తెలుగు వారికి శ్రీధర్ పంచిన ‘పెళ్లికానుక’

అతడు తమిళ, హిందీ చిత్రరంగంలో ప్రముఖ దర్శకుడు. వెండితెరమీద ముక్కోణపు ప్రేమకథలకు ప్రాణంపోసిన అద్వితీయ కళాకారుడు. సినిమా కథ యెంత విషాదభరితంగా వున్నా ప్రేక్షకుని మనసు ఆకట్టుకునే విధంగా సినిమా నిర్మించడం ఆ దర్శకునికి వెన్నతో పెట్టిన విద్య. అతడే చిట్టుమూరు విజయరాఘవన్ శ్రీధర్. సింపుల్ గా శ్రీధర్ అంటే సగటు ఫ్రేక్షకుడికి ఇట్టే అర్ధమయ్యే పేరు. పుట్టింది జూలై 22, 1933 న చెంగల్పట్టు జిల్లా, మధురాంతకం వద్ద గల నెల్వోయి గ్రామంలో. శ్రీధర్ తండ్రి విజయరాఘవ రెడ్డి, తల్లి తాయారమ్మ. వారిది పదహారణాల తెలుగు కుటుంబం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో యెక్కువగా తెలుగువారి కుటుంబాలే వుండేవి. అక్కడే చెంగల్పట్టులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో శ్రీధర్ చదువుకున్నాడు. ‘చిత్రాలయ’ గోపు శ్రీధర్ కు సహవిద్యార్థి మాత్రమే కాదు, మంచి మిత్రుడు కూడా. శ్రీధర్ ఏడవ తరగతి చదువుతున్నప్పుడే మిత్రుడు గోపు సహకారంతో నాటకాలు రాసేవాడు. తన పద్దెనిమిదవ యేట… అంటే 1951లో శ్రీధర్ ’లచ్చియావతి’ అనే ఒక కథను రాసి, ఆ కథను మద్రాసులోని ఎ.వి.యం ప్రొడక్షన్ కార్యాలయానికి వెళ్ళి వినిపిస్తే, ఆ సంస్థలోని సీనియర్ దర్శకుడు పి. నీలకంఠన్ ఆ కథను త్రోసిపుచ్చాడు. అయితే ‘అవ్వయ్’గా పిలిపించుకునే ప్రముఖ రంగస్థల, సినీ నటుడు టి.కె. షణ్ముగం కు ఆ కథ యెంతగానో నచ్చింది. అదే కథను శ్రీధర్ చేత ఒక నాటకంగా రూపొందించి ‘రత్తపాశం’ అనే పేరుతో ఆ నాటకాన్ని మద్రాసు నగరంలో వివిధ వేదికలమీద రక్తి కట్టించడమే కాకుండా, శ్రీధర్ ని వేదికమీదకు రప్పించి ఫ్రేక్షకులకు పరిచయం చేయసాగడంతో, చిత్ర పరిశ్రమ దృష్టి శ్రీధర్ వైపు మరలింది. ‘కళ్యాణపరిశు’ చిత్రంతో శ్రీధర్ దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎదిగారు. ‘కళ్యాణపరిశు’ చిత్ర విజయం తరవాత తెలుగులో అదే చిత్రాన్ని ‘పెళ్లికానుక’గా నిర్మించి విజయం సాధించారు. ఈ చిత్రం 29 ఏప్రిల్ 1960 న విడుదలై స్వర్ణోత్సవం జరుపుకుంది. ఈ తమిళ, తెలుగు జంట సినిమాల విశేషాలు కొన్ని…

దశ తిప్పిన ‘రత్తపాశం’…
శ్రీధర్ రచించిన ‘రత్తపాశం’ నాటకాన్ని టి.కె. షణ్ముగం 1954లో శ్రీధర్ చేత స్క్రీన్ ప్లే గా రాయించి, తన సొంత బ్యానర్ మీద సినిమాగా నిర్మించాడు. అందులో షణ్ముగం తోబాటు టి.కె. భగవతి, టి.ఎస్. బాలయ్య, అంజలీదేవి నటించారు. సినిమా మంచి కలక్షన్లతో విజయవంతమైంది (ఇదే సినిమాని ఎ.వి.ఎం వారు 1956లో ‘భాయి భాయి’ పేరుతో నిర్మిస్తే, ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది). ‘రత్తపాశం’ చిత్ర విజయంతో శ్రీధర్ కు శివాజీ గణేశన్ నటించే సినిమాకు కథ, సంభాషణలు సమకూర్చే అవకాశం దొరిగింది. శరవణభవ యూనిటీ పిక్చర్స్ వారు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో నిర్మించిన ‘ఎదిర్ పరదట్టు’ సినిమాకు శ్రీధర్ కథ, సంభాషణలు సమకూర్చారు. అందులో శివాజీ గణేశన్ కు జోడీగా పద్మిని నటించింది. ఈ సినిమా శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి కూడా అందుకుంది. తరవాత ఇదే చిత్రాన్ని తెలుగులో యోగానంద్ దర్శకత్వంల్లో ‘ఇలవేలుపు’ గా, హిందీలో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘శారద’గా పునర్నిర్మించి హిట్ చేశారు. ఆ తరవాత శ్రీధర్ ‘మామన్ మగళ్’, ‘మహేశ్వరి’, ‘మాదర్కుల మాణిక్కం’, ‘ఎంగ వీట్టు మహాలక్ష్మి’ (తెలుగులో తోడికోడళ్ళు), ‘యార్ పయ్యా’, ‘మంజల్ మహిమై’(తెలుగులో మాంగల్యబలం), ‘పునర్ జన్మం’, ‘కలై వానన్’ (తెలుగులో జయభేరి) వంటి హిట్ చిత్రాలకు కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. మోడరన్ ధియేటర్స్ వారి ‘మహేశ్వరి’ సినిమాకు రచయితగా పనిచేస్తుండగా శ్రీధర్ ఆ స్టూడియోలో వున్న అతిపెద్ద లైబ్రరీలో సినిమా నిర్మాణం మీద అవగాహన పెంచుకునేలా పుస్తకాలు చదివి నైపుణ్యం పెంచుకున్నారు. తరవాత 1956లో తన మిత్రులు టి. గోవిందరాజన్, ఎస్. కృష్ణమూర్తిలతో కలిసి ‘వీనస్ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి ‘ఉత్తమ పుతిరన్’, ‘అమరదీపం’ చిత్రాలకు రచయితగానే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ రెండు సినిమాలలో కూడా శివాజీ గణేశన్, పద్మిని నటించారు. ఈ సినిమాల తరవాత శ్రీధర్ దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యారు.

‘కల్యాణ పరిశు’ (పెళ్లికానుక)తో దర్శకుడిగా, సహనిర్మాతగా…
1959లో శ్రీధర్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్యాణపరిశు’. వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు శ్రీధర్ నిర్వహించడమే కాకుండా ఆ చిత్రానికి సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా గాయకుడు ఎ.ఎం. రాజాకు తొలి అవకాశాన్ని కలిపించారు. జెమిని గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు, తంగవేలు, బి. సరోజాదేవి, సి.ఆర్. విజయలక్ష్మి, నంబియార్ ఇందులో ముఖ్య తారాగణం. ఈ సినిమా ఒక ముక్కోణపు ప్రేమకథ. ఈ సినిమాకు శ్రీధర్ మిత్రుడు ‘చిత్రాలయ’ గోపు కామెడీ ట్రాక్ తీర్చిదిద్దారు. బ్లూ మ్యాట్లు, కంప్యూటర్ గ్రాఫిక్ లు వంటి సాంకేతికత లేని ఆరోజుల్లో వెండితెరపై దృశ్యాలను వర్ణరంజితం చేసిన విశిష్ట సాంకేతిక నిపుణుడు విన్సెంట్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడుగా పనిచేశారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒకే వ్యక్తిని ప్రేమించడం, అక్కకోసం చెల్లెలు త్యాగం చేసి, హీరోను ఒప్పించి పెళ్లిచేయడం, వారికి కలిగిన కుర్రవాడిని చెల్లెలు పెంచడం; అక్క మంచమెక్కి మరణించడంతో హీరో తన పిల్లవాడిని వాసంతి-రఘులకు పెళ్లికానుకగా ఇచ్చి దూరతీరాలకు వెళ్లిపోవడం టూకీగా ఈ సినిమా కథ. ఇందులో విజయకుమారి, సరోజాదేవి అక్క చెల్లెళ్ళు( గీత, వాసంతి)గా నటించగా హీరో భాస్కర్ గా జెమిని గణేశన్ నటించాడు. తంగవేలు, ఎం. సరోజ కామెడీ పాత్రలు పోషించారు. సుబ్బులక్ష్మి అక్కచెల్లెళ్ల తల్లి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు వాసంతి పనిచేసే ఆఫీసు అధిపతిగా నటించారు. లక్ష రూపాయల బడ్జట్ లో చిత్రాన్ని శ్రీధర్ పూర్తిచేశారు. ఈ సినిమాలో విలన్ లేడు. పైగా పాత్రలన్నీ సహృదయం కలిగినవే కావడం విశేషం. ‘కల్యాణ పరిశు’ సినిమా ఏప్రిల్ 9, 1959 న విడుదలైంది. ఆదేరోజు శివాజీ గణేశన్ నటించిన ‘నల్ల తీర్పు’ సినిమా కూడా విడుదలైంది. అయినా ఆ పోటీని తట్టుకొని ‘కల్యాణ పరిశు’ చిత్రం 25 వారాలు ఆడి రజతోత్సవం చేసుకుంది. ఈ సినిమా 100వ రోజు ఆడిన సందర్భంగా ఇందులో నటించిన తంగవేలు, ఎం. సరోజ మదురై మురుగన్ కోవెలలో పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఈ సినిమా బి. సరోజాదేవికి, సంగీత దర్శకుడిగా ఎ.ఎం. రాజాకి బ్రేక్ ఇచ్చింది. ‘కల్యాణ పరిశు’ విజయంతో శ్రీధర్ ‘చిత్రాలయ పిక్చర్స్’ పేరుతో సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పి అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ‘కల్యాణపరిశు’ చిత్రాన్ని తెలుగులో ‘పెళ్లికానుక’ (1960) గా, హిందీలో రాజాకపూర్, వైజయంతిమాల జంటగా ‘నజరానా’ (1961) గా పునర్నిర్మించారు.

