
పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా, డెల్టా పెనుమంట్ర మండలంలో పవిత్ర గోస్తనీ నది ఒడ్డున ‘దక్షిణ చినరామేశ్వర’ శివక్షేత్రముగా ప్రసిద్ధిచెందిన శ్రీ పార్వతీ సమేత శ్రీ రామేశ్వరుడు వెలసిన ‘నత్తారామేశ్వరము’ గ్రామమునకు, మైసూరు రాజ్యం నుండి తరాల క్రితం తరలివచ్చిన ‘దేవగుప్తపు’ కుటుంబంవారు అక్కడే స్థిరపడ్డారు. 28 జూన్ వారి వర్థంతి సందర్భంగా…ఈ వ్యాసం.
కాశీ పండితుడు, శిల్పకళా పితామహుడు, స్వాతంత్రోద్యమ దేశసేవకుడు శ్రీ సత్యలింగవుడయార్, శ్రీమతి భద్రమాంబ దంపతులకు 30, జనవరి 1938. చొల్లంగి అమావాస్యనాడు శ్రీనాథరత్న శిల్పివుడయార్ జన్మించారు. గుమ్మంపాడు వాస్తవ్యులు సమీప బంధువులు ‘రేలంగి’ వారి ఆడపడుచు. లక్ష్మీకాంతంతో బాల్యంలోనే వివాహం జరిగింది.
ప్రాథమిక విద్య నత్తారామేశ్వరము, హైస్కూలు విద్య – అత్తిలి, బి.ఏ., డిగ్రీ, D.N.R. కాలేజీ భీమవరములో పూర్తి చేశారు. తండ్రి నుండి శిల్పకళ వారసత్వంగా పొందినారు. బాల్యం నుండి విద్యతోపాటు శిల్పాలు, తీర్చిదిద్ది అందరి మన్ననలు పొందేవారు.
తన విద్యను పెంపొందించు కునేందుకు పశ్చిమ బెంగాల్ లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ లో చేరారు. క్రమశిక్షణతో నిరంతర దీక్ష పట్టుదల కృషి తోడు 8 సంవత్సరాలు శిక్షణ పొందికైన ఆర్ట్స్ శిల్పశాస్త్రంలో డిప్లమో పొందారు. ఈ విద్యతో జీవితకాల సహజ శిల్పిగా తననుతాను తీర్చిదిద్దుకున్నారు. ఈ కాలంలోనే, టిబెట్, నేపాల్, భూటాన్, జపాన్, చైనా, మంగోలియా, శ్రీలంక వగైరా దేశాలు పర్యటించి, అక్కడి శిల్ప కళానైపుణ్యాన్ని పరిశీలించి, శాంతినికేతన్ విద్యాప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంత్యుత్సవాలలో ‘నూరు పలకల’పై విశ్వకవి జీవిత ఘట్టాలను మలచి, నాటి ప్రధాని, శాంతినికేతన్ -యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జవహర్ లాల్ నెహ్రూచే “ది బెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ విశ్వభారతి” అని ప్రశంసించబడి, సత్కార గౌరవాలు పొందారు. బసు కంపెనీ వారికి 36 అడుగుల నిలువెత్తు కాళికాదేవి విగ్రహం మలిచి, ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ఆచార్య పురస్కారము పొందారు.
1964లో యువశిల్పకళా పరీక్షలో నిర్ణీత సమయం కంటే ముందే శిల్పకళాఖండాన్ని రూపొందించి, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి ద్వారా ప్రథమ బహుమతి పొందారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా సమక్షంలో ఆయన విగ్రహాన్ని మూడు గంటల్లో తీర్చిదిద్ది, ఆశీస్సులను పొందారు. 1962లో చైనా భారత్ పై దాడి సమయంలో జరిపిన యుద్ధం ఎన్.సి.సి. క్యాడెట్ సరిహద్దులలో దేశభక్తుడిగా సేవలందించారు.
స్వదేశంలో 1956 లో ఢిల్లీ మ్యూజియమ్ కు నటరాజ్, సరస్వతి, 1960లో కాశ్మీర్ లో వృద్ధురాలి విగ్రహము. 1963లో నాగాలాండ్ లో దేవీ విగ్రహమును, 1966లో అస్సాంలో రామ, బుద్ధ, అంబేద్కర్ విగ్రహాలు, త్రిపురలో శ్రీకృష్ణ భగవద్గీత బోధ, శ్రీరామపట్టాభిషేకం, 1968 కాశీలో గంగామాత, 1972 తమిళనాడులో నటరాజ్, విగ్రహాలు రూపొందించారు. 1986లో ప్రఖ్యాత సినీనటుడు, నటరత్న, నాటి ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పిలుపుమేరకు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టాంకుబండ్ పై అన్నమాచార్య,కాంస్య విగ్రహం తీర్చిదిద్ది ఎన్.టి.ఆర్. ను ముగ్ధుల్ని చేసి, సత్కరించబడ్డారు.
వివిధ దేశాల్లో 1968లో ఇండోనేషియాలో ‘ది సీటెడ్ హార్సెస్’ విగ్రహము, 1969, 1972 అమెరికాలోను, 1976లో నేపాల్ ‘బుద్ధ’ విగ్రహమును రూపొందించి, నేపాల్ రాజుచే సత్కారం పొందారు.
