కమనీయం శ్రీనివాస కల్యాణం

మధునాపంతుల సీతామహాలక్ష్మి ప్రసాద్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కల్యాణం కూచిపూడి నృత్యరూపకం ఆద్యంతం కమనీయంగా సాగింది. విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నృత్య రూపకాన్ని శనివారం (29-10-2022) రాత్రి ప్రదర్శించారు. శ్రీనివాసుడిగా ప్రవల్లిక, పద్మావతిగా మనీషా, విష్ణుమూర్తిగా ఇంద్రాణి, లక్ష్మీదేవిగా శ్రీనిజ, ఇతర పాత్రల్లో నేహ, సునంద, సాహితి, సంస్కృతి, ఆశిత్ర యామిని తదితరులు తమ హావభావాలతో ప్రేక్షకులను మైమరపింపజేశారు. ఈ నృత్య రూపకానికి రచన ఎన్.సీహెచ్. జగన్నాథాచార్యులు, నట్టువాగం సీతామహాలక్ష్మి, సంగీతం బుచ్చయ్యచార్యులు అందించారు. ప్రదర్శన అనంతరం కళాకారులను సత్కరించారు.

Shiva-Parvathi

మధునాపంతుల సీతాలక్ష్మీ ప్రసాద్ గారి గురించి:
శ్రీమతి సీతాప్రసాద్ దూరదర్శన్ ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్ట్. వీరు తన వివాహానంతరం పుత్రునికి జన్మనిచ్చిన పిదప కూచిపూడి నృత్యం నేర్చుకోవటం విశేషం. వీరి గురువులు శ్రీమతి మధు నిర్మలగారు, శ్రీ వేదాంతం వేంకటాచలపతిగారు, శ్రీ వెంపటి రవిశంకర్ గారు. వీరి వద్ద కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ మరియు డిప్లొమ కోర్సులలో తర్ఫీదు పొంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డిస్టింక్షన్లో పట్టా పొందారు. వీరు కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేనేళ్ళుగా “శ్రీ దుర్గాసాయి నృత్య నికేతన్” సంస్థను స్థాపించి 200కు పైగా విద్యార్థినులకు కూచిపూడి నృత్య శిక్షణనిస్తున్నారు. వీరు తమ శిష్యబృందంతో కలసి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో, యూరప్ ఖండంలోని వివిధ దేశాలలో ఎన్నో ప్రదర్శనలనిచ్చారు. వీరు 2013వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే “ప్రతిభా పురస్కార్”ను పొందారు. గౌ॥ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై చేతుల మీదుగా “Woman Achiever of 2022” అవార్డును అందుకున్నారు.
-కళాసాగర్

SA: