అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

(ఈ రోజు 15-06-2020 మహాకవి శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా…)

‘శ్రీశ్రీ’… అవి రెండక్షరాలే… కానీ అవి శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఒక చైతన్య స్పూర్తికి సజీవ దర్పణాలు. శ్రీశ్రీ… అబ్బ ఎంతగొప్పపేరు… ఆ పేరెంత గొప్పదో ఆ మహనీయుని కలం బలం కూడా అంతే గొప్పది. సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా శ్రీశ్రీ తెలుగువారికి దక్కిన గొప్ప వరం. ‘మహాపస్థానం’ అన్నా, మహాకవి అన్నా గుర్తుకొచ్చేది శ్రీశ్రీ నే. ముప్పయ్యవ దశకంలో శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ గీతాలను జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (జరుక్ శాస్త్రి… శ్రీశ్రీ మాటల్లో రుక్కాయి) ఒకదగ్గరకు చేర్చి అచ్చొత్తించారు. ‘జగన్నాథ రథ చక్రాలు ఆ కవితాసంకలనానికి నుదుటి తిలకం అయితే శ్రీశ్రీ ఎంతగానో అభిమానించే గీతం ‘కవితా ఓ కవితా’ అనే సుదీర్ఘ గీతం. ఈ రెండు కవితలూ ఒకే ఊపులో శ్రీశ్రీ రాసినవి. రెండు కవితలకూ ఎంతటి వైవిధ్యం! ఈ పుస్తకం విశాలాంధ్ర పబ్లిషింగ్ వారి నేతృత్వంలో యెనిసార్లు ప్రచురణకు నోచుకుందో లెక్ఖ లేదు. ఈ మహాప్రస్థాన గీతాలన్నిటికీ మార్క్సిజం అనే దార్శనికత వుంది. శ్రీశ్రీ ఆయా కవితలు రాసింది యాదృచ్ఛికంగానే! గణబద్ధ మాత్రా ఛందస్సుకు శుభం కార్డు వేసి కవియతలు రాయడంలో ఆద్యుడుగా శ్రీశ్రీనే చెప్పుకోవాలి. గురజాడ అప్పారావు చూపిన మార్గాన్ని మహాప్రస్థానం అనే గీతాలతో శ్రీశ్రీ మరింత విస్తృతం చేశారు. అందమైన అబద్ధాలకన్నా నిష్టూర్తమైన నిజంలోనే మంచి కవిత్వం జనిస్తుందని నమ్మిన దార్శనికుడు శ్రీశ్రీ. సామాజిక రుగ్మతను శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే నయం చేయగలం. ఆ శస్త్ర చికిత్స పేరే ‘విప్లవం’ అంటారు శ్రీశ్రీ. సామాన్య ప్రజానీకాన్ని విప్లవ పథంలో నడిపించేదే ‘విప్లవ సాహిత్యం’ అనేది శ్రీశ్రీ నమ్మిన కవిత్వం. శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకే రకం అంటారు చలం సోదరి సౌరిస్. కాలికింద నలిగి విరిగినప్పుడు ధ్వనించే చీమల కాళ్ళ చప్పుళ్ళు తన సంగీతంలో వినిపించగలిగిన మేధావి రోబ్సన్ అయితే… సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణ ధ్వానం తన కవితల ద్వారా వినిపించగల కవి శ్రీశ్రీ. ఆకలేస్తే ఆకశాన నక్షత్రాలను దర్శించే దార్శనికుడు శ్రీశ్రీ. కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి రక్షించే అపూర్వ శక్తి శ్రీశ్రీ కవిత్వానిది అంటూ మెచ్చుకున్న చలం, మహాప్రస్థాన పాఠకుడికి అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ లో కూడా కవిత్వముంది…చదువుకో అంటూ హితబోధ చేశారు. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝంఝానిల షఢ్జధ్వానం తట్టుకోగల చావ వుండే వాళ్ళనే ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని చదవమని శాసించారు చలం. నిండుమనసుతో ప్రపంచాన్ని ప్రేమించిన శ్రీశ్రీ అసమ సమాజం మీద కొరడా ఝళిపించారు. కార్మికలోకపు కల్యాణం కోసం రక్తాన్ని అక్షరాలలో రంగరించి కవిత్వీకరించారు. ఆయన కవిత్వం ఒక అగ్నిగోళ విస్ఫోటనం.
-షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap