రంగస్థల కళా ప్రవీణ – డా. పి.వి.ఎన్. కృష్ణ

పద్యం తెలుగు వారి సొత్తు. పౌరాణిక పద్య నాటకం తెలుగు వారి వైభవం. అలాంటి పౌరాణిక పద్య నాటకాన్ని కొత్త ఒరవళ్ళతో, నూతన ఆలోచనా పోకడలతో ప్రేక్షక జనరంజకంగా ఆడుతూ… నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, నాటకసమాజ నిర్వహకుడిగా, భావికళాకారుల శిక్షకుడిగా, బహుముఖీనమైన పాత్రలు పోషిస్తూ, మరో పక్క ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్యహిస్తూ, దినదినాభివృద్ది తో రాణిస్తున్న డా. పి.వి.ఎన్. కృష్ణ గారి పరిచయం 64కళలు.కాం పాఠకులకోసం…

తూర్పుగోదావరి జిల్లా ‘విలసవల్లి ‘ గ్రామంలో 1962 నవంబర్ 11 వ తేదీన పొన్నపల్లి విశ్వనాథం, నారాయణమ్మ దంపతుల ఇంట జన్మించారు పి.వి.ఎన్. కృష్ణ. వీరి పూర్తి పేరు పొన్నపల్లి విశ్వనారాయణ కృష్ణ. బి.ఏ. తర్వాత తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందారు.
1983 లో ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తండ్రి విశ్వనాథం గారు బాల్యదశ లోనే ముచ్చటపడి ‘భక్తప్రహ్లాద ‘ ఏకపాత్ర నేర్పించగా ప్రదర్శించి చిన్న కప్పును కూడా సాధించారు. ఆయనే తొలి గురువు.
భీమనపల్లిలో చదువుతుండగా డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కూచిబొట్ల సత్యనారాయణ గారు ‘అశ్వద్ధామ ‘ పాత్రను ప్రశంసనీయంగా నేర్పగా తూర్పుగోదావరి జిల్లా స్థాయి లో ప్రథమ స్థానం పొందారు. వారినే నాటకరంగంలో గురువుగా భావిస్తారు కృష్ణ.

నాటక ప్రస్థానం :
విజయవాడ పోలీస్ శాఖలో పనిచేస్తూనే శ్రీసాయిబాబా నాట్యమండలిలో చేరి హార్మోనిస్ట్ కె. రామకృష్ణ శాస్త్రి, పి.వి. రమణ మూర్తి గార్ల వాద్య సహకారంతో సుబ్రమణ్య యాదవ్ వారి ఆధ్వర్యంలో దుర్యోధనుడు, కర్ణుడు, విశ్వామిత్రుడు పాత్రలు నేర్చుకుని పద్య నాటక రంగంలో ముందడుగు వేశారు. 1996లో తన మనోయవనిక మీద కదలాడిన ఉషాపరిణయం పద్యనాటకానికి రచయితగా అక్షరీకరణ చేసి, ఆ అక్షరసమూహాన్ని ప్రోది చేసి భావయుక్తంగా, ఉషా పరిణయం నాటకం ప్రదర్శించగా అది అంతగా విజయవంతం కాలేదు. అయినా పట్టు వదలకుండా మరల ప్రయత్నించి రచయితే దర్శకుడయ్యారు. నటరాజు ముందు నిల్చుని శుభశంఖారావం చేశారు. బాణాసుర పాత్ర ధరించి ఆ నాటకానికి త్రిపాత్రాభినయం చేశారు. అప్పుడు ఉషాపరిణయం నాటకం 2005లో అప్పాజోస్యుల , విష్ణుభట్ల కందాళం పౌండేషన్ వారు నిర్వహించిన పద్య నాటక పోటీలలో ప్రథమ స్థానం పొంది ఉత్తమ ప్రదర్శన సాధించడం ద్వారా పద్యనాటక విజయ పరంపర ప్రారంభమైంది.

2002 సంవత్సరంలో శ్రీకృష్ణరాయబారం పద్యనాటకాన్ని స్వీయదర్శకత్వంలో నంది నాటకోత్సవాల్లో జనరంజకంగా ప్రదర్శించారు. రచయితగా, దర్శకుడిగా, ప్రధాన నటుడిగా, సమాజ నిర్వహకుడిగా కొనసాగుతునే క్రింది పేర్క్కొన్న అనేక నాటకాలను విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు.
ప్రథమ స్వతంత్ర మహాసంగ్రామం-1857 (భారత స్వతంత్ర చారిత్రాత్మక పద్యనాటకం)
ఖడ్గతిక్కన (చారిత్రాత్మక పద్యనాటకం)
ఉషాపరిణయం (పౌరాణిక పద్య నాటకం)
శ్రీమాధవవర్మ (చరిత్రాత్మక పద్య నాటకం)
పృథ్వీరాజ్ రాసో (చారిత్రాత్మక పద్యనాటకం)
తరిగొండ వెంగమాంబ (భక్తి రసాత్మక పద్యనాటకం)
విధివ్రాత (పౌరాణిక పద్య నాటకం)
ఆంధ్ర మహావిష్ణు (పద్య నాటకం)
అసలీ జిహాద్ (దేశ భక్తి యుత నాటకం)
ఇది కొత్త కథ (యువ సాంఘిక నాటిక)
కృష్ణవేణీ మాత (నదీ ప్రవాహ విశిష్టత-విలువలు).

ఈ నాటకాలలో ప్రధానపాత్ర లైన కర్ణ, దుర్యోధన, ఖడ్గతిక్కన, జనరల్ హ్యుగ్రోస్, మాధవవర్మ, చాంద్ వరదాయి, విశ్వామిత్ర, బానాసుర, ప్లాస్టికాసురా, మహామంత్రి తిమ్మరుసి మొదలైన విలక్షణమైన పాత్రలను పోషించి, ప్రేక్షకులచేత మెప్పుపొంది, కీర్తిని, గౌరవాన్ని పొందారు.

సామాజిక సేవ:  శ్రీ సాయిబాబా నాట్యమండలిలో అనేక నాటక ప్రదర్శనలు విజయవంతంగా ప్రదర్శిస్తూనే, తిరువూరు లక్ష్మీనరసింహారావు వారి కుమారుడు రామన్ ఆశయాలకు, ఆదర్శాలకు ఆకర్షితులయ్యారు. పేద విద్యార్థులకు ‘ఉచితంగా ‘ స్టడీ అవర్స్ నిర్వహించడానికి డాక్టర్ రామన్ గారి సోదరుడు డాక్టర్ టీవీఎస్ గిరింద్రనాథ్ ఆర్దిక చేయూతతో విజయవాడ సింగ్ నగర్ లో కృష్ణ గారు తన నివాసభవనం పైభాగంలో రోజూ సాయంత్రం వేళ తన శ్రీమతి వెంకట లక్ష్మి శేషసాయి సహకారంతో సుమారు 150 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయుల తో పేద విద్యార్థులకు విద్యా బోధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసుఉద్యోగి గా శ్రీకాకుళంలో 2017 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతులమీదుగా పోలీస్ శాఖలో విద్యుక్త ధర్మంగా, బాధ్యతలతో పనిచేసేందుకు లభించే అరుదైన పోలీస్ అవార్డు ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) స్వీకరించారు.