‘పెళ్లి కానుక’గా తెలుగులో…
‘కల్యాణ పరిశు’ చిత్రాన్ని తెలుగులో ‘పెళ్లికానుక’ గా వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీదే ఎస్. కృష్ణమూర్తి, టి. గోవిందరాజన్, సి.వి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో శ్రీధర్, ‘చిత్రాలయ’ గోపు సంభాషణలు రాయగా తెలుగు వర్షన్ కి ఆచార్య ఆత్రేయ రచన చేశారు. స్క్రీన్ ప్లే శ్రీధర్ రూపొందించారు. విన్సెంట్ ఛాయాగ్రహణం, ఎ.ఎం. రాజా సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం తయారయింది. హీరో భాస్కర్ గా అక్కినేని నాగేశ్వరరావు నటించగా వాసంతిగా బి. సరోజాదేవి, ఆమె అక్క గీతగా కృష్ణకుమారి నటించారు. తమిళంలో అక్కినేని నాగేశ్వరరావు పోషించిన రఘు పాత్రను ‘పెళ్లికానుక’లో జగ్గయ్య పోషించారు. కామెడీ పాత్రల్లో సత్యం గా రేలంగి, అతని భార్య కాంతం గా గిరిజ నటించారు. సీనియర్ నటి మాలతి అక్కచెల్లెళ్ల తల్లిగా నటించింది. ఇది అక్కినేనికి 82 వ సినిమా. అక్కినేనితో కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం ‘పెళ్లికానుక’. 1982లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన ‘దేవత’ చిత్రానికి ‘పెళ్లికానుక’ కథాంశాన్నే తీసుకోవడం గమనార్హం. అయితే ద్వితీయార్ధంలో రాఘవేంద్రరావు కథలో కొన్ని మార్పులు చేశారు. అంతేకాదు 1964 లో రామానాయుడు హిందీలో నిర్మించిన ‘తోఫా’ (దేవత చిత్రమే) చిత్రానికి కూడా మూలకథ శ్రీధర్ చిత్రమే కావడం విశేషం.

రాజా మెప్పించిన తెలుగు పాటలు…
ఇక్కడ ఎ.యం. రాజా గురించి కొంచెం చెప్పాలి. రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధుర్యం ఉంది. తొలినుండి రాజాకు స్వంతంగా స్వరకల్పన చేయాలనే ఆశ ఉండేది. చివరకు ఆ ఆశ పొన్నలూరి బ్రదర్స్ నిర్మించిన ‘శోభ’ చిత్రంతో తీరింది. కానీ రాజాను ఒక గొప్ప సంగీతదర్శకునిగా నిలబెట్టిన చిత్రాలు ‘కళ్యాణపరిశు’, `పెళ్లికానుక’. దీని వెనుక ఒక చిన్న కథ కూడా వుంది. ఒకసారి కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీధర్ తన మొదటి సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకుంటానని రాజాకి మాటిచ్చాడు. ఆ అవకాశం ‘కళ్యాణపరిశు’తో కలిసివచ్చింది. దీపావళి పండుగ సమయంలో ఈ సినిమాలో వచ్చే ‘ఆడేపాడే పసివాడ’ అనే పాట ఇప్పటికీ వినపడుతూనే వుంటుంది. ఈ చిత్రంలో రాజాకు సహాయకుడిగా పనిచేసిన సెబాస్టియన్ తదనంతర కాలంలో శంకర్ జైకిషన్ లకు సహాయ సంగీత దర్శకుడిగా వెళ్ళాడు. రాజా తమిళంలో స్వరపరచిన పాటలు తెలుగు వర్షన్ లో తెలుగుదనాన్ని మెప్పించేవిధంగా ట్యూన్ చేయబడ్డాయి. తొలి పాట ‘వాడుక మరిచెదవేలా నను వేడుక చేసెద వేలా’ను ఆత్రేయ లిఖించగా రాజా, సుశీల కలిసి పాడారు. ఈ పాట