శ్రీ ఆంజనేయ, సీతాసమేతరామలక్ష్మణులు, కనకదుర్గ, శ్రీకృష్ణ, భగవద్గీత బోధ, అనేక దేవీ, దేవతల విగ్రహాలు రూపొందించారు. మెహర్ బాబా, సాయిబాబా, శ్రీ స్వామివివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, వందలాదిగా విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు, వేలాదిగా అంబేద్కర్ విగ్రహాలు, గాంధీజీ, నెహ్రూ, ప్రకాశం, నేతాజీ, శాస్త్రీజీ, పొట్టి శ్రీరాముల డా. హెగ్డేవార్, డా. పట్టాభి సీతారామయ్య, వందలాదిగా ఎన్.టి.ఆర్. విగ్రహాలు,జలగం వెంగళరావు వంటి వారివి అనేక సాహిత్య, ప్రముఖుల, స్థానిక ప్రజాసేవకుల యొక్క విగ్రహాలు వారు తీర్చిదిద్దారు.
పూర్తి నిలువెత్తు సైజులో, బస్ట్ సైజులో కాంస్య విగ్రహాలు తీర్చిదిద్దడం వారి విశిష్టత. 1968లో పెనుగొండ (ప.గో. జిల్లా) శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి దేవాలయ రాజగోపురం పునః నిర్మాణంలో గోపురంపై అమ్మవారి అనేక విగ్రహాలు తీర్చిదిద్దారు. వారు జీవిత కాలం అమ్మ ఇచ్చిన ఆశీస్సులతో ఆనందంగా గడిపేవారు. వారు రూపొందించిన గానగంధర్వ ఘంటసాల విగ్రహము విజయవాడలో, ‘భారతమాత’ విగ్రహము నౌడూరు జంక్షన్ వద్దగల మందిరంలో, తాడేపల్లిగూడెంలో శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో వారు చెక్కిన శ్రీ స్వామి అయ్యప్ప శిలా విగ్రహమును ప్రతిష్ఠించారు. 1993 యు.ఎస్.ఎ. తానా సంస్థ ఆహ్వానంపై అమెరికాలో పర్యటించారు. సఖినేటిపల్లి (తూ.గో. జిల్లా).
గీతామందిరంలో నాటి రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారి ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్యసాయి బాబాగారిచే ‘సువర్ణ సింహతలాట కంకణం’ తోను, తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎన్. వెంకటరెడ్డి గారిచే ‘సువర్ణ గండపెండేరం’ తోను సత్కరించబడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం స్వర్గీయ ఆర్.ఎస్. రాజుగారి జయంతికి రుద్రరాజు ఫౌండేషన్ వారిచే ‘గోదావరి మాత 1999 పురస్కార సత్కారం పొందారు. ఆర్.ఆర్. ఫౌండేషన్ వారికి ప్రేమతో తరగల, నురుగులతో ఎగసిపడే ‘గోదావరిమాత’ అద్భుత శిల్పమును బహూకరించగా, అదే ‘గోదావరిమాత విగ్రహ నమూనాను 2003లో జరిగిన మహా గోదావరి పుష్కరాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ శాఖవారు ‘సేవా పురస్కారాల జ్ఞాపికలుగా రూపొందించినారు.
1993 – 1998 గుంటూరు జిల్లా పొన్నూరు- అంబేద్కర్ శిల్పకళాశాల ప్రిన్సిపాల్ గా అమూల్య సేవలు 2000లో ఇంటర్ నేషనల్ యూనిస్కో మిలీనియమ్ బెస్ట్ ఆర్టిస్ట్ పురస్కారము పొందారు. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్శీటీ భారతదేశంలో తొలిసారిగా శిల్పకళలో ‘డాక్టరేట్’ను వుడయార్ గార్కి 2002 జనవరిలో చెన్నైలో యిచ్చి సత్కరించింది. ఆయన తన రెండు చేతులతో ఒకేసారి తాపీలతో విగ్రహాలను తీర్చిదిద్దే ‘నవ్యసాచి’గా ప్రఖ్యాతి పొందినారు. జీవితకాలంలో శిల్పాలు చెక్కడము, దేవీ, దేవత, అన్ని రంగాల ప్రముఖులు, వ్యక్తుల, వేలాది విగ్రహాలు ఆయన రూపొందించినారు. నత్తారామేశ్వరంలో, తాడేపల్లిగూడెంలో శిల్పాశ్రమములు ఏర్పాటుచేశారు. ఎన్నో దేవాలయాలు, సంస్థలకు, వ్యక్తులకు అభిమానంతో విగ్రహాలు తీర్చిదిద్దియిచ్చారు. ఎంతోమంది బీదలకు ఉచిత ఆర్థిక సహాయాన్ని అందించిన మానవతావాది.
కేవలం శిల్పకళలోనే గాక, చిత్రలేఖనము, సాహిత్యం, సంగీతం, గానం, జ్యోతిషము, హోమియో, ఆయుర్వేదం, ప్రజాసేవ వంటి వివిధ రంగాలలో కూడా కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
వారు మాతృభాష తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, ప్రత్యేక అభిమాన ‘బెంగాలీ’తో సహా – బహుభాషావేత్త.
రాష్ట్ర, దేశ, విదేశాలలో ఎన్నో సన్మాన, సత్కారాలు పొందినా తన వృత్తి, ప్రవృత్తిలో నిరాడంబరంగా గడిపిన స్థిత – ప్రజ్ఞులు, ఆయన మార్గదర్శనంలో ఎందరో శిష్య, ప్రశిష్యులు తయారు అయ్యారు.
ఎల్లకాలము చిరు నవ్వులు చిందిస్తూ జీవించిన ఆ మహానీయుడు 28 జూన్ 2003న తన 65వ ఏట అనాయాసంగా పరమపదం చెందారు.
–ఆర్.వి.ఎస్.రాజు (ధనంజయ)