కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

అతని పేరు కొంచెం ! అతని ఊరు ప్రపంచం ! అతడే శ్రీశ్రీ !! ‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’ అన్న వాడు, తన జీవితాంతం అలా నిలబడి ఉన్నవాడు. అతడి కసీ కృషీ-అతడి కన్నూ, పెన్నూ, గన్నూ-అతడి గేయం, ధ్యేయం, న్యాయం, శ్రమవాదం, సామ్యవాదం, మానవతావాదం. సమానవతావాదం ! సామ్రాజ్యవాదాన్ని పాతరవేసే శ్రమరాజ్యవాదం ఎజెండా అతడు. గ్లోబల్ గూండాలను ప్రతిఘటించే ఎర్రజెండా అతడు.

శ్రమైకజీవన సౌందర్యమయ మరోప్రపంచం కోసం లెప్టూ రైటూ, లెప్టూ రైటూ అంటూ జాతిని కవనకవాతు చేయించిన మహాప్రస్థానమూ అతడే ! లెఫ్టే రైటూ, లెఫ్టే రైటూ అంటూ జాతిని కదన కవాతు చేయించిన మరోప్రస్థానమూ అతడే ! ఆకలిలోకం పనిముట్టె దోపిడిలోకం పనిబట్టే కత్తిమీద సాములాంటి కవిత్వంతో- కత్తసుత్తితో సాముచేసిన కవియోధుడు శ్రీశ్రీ !! అందుకే శ్రీశ్రీకి నిబద్దులం కావడంమంటే- సమాజానికి నిబద్దులు కావడం, చైతన్యానికి నిబద్దులు కావడం-సమకాలీన సమస్యలపై ప్రజా పోరాటాలకు నిబద్దులు కావటం అంతకంటే ఏ నిబద్దరచయితయినా చేసేదేముంటుంది. శ్రీశ్రీ కవితావారసులమైన మేం చేస్తున్నదీ అదే!! అంటూ గర్వంగానూ,గౌరవంగానూ చెప్పుకుంటూ శ్రీశ్రీ సాహిత్యాన్నీ, శ్రీశ్రీపై సాహిత్యాన్ని నూరు పుస్తకాలహోరు ప్రణాళికల ద్వారా కోటి రూపాయిల సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చేయడం ధ్యేయంగా చెప్పుకుంటున్న రచయిత, జర్నలిస్టు, శ్రీశ్రీ సాహిత్యనిధి సంస్థ కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ అంతరంగాన్ని “64 కళలు.కాం ‘ పాఠకుల ముందుంచుతున్నాం.

శ్రీశ్రీ సాహిత్యనిధి గురించి క్లుప్తంగా చెప్తారా?
* మహాకవి శ్రీశ్రీని భావితరాలకు చెక్కుచెదరకుండా అందజేయడం కోసం శ్రీశ్రీ రాసిందీ, చెప్పిందీ, శ్రీ శ్రీ మీద రాసిందీ, చెప్పిందీ పొల్లుపోకుండా నిక్షిప్తం చేయడమే ధ్యేయంగా 2000 లోని ఆలోచన.. 2007లో ఆచరణగా ‘శ్రీశ్రీ సాహిత్యనిధి’ ఏర్పాటయింది.
ఇప్పటికీ శ్రీ శ్రీ – శ్రీశ్రీ సాహిత్యనిధికి కొట్టిన పిండి కాదు. కొడుతున్న పిండి మాత్రమే. ఎందుకంటే శ్రీశ్రీ ఎవరికీ కొట్టిన పిండి కాదు. శ్రీశ్రీలో కొట్టాల్సిన పిండి ఎంతో ఉంది. అందు కోసం శ్రీశ్రీ అభిమానుల ప్రయత్నమే శ్రీశ్రీ సాహిత్యనిధి. ఆ ప్రయత్నంగా శ్రీశ్రీ అభిమానులు ఎగరేసిన శ్రీశ్రీ జెండాయే శ్రీశ్రీ సాహిత్యనిధి.
శ్రీశ్రీ భావాలు సాగుచెయ్యడం శ్రీశ్రీ అభిమానుల విధి !
శ్రీశ్రీ భావాలు పోగు చెయ్యడం శ్రీశ్రీ సాహిత్యనిధి !

