గుంటూరులో ‘శ్రీహరి సిత్రాలు’ పుస్తకావిష్కరణ

నేడు బంధాలు-మానవ సంబంధాలు డెలిట్ చేసుకునే అంశాలుగా మారిపోతున్నాయి
పుస్తకావిష్కరణ సభలో ‘అరసం’ జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ

సెల్ ఫోన్ లో అవసరం లేనివాటిని డెలిట్ చేసుకున్నట్టే, నేడు బంధాలు-మానవ సంబంధాలు డెలిట్ చేసుకునే అంశాలుగా మారిపోతున్నాయని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో గుంటూరు, బృందావన్ గార్డెన్స్- శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆడిటోరియంలో ఆదివారం ఉదయం మురుగుడు శ్రీహరి రచించిన ‘శ్రీహరి సిత్రాలు’ ఛాయాచిత్ర కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- వందేళ్ల అనుబంధాలను క్షణాల్లో తెంపుకుంటున్న తీరును ఈ పుస్తకంలో రచయిత ‘తెగిపోతున్న బంధాలు’ పేరుతో కవిత్వం చేయడం నేటి సమాజ తీరుతెన్నుల్ని కళ్ళకు కట్టిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన డా. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకులు డా. తూములూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – సిరాచుక్క మౌనం వహిస్తే, సారాచుక్క రాజ్యం ఏలుతుందన్నారు. అందుకే కవులు మౌనం వీడి, సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవిత్వం రాయాలన్నారు. మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ- ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో ఎన్నో కొత్త ప్రక్రియలు రంగప్రవేశం చేస్తున్నాయన్నారు.

ఛాయాచిత్ర కవిత్వం అనే కొత్త ప్రక్రియతో కవిత్వమై పుస్తకంగా మనముందుకొచ్చిన శ్రీహరిని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యమన్నారు. వివిఐటి విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం సమన్వయకర్త మోదుగుల రవికృష్ణ మాట్లాడుతూ- తెలుగుభాషను రక్షిస్తున్నవారిలో కవులే అగ్రభాగాన నిలుస్తారన్నారు. అందుకు కవులంటే నాకు చాలా ఇష్టమన్నారు. సుప్రసిద్ధ కవి కోసూరి రవికుమార్ పుస్తకాన్ని సమీక్షిస్తూ పుస్తక రచయిత శ్రీహరి అంతరాత్మను, పుస్తకంలోని ఆత్మను సభకు పరిచయం చేశారు. రచయిత శ్రీహరి తన స్పందన తెలియజేస్తూ- తొలి పుస్తకంతోనే తనను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సభలో ఆధ్యాత్మిక రచయిత పచ్చిపులుసు సూర్యనారాయణ, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండికల్లు జమదగ్ని, గుళ్ళపల్లి రాఘవేంద్రరావు, గుళ్ళపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share via
Copy link
Powered by Social Snap