సైకిల్ ప్రయాణంలో సాగుతుంది. అందుకోసం, బి. సరోజాదేవి సైకిల్ తొక్కడం అభ్యాసం చేసింది. హిందూస్తానీ పహాడి రాగఛాయల్లో ఈ పాటను స్వరపరచారు. ఇందులో పట్టువస్త్రం వంటి రాజా గొంతు మార్దవంగా వినిపిస్తుంది. ‘కన్నులతో పలకరించు వలపులూ ఎన్నటికీ మరువరాని తలపులూ’ అనే యుగళగీతం బి. సరోజాదేవి, నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాటకు ముందు ఒక అద్భుతమైన పియానో బిట్ వినిపించారు రాజా. మాండ్ రాగఛాయల్లో మట్లు కట్టిన ఈ పాట కూడా చాలా సున్నితంగా సాగుతుంది. రాజా దర్శకత్వంలో బహుశా జిక్కి పాడిన అత్యుత్తమమైన పాట (తమిళంలో ‘తుళ్ళాద మనముం తుళ్ళుం’) ‘పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు’ అనే పాట. ఈ పాటను ఆత్రేయ రచించగా, కృష్ణకుమారి మీద చిత్రీకరించారు. ఈ పాటలో రాజా సితార్ వాద్య బిట్లను వినిపించిన తీరు అద్భుతంగా వుంటుంది. మోహన కళ్యాణి రాగాన్ని ఈ పాటకోసం రాజా వాడుకున్నారు. ‘ఆడేపాడే పసివాడ ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’ అనే విలాసవంతపు పాటను సుశీల గానం చేయగా బి. సరోజాదేవి మీద, బ్యాక్ డ్రాప్ లో అక్కినేని, కృష్ణకుమారి, మాస్టర్ బాబు మీద చిత్రీకరించారు. ఈ పాటను చెరువు ఆంజనేయశాస్త్రి (కలం పేరు కార్తిక్) రాశారు. ఇదేపాట ‘పాథోస్’ (విషాదగీతం)గా వచ్చినప్పుడు ఎ.ఎం. రాజా పాడగా అక్కినేని మీద చిత్రీకరించారు. ఆ పాటను ఆత్రేయ రాశారు. ఒకే ట్యూనుతో వున్న రెండు వైవిధ్యభరిత పాటలను ఇద్దరు కవులచేత రాయించడం దర్శకుడు శ్రీధర్ గొప్పతనం. ఆంజనేయశాస్త్రి ఆత్రేయకు ప్రియ శిష్యుడు. ఎక్కువ భాగం భాగేశ్వరి రాగాన్ని ఈ పాటకు వాడుకున్నారు. చివరిగా సముద్రాల రచించిన ‘తీరెనుగా నేటితో నీ తీయని గాథ మిగిలిపోయేనే మదిలో మాయని బాధ’ అనేది నేపథ్య గీతం. మిశ్రమ శివరంజని రాగంలో వచ్చే ఈ పాటను రాజా పాడారు. ఎ.ఎం. రాజా అద్బుతమైన సంగీతం సమకూర్చినా, తదనంతర కాలంలో ఆ ఒరవడిని కొనసాగించలేకపోవడం స్వయంకృతమే అని చెప్పాలి. ‘పెళ్లి కానుక’ విడుదలతో రాజాకు మరిన్ని అవకాశాలు రాసాగాయి. కానీ రాజా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ‘కళ్యాణ పరిశు’, ‘పెళ్లికానుక’ చిత్రాల రీరికార్డింగు పనులను కారణం లేకుండా రాజా ఆలస్యం చేశాడనేది అతని మీద అభియోగం. అది సినిమాల విడుదల ఆలస్యం కావడానికి దారి తీసింది. పైగా తను కూర్చిన స్వరాలను ఎవరైనా దొంగిలిస్తారేమోననే అభద్రతా భావం రాజాకు వుండేదని, అందుచేతే శ్రీధర్ తదనంతరకాలంలో నిర్మించిన ‘నెంజిల్ ఒరు ఆలయం’ చిత్ర అవకాశం ఎం.ఎస్. విశ్వనాథన్-రామమూర్తి చేతిలోకి వెళ్లిపోయిందనేది సినీ పండితుల విశ్లేషణ.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap