అచ్చుయంత్రాన్ని కనిపెట్టిన జాన్ గూటెన్ బర్గ్ జర్మనీ వాడయితే!… ఆ అచ్చుయంత్రాన్నుండి నాణ్యమైన ఫలితాన్ని రాబట్టిన తెలుగు వాడు శ్రీశ్రీ విశ్వం అని చెప్పుకోవచ్చు!!. ప్రచురణా రంగంలో అర్థశతాబ్దం అనుబంధం కలిగిన విశ్వానికి ‘మూడు పాతికలు’ వచ్చిన సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం… సీతారాం గారి మాటల్లో…
సాహితీ మిత్రులు విశ్వేశ్వరరావుకి కూడా ముమ్మాటికీ అన్ని ఏళ్ళే వొచ్చుంటాయి.
సరిగ్గా మహాప్రస్థానం వెలువడిన తర్వాత అదే సంవత్సరంలో పుట్టాడు.
లక్ష్మీతులసి, నాగభూషణం గార్ల నాల్గవ సంతానంగా. మహాప్రస్థానానికి కూడా వజ్రోత్సవం జరపవచ్చు. ఈ విషయం ముందే పసిగట్టి శ్రీశ్రీ నెరవేరని కలని మహాప్రస్థానం అరనిలువుటద్దం సైజులో ముద్రించి మురిసిపోయాడు శ్రీశ్రీ విశ్వం.
డెబ్బై ఐదేళ్ళొచ్చిన మనిషి ఎట్లుండాలి నిజానికి అందర్లాగా ఉండడం కాదు. నువ్వు నీలాగా ఉంటావ్, నేను నాలాగానే ఉండగలను. ఇంకెవ్వరి లానూ ఉండనవసరం లేదు అంటాడు. ఆయన్లాగా ఉండడం కూడా ఎవరితోనూ అయ్యేపని కాదు. బెజవాడ అరండల్ పేటలో మసీదుకు నాలుగడుగులవతల శ్రీశ్రీ బొమ్మ కనిపిస్తే అదే విశ్వేశ్వరరావుండే చోటు. పతంజలి ఫొటో కనిపిస్తే అదే విశ్వం నిలయం. శివారెడ్డి ఫ్లెక్సీ కనిపిస్తే ఇక నిశ్చింతగా అదే శ్రీశ్రీ ప్రింటర్స్. షాపు ముందు పచ్చటి మొక్కలు కనిపిస్తే ఇక హాయిగా లోపలికి తొంగి చూడొచ్చు మనం. మనం వెళ్ళిన సమయం లంచికి ముందైతే ఆయన ఆ కుర్చీలో ఉంటాడు. కూర్చుని మరీ ఉంటాడు. అప్పుడెలా ఉంటాడంటే ఎం.ఎల్.ఎ.గా పోటీ చేయటానికి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకున్న అభ్యర్థిలాగా ఉంటాడు. అట్లా అని ఆయనెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనెప్పుడూ ప్రజాపక్షమే – ప్రతిపక్షమే! నల్ల కళ్ళద్దాలు తొలగించి వేసిన సుప్రీం వెల్టర్లా ఉంటాడు.
అతకటం ఆయన పని. అతికించడం నిత్య కృత్యం. మనుషులను అతికించే పని ఆయనకు ఇష్టం. విరిగిన, కూలిన, రాలిన, కలలు చెదిరిన, ధైర్యం సడలిన మనుషులెవరైనా వస్తే అతికించి పంపేస్తాడు. కనిపించదు కానీ, ఆయన బల్ల మీద కొలిమి మండుతూ ఉంటుంది. అందులో మాటలతో పాటు ఇనప బిళ్లలూ వేగుతూ ఉంటాయి. ప్రక్కనే మల్లెలు మూట ఒకటి ఉంటుంది. మాటలు వాటి మధ్య పరీమళిస్తూ ఉంటాయి.
ఏదో అలంకారాల్లో చెబుతుంటామే – ఈ రాజు మూడవ కన్నులేని సాక్షాత్తూ ఈశ్వరుడే అని. అలాగన్నమాట. లోపలికి వెళ్ళటమే మనపని. బయటకు ఆయన ఎప్పుడు పంపితే అప్పుడు బయటపడాలి. ఈలోపు ఆయన గతంలో సార్ట్ అవుట్ చేసి మూటలు గట్టిన విషయాలను ఒక్కటొక్కటే విప్పుతుంటాడు.
నిన్న జరిగిన విషయాలనే నేడు మరిచిపోతున్నాం. గుర్తుంచు కోవలసినవి గుర్తుంచుకోవడం లేదు. గుర్తెరిగి నడుచుకోవలసిన తీరునూ విస్మృతిలోకి పంపుతున్నాం. అట్లాంటిది ఈ 75 వసంతాల మనిషి తనకు వ్యక్తిగతంగానూ, సామాజిక జీవిత పరంగానూ ఎదురైన ప్రతి అనుభవాన్ని గుర్తుంచుకున్నారు. ఇదెలా సాధ్యపడిందంటే తాను జీవిస్తూన్న ప్రతి క్షణాన్నీ సకలేంద్రియాలతో అనుభవించటం, ఆస్వాదిస్తూ ఉండటం వల్లనే. సాధారణంగా అరవై దాటాక వయసు మీదపడుతున్న కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా Senile dementia ఒకటి రంగప్రవేశమో, దొంగ ప్రవేశమో చేస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని దగ్గరకు రానీయలేదంటే ఏదో కిటుకు ఉండే ఉంటుంది. ఆ కిటుకు మరేమిటో కాదు. తనను తాను స్వచ్ఛందంగా సామాజికీకరించుకున్నాడు. మనిషికి సహజంగా ఉండే స్వార్థ చింతనను త్యజించాడు. అతి సంపద భారాన్ని తాను మోయకూడదని నిర్ణయించుకున్నాడు. పెట్టుబడి పెట్టి పీకల్లోతు లాభాల్లో మునగటం, ఊపిరాడకుండా బ్రతకటం తనకు సాధ్యం కాదని తేల్చేసుకున్నాడు. ముఖ్యంగా గతం గురించి విచారమూ, రేపటి గురించి బెంగా రెండూ అనవసరమని నిర్ధారించుకున్నాడు. అయితే బ్రతకటం కోసం ఎంత వరకు పని చేయాలో అంతవరకు మాత్రమే పనిచేయటం అభ్యసించాడు. ఎదుగూబొదుగూ అనేది మేడలు, మిద్దెలు మొదలైన వాటి ద్వారా ప్రదర్శితమయ్యేది కాదని తెలుసుకున్నాడు. అందుకే ఎప్పుడూ నిశ్చింత, నిర్విచారమూ ఆయన వెంట రక్షక భటుల్లాగా నిలబడి కనిపిస్తాయి నాకు.
విశ్వేశ్వరరావు ఎదుట ఉంటే బ్రతకటం ఇంత సులభమా, ఇంత సుకరమా అనిపిస్తుంది. అనుక్షణ జీవనరధ్యలేవీ బాధించవు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ జ్ఞాపకాలు మూట ముడులు విప్పే ఉంచుతాడు. చెప్పడం మొదలుపెడితే చాలు చరిత్రవాహిని అలా ప్రవహిస్తూ పోతుంది. ఎంతసేపు విన్నా, చూసినా విసుగని పించదు. అది సంభాషణ. అదొక సంవాదం. అదొక సరస చమత్కారోక్తి. అందులో చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు, కవులు, రచయితలు, వ్యవస్థలు అన్నీ ఘటనలుగా ముందుకు సాగుతుంటాయి.