Sri Sri books

శ్రీశ్రీ సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చెయ్యడమే శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రధాన ఆశయంగా చెప్పుకోవచ్చా?
* కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యాన్ని శ్రీశ్రీపై సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చెయ్యా లన్నది ఆశయం. అందుకోసమే వెయ్యి రూపాయలకు వందపుస్తకాల’నూరు పుస్తకాల హోరు ప్రణాళిక’. ప్రారంభమైంది. మొదట్లో మూడు వేల రూపాయలనుకున్న వందపుస్తకాలు దీర్ఘకాలిక ప్రణాళిక (పది సంవత్సరాలు)కావడం వలన పూర్తయేసరికి ఐదువేల రూపాయలు అయింది. అయినా అందరికీ అదే ధరకు అందించాం.
మొదటి నూరు పుస్తకాల హోరు ప్రణాళిక పూర్తికి శ్రీశ్రీ సాహిత్యనిధి యాభై లక్షల పైగా రూపాయల శ్రీశ్రీ సాహిత్యాన్ని, శ్రీశ్రీపై సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చేసింది. ఇప్పుడు రెండువేల రూపాయలతో ‘రెండో నూరుపుస్తకాల హోరు ప్రణాళిక’ ప్రారంభమైంది.

శ్రీశ్రీ బులెటిన్స్ ఇప్పటికి ఎన్ని ప్రచురించారు. ఇకపై ‘శ్రీశ్రీ బులెటిన్’ నడుస్తుందా?
* కొద్ది మార్పులతో తప్పకుండా వస్తుంది. ఉచితంగా కావాల్సిన వారికి ‘ఈ-బులెటిన్’ గానూ, హార్డ్ కాపీ కావల్సిన వారికి 10 సంవత్సరాలకు రు. 200/- చందాతోనూ నడుస్తుంది. (ఇప్పటి వరకు ఒక్కోబులెటిన్ కి చెల్లిస్తున్న పోస్టేజి ఒక రూపాయికి బదులు నాలుగు రూపాయిలు చెల్లించాలనే పోస్టల్ అభ్యంతరాల వలన ఈ మార్పులు చెయ్యక తప్పడం లేదు).

మీరు ప్రచురించిన వంద పుస్తకాలలో శ్రీశ్రీ సూక్తులు, శ్రీశ్రీ సినిమా పాటలు చోటుచేసుకోక పోవడంలో ఏదైనా ప్రతేకత ఉందా?
* ఏమీ లేదు. త్వరలో వెలువడబోతున్నాయి. శ్రీశ్రీ పాటలు మూడు సంపుటలుగానూ, (ఒకటి డైరెక్టు పాటల సంపుటి, రెండు అనువాద పాటల సంపుటి? శ్రీశ్రీ సూక్తులు ఎనిమిది సంపుటులుగాను రాబోతున్నాయి. ఇవి రెండో ‘నూరు పుస్తకాల హోరు ప్రణాళిక’లో ఉంటాయి.

Sri Sri Books

తెలుగునాట వామపక్ష సాహిత్య సంస్థలు ‘అరసం, విరసం, జనసాహితీ, సాహితీ స్రవంతి’లను విజయవాడలో ఒకే వేదికమీదకు చేర్చి సాహిత్యకార్య క్రమాలను నిర్వహించడం శ్రీశ్రీ సాహిత్యనిధి విజయంగా భావించవచ్చా?
*మహాకవి శ్రీశ్రీని ఎంతగానో ప్రేమిస్తున్న తెలుగునాట నలుదిక్కుల్లాంటి ఆ నాలుగు వామపక్ష సాహితీ సంస్థల సహకారానికి ముందుగా నా ధన్యవాదాలు. శ్రీశ్రీ సాహిత్యనిధి విజయంగా కంటే శ్రీశ్రీ విజయంగానే నేను భావిస్తున్నాను.

Sri Sri Statue at Vijayawada

ఒకే రచయిత గురించి ఒక సంస్థ ఏర్పడం. నూరు పుస్తకాలు వెలువడడం, ఒక పత్రిక రాడం, ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికీ లేదు అనుకోవచ్చా?
*ఎవరూ లేరని, ఏవ్యక్తికీ లేదని, ఇది ప్రపంచ రికార్డు అని ప్రపంచ సాహిత్య చరిత్ర తెలిసిన పెద్దలు అంటున్నారు.


