కవితా భాస్కరుడు మహాకవి శ్రీశ్రీ

‘కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి’ అంటూ 1934లోనే మహాకవి శ్రీశ్రీ తను కలగన్న మరోప్రపంచానికి స్వాగతం పలికాడు…‘నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకిలేస్తాను’ అంటూ ప్రతిజ్ఞచేశాడు.‘కూటికోసం కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవినిపెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్ట’మో ఆ కష్టాన్ని తనకష్టంగా అనుభవించాడు…‘గిరులు, సాగరులు కంకేళికా మంజరులు, ఝరులు నా సోదరులు’ అంటూ తనదొక స్వర్గంగా, అది ఒక అనితర సాధ్యమైన మార్గంగా ఎంచుకున్నాడు… దారిపక్క చెట్టుక్రింద మూలుగుతూ జబ్బుచేసి పడిపోయిన దిక్కులేని దీనురాలు మరణిస్తే ‘’ఇది నా పాపం కాదంటూ’’ ఎంగిలాకు కూడా ఎగిరిపోయిందని ఆక్రోశించాడు… నిప్పులు చిమ్ముకుంటూ నింగికి తను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంలో వున్నవాళ్లే, నెత్తురు కక్కుకుంటూ నేలకు తను రాలిపోతే కూడా ఆలోచించని జనాన్ని చూసి ఆవేదనచెందాడు. ‘కర్షకవీరుల కాయం నిండా, కాలువకట్టే ఘర్మజలానికి ఖరీదుకట్టే షరాబు లేడ’ని నినదించాడు. ఏ దేశ’ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం’ అంటూ హోరెత్తాడు. ఈ ఆలోచనలు. ఆక్రందనలు మహాకవి శ్రీశ్రీ చేసినవే! అందుకే ఆయనను కమ్యూనిస్టు ముద్ర వేసి ప్రక్కన పెట్టారు. ఆయన కూడా ఈ గర్జనను కాస్త ప్రక్కనపెట్టి….‘కవితా ఓ కవితా, నా యువకాశల, నవ పేశల సుమగీతావరణంలో, నా గుహలో, కుటిలో, చీకటిలో ఒక్కదాన్నయి సృక్కిన రోజులు లేవా?’ అంటూ ఓ అద్భుత కవితకు శ్రీకారం చుట్టాడు. ఆ కవితను రసధునిగా, మణిఖనిగా, జననిగా వూహించుకున్నాడు. ఇవన్నీ ప్రపంచమంతటా వచ్చిన అల్లకల్లోల ప్రభావంతో మహాప్రస్థానంగా ఉద్బవించిన శ్రీశ్రీ ఆలోచనలు. ఈ ప్రస్థానానికి గుడిపాటి వెంకటచలం రాసిన యోగ్యతాపత్రం శ్రీశ్రీ కి ‘పద్మ’ పురస్కారంకన్నా విలువైనది. శ్రీశ్రీకి కవిత్వం మీద వున్న అదుపు, సంభాషణ, కవితా రూపాలమీద వున్న అదుపు కవిత్వప్రియుల్ని చకితుల్ని చేసింది. సృజనాత్మక రచనల అనువాదంలో అనుసృజనకు దృష్టాంతంగా నిలిచారు శ్రీశ్రీ. ’ఆకలి, శోకాలు చెలరేగుతున్నంతకాలం, నింగి, నేల, నిప్పు, నీరు ఉన్నంతకాలం ఆకలి గుండెల్లోనుంచి శ్రీశ్రీ అనే రెండక్షరాలు దూసుకొస్తూనే వుంటాయి… తెలుగు భాష ఉన్నంతకాలం శ్రీశ్రీ ఉంటారు’’. మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహా మనీషిని గురించి కొన్ని విషయాలను గుర్తుచేసుకుందాం…