తన ఊరికి జరిగిన అవమానాన్ని ఇప్పటికీ తలుచుకుంటాడు. కాటూరు, ఎలమర్రులకు తగిలిన గాయాలను గుర్తు చేసుకుంటాడు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం గురించి రాసిన హరీన్ఛటోను స్మరించుకుంటాడు. ఆయన ఆంగ్ల కవితను సరళవచన కవితగా తెలుగులో వస్తే బావుండనీ అనుకుంటాడు. 1955లో జరిగిన ‘దొంగదాడి’, ప్రతీపశక్తులు ఏకం కావటం, శ్రీశ్రీకి జరిగిన అవమానం వైపు వేలు చూపించి చూడు చూడు చూడండని, చరిత్రను చదవండని, తిరగరాయండని చెపుతూ ఉంటారు. ఇక పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి అయితే ఒక జీవిత చరిత్ర అంత సమాచారం విశ్వేశ్వరరావులో ఉంది. సుందరయ్య లాంటి నాయకుడు లేనే లేడుపో అంటారు. అట్లాంటి మనిషి రాడుపో అనేమీ అనరు గానీ, రావాలని, వస్తే బాగుంటుందని ఆశిస్తాడు. నార్ల చిరంజీవిని అదే పనిగా పదే పదే గుర్తుకు తెచ్చుకుని బెంగపడతాడు.
తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న రచయితలు, కవుల గురించి, ఎంతో విలువైన సమాచారం తెలియజెపుతాడు. సాహిత్యమొక్కటే కాదు. తెలుగునాట జరిగిన రాజకీయ పరిణామాలు, వామపక్ష పార్టీల వైఖరులు, విధానాలు మొదలైనవి ఒక చరిత్రకారుడు చెపుతున్నంత సునాయాసంగా చెపుతాడు. విప్లవ రాజకీయ ఉద్యమాలు, సాహిత్యం, విరసం మలుపులు దిగంబర కవిత్వం తదితరాలతో పాటుగా అజయ్ ఘోష్, పి.సి. జోషి, ఎస్.ఎ.డాంగే, ఎ.కె. గోపాలన్, మాకినేని బసవ పున్నయ్య లాంటి వారి గురించి ఎంత లోతుగా మాట్లాడతారో ఒక నిజాయితీ గల పార్టీ సభ్యుడు, కార్యకర్త గురించి అంతే గౌరవంతో చెపుతారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు అక్టోబర్ విప్లవం, ప్రపంచ ప్రజల విముక్తి పోరాటాలు, క్యూబా, చైనా, రష్యాలు, భారతదేశ జాతీయోధ్యమం, అతివాద, మితవాద, అమితవాద ధోరణుల గురించి ఆయన చెప్పే సోషియో ఎకనమిక్, పొలిటికోలిటరరీ అనెప్డేట్స్ విశేషమైనవే కావు ఆసక్తిదాయకం కూడా. ఇవన్నీ ఎక్కడ నుంచి నేర్చారు. విశ్వేశ్వరరావు పైకి కనిపించడు కానీ, విస్తృత రాజకీయ పరిజ్ఞానం గలవాడు.
సాహిత్యం, రాజకీయాలు రెండూ వేర్వేరు విడివిషయాలు కావు. ఆయన దృష్టిలో సాహిత్యం మెరుగైన జీవితానికి దారులు వేస్తుందని ఆయన నమ్మకం. రాజకీయాలు విలువలతో కూడినవైనప్పుడు ఆ విలువలను, ఆ భావజాలాన్ని సాహిత్యం ప్రచారం చేస్తుందని ఆయన నమ్మకం. సమాజాన్ని సాహిత్య కారులు, రాజకీయవేత్తలు, బుద్ధిజీవులు ఉత్తమమైన దారుల్లో నడపాలనే ఆకాంక్ష మెండు. అట్లా నడిపే వారిని ఆరాధించాడు. అభిమానించాడు.
అపసవ్యాలను ఎంత మాత్రమూ సహించడు. కర్ర విరగని, పామూ చావని వైఖరి నచ్చదు. కర్ర విరిగితే విరిగింది. పాము చావాల్సిందే నంటాడు. వ్యక్తిగత ఆస్తికి బారెడు దూరంలో నిలబడతాడు. ఏ మాటైనా సూటిగానే అంటాడు. ముక్కుసూటిగా నడుస్తాడు. నీళ్ళు నమలడు. నింగికి నిచ్చెనలు వేయడు. ఆరింటికే ప్రెస్సుకి తాళం వేస్తాడు. ఆరు తరువాత ఎవడొచ్చినా డోంట్కేర్, అరవైలక్షల ముద్రణ పని అప్పగిస్తామన్నా రేపొద్దున తొమ్మిది గంటలకే రమ్మంటాడు. విలువలు వదిలేశారు సరే, కనీసం బట్టలేసుకనైనా తిరగండి అనగలడు. పోరాటం, సంఘర్షణ, వైరుధ్యం, విముక్తి, సమత్వం, మమత్వం, ఎర్రజెండా, త్యాగశీలత లాంటి పదాలకున్న అన్ని అర్ధఛాయలూ ఆయనకు తెలుసు.
బెజవాడ అంటే ప్రాణమే కానీ, బెజవాడ ఏం చేసినా చెల్లుతుందనే విషయాన్ని అంగీకరించడు. ప్రజల కష్టాలు, కడగండ్లు చూసి కన్నీరు మున్నీరైపోడు. ఏం చేస్తే ప్రజల జీవితం మెరుగు పడుతుందో ఆ వైపుకు ఆలోచించమంటాడు. రాగద్వేషాలు లేని మనిషేమీ కాదు. వ్యక్తుల, వ్యవస్థల బలహీనతలు అధిగమించగల అవకాశమున్నప్పటికీ ఆ అధిగమించలేని అశక్తత పట్ల విపరీత అసహన పడతాడు. పురోగమనమే శిరోధార్యం తిరోగమనం క్షమించరాని నేరం అంటాడు. ఈ ఏడున్నరపదుల మనిషి అర్థశతాబ్దం పాటు పాటుపడ్డాడు. అనేక పాట్లూ . పడ్డాడు. అవి మానవులందరూ పడాల్సిన పాట్లేనని తాను మాత్రమే పడుతున్నవి కావని తెలుసుకున్నాడు.
‘సాహితీమిత్రులు’ అనే ఒక చిరునామా రూపొందించాడు. రెండు దశాబ్దాలుగా కవితా వార్షికలు క్రమం తప్పకుండా వెలువరిస్తున్నాడు. కవిత్వం కోసం ‘కవితా!’ సంచిక తెస్తున్నాడు. కవితా వార్షికలు ఐదువందల కాపీలు వేసి రెండు మూడొందలు ఉచితంగా పంచేసి, మిగిలిన రెండొందల ప్రతులకు స్థలం చాలక ‘ఈ విశాల జగతి నుండి ఏమిటి నే కోరినాను. ఒక గుప్పెడు సానుభూతి, ఒక పిడికెడు తిరుగుబాటు’ అని గొణుక్కుంటున్నాడు. ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ ముద్రణను ఒక వ్యాపారంగా కాకుండా కళగా ఆరాధిస్తూ వస్తున్నాడు. పుస్తకాల ప్రచురణలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మే 1న ప్రతి ఏటా కవిసమ్మేళనం, కవితా వార్షిక ఆవిష్కరణ తప్పనిసరిగా చేస్తూ వస్తున్నాడు. ఇవికాక ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం, శ్రీశ్రీ మహాప్రస్థానం, దొంగదాడి, లెనిన్ కావ్యం, కమ్యూనిస్టు ప్రణాళిక, నార్ల చిరంజీవి రచనలు, దిగంబరుల సంపుటం కొన్ని చెప్పుకోదగ్గవి.