వేరు తెలంగాణా ఉద్యమంలో జరిగిన మిలీనియం మార్చ్ లో శ్రీశ్రీ విగ్రహ విధ్వంసంపై మీ స్పందన ఏమిటి?
* శ్రీశ్రీ సాహిత్యనిధి స్పందనగా శ్రీశ్రీ ఒక బులెటిన్ (బులెటిన్-17) ప్రచురించాం. శ్రీశ్రీ మరణించినప్పుడు తెలుగునాట దిన, వార, పక్ష, మాసపత్రికలు 34 పత్రికలు సంపాదకీయాలు రాశాయి. వాటినిమేము సంతాపకీయాలుగా 20 ప్రముఖ పత్రికల సంపాదకీయాల శకలాలు ప్రచురించాం.
సంతాపకీయాలు :
ప్రజలే చరిత్ర నిర్మాతలు ::
వేరుతెలంగాణా పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వీరతెలంగాణా సోదరులకు మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాం !
ఏ వెల్గులకీ ప్రస్థానం? :
మిలియన్ మార్చ్ లో టాంక్బండ్ పై జరిగిన జాతి వైతాళికుల విగ్రహాల విధ్వంసచర్యను తీవ్రంగా నిరసిస్తున్నాం ! – శ్రీశ్రీ సాహిత్య నిధి ! ప్రజాపోరాట ప్రస్థానాల మహాప్రస్థానం శ్రీశ్రీ
రాష్ట్ర రాజధాని / ట్యాంక్ బండ మీదనా | శ్రీశ్రీ ఉన్నది
కాదు కదా –
ఉత్తరాంధ్ర / విశాఖ బీచ్లోనా /శ్రీశ్రీ ఉన్నది
కాదు కదా –
తెలంగాణా / ఖమ్మం శిఖరంపైనా | శ్రీశ్రీ ఉన్నది
కాదు కదా –
రాష్ట్ర నడిబొడ్డు / బెజవాడ ఒడ్డునా / శ్రీశ్రీ ఉన్నది
కాదు కదా –
రాయలసీమ | తిరుపతి క్షేత్రానా / శ్రీశ్రీ ఉన్నది
కాదు కదా –
అతను శ్రీశ్రీ రాతిబండలపైన / నెలవున్నవాడు కాదు –
విశ్వమంతా వికసించిన జాతిగుండెలలో / కొలువున్న వాడు ! అతను శ్రీశ్రీఅతని పేరు / కొంచెం ! అతని ఊరు / ప్రపంచం !
(గాయపడ్డ మహాకవి శ్రీశ్రీ విగ్రహ ముఖచిత్ర కవనం)

Mahakavi sri sri street name
  • అసి ( అశోక కుమార్ సింగంపల్లి)

అతని పేరు కొంచెం! అతని ఊరు ప్రపంచం! అతడే శ్రీశ్రీ ఇంత గొప్పగా చెప్పిన మీరు ‘మహాకవి శ్రీశ్రీని మర్చిపోవడం తెలుగు కవిగా చచ్చిపోవడం’ అని మీరు అనడంలో నాకు అభిమానం మాత్రమే కనిపిస్తుంది ? మీరేమంటారు.
* శ్రీశ్రీకి అభిమానులు లేరు. అంతా వీరాభిమానులే.

సరే వీరాభిమానం-అంటే మీరే మంటారు.
* వీరాభిమానమే అంటాను.