తొలిరోజులు… సాహిత్య సేద్యం

తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30 న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రిపేరు పూడిపెద్ది వెంకట రమణయ్య, తల్లి ఆప్పలకొండ. శ్రీశ్రీ తండ్రిగారిని శ్రీరంగం సూర్యనారాయణ అనే దగ్గరి బంధువు దత్తత తీసుకోవడంతో ఇంటిపేరు శ్రీరంగం గా మారింది. శ్రీశ్రీ నెలలవయసులో ఉండగా పెద్ద జబ్బుచేసింది. అప్పుడు శ్రీశ్రీ కి వరసకు మామయ్య అయిన శివప్రసాదం శ్రీశ్రీ నుదుట చుట్టతో కాల్చారట. తల్లి శ్రీశ్రీ కి ఒకటిన్నర సంవత్సరం వయసున్నప్పుడే కాలం చేశారు. అప్పుడు తండ్రిగారు సుభద్రమ్మ అనే ఆవిడను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె ఆలన పాలనలోనే శ్రీశ్రీ పెరిగారు. తాతగారు శ్రీశ్రీ కి చిన్నతనంలోనే భారత, భాగవతాలను బోధించారు. శ్రీశ్రీ ప్రాధమిక విద్యను విశాఖలోని శివరామయ్య పాఠశాలలో పూర్తిచేశారు. హైస్కూలు విద్యను మిసెస్ AVN కాలేజీ అనుబంధ పాఠశాలలో అభ్యసించారు. అదే స్కూలులో శ్రీశ్రీ తండ్రి లెక్కల మేస్టారుగా, ఆతర్వాత హెడ్మాస్టర్ గా పనిచేశారు. అక్కడే శ్రీశ్రీ ఛందోబద్ధంగా పద్యాలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడే జగన్మిత్ర సమాజం వారు ప్రదర్శించిన ‘కృష్ణలీలలు’ అనే నాటకంలో శ్రీశ్రీ స్త్రీపాత్రను పోషించారు. హైస్కూలు దశలోనే శ్రీశ్రీ ‘వీరసింహ విజయసింహులు’ అనే కథను, ‘సావిత్రి సత్యవంతం’ అనే పద్యనాటికను, ‘పరిణయ రహస్యం’ అనే నవలికను, ‘గోకులాయ్’ అనే డిటెక్టివ్ నవలను రాశారు. అలా వైవిధ్య రచనలతో బాలకవిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీశ్రీ కి 15 సంవత్సరాలకే వెంకటరమణమ్మతో పెళ్లయింది. 1920 ప్రాంతంలో శ్రీశ్రీకి ‘స్వశక్తి’ అనే పత్రికకు సంపాదకులుగా వున్న పురిపండా అప్పలస్వామితో పరిచయమైంది, ఆయనే శ్రీశ్రీ కవిత్వాన్ని తొలిసారి పాఠకలోకానికి పరిచయం చేశారు. కలంపేరుతో శ్రీశ్రీ రాసుకున్న కవితలను పురిపండా ‘దివ్యలోచనములు’ పేరుతో తన పత్రికలో అచ్చువేశారు. ఇంటర్మీడియట్ లో వుండగా ‘ప్రభవ’ అనే పద్యగ్రంధాన్ని శ్రీశ్రీ రచించి ప్రచురించారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో వుండగా తెలుగు వ్యాసరచన పోటీలు పెట్టగా అందులో శ్రీశ్రీ కి ప్రధమబహుమతి వచ్చింది. బహుమతిగా ‘వేమన పద్యాలు’ పుస్తకాన్ని కాలేజీ ప్రిన్సిపల్ బహూకరించారు. ఆ పుస్తకం చదివాక శ్రీశ్రీ రచనా శైలిలో పెద్ద మార్పువచ్చింది. భావకవిత్వం వీడి సమాజంలో వున్న సమస్యలను ప్రతిబింబిస్తూ కవితలు రాయడం అలవడింది. 1928లో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో శ్రీశ్రీ సైన్సు సబ్జెక్టు ప్రధానాంశంగా బి.ఏ చదివారు. అప్పుడే కొంపెల్ల జనార్దనరావుతో సాంగత్యం పెరిగింది. భావకవిత్వాన్ని అభిమానిస్తూ శ్రీశ్రీ అప్పుడే సంప్రదాయ ఛందోబద్ధంగా ‘ప్రభవ’ అనే కావ్యాన్ని రాస్తే దానిని విశాఖ కళా సమితివారు ప్రచురించారు. నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు, మల్లంపల్లిం సోమశేఖరశర్మ, ముద్దుకృష్ణ వంటి సాహితీ మూర్తులతో ఆయనకు పరిచయం పెరిగింది. చదువు ముగించుకొని 1931లో విశాఖపట్నం వచ్చిన తర్వాత నిరుద్యోగపర్వం మొదలైంది. అప్పుడే శ్రీశ్రీ తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో 63 రోజులు బాధపడ్డారు. విశాఖ హార్బర్ లో టైమ్ కీపర్ గా, AVN కాలేజీ జువాలజీ విభాగంలో డెమానిస్ట్రేటర్ గా తాత్కాలిక ఉద్యోగాలు చేశారు. 1934 లో ‘మహాప్రస్థానం’ కవితా సంకలనానికి బీజం పడింది. ఆ గేయాలు ‘జ్వాల’ అనే పత్రికలో ప్రచురితమవుతూ వచ్చాయి. అక్కడ మూడేళ్లు పనిచేశాక 1938లో మద్రాసు వెళ్ళి ఆంధ్రప్రభ లో సహాయ సంపాదకుడిగా చేరారు. 1942లో ఆకాశవాణి, మద్రాసు, ఢిల్లీ స్టేషన్లలో అనౌన్సర్ గా, లక్నో మిలిటరీ కంటోన్మెంట్ లో లేబరేటరీ ఆసిస్టెంట్ గా పనిచేశారు. 1948లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు ఒక మహాసభలో శ్రీశ్రీ ని ‘మహాకవి’ అని సంబోధించారు. అప్పటినుండి శ్రీశ్రీ పేరుకు ముందు ‘మహాకవి’ అనే బిరుదు స్థిరపడిపోయింది. 1933-47 మధ్యకాలంలో రచించిన కవితలను 1950లో ‘మహాప్రస్థానం’ అనే పేరుతో నళినీకుమార్ అనే సాహితీ అభిమాని తొలిసారి ప్రచురించారు. ఈ పుస్తకం తెలుగు సాహిత్యపు దశను, దిశను కూడా మార్చిన పుస్తకంగా ఆదరణ పొందింది. 41 కవితలతో రూపొందిన ‘మహాప్రస్థానం’ కవితా సంకలనం ప్రతి ముద్రణకి 2000 కాపీల చొప్పున ఇప్పటికి 34 సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. ఈ పుస్తకానికి వచ్చినన్నివ్యాఖ్యానాలు, విశ్లేషణలు మరే పుస్తకానికి రాలేదనేది వాస్తవం. ఈ కవితా సంకలనం సృష్టించినంత సంచలనం తెలుగు సాహిత్యంలో మరే పుస్తకం సృష్టించలేదనే విషయం కూడా వాస్తవమే. ఈ పుస్తకానికి గుడిపాటి వెంకట చలం ‘యోగ్యతాపత్రం’ పేరుతో 1940లోనే ముందుమాట రాశారు. అందులో ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’ అనివ్యాఖ్యానించారు. ‘’రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ వుంటేనే ఈ పుస్తకం తెరవండి’’ అంటూ చలం అందులో ముగింపు వాక్యాలు రాశారు.

