అక్కినేని శ్రీకర్ ప్రసాద్ అంటే చాలా మందికి తెలియదు కానీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అంటే మాత్రం ఇట్టే గుర్తుకు వస్తారు. తాజాగా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు.
8 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సీనియర్ ఎడిటర్ ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. 17 భారతీయ భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ టేబుల్ పై కట్ చెప్పి తీర్పు చెప్పిన మొదటి ఎడిటర్ గా ఆయనకు గుర్తింపు దక్కింది.
దాదాపు 37 సంవత్సరాల కెరీర్ లో శ్రీకర్ ప్రసాద్ సుమారు 500 సినిమాలను ఎడిట్ చేశారు. అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు సింహళీ- కర్బి- మిషింగ్- బోడో -పాంగ్ చెన్పా భాషలలో కూడా ఆయన ఎడిటర్ గా పని చేశారు. మణిరత్నం తెరకెక్కించిన చాలా సినిమాలకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అనేక బాలీవుడ్ సినిమాలతో పాటు.. దక్షిణ భారత సినిమాలకు పనిచేసిన గ్రేట్ ఎడిటర్ గా ఆయన పాపులర్.
అలనాటి దర్శకుడు, నిర్మాత, నటుడు ఎల్వీ.ప్రసాద్ – శ్రీకర్ ప్రసాద్‌కి దగ్గర బంధువు. గతంలో ఆయన ‘యువ’, ‘గురు’, ‘ఫిరాక్’లాంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. గత ఏడాది చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు ‘సాహో’, ‘సూపర్’ సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం భారీ చిత్రాలుగా వస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’, ‘పొన్నియన్ సెల్వన్’, ‘ఇండియన్ 2’ లాంటి పెద్ద చిత్రాలకు ఫిల్మ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఎడిటింగ్ టేబుల్ పై లెవెంథ్ అవర్ టెన్షన్స్ ని తగ్గించిన గ్రేట్ ఎడిటర్ గానూ శ్రీకర్ ప్రసాద్ కి పేరుంది. ఎందరో టాప్ స్టార్లు.. టాప్ డైరెక్టర్లు.. నిర్మాతలు ఆయనను నమ్మి ఫైనల్ కట్ ని వదిలేస్తుంటారని చెబుతుంటారు. అంత గొప్ప పాపులారిటీ లేటెస్ట్ జనరేషన్ లో ఇంకెవరికీ లేదు.