తాను అచ్చువేసే ప్రతి పుస్తకం పట్లా అమిత శ్రద్ధ కనపరుస్తాడు. అటు ఫొటో ఇండియా శ్రీనివాస రెడ్డి గారినీ, ఇటు ఆర్టిస్ట్ గిరిధర్ అరసవల్లిని వెల్లుల్లిపాయలుగా వేపుకు తింటాడు. ముద్రణ పని అంత తేలికేమీ కాదు. ఫారాలకు ఫారాలు తారుమారైనా తొణకడు, బెణకడు. ఆ నష్టం తానే నిశ్శబ్దంగా భరిస్తాడు. ఆయన కూర్చునే సీటు వెనకాల ‘మహానటి సావిత్రి’ అలా వీక్షిస్తూనే ఉంటుంది. ఆయన వ్యవహారాన్ని ఆపైన ‘మో’ ఒక రాలీరాలని చిరునవ్వు విసురుతూనే ఉంటాడు. శ్రీశ్రీ ప్రింటర్స్ ఒక సంగమస్థలి. ఒక కూడలి. అక్షర తీర్థయాత్రీకులకు అదొక విశ్రాంతి స్థలం. ఎందరో వస్తుంటారు, పోతుంటారు. నిజానికి ఆయన దగ్గర్నుంచి వెళ్ళిపోయామనుకుంటారు కానీ, ఎక్కడికీ పోరు. ఆయనను కలిసిన వాళ్ళని గుండెకు కట్టేసుకుంటాడు. అలా బంధితుల మయ్యామనీ తెలీదు. ఎప్పుడో ఒక చుక్క రాలిపడ్డట్లు సత్యరంజన్ ‘మా అయ్యున్నాడా’ అంటూ తొంగి చూస్తాడు. సుబ్రహ్మణ్యభట్టు గారు అవలోకిలేశ్వరుడిలా అరమోడ్పు కనులతో అడపాదడపా ఆలకిస్తారు. సాహిత్య సభలు జరపటమంటే మహా కుతూహలం. పదిమందిని పిలవటమన్నా, వందమందిని కలవటమన్నా మహా ప్రీతి. తాను ఎవరినైనా అతిధిగా పిలిస్తే చాలు. కట్టుబట్టలతో వచ్చిన బట్టలు కట్టి పంపుతాడు. మనిషిని పట్టి చూస్తాడు. వాలకమూ, వైఖరీ గమనిస్తాడు. తనకు కాదు సమాజహితానికి పనికొచ్చే సరుకో కాదో గీటుగీసి చూస్తాడు. ఆ గీటురాయి పరీక్షలో ఆ సదరుడు నెగ్గాడా? వాడ్ని మించిన దురదృష్ట, నష్ట కష్ట జాతకుడు ఇక ఎవడూ ఉండడు. ఆ సదరుడు నుండి సమాజానికి ఏమి పిండివ్వాలో మేరా పిండిపోస్తాడు. సాహితీ ప్రయాణాలంటే చాలు రెండు కాళ్ళు కాదు, నాలుగు రెక్కలొస్తాయి. ఎంత దూరమైనా అలుపూ, అలసటా లేకుండా వెళ్ళొస్తాడు. తిరిగొచ్చి ఊరుకుంటాడా? ఆ బండ్ల మాధవరావును పిలుస్తాడు. అనిల్ డ్యానీనో, పుప్పాల శ్రీరామ్నో వస్తే ఇక ముచ్చట్లే ముచ్చట్లు. ఇలా చెప్పడం ఎందుకంటే – కొత్త ఉత్సాహాన్ని వాళ్ళకు కలిగించటం కోసమే.
లాభ నష్టాల బేరీజు వేసుకోలేదు. లెక్కలు చూసుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల సాహితీమిత్రుడు శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు ఉరఫ్ శ్రీశ్రీ విశ్వం. ఇంతా జేసి మా ప్రమీల గారు పక్కనుండబట్టే ఇవన్నీ జరిగాయనే మాట చెప్పాలిగా. ఆవిడ్ని విశ్వం మిత్రుల పక్షాన అభినందించాలి. వజ్రోత్సవం శుభాకాంక్షలు.
శ్రీశ్రీ ఎవడు బతికేడు మూడు యాభైలు అన్నాడు. ఎవడు మాత్రం మూడు పాతికలు తదేక చైతన్యంలో ఉన్నాడు విశ్వేశ్వర రావులా…
-సీతారాం
ఫోటో: శ్రీశ్రీ విశ్వం గారికి తను చిత్రించిన పోట్రైట్ ను బహుకరిస్తున్న ఆర్టిస్ట్ గిరిధర్ అరసవల్లి మధ్యలో రచయిత సీతారాం.