సినీరంగ ప్రవేశం… సినీగీయ సేద్యం

శ్రీశ్రీ కి సినిమాలమీద మోజు తన పదవ ఏటనుంచే మొదలైంది. అప్పట్లో విశాఖపట్నం లైట్ హౌస్ వద్ద చిన్న టూరింగ్ టాకీస్ లో మూకీ సినిమాలు చూసేవారు. ఆ అలవాటు మద్రాసులో చదువుకునేటప్పుడు బలీయమై ఇంగ్లీష్ చిత్రాలను ఎక్కువగా చూసేవారు. మద్రాసులో వుండగా మొదట ‘గాంధీనగర్’ అనే చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు చలం సంభాషణలు రాసేలాగా, శ్రీశ్రీ పాటలు రాసేలాగా అంగీకారం కుదిరింది. ఆ చిత్ర నిర్మాత వీరిద్దరిని బొంబాయి తీసుకెళ్లి సంగీత దర్శకుడు సి. రామచంద్రకు పరిచయం చేశారు. నిర్మాత అడ్వాన్స్ ఇవ్వకపోవడంతో రామచంద్ర పాటలకు బాణీలు కట్టేందుకు ఉత్సాహం చూపలేదు. దాంతో ఇద్దరూ మద్రాస్ కు తిరుగు ప్రయాణం కట్టారు. తర్వాత శ్రీశ్రీ హైదరాబాదు వెళ్ళి నిజాం రిఫారమ్ సెక్రెటేరియట్ లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు గా చేరారు. అయితే ముల్కీ సర్టిఫికేట్ లేనికారణంగా ఎక్కువకాలం ఉద్యోగంలో కొనసాగలేకపోయారు. మరలా శ్రీశ్రీ మద్రాసుకు వెళ్లారు. 1949లో R.S. జునార్కర్ హిందీలో నిర్మించిన ‘నీరా అవుర్ నందా’ అనే చిత్రాన్ని తెలుగులో అనువదిస్తూ ఆ చిత్రానికి మాటలు, పాటలు రాయమని నిర్మాతలు మల్లాది రామకృష్ణశాస్త్రి ని కోరారు. ఆయన బాగా బిజీగా వుండడంతో శ్రీశ్రీ పేరును సూచించారు. అలా ‘’ఆహుతి’’ పేరుతో తెలుగులో అనువదించిన ఈ చిత్రానికి శ్రీశ్రీ మాటలు పాటలు సమకూర్చగా, సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించారు. అందులో శ్రీశ్రీ తొమ్మిది పాటలు రాశారు. ఇదే తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ చిత్రం. అందులో శ్రీశ్రీ రాసిన తొలి పాట ‘‘హంసవలే ఓ పడవా ఊగుచు రావే… అలలమీద మైమరచి హంసవలే ఓ పడవా ఊగుచూ రావే’’ అనేది. ఈ పాటను ఘంటసాల, రావు బాలసరస్వతీదేవి పాడారు. వీరిద్దరూ పాడిన మరో పాట ‘’ప్రేమయే జనన మరణ లీలా… మృత్యుపాశమే అమర బంధమౌ యువ ప్రాణుల మ్రోలా’’ చాలా పాపులర్ అయింది. మాతృకలో నటీనటుల లిప్ మూవ్మెంట్ సింక్ అయ్యేలా శ్రీశ్రీ ఇందులో అన్ని పాటల్ని స్వేచ్ఛానువాదం చేశారు. సినిమా గొప్పగా ఆడకపోయినా పాటలన్నీ హిట్టయ్యాయి. తర్వాత 1949లో హెచ్.ఎం. రెడ్డి రోహిణీ బ్యానర్ మీద ‘నిర్దోషి’ అనే సినిమా నిర్మిస్తూ క్రొత్త రచయితను పరిచయం చేద్దామని శ్రీశ్రీ చేత రెండు పాటలు రాయించారు. అంతే కాకుండా నాలుగు సన్నివేశాలకు సంభాషణలు కూడా రాశారు. సినిమా బాగా ఆడడంతో శ్రీశ్రీ ని నెలకు 300 రూపాయల జీతానికి తన కంపెనీలో నియమించుకున్నారు. నిర్దోషి చిత్రం బాగా ఆడటంతో సొసైటీ పిక్చర్స్ నిర్మాత M.H.M మునాస్ తమిళం లో ‘ఉళఘం’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ దాని తెలుగు వర్షన్ ‘ప్రపంచం’ లో మాటలు, పాటలు శ్రీశ్రీ చేత రాయించారు. ఈ చిత్రంలో శ్రీశ్రీ ఒక చిన్న పాత్ర ధరించి తెరమీద తొలిసారి దర్శనమిచ్చారు. దాంతో ఆర్ధికంగా శ్రీశ్రీ నిలదొక్కుకున్నారు. డబ్బింగ్ చిత్రాల రచయితగా శ్రీశ్రీ అలా పది సంవత్సరాలు నిరాటంకంగా మాటలు పాటలు రాశారు. 1952లో వచ్చిన ‘మరదలు పెళ్లి’ అనే స్ట్రెయిట్ చిత్రానికి శ్రీశ్రీ మాటలు, పాటలు రాశారు. అదే సంవత్సరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం నుండి 42 మంది కమ్యూనిస్టు నాయకులు శాసనసభకు ఎన్నికయ్యారు. దాంతో కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడైన శ్రీశ్రీ కి 1953లో MLC పదవి దక్కింది. 1954లో స్టాక్ హోమ్ లో జరిగిన ప్రపంచ శాంతి మహాసభల్లో పాల్గొన్నారు. అభ్యుదయ రచయితల సంఘంలో చురుకైన సభ్యునిగా వ్యవహరించారు. అప్పుడే ‘చరమరాత్రి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

