*216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ రూపకల్పనలో కీలకపాత్ర
*భువనగిరి సమీపంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రూపకల్పన
ప్రాచీన భారతీయ శిల్పశాస్త్ర, ఆలయనిర్మాణ వైభవాన్ని ప్రపంచపు నలుమూలలా చాటి చెప్తున్న సమకాలీన ప్రతిభావంతులైన స్థపతులలో డి.ఎన్.వి. ప్రసాద్ స్థపతి అగ్రగణ్యులు. తెలుగు నేలపై తమిళ స్థపతులకు ధీటుగా ఆలయాలను నిర్మించి, విదేశాలలో సైతం అనేక దేవాలయాలకు రూపమిచ్చిన ఘనత శ్రీ ప్రసాద్ స్థపతి గారికి చెందుతుంది.
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాలోని ఏడుగుండ్లపాడు గ్రామంలో ఒక సంప్రదాయ కుటుంబంలో, శ్రీ దగ్గుపాటి వెంకట్రావు, శ్రీమతి వీర రాఘవమ్మ పుణ్యదంపతులకు వీరు జన్మించారు. పదవ తరగతి పూర్తి అవగానే తన కెరీర్ ను కళలవైపు మళ్లించాలని నిశ్చయించుకుని తిరుపతిలోని సంప్రదాయ శిల్పకళాశాలలో సంప్రదాయ శిల్పం, ఆలయనిర్మాణం విభాగంలో డిప్లొమా కోర్సును ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులై , ఆయా శిల్ప శాస్త్ర రహస్యాలను ఆకళింపుచేసుకొని ఆలయ నిర్మాణ రంగం లో ఎంతో పరిణతి సాధించడమేగాక ఆగమశాస్త్ర గ్రంథాలను పరిశోధించి ఎన్నో రహస్యాలను ఆకళింపు చేసుకున్నాడు.
2005 సం.లో ఒంగోలులోని శ్రీ వీరబ్రహ్మంగారి దేవాలయ పునరుద్ధరణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావన్ లో శ్రీ రాధా మాధవ దివ్యదేశ్ ఆలయనిర్మాణం చేశారు. నర్రవాడలోని వెంగమాంబ కల్యాణ మండపం, మాజీ మంత్రి శ్రీ మాదాల జానకీరామ్ గారూ అప్పటి శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు గారి సహకారంతో నెల్లూరులో హరిప్రసాద్ శిల్పశాల స్థాపించారు. శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో శంషాబాద్ ఆశ్రమంలో ఆనందనిలయం,
‘శ్రీరామానుజ సహస్రాబ్ది’ – “స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీ Sriramanuja Sahasrabdi-Statue-of-Equality: అమెరికాలోని డెన్వర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థపతిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని స్థిరత్వం పొందబోతున్న సమయంలో శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆదేశం మేరకు, అమెరికా ను వదలి ఇండియా చేరుకుని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో ‘శ్రీరామానుజ సహస్రాబ్ది’ – “స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీ’ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన శ్రీరామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ ‘కూర్చున్న అతిపెద్ద విగ్రహాన్ని’ విజయవంతంగా పూర్తి చేయించారు. 108 ప్రసిద్ధ దివ్యదేశ ఆలయ నమూనాలను రాతితో నిర్మింపజేశారు. బద్రీనాథ్ లో అతి పెద్ద ఏకశిలా రామానుజ విగ్రహము, బృందావనంలోని గోవర్ధనగిరి వద్ద 24 అడుగుల ఎత్తైన ఏకశిలా సంకర్షణమూర్తి విగ్రహం నిర్మించారు. నేపాల్ లో శ్రీలక్ష్మి నారాయణ మందిరము సుందరంగా నిర్మించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ఏక్తాధామ్” – స్టాట్యూ ఆఫ్ వన్ నెస్- శ్రీ ఆది శంకరాచార్య ప్రాజెక్ట్ కు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా సేవలందిస్తూ, 108 అడుగుల ఎత్తైన శ్రీ అది శంకరాచార్య స్వామి వారి విగ్రహ తయారీలో కీలక భూమిక వహించారు. ఇటీవలనే వారణాసిలో శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేతంగా విశ్వేశ్వరమహదేవ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, కెనడా, నూజీలాండ్ తదితర దేశాలలో నిర్మితమవుతున్న ఎన్నో ఆలయాలకు తమా అమూల్యమైన సేవలందిస్తున్నారు.
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం: తెలంగాణ లోని భువనగిరి సమీపంలో వున్న స్వర్ణగిరి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రసాద్ స్థపతి గారి అధ్వర్యంలో పూర్తికాబడి నేడు విశేష ఆదరణ పొందుతుంది. ఎంత ఎదిగినా అంతగా ఒదిగి ఉండే సమున్నత వ్యక్తిత్వం గల D.N.V. ప్రసాద్ స్థపతి గారు ఈ స్వర్ణగిరి ఆలయానికి సశాస్తీయముగా, తన అపార అనుభవాన్ని రంగరిస్తూ, అద్భుతమైన రీతిలో రూపకల్పన చేసారు. ఆగమ, శిల్ప, వాస్తు, చారిత్రక అంశాలను పరిగణ లోనికి తీసుకుంటూ ఈ దేవాలయ నిర్మాణానికి వేలాది డ్రావిన్స్ ను రూపొందించారు. అంతే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది నిపుణులైన శిల్పులను సమీకరించి ఆలయ శిల్ప నిర్మాణాలను ఆద్యంతమూ పర్యవేక్షించారు. ఒక చారిత్రిక అద్భుత సృష్టిలో ప్రధాన భూమిక పోషించారు. ఆలయ ముందు భాగంలో 27 అడుగుల నల్లరాతి ఏకశిలతో రూపొందించిన జై ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా సందర్శకులకు దర్శనమిస్తాడు. జయగంట ఇక్కడ ప్రత్యేకను కలిగివుంది. 6 మార్చి 2024 న, ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఉచిత భోజన సదుపాయం కూడా వుంది.
స్థాపత్య వేద రీసెర్చ్ ఫౌండేషన్ : శిల్పసంబంధమైన సెమినార్లను నిర్వహిస్తూ, ఆర్టికల్స్ వ్రాస్తూ శిల్పకళార్చన చేస్తున్నారూ. స్వంత నిధులతో ‘స్థాపత్య వేద రీసెర్చ్ ఫౌండేషన్’ స్థాపించి శిల్పకళా మూల గ్రంథాలను తెలుగు భాషలో ప్రచురణకు సిద్ధం చేస్తున్నారు. శ్రీ దక్షిణామూర్తి విగ్రహ రూపాలతో ఒక చిత్ర ప్రదర్శనను బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటుచేసి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము గారి ప్రశంసలందుకున్నారు.
వారి సంప్రదాయ శిల్పకళాసేవకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారి ద్వారా “స్థాపత్యకళా రత్న”,
శ్రీ చిన్న జీయర్ స్వామివారి ద్వారా స్థాపత్య కళాసమ్రాట్, హిందుత్వ ఆధార్ స్తంభ్, ముంబయి వారి ద్వారా “ఆచార్యవిశ్వకర్మ” వంటి బిరుదులు వీరిని వరించాయి.
–కళాసాగర్ యల్లపు