శ్రీశ్రీవి సినిమా పాటలు వేరే రచయిత పేరుతో రావడం, లేదా వేరే రచయిత పాట శ్రీశ్రీ పాటగా రావడం జరిగినప్పుడల్లా మీరు ఖండిస్తూ సవరణలు, వివరణలు పేరుతో రాస్తూ వివరిస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం?
* పొరపాటు పడటం సహజం. శ్రీశ్రీ పాటల విషయంలో ఇది ఎక్కువసార్లు కావడం జరుగుతోంది. దీనికి కారణం శ్రీశ్రీ సినిమా పాటల సంపుటాల సంకలన కర్త. వెలువడిన ఐదు పాటల సంపుటాలలో పాడవోయి భారతీయుడా సంపుటం మాత్రం ఆయన స్వీయ పర్యవేక్షణలో వెలువడింది. మిగిలిన ‘తెలుగువీర లేవరా!, విశాలాంధ్రలో ప్రజారాజ్యం , ఉ క్కు పిడికిలి-అగ్నిజ్వాల, ఖబడ్డార్ సంఘశత్రువులారా!, అరుణ పతాకం పుస్తకాలు శ్రీమతి సరోజాశ్రీశ్రీ సంపాదకత్వంలో వెలువడ్డాయి. అందులో ఎన్నో శ్రీశ్రీవి కాని పాటలు శ్రీశ్రీ పాటలుగా నమోదు అయ్యాయి. వాటిని రిఫరెన్సుగా తీసుకున్న ప్రతిపాటా సవరణకు, వివరణకు గురవుతోంది. ఆదికవి నన్నయ్య రాసిన సభాపర్వంలోని ‘ధారుణిరాజ్య సంపద’ పద్యం శ్రీశ్రీ పద్యంగా నమోదు కావడం ఇందుకు పరాకాష్ఠ.
ఈ విషయంలో శ్రీశ్రీ సాహిత్యనిధి ఎంత కచ్చితమైన శ్రీశ్రీ విషయసేకరణకు పాటుపడు తోంది అంటే- శ్రీశ్రీ స్వయంగా చెప్పిన విషయాలలోనూ సవరణ వివరణ ఇవ్వడం జరిగింది.
శ్రీశ్రీగారు ఒక పాఠకుడి ప్రశ్నకు మూడుచిత్రాలలో (కాలచక్రం, మూగజీవులు, మహాప్రస్థానం) ఆయన వెండి తెరపై కనిపించానని చెప్పారు. కాని మరో చిత్రం కూడా ఉంది అది నటుడు పద్మనాభం నిర్మించిన పొట్టి ప్లీడరు. అలాగే మరొకటి గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు తొలుత పాడింది ‘మరోప్రపంచం’ చిత్రంగా చెప్పారు. కాని బాలు శ్రీశ్రీకి తొలుత పాడింది ‘మూగజీవులు’ చిత్రం. ఇలా కొన్ని.
ఇది ఎలా సాధ్యం అంటే- ప్రతీది, క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖరారు చేసుకో డానికి ఆధారాలు 1. సినిమా టైటిల్స్, 2.78 ఆర్.పి.యం (మట్టి రికార్డులు), ఇ.పి, ఎల్.పి రికార్డులపై లిరిక్ అండ్ మ్యూజిక్ క్రెడిట్స్ ఉంటాయి. 3. ఒరిజినల్ సినిమా పాటల పుస్తకాలు.
మరో ముఖ్య విషయం-ఘోస్టురైటర్స్ రాసినా ఎవరిపేర క్రెడిట్ ఉంటే వారు రాసినట్టే లెక్క. పాత దేవదాసు చిత్రానికి మల్లాది రాసిన గీతాలు సముద్రాలవిగా చెలామణీ అయినట్టు.

మీకు రెండు శ్రీశ్రీ అవార్డులు వచ్చాయి అనుకుంటాను ఏ సంస్థలవి ?
* రెండు కాదండి, మూడు. ఆ అవార్డులు నాకు కాదు శ్రీశ్రీకి, శ్రీశ్రీ సాహిత్యనిధికి.

Mahakvi Sri Sri Award from Kinnera Art Theatre, Hyd. in 2004 By Dr. C. Narayanareddy
  1. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారి తొలి శ్రీశ్రీ అవార్డు 2002లో శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా జ్ఞానపీఠ గ్రహీత డా. సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా అందించారు.
  2. ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ,ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, నాగార్జున కళాపరిషత్ కొండపల్లి సంయుక్తంగా తొలి శ్రీశ్రీ అవార్డు 2016లో ప్రజాసాహితి ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు చేతులమీద అందించారు.
  3. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రచయితల సంఘం తొలి శ్రీశ్రీ అవార్డు 2016లో ప్రముఖ సాహిత్యకారులు పురుషోత్తం కాళిదాసు చేతుల మీద అందించారు.
    ముఖ్య విషయం ఏమిటంటే ఈ అన్ని సంస్థలవీ తొలి అవార్డులే కావడం విశేషం. విజయవాడ, నెల్లూరులలో ఒకే సంవత్సరం రావడం మరో విశేషం.

ఈ అవార్డుల విజేతగా మీరు ఎలా ఫీలవుతున్నారు.
* అవార్డుల విజేత నేను కాదు శ్రీశ్రీ. ఈ విషయం అవార్డులు అందుకున్న అన్ని వేదికల మీద చెప్పాను. ఈ అవార్డులు శ్రీశ్రీకి వచ్చిన అవార్డులు, శ్రీశ్రీ సాహిత్య నిధి కృషికి వచ్చిన అవార్డులు, శ్రీశ్రీ అభిమానులకు వచ్చిన అవార్డులు, శ్రీశ్రీ ప్రేమికులకు వచ్చిన అవార్డులు. శ్రీశ్రీ సాహిత్యనిధి తరఫున నేను అందుకున్నాను అంతే!