తేనెలొలికిన శ్రీశ్రీ పాటలు

శ్రీశ్రీ రెండువందల చిత్రాలకు పైగా పాటలు రాశారు. యాభైకి పైగా అనువాద చిత్రాలకు పాటలు, మాటలు సమకూర్చారు. అనువాద చిత్రాల్లో 500 కు పైగా పాటలు రాశారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు శ్రీశ్రీ కి మంచి సహకారం అందిస్తూ తను నిర్మించిన సినిమాలలో అధికశాతం పాటలు శ్రీశ్రీ చేతనే రాయించారు. అలాగే అన్నపూర్ణా సారథి దుక్కిపాటి మధుసూదనరావు శ్రీశ్రీ చేత తమ సినిమాలకు ఎక్కువ పాటలు రాయించారు. ఇక్కడ మీకొక మాట చెప్పాలి. శ్రీశ్రీ ప్రభంజనం మద్రాసులో ఒక వెలుగు వెగుతున్నప్పుడు గిట్టనివాళ్లు తన సహచర గేయకవికి (సభ్యత కాదని పేరు చెప్పడం లేదు) శ్రీశ్రీ మీద పితూరీలుచెప్పి ఎక్కవేశారు. ఆవేశంతో ఆ కవిగారు ‘జ్యోతి’ మాసపత్రికలో శ్రీశ్రీ గురించి ‘’తెలుగే సరీగరాని నీకు దేవభాష యెందుకురా’’ అంటూ విసుర్లు విసిరారు. మరుసటి నెల సంచికలో శ్రీశ్రీ జవాబిస్తూ ‘’PAPలో నే రాసిన ఒక సంగం పాటకతికేవు. ఎందుకు నీ నీతులు నా ఎంగిలి తిని బ్రతికేవు’’ అంటూ గట్టిగానే సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేయాల్సివచ్చిందంటే, PAP(ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్) సంస్థ అంటే శ్రీశ్రీ కి అంతటి గౌరవమని చెప్పేందుకు మాత్రమే. 1952లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన ‘పల్లెటూరు’ సినిమాలలో శ్రీశ్రీ మహాప్రస్థానంలో రాసిన ‘’పొలాలలన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం పండగ… జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్’’ అనే కవితను వాడుకున్నారు. 1956-68 మధ్యకాలంలో శ్రీశ్రీ అనేక అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. స్ట్రెయిట్ చిత్రాలకు రెండు మూడు చొప్పున పాటలు రాస్తూ వచ్చారు. శ్రీశ్రీ పాటలు రాసిన చివరి సినిమా 1983లో వచ్చిన ‘నేటిభారతం’. అందులో ‘’అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం’’ అనే పాట శ్రీశ్రీ రాసిన చివరి పాట. అలాగే ‘’దాహం దాహం’ అనే అనువాద సినిమాకు చివరగా పాటలు రాశారు. ‘’సినిమా అనేది ఒక గంభీరమైన కళారూపం. భావ వ్యక్తీకరణకు సినిమాకు మించిన మాధ్యమం మరొకటి లేదు. సినిమా కేవలం వినోద సాధనమే కాదు, మంచి సందేశాన్ని తిన్నగా మనిషి గుండెల్లోకి పంపగల దివ్యాయుధ’’మని శ్రీశ్రీ తరచూ వెల్లడిస్తూ వుండేవారు. శ్రీశ్రీ కి వామపక్ష భావాలున్న మాట వాస్తవమే… అయితే సినిమాలలో అద్భుతమైన పాటలు రాశారు. ఒకసారి ఆరాధన చిత్రం లోని ‘’నా హృదయంలో నిదురించే చెలి’’ అనే పాట గురించి ఒకాయన ‘’ఆ చెలి ఎవరండీ’’ అని అడిగాడు. శ్రీశ్రీ వెంటనే ‘’కమ్యూనిజం’’ అని బదులిచ్చి చమత్కరించారు. వెలుగునీడలు చిత్రంలో శ్రీశ్రీ ‘’పాడవోయి భారతీయుడా …ఆడి పాడవోయి విజయగీతికా’’ అనే పాటను రాశారు. ప్రతి స్వాతంత్ర్య దినోత్సంనాడు ఈ పాట వినిపించని మైక్ వుండదంటే నమ్మండి. అలాగే రాముడు భీముడు చిత్రంలో ‘’ఉందిలే మంచి కాలం ముందుముందునా అందరూ సుఖపడాలి నందనందనా’’ అనే దేశభక్తి గీతాన్ని రాసి మెప్పించారు. ఇక అల్లూరి సీతారామరాజు సినిమాలో ‘’తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా… దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా’’ అంటూ అద్భుతమైన దేశభక్తి గీతం రాశారు. ఈ పాటకు జాతీయ బహుమతి వచ్చింది. తెలుగు పాటకు తొలి జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన కవి ఈ మహాకవే కావడం తెలుగు ప్రజల అదృష్టం. శ్రీశ్రీ దేశభక్తి గీతాలలో వాడి, వేడి కూడా వుంటుంది. అందుకే అవి జనరంజకమౌతాయి.

వాగ్దానంలో శ్రీశ్రీ హరికథ

ఇక ఆత్రేయ నిర్మించిన ‘వాగ్దానం’ సినిమాలో శ్రీశ్రీ ఒక హరికథ రాశారు. దానిగురించి కాస్త వివరిస్తే బాగుంటుందనిపించింది. ‘’శ్రీనగజా తనయం సహృదయం… చింతయామి సదయం, త్రిజగన్మహోదయం’’ అంటూ కానడ రాగంలో పాట మొదలవుతుంది. వెంటనే ‘’శ్రీరామభక్తులారా! ఇది సీతాకల్యాణ సత్కథ’’ అంటూ వచన వర్ణనతో ఈ హరికథ ప్రారంభమౌతుంది. ‘’సీతాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచి వచ్చిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి రఘురాముడు’’… అంటూ తిన్నగా విషయానికి వచ్చేస్తారు శ్రీశ్రీ. ఇక్కడ రఘురాముడు ముల్లోకాలనుండి వచ్చిన వీరాధివీరులకన్నా ఎందుకు దివ్యసుందరుడో వివరిస్తారు. రాముడు నెలరేడుకు సరిజోడు అని, అతని కనులు మగమీలను యేలుతాయని, అతను నవ్వితే రతనాలు రాలుతాయని…. అన్నిటికన్నా ఆ రఘురాముని చూచిన మగవారు కూడా మైమరచి మరులుగొనేటంతటి మనోహరుడు అని వర్ణిస్తారు. శ్రీశ్రీ ఆ రఘురాముని పరాక్రమం గురించి ముందుగా చెప్పలేదు. కేవలం అతని మనోహర మూర్తిని మాత్రమే వర్ణించారు. ఇక సీతాదేవి ఆ మనోహర విగ్రహాన్ని అంతఃపుర గవాక్షం నుంచి ఓరకంట చూసి, చెలికత్తెలతో ‘’ఎంతసొగసుగాడే, మనసు ఇంతలోనే దోచినాడే’’ అంటుంది. అంటే స్వయంవర సంరంభం యెలావున్నా రఘురాముని ఆ సీతమ్మ తొలిచూపులోనే మనసు దోచేసుకున్నదని, తన నోము ఫలమతడేనని నిర్ణయించుకున్నదని ఒక్క వాక్యంలోనే శ్రీశ్రీ చెప్పేశారు. సీతాదేవి అలా పరవశయై వుండగా, మరొక సన్నివేశానికి శ్రీశ్రీ వేగంగా వెళ్లిపోతారు. అక్కడ సభామంటపంలో జనక మహీపతి సభాసధులకు సీతాదేవిని పరోక్షంలో పరిచయం చేస్తారు. ఆమె వినయవిధేయతలు కలిగిన సద్గుణవతి అంటూ ‘’ముఖవిజిత లలిత జలజాత’’ అని, శివధనుస్సును అవలీలగా కదిల్చిన ఆమెకు, ఆ శివధనస్సును ఎక్కుపెట్టగలవీరుడే సరిజోడు అవుతాడని, అట్టివీరునికే సీతమ్మ మాల వేసి పెళ్లాడుతుందని నిబంధన విధిస్తూ స్వయంవర ప్రకటన చేస్తాడు. ఇక్కడ శ్రీశ్రీ ఒక అద్భుతమైన పద్యాన్ని రచించారు. ‘’ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి, తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి, ’సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత, మదనవిరోధి (శివుడు) శరాసనమును తన కరమును బూనినయంత’’ అనే రెండు వాక్యాలతో అద్భుత ఫలప్రయోజనాన్ని చేకూర్చారు. ఇంకాస్త ముందుకెళితే…ఈ పద్యానికి అనుసంధానమైన పద్యాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 1959లో రచించిన ‘ఉదయశ్రీ’ అనే కావ్యఖండికలో వచ్చే ‘ధనుర్భగం’ లోని ఒక పద్యాన్ని తన పద్యానికి అనుసంధానించి, ఆ హరికథ నడకతీరును వేగిరపరుస్తూ గొప్ప లయ (టెంపో)ను సమకూర్చారు. కరుణశ్రీ రాసిన పద్యం ఇక్కడి సన్నివేశానికి యెంత చక్కగా అమరిందంటే… ‘’ఫెళ్ళు’’ మనె విల్లు గంటలు ‘’ఘల్లు’’మనె, ‘’గుభిల్లు’’మనె గుండె నృపులకు … ‘’ఝల్లు’’మనియె జానకీ దేహ మొక నిమేషమ్ము నందె నయము జయమును భయము విస్మయము గదుర’’ అంటూ సమయస్పూర్తితో ‘’శ్రీమద్రమారమణ గోవిందో హరి’’ అనిపించారు. ఈ పద్య మాధుర్యాన్ని గమనిస్తే… శ్రీరాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు ఫెళ్ళుమని విరిగింది. ఆ వింటికి కట్టివున్న చిరుగంటలు ఘల్లుమని మ్రోగాయి. సభలో ఆసీనులైవున్న రాజకుమారులందరి గుండెలు ఆ భీకరనాదానికి గుభిల్లుమన్నాయి. ఇక, సీతాదేవి శరీరము ఝల్లుమని పులకరించిపోయింది…..ఎంత అందమైన, మనోహరమైన వర్ణన! ఈ చిన్నిపద్యంలోనే అక్కడి వాతావరణాన్ని కరుణశ్రీ యెంత మనోజ్ఞంగా మన కనుల ముందర నిలిపారో అనే విషయం శ్రీశ్రీ కి తెలుసు కనుకనే వారి పద్యాన్ని ఇక్కడ వాడుకున్నారు. ఈ పద్యం గొప్పతనాన్ని ఒకసారి పరిశీలిస్తే…ఒక్క నిమిషములోనే ఆ సభాస్థలిలో నయము, జయము, భయము, విస్మయము ప్రతిఫలించాయట. విల్లు ఫెళ్ళుమనడానికి నయము, గంటలు ఘల్లుమనడానికి జయము, నరపతుల గుండెలు గుభిల్లుమనడానికి భయము, వైదేహి దేహము ఝల్లుమనడానికి విస్మయము ప్రతీకలు గా ఈ పద్యంలో పోల్చారు. అందుకే శ్రీశ్రీ ఈ పద్యాన్ని వాడుకోవడానికి కారణం. లోకనాయకుడైన రాముడు, గొప్ప గుణవంతురాలు, అదృష్టవంతురాలు, చంద్రుణ్ణి అతిశయించిన ముఖకాంతిగల సౌందర్యవతి సీతను ప్రీతితో పెండ్లాడినాడు అని ముగించడం ఒక శ్రీశ్రీ మహాకవికే దక్కింది.

వైవిధ్య పాటలు…

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ నిర్మాత సీతారాం నిర్మించిన బొబ్బిలి యుద్దం సినిమాలో ‘’మురిపించే అందాలే అవి నన్నే చెందాలే… నాదానవు నీవేలే నీవాడను నేనేలే… దరీ చేరరావే సఖీ నా సఖీ” అనే పాటలో శ్రీనాధుని ఒక చాటుపద్యాన్ని శ్రీశ్రీ సాకీగా కొంతవాడుకొని ఆ పాటకు సొబగులద్దారు. ‘’సొగసు కీల్జడదాన, సోగకన్నులదాన, వజ్రాల వంటి పల్వరుసదాన, బంగారు జిగిదాన’’ అంటూ సాగే పంక్తిలో “బటువుగుబ్బలదాన” అనే మాటను తొలగించి “సింగారములదాన” అని ప్రతిక్షేపించి చాటువును పూర్తిచేసి… పాటకు శ్రీకారం చుట్టారు. ఎవరో ఒకసారి శ్రీశ్రీ జావళి రాయగలరా అని అడిగారాట. అందుకు జవాబుగా ఇదే చిత్రంలో “నినుచేర మనసాయెరా నా స్వామీ… చనువార దయసేయరా” అనే జావళి రాశారు. అంతేకాదు “సరసుడవని నిన్నే పదిమంది పొగడ, మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా” వంటి చరణాలు ఈ పాటలో అద్భుతంగా పొదిగారు. వెలుగునీడలు చిత్రంలో తొలిరేయి పాటను వైవిద్యభరితంగా రాశారు. “హాయిహాయిగా జాబిల్లి, తొలిరేయి ‘వెండిదారాలల్లి’ మందుజల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో” అనే పాటలో పండువెన్నెలను వెండిదారాలతో సరిపోల్చడం గొప్ప ప్రయోగం. అలాగే మాంగల్యబలం చిత్రంలో “జలతారు మేలిమబ్బు పరదాలువేసి, తెర చాటుచేసి” అని ప్రయోగించారు. “ఏమని పాడేదనో ఈ వేళ… మానస వీణా మౌనముగా నిదురించిన వేళ” అనే శ్రీశ్రీ రాసిన గొప్ప వీణ పాటను భార్యాభర్తలు చిత్రంలో సాలూరు రాజేశ్వరరావు అద్భుతంగా స్వరపరచారు. చిలకా గోరింక చిత్రంలో ఎస్.వి. రంగారావు, అంజలీదేవి ల మీద షష్టిపూర్తి సందర్భంగా తొలిరేయి పాటను ‘’నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే… ఊరించు తొలి దినాలే ఈ రేయి గడువసాగే’’ అంటూ రాశారు. ఇటువంటి వైవిద్యభరితమైన పాట తరవాతి సినిమాలలో ఎక్కడా రాలేదు. అవకాశం వచ్చిన ప్రతిచోటా వామపక్ష భావజాలాన్ని శ్రీశ్రీ గుప్పించేవారు. వెలుగునీడలు చిత్రంలో “ఓ రంగయో పూలరంగయో” అనే పాటలో “కడుపారగ కూడులేని, తలదాచగ గూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో” అని సావిత్రి సందేహం వ్యక్తం చేస్తే… “కలవారలు లేనివారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలుచేయ కలిగినప్పుడే” అంటూ అక్కినేని చేత నివృత్తి చెప్పించారు. శ్రీశ్రీ విరచించిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి కవితా సంకలనంలోని కొన్ని కవితలు సినిమాలలో పాటలుగా వాడుకున్నారు…. వాటిలో కొన్ని…

  1. ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే (కన్యాశుల్కం)
  2. పొలాలలన్నీ హలాల దున్నీ (పల్లెటూరు)
  3. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు (విప్లవశంఖం)
  4. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను (టాగూర్)
  5. పోనీ పోనీ సతుల్ హితుల్ పోతేపోనీ (ఆకలిరాజ్యం)
  6. కూటికోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని (ఆకలిరాజ్యం)
  7. ఓ మహాత్మా ఓ మహర్షి (ఆకలి రాజ్యం)
    అలాగే మహానది డబ్బింగ్ చిత్రంలో అనేక సందర్భాలలో హీరో కమల్ హాసన్ శ్రీశ్రీ ఖండికలను వల్లిస్తారు. వెలుగు నీడలు చిత్రంలో ‘’కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారాలలోనే బలిచేయకు’’ అనే పాట ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక యువకుడి ప్రాణాన్ని కాపాడింది. ‘’ఏదీ తనంతట తానై నీ దారికి రాదు శోధించి సాధించాలి అదియే ధీర గుణం’’ అనే చరణం ఆ యువకుడికి స్పూర్తి ప్రదాత అయింది.

శ్రీశ్రీ రచనలలో కొన్ని అద్భుతమైన పాటల్ని గుర్తుచేసుకుందాం… అవి

1.నందుని చరితము వినుమా పరమానందము గనుమా (జయభేరి)
2.పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా (ఇద్దరు మిత్రులు)
3.ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే (నర్తనశాల)
4.ఎవరివో నీ వెవరివో ఎవరివో ఎవరివో (పునర్జన్మ)
5.మనసున మనసై బ్రతుకున బ్రతుకై (డాక్టర్ చక్రవర్తి … ఈ పాటను ఆత్రేయ రాశారేమో అనే సందేహం రాక మానదు)
6.తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం (మనుషులు మారాలి)
7.దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా (దేవుడు చేసిన మనుషులు)
8.విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరలా (దేవుడుచేసిన మనుషులు)
9.ఎవరో వస్తారని ఏదో చేస్తారని (భూమికోసం)
10.సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారబ్ధం (యమగోల)
11.అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం (నేటి భారతం)
12.నేడే ఈనాడే ప్రజా యుద్ధ సంరంభం (ఈనాడు)
13.ధర్మ క్షేత్రం ఇది కురుక్షేత్రం కురుపాండవ రోషాజ్ఞుల రణక్షేత్రం (కురుక్షేత్రం)

చెవిలో రహస్యంతో చేతులు కాల్చుకొని …

1959 శ్రీశ్రీ, ఉషశ్రీ పిక్చర్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి తొలిసారి తమిళంలో శివాజీ గణేశన్, అంజలీదేవి నటించిన “నాన్ సొల్లుం రగస్యం” అనే చిత్రాన్ని తెలుగులో ’చెవిలో రహస్యం’ పేరుతో డబ్ చేశారు. అయితే ఆ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది. దాంతో శ్రీశ్రీ ఆర్ధికంగా నష్టపోయారు. ఒకానొక సందర్భంలో “చెవిలో రహస్యం సినిమా తీసి చేతులు కాల్చుకున్నాను” అంటూ చమత్కరించారు కూడా. డబ్బింగ్ చిత్రాల మీద మోజుతీరక 1964 లో ‘కవలపిల్లలు’ అనే డబ్బింగ్ సినిమానునిర్మించి మరోసారి శ్రీశ్రీ చేతులు కాల్చుకున్నారు. 1964 లోనే ఒక స్ట్రెయిట్ సినిమా తీయాలనే నిద్రాణమైన ఆలోచన మళ్లీ శ్రీశ్రీ మెదడు తొలిచింది. ‘రుక్మిణీ కల్యాణం’ పేరుతో ఒక కథ రాసి, మాటలు, స్క్రీన్ ప్లే కూడా సిద్ధం చేసుకున్నారు. మాటల మధ్య ఈ విషయం అన్నపూర్ణ సంస్థ అధినేతలు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావులకు తెలిసి, కథ విన్నారు. తనే స్వయంగా ఈ చిత్రాన్ని తీస్తానని చెప్పడంతో, మధుసూదనరావు పెట్టుబడిదార్లతో, పంపిణీ సంస్థలతో మాట్లాడి ఆర్దిక సహాయం చేస్తానని మాటిచ్చారు. అక్కినేని, కృష్ణకుమారి నటిస్తామని అన్నారు కూడా. సాలూరు రాజేశ్వరరావు సంగీతాన్ని, మాధవపెద్ది గోఖలే కళా దర్శకత్వాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శ్రీశ్రీ తనే దర్శకత్వం నిర్వహిస్తామన్నారు. ఇది రుక్మిణీ కల్యాణానికి సోషలైజేషన్ అన్నమాట. ఈ చిత్రం తాలూకు పూజా నిర్వహణ కూడా శ్రీశ్రీ ఇంట్లోనే నిరాడంబరంగా జరిగింది. (శ్రీశ్రీ స్వయంగా నాస్తికుడైనా భార్య సరోజ కోరిక మేరకు పూజా కార్యక్రమం జరిగింది). దుక్కిపాటి, అక్కినేని, కృష్ణకుమారి, రాజేశ్వరరావు, గోఖలే మొదలైన వారంతా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరుసటిరోజు, శ్రీశ్రీ రాసిన ‘అమ్మలగన్నయమ్మ’ అనే పద్యాన్ని, మరో పాటను ఫిలిం సెంటర్ స్టుడియోలో లీల చేత పాడించి రికార్డింగ్ చేయించారు….. అంతే ఆ సినిమా ప్రాజెక్ట్ అలాగే మూలపడిపోయింది. శ్రీశ్రీ జేబుకి మాత్రం ఇరవై వేల రూపాయల కిలుం వదిలింది.

జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను, వివాదాలను ఎదుర్కొన్న శ్రీశ్రీ తన సామర్ధ్యానికి తగినన్ని పాటలు సినిమాలకు రాయలేదేమో అనిపిస్తుంది. క్యాన్సర్ వ్యాధికి గురైన శ్రీశ్రీ 1983 జూన్ 15 న మద్రాసు లోని ఆసుపత్రిలో మరణించారు. ఆధునిక కవులలో శ్రీశ్రీ కవితా భాస్కరుడు!! ఒక మహాకవి!!!

*స్వానుభవం *

మహాకవి శ్రీశ్రీ ని రెండుసార్లు మద్రాసు త్యాగరాయ నగర్ లోని శ్యామ్ లాడ్జింగ్ లో కలుసుకొని ముచ్చటించే అపూర్వ అవకాశం నాకు దొరికింది. మా నెల్లూరుకు చెందిన రెడ్డిగారిది ఆ లాడ్జింగ్ (ఇప్పుడు ఆ లాడ్జింగ్ లేదు, రెడ్డిగారూ లేరు). సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీశ్రీ, రెడ్డిగారిని కలిసేందుకు శ్రీశ్రీ ఎక్కువగా అక్కడకు వచ్చేవారు. ఆ రెడ్డిగారికి శ్రీశ్రీ కి ముందు ఆల్ఫాహారం, కాఫీ ఇప్పించి, రెండు ఛార్మినార్ సిగరెట్ ప్యాకెట్లు, ఒక క్వార్టరు… ఇచ్చి కాసేపు కబుర్లు చెప్పించుకోవడం ఇష్టం. నాకు రెడ్డిగారే శ్రీశ్రీ ని పరిచయం చేశారు. శ్రీశ్రీతో రెండుసార్లు గంటకు పైగా మాట్లాడడం ఒక మధురానుభూతి. అందులో ముఖ్యంగా మహానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య, ప్రజా వైద్యశాల డాక్టర్ రామచంద్రా రెడ్డి, విరసం కార్యదర్శి కె.వి. రమణారెడ్డిగార్ల కబుర్లు, శ్రీశ్రీ రచించిన ‘ఝంఝ’ కవితలు మా చర్చాంశాలుగా వుండేవి. తర్వాత నెల్లూరులో జరిగిన ఒక బహిరంగ సభలో కూడా వారినిదడటం జరిగింది. ఆ మధురానుభూతులను ఇప్పుడు తలచుకుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తూవుంటుంది.
(వ్యక్తిగత విషయం జొప్పించినందుకు మిత్రులు నన్ను మన్నించమనవి)

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
‘శ్రీశ్రీ’ చిత్రకారుడు- అల్లు రాంబాబు

1 thought on “కవితా భాస్కరుడు మహాకవి శ్రీశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap