.
పుస్తకాలే అద్భుతమైన టెక్నాలజీ: పుస్తకాలను ఒక ‘టైం మెషిన్’ లాంటి అద్భుతమైన సాంకేతికతగా ఆమె అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏడాదికి కనీసం 50 పుస్తకాలు చదువుతారని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ రోజూ పది గంటల పాటు పుస్తక పఠనం చేయడం వల్లే సాంకేతిక రంగంలో దిట్టగా ఎదగగలిగారని విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. నేటి యువతరం సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారకుండా, మొబైల్ స్క్రీన్ టైమ్‌ను బాగా తగ్గించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలన్నారు. యువత ఉద్యోగాల నిమిత్తం వీసాల కోసం ఇతర దేశాలకు వెంపర్లాడే పరిస్థితి పోయి, ప్రపంచమే మన దేశం వైపు చూసే రోజు రావాలని ఆకాంక్షించారు.
పురస్కారాల్లో ప్రాధాన్యం: రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే ఉగాది పురస్కారాల్లో సైతం యువతకు పెద్దపీట వేసే దిశగా సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఆమె వెల్లడించారు.
రచయిత్రికి నగదు బహుమతి: ఈ కార్యక్రమంలో కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ లలితప్రసాద్ పుస్తక తొలి ప్రతిని అందుకున్నారు. అనంతరం యువ రచయిత్రి స్రవంతిని అభినందిస్తూ రూ. 10 వేల నగదు బహుమతిని అందజేశారు. బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్న మరో విద్యార్థిని భువనశ్రీ ఈ కథా సంపుటిపై చక్కటి సమీక్ష (Book Review) అందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్, డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల, లైబ్రేరియన్ డా. వాణిశ్రీ, రచయిత్రి ఆర్. స్రవంతి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
–కళాసాగర్