ఇంకా ఏమైనా శ్రీశ్రీ పురస్కార విజయాలున్నాయా?
* మరొక విశేషం మహాకవి శ్రీశ్రీ వీధి-15-06-2013న గుంటూరు నగరపాలక సంస్థలోని ‘మారుతీ నగర్ రెండో వీధికి స్థానికులు అరసం, విరసం, జనసాహితీ రాష్ట్రస్థాయి నేతలు విద్యావేత్తలు శ్రీశ్రీ అభిమానులు సమావేశమై ‘మహాకవి శ్రీశ్రీ వీధి’గా మహాకవి పేరు పెట్టుకొని ఆ వీధిని శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ గా నాతో ప్రారంభం చేయించారు. ఇది మహాకవి శ్రీశ్రీకి, శ్రీశ్రీ సాహిత్యనిధికి, శ్రీశ్రీ అభిమానులకి దక్కిన గౌరవంగా గర్వపడుతున్నాను.

నూరు పుస్తకాల హోరు ప్రణాళికలో ఎంతమంది చందాదారులున్నారు?
* వెయ్యి మంది వరకు ఉంటారు.

‘మహాకవి శ్రీశ్రీ బులెటిన్’ కు ఎంత మంది చందాదారులుంటారు?
* రెండు వేలు వరకు ఉంటారు.

Sri Sri Saahitya Nidhi book stall at Vijayawada Book Festival

ప్రతి ఏటా విజయవాడ పుస్తక ప్రదర్శనలో శ్రీశ్రీ సాహిత్యనిధి స్టాల్ పెడుతున్నారు కదా? ప్రదర్శకుల స్పందన ఎలావుంది ?
* విజయవాడ బుక్ ఫెస్టివల్ లో పాల్గొంటూ ఉండడం శ్రీశ్రీ సాహిత్యనిధి మరింత విస్తృత పరిధిలో అందరికీ పరిచయం అయింది. అక్కడే ఎందరో నూరు పుస్తకాల హోరు, శ్రీశ్రీ బులెటిన్ ప్రణాళికల్లో చేరడం మాకు ఎంతో ప్రోత్సాహం అయింది. ‘సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త, హిందు’ (ఆంగ్లం) దినపత్రికలు ప్రతి ఏటా మంచి కవరేజి ఇస్తున్నాయి. ఒకే రచయితపై స్టాల్ పెట్టడం, శ్రీశ్రీ సాహిత్యం , శ్రీశ్రీపై సాహిత్యం తప్ప ఏ ఇతర పుస్తకాలు పెట్టక పోవడం. నిర్వాహకుల రచనలకుకూడా స్టాల్లో ప్రదర్శనకు చోటివ్వకపోవడం వంటి ప్రత్యేకతలు చాలా మందిని ఆకర్షించాయి.

Sri Sri books

నూరు పుస్తకాల హోరు ప్రణాళికలో ప్రచురించిన వంద పుస్తకాల ముఖచిత్రాలన్నీ మంచి ఈస్తటిక్ సెన్స్ తో ఉండటం గొప్ప విషయం. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
* ఈ అభినందనలన్నీ వాటివాటి ముఖచిత్రకారులకు చెందాలి. ఎందరో మహా కళాకారులు ఈ సందర్భంగా అందరికీ వందనాలు. ఆర్టిస్టులు గిరిధర్, యు.ఏ.మహేష్, నాగమల్లీశ్వరరావు, ఎన్.సుబ్రహ్మణ్యం, కళాసాగర్-వీళ్లంతా భాగస్వాములే. ఆలస్యంగా అసోసియేట్ అయినా ఇందులో కళాసాగర్ కొంచెం ఎక్కువ భాగస్వామి.

చివరగా మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సప్తతిపూర్తి సంర్భంగానూ, సాహిత్య స్వర్ణోత్సవ సందర్భంగానూ మీకూ, శ్రీశ్రీ సాహిత్యనిధికీ, కథానాయకుడు మహాకవి శ్రీశ్రీకీ శుభాకాంక్షలు.
* ముఖ్యంగా శ్రీశ్రీ, శ్రీశ్రీ సాహిత్యనిధి నేపథ్యంగా ఇంత సమగ్రమైన ఇంటర్వ్యూ చేసినందుకు మీకూ, మీ 64 కళల అంతర్జాల పత్రికకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

ఇంటర్వ్యూ : కళాసాగర్
శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణలు కావలసిన వారు సంప్రదించండి-
సింగంపల్లి అశోక్ కుమార్ (92462 77375)

2 thoughts on “కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

  1. ఒక కవి గురించి ఇంతగా కృషి చేస్తున్న మీరు అభినందనీయులు.
    శ్రీధర్ గుమ్మడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap