
2025 ఫిబ్రవరి 1 వ తారీఖున సాయంత్రం స్వర్గస్తులైన బి.సి. క్రిష్ణ గారికి నివాళిగా అంజనప్ప గారి ప్రత్యేక వ్యాసం.

పౌరాణిక నటరత్న నందమూరి తారకరామారావు గారినే ఉద్వేగానికి గురిచేసిన నటన ఆయనది.
స్వయానా రామారావు గారే ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలతో ప్రశంసలు కురిపించిన ఘనత ఆయనకే దక్కింది. చూసే చూపు లోను, పలికే పలుకులోను, నటించే నటనలోను నందమూరి తారకరామారావు గారి పోలికలు కల్గిన రాయలసీమ రంగస్థల నటరత్నమాయన.
గొప్ప గాత్ర ధర్మం గల బిల్వమంగళుడు, వేషధర్మం బిల్వమంగళుడు, భాషా ధర్మం బిల్వమంగళుడు,శృతి, లయ, ధర్మం బిల్వమంగళుడు,
నటనా ధర్మం గల బిల్వమంగళుడు, భావ యుక్తమైన, రాగయుక్తమైన నటసామ్రాట్ ఘంటసాల గారికి ఏకలవ్య శిష్యుడు ఘంటసాల మహమ్మద్ రఫీ గారి పాటలంటే అతనికి పంచప్రాణాలు.
కర్నూలు జిల్లా కర్నూలు పట్టణము నందు జములమ్మ, బీసన్న పుణ్య దంపతులకు 1947 ఏప్రిల్ ఒకటో తారీఖున జన్మించారు. బీసీ కృష్ణ గారి విద్యాభ్యాసం అనంతరం అతనికి సంగీతం మీద ఉన్న పట్టును,ఆసక్తిని గుర్తించిన రంగస్థల హార్మోనిస్టు కేసీ శివారెడ్డి గారు నాటక రంగం వైపు తీసుకొచ్చి అకుంఠిత దీక్షా, శిక్షణలతో సత్య హరిచంద్ర, శ్రీకృష్ణుడు, రాముడు, బిల్వమంగళుడు వంటి పౌరాణిక పాత్రలను నవరసభరితంగా నటించే కళాకారుడిగా తీర్చిదిద్దబడినారు. ఏ పాత్ర ధరించి, నటించినా పౌరాణిక సినిమాలలో పేరుగాంచిన నందమూరి తారక రామారావు గారి నటనకు దగ్గరగా ఉంటారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మొదలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రోశయ్య వంటి ముగ్గురు ముఖ్యమంత్రుల చేత సన్మానాలు, ప్రశంసలు అందుకున్న కళాకారుడు.
అక్కినేని నాగేశ్వరావు గారు, జమునగార్ల చేత సత్కారాలు, సి. నారాయణ రెడ్డి, టీవీ రాజు లాంటి సినీ ప్రముఖుల చేత ప్రశంసలు, గండ పెండేర ధారణలు, రాష్ట్రస్థాయి బహుమతులు, తన రెండవ గురువుగారైనటువంటి బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి పేరిట అవార్డు. బళ్ళారి రాఘవ గారి అవార్డు, ప్రతిభా అవార్డులు రెండుసార్లు విశిష్ట పురస్కారాలు, రెండుసార్లు శిరోమకుట ధారణలు పొందిన ప్రతిభాశాలి. హైదరాబాదు రవీంద్రభారతిలో ఏకధాటిగా 11 గంటలు నిర్విరామంగా ఘంటసాల గారి మధుర గీతాలు ఆలపించి, గాన గంధర్వుడు అని అనిపించుకున్న గొప్ప గాయక ప్రజ్ఞాశాలి మన బీసీ కృష్ణ గారు.

తెలుగు నాటక రంగంలో బిల్వమంగళుడంటే B.C. క్రిష్ణ గారే అనే పేరుతెచ్చుకున్నారు. తన గురువు గారైన K.C శివారెడ్డి, బుర్రా సుబ్రహ్మణ్యం గారిని నాన్న గారు అని స్మరించుకొనే అసలైన శిష్యుడాయన. K.C, B.C ల కలయిక సాక్షాత్తు శివ కేశవుల కలయిక అని వేదికల మీద వక్తల చేత కొనియాడబడిన కళాకారుడు. నాటకాలంటే నటించబడేది అని, పద్యమంటే చదవాలి కానీ, పాడకూడదని, పాటను మాత్రమే పాడాలని అభిప్రాయ పడేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాటకం నాటకం లాగే ఉండాలని కోరుకొనే వారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల్లో వేలాది నాటక ప్రదర్శనలు ఇచ్చి, ప్రేక్షకులను మురిపించిన మంచి మనిషి. నాటకాన్ని రచించిన కవుల ఉద్ధేశ్యాలు, ఆలోచనలు, భావాలు ఏ మాత్రం దెబ్బతినకూడదనే కోరుకొనే సహజ నటుడాయన.
నటనా జీవితంలో కాక, వ్యక్తిగత జీవితంలో కూడా క్రమశిక్షణ గల రాజయోగి B.C. క్రిష్ణ గారు. మాయమాటలు చెప్పడం,మోసం చేయడం తెలియని అభిమానధనుడు బి.సి. క్రిష్ణ గారు. భార్య గంగ గారు అంటే ఎనలేని ప్రేమ గలవాడు. తుదిశ్వాస వరకు చిలకా గోరింకల్లా కలిసి జీవించారు. నాటకంలో పరిపూర్ణంగా నటించ గలిగారు కాని, నిజజీవితంలో సమాజంలో నటించలేక పోయారేమో అనిపిస్తుంది. కొడుకు, కోడలు మనవరాళ్లను ఇంటి యజమాని పాత్రలో చక్కగా విలువలతో పోషించిన క్రిష్ణ గారు 77 సంవత్సరాల 8 మాసాలు జీవించి, 2025 ఫిబ్రవరి 1 వ తారీఖున సాయంత్రం స్వర్గస్తులైనారు. నటరాజు స్వామి సన్నిధికి చేరుకున్నారు. కళారంగం మళ్ళీ తెచ్చుకోలేని నటుడిని కోల్పోయింది.

నేనెప్పుడు ఫోన్ చేసినా “నమస్కార శతములు మీకు” అని మాట్లాడేవారు. పెద్ద వారైనా సంస్కార వంతులు కదా! ఇంకా ఎంతో రాయాలని ఉంది. కానీ గుండె ఘోషిస్తోంది. అందుకే నేను చేసిన కళాభిషేకం కార్యక్రమంలో వారు మనకు సజీవంగా, చిరస్మరణీయులుగా కనిపిస్తారు, మాట్లాడుతారు చూడండి.
మీ శేషయ్య గారి పల్లి అంజనప్ప
కళాభిషేకం నిర్వాహకులు.
Tene Telugu Channel
(Mob: 99499 97672)

బి.సి. క్రిష్ణ గారితో అంజనప్ప గారు చేసిన ఇంటర్వ్యూ క్రింది లింక్ లో చూడగలరు.
https://www.youtube.com/watch?v=BxUIEPCQxqU