అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 30

శ్రీశ్రీ అంటే అక్షరంలో దాగిన ఆకలి జ్వా ల
శ్రీశ్రీ అంటే ఆకలేసి అరచిన వాడికి అమ్మజోల
శ్రీశ్రీ అంటే నవచైతన్య నిర్మాణ పాఠశాల
శ్రీశ్రీ అంటే శ్రామికుడి చెమటను తుడిచే తెలుగు చేతిరుమాల!

ఆధునిక అభ్యుదయ ఉద్యమంలో అసమానతల అమావాస్యలను అధిగమించి సమాజంపై కమ్మిన చిమ్మచీకట్లను చీల్చడానికి ఉదయించి, బడుగు జీవుల అలసటలో బాసటగా నిలిచి సాహితీ రంగంలో వీరంగం వేసిన వాడు శ్రీ రంగం శ్రీనివాసరావు. రెండు శ్రీలు ధరించి తెలుగు శబ్దవిరించి అనిపించుకున్న శ్రీశ్రీగారి ప్రతి అక్షరం ఒక శబ్ద భేదినిని తలపించే శరమే ! ఉగ్గేల తాగుబోతుకు ముగ్గేల తాజ్ మహాల్ ముని వాకిటన్ సిగ్గేల భావ కవికి విగ్గేల కృష్ణశాస్త్రికి – అని

శబ్దం మీద తనకున్న సాధికారతకు, ప్రభుత్వానికి ప్రతీకగా నిలిచాడు. పని చేసేవాడు కర్మయోగి-పనిచేయనివాడు కర్మరోగి అనే శ్రీశ్రీ జరుగుబాటుకు ఆటంకం కలిగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించాడు. మహా ప్రస్థానంలో చెప్పినా సినీరంగంలో చెప్పినా ఏ రంగంలో ఎవరికి చెప్పినా… ఎప్పుడు చెప్పినా… మనల్ని తన జగన్నాథ రథం పై ఎక్కించి మరో ప్రపంచాన్ని చూపించాడు. ఆడంబరాలెరుగని నిరాడంబరుడు, శ్రామిక వేదం తెలిపే దార్శనికుడు వెలుగులు విరజిమ్మే జిలుగుతార మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు నేటికీ మన ధృవతార !

( శ్రీశ్రీ జన్మదినం 30 ఏప్రిల్ 1910)

SA:

View Comments (2)

  • BMP సింగ్ గారి వ్రాత, కళాసాగర్ గారి వర్ణ చిత్రం
    చాలా బాగుంది

  • BMP సింగ్ గారి వ్రాత, కోటేష్రి గారి వర్ణ చిత్రం
    చాలా బాగున్నాయి