అవార్డులు – రివార్డులు :
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న నానుడికి ఉదాహరణగా 12 నంది అవార్డులు, 8 ఎన్టీఆర్ అవార్డులు, 6 గరుడ అవార్డులు తోపాటు కందుకూరి వీరేశలింగం నాటకరంగం పురస్కారం, కర్నాటి లక్ష్మీనరసయ్య జీవిత సాఫల్య పురస్కారం, శనగల కబీర్ దాస్ పురస్కారం, ఎస్.వి. రంగారావు స్మారక పురస్కారం, కె.ఎల్. యూనివర్సిటీ వారి సి.ఎస్. ఆర్. అవార్డు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 50కిపైగా క్యాష్ అవార్డ్స్ , ఉత్తమ సేవా పతకం అసంఖ్యాకమైన సన్మానాలు,సత్కారాలతో పాటు ఎన్నో బహుమతులు అందుకున్నా, కీర్తి కిరీటాలు వచ్చినా ‘విద్య యొసగును వినయంబు ‘ అన్న చందాన తన మాటల్లోనూ, చేతల్లోనూ అహంభావం, అహంకారం వీసమెత్తు కూడా ప్రదర్శించని నిగర్వి, సంస్కారమే ఆభరణంగా ఉండే వినయశీలుడు కృష్ణ గారు.

నట పరంపర:  “ పద్యం తెలుగువారి సొత్తు ” . పౌరాణిక పద్య నాటకం కాలక్రమేణా ‘తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, అడుగంటిపోతూ, అంతరించి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?, ఎలా? అన్న ఆలోచన మొలకెత్తింది కృష్ణ గారి మస్తిష్కం లో . అంతే ఉవ్వెత్తున లేచాయి.. తన మనో సాగరంలో అలోచనా తరంగాలు. తనని నటుడిగా, దర్శకుడుగా ఈ స్థాయికి తీసుకొచ్చిన కళారంగానికి – ఊపిరులు ఊది, జవ సత్వాలు నింపకపోతే మరి తన తరువాత ఎవరు నాటకరంగం వికాసానికి నడుం కట్టి మళ్లీ ప్రభలు వెలిగిస్తారు. కీర్తి ప్రతిష్టలు తెస్తారు? ముందుగా – సాగు చేసి, విత్తనం నాటి దానికి నీరు పోస్తే అదే మహావృక్షం అవుతుంది. కళావృక్షం అవుతుంది. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. పద్య నాటక రంగంలో అందరికీ ఆదర్శం అవుతుంది. అదే ఆలోచన… ఆచరణ లో ఎలా పెట్టడం?.. ప్రయత్నం ప్రారంభమైంది….

అనేక కళాశాలల్లో విద్యార్థుల్ని పరిశీలించి, జల్లెడపట్టి, పాత్రోచితంగా చక్కగా సరిపోయే వారిని ఎంపిక చేసుకుని, వారిని సాయంత్రం వేళ హార్మోనియం ముందు సాధన చేయిస్తూ… వారికి పద్యాలు అర్థం అయ్యేటట్లు నేర్పించారు.
శృతిలో, రాగయుక్తంగా, భావయుక్తంగా పాడగలిగేటట్లు శిక్షణ ఇచ్చి, చక్కని ముఖకవళికలు ప్రదర్శిస్తూ, సంభాషణలు అందరికీ అర్థం అయ్యేటట్లు, మైకు ముందే పాడకుండా, చక్కని హావభావాలతో ప్రేక్షకులు మెచ్చుకునేలా ప్రదర్శించారు తొలి సారిగా. ఆ పద్యనాటకమే తిరుపతి వెంకటకవులు రచించిన ” శ్రీకృష్ణ రాయబారం“. ఈ నాటకం రంగస్థలం పై ‘26′ అద్భుత ప్రదర్శనలిచ్చి ఎన్నో బహుమతుల్ని, పెద్దల ఆశీస్సులను, పత్రికల ప్రశంసలను అందుకున్నారు. ఆ యువ కళాకారులు.
రామకృష్ణ పరమహంస కు వివేకానందుడు లభించినట్లు కృష్ణ గారికి క్రమ శిక్షణ, ఆశక్తి కల్గిన యువతీయువకు లభించడం అదృష్టం. వారిరువురి కృషి ఫలించి తెలుగు పద్యనాటకం రంగస్థలం పై పదికాలాల పాటు నిలవాలని ఆ విధంగా కృష్ణ గారి కల సాకారం కావాలని ఆశిద్దాం.

గతంలో పోలీసు డిపార్ట్మెంట్ లో ఆసక్తి వున్న తన సహ ఉద్యోగులకు పద్యనాటకంలో శిక్షణ ఇచ్చారు కృష్ణ గారు. వారందరూ కూడా ప్రస్తుతం రంగస్థలం పై మంచి నటులుగా రాణిస్తున్నారు.
నటీనటుల నట విన్యాసం, సంగీత రస ప్రవాహం, రూపాలంకరణ, రంగాలంకరణ మొదలయిన శాఖల సమ్మేళనమే నాటకం. నాటకం ప్రేక్షకులు మెచ్చుకునేలా విజయవంతం కావాలంటే దర్శకుడే అన్ని కోణాల్లో నాటకాన్ని పరిశీలించి, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే “నాటక ప్రయోక్త ” అవుతాడు. అలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే డా. పి.వి.ఎన్. కృష్ణ గారు ‘మంచి ‘ నాటకప్రయోక్త గా గుర్తింపుపొందారు.

పౌరాణిక పద్యనాటకం, సాంఘిక నాటకం రచయితే కాకుండా, పోలీసు ఉద్యోగిగా కాకుండా, ఒక సాధారణ భారతీయ పౌరుడిగా బాధ్యత వహిస్తూ సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ ప్రస్తుత మహమ్మారి, సర్వ వినాశని “కరోనా ” విశృంఖల విలయతాండవ పరిస్థితి పైన, అందుకుగాను ప్రజాసమూహం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి, అప్రమత్తత గురించి అద్భుతంగా పద్యాలు రచించి, తన గానం ద్వారా ప్రజలకు వినిపించారు.
అనేక దశాబ్దాలుగా కొనసాగిన కృష్ణ గారి కళాసేవకి గుర్తింపుగా  ‘అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ‘ వారు డాక్టరేట్ ఇన్ ఇండీజినెస్ (స్థానిక కళలు) ‘డాక్టరేట్ ‘ ప్రదానం చేసారు.

కుటుంబం:  శ్రీమతి వెంకట లక్ష్మి శేషసాయి కృష్ణ గారి దంపతులకు ముగ్గురు కుమారులు విశ్వకాంత్, ప్రసన్నకుమార్, సాయిశంకర్. వీరిలో మూడవ కుమారుడు సాయిశంకర్ తండ్రి కళావారసత్వాన్ని స్వీకరించి శ్రీకృష్ణరాయభారం నాటకంలో దుర్యోధన పాత్ర పోషించి తడ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు.
కొత్త ఒరఒడితో, నూతన ఆలోచనా పోకడలతో పౌరాణిక పద్యనాటకాన్ని ప్రేక్షక జనరంజకంగా ఇలానే భవిష్యతరాలకు అందిస్తూ … తన ఉద్యోగంలో కూడా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.

-‘కళామిత్ర ‘ అడి వి శంకర రావు (6301002268)

_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

యువ కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం ‘ పద్యనాటకం పడక సీను… క్రింది లింక్ లో చూడగలరు …

37 thoughts on “రంగస్థల కళా ప్రవీణ – డా. పి.వి.ఎన్. కృష్ణ

  1. ఎంతోమంది అభిమానులను కళాకారులు ఆయన ద్వారా సమాజానికి దొరుకు తున్న రు దీనిలో ఏమాత్రము అతిశయోక్తి కాదేమో

  2. కళరాధనే సర్వస్వంగా భావించే గొప్పకళాకారుడు పి వి ఎన్ కృష్ణ….ఈ కళ అంతరించిపోకూడదనే తపనతో ‘నేటి యువత’ ను ఆకర్షితులను చేసి అద్భుత ప్రదర్శనలను చూపి తెలుగు వారి సొత్తు ‘పద్యాన్ని’ రక్షించారు….
   వ్యాస రూపశిల్పి ‘కళామిత్ర’ కు…
   64 కళల ‘కళాసాగర్’ కు….
   అభినందన *శుభాకాంక్షలు*

 1. చాలా మంచి రచయిత, మంచి దర్శకుడు, ముఖ్యంగా మంచి మనసు ఉన్న మనీషి మా కృష్ణ.

 2. కళా ప్రదర్శన చేసేవారు కళాకారులు కాదు

  నిస్వార్థంగా కళాకారులను తయారుచేసి కళను తరువాత తరానికి అందించేవారు,నిజమైన కళాకారులు.

  సందేహం లేదు,కృష్ణ గారు కళామతల్లి ముద్దుబిడ్డ.

  1. ధన్యవాదాలు రామ్ కుమార్ గారు

   ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరునన్ను ప్రశంసించడం మీ స హృదయానికి నిదర్శనం

 3. మాధవవర్మ నాటకం చూశాను. నటనకు రచన పోటీ. రచనకు దర్శకత్వం పోటీ. ముగ్గురూ ఒక్కరే..త్రిమూర్తులు కలసిన రూపం..ఆ రూపం మా తాతయ్య ది.మా తాతయ్య ముందుగా నాకు రచయిత గానే తెలుసు.ఆ తర్వాతే తాతయ్య గా.

  1. ధన్యవాదాలు భీమశంకర్,
   చిరంజీవి శంకర్ నాకు మనవడుగా పరిచయం కాకముందే “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే కార్యక్రమంలో చిరంజీవి గారి సమక్షంలో పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్న కుర్రవాడిగా నేను అతని అభిమానిని. ఆ తర్వాత తెలిసింది భీమశంకర్ మా బావ గారి సొంత మనవడిని.

 4. ఇలాంటి మహోన్నత రంగస్థల కళాకారుడి తో కలిసి చేయడం నాకెంతో ఆనందంగా ఉంది

  1. ధన్యవాదాలు మధుగారు,
   మీరు ఎప్పుడో చిన్నప్పుడు నా దగ్గర చదువుకుని , మీ అంతట మీరుగా బాగా చదువుకొని ఈనాడు టీచర్ గా గొప్ప పేరు తెచ్చుకుని కూడా నన్ను మర్చిపోకుండా ఇప్పటి దాకా గురువు గా గౌరవిస్తూ ఉండడం సహృదయానికి నిదర్శనం.

 5. నేను వీరి శిష్యులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ రాయబారం ‘ పద్యనాటకం విజయవాడలో చూశాను. అద్భుతం… వీరి కృషి అభినందనీయం. వీరి సేవలు నిరుపమానం.

 6. డాll పి వి యన్ కృష్ణ గారు కృషి,పట్టుదల లో మిగతా కళాకారులకు ఆదర్శనీయుడు.
  కానిస్టేబుల్ నుంచి గోప్పకాళాకారుడుగా
  రచయితగా ,దర్శకుడు గా మరియు డాక్టరేట్ పొందడం సమాజసేవకుడుగా తన వృత్తిలోను
  ప్రవృత్తి గుర్తింపు పొంది తను నమ్మిన సిద్దాంతాన్ని తన కుమారుడును రంగప్రవేశం చేయిపించి ఆచరించి చూపించారు .

  1. ధన్యవాదాలు రాంబాబు గారు, చిత్రలేఖనంలో అంతర్జాతీయ స్థాయి కళాకారుడైన మీరు ఇలా ప్రశంసలు అందజేయడం మీ సహృదయ మే గాని నా గొప్పదనం కాదు

 7. జగద్విఖ్యాతికలిగిన,రచయిత,దర్శకుడు,నటుడు,గౌ:మాన్యశ్రీ పి.వి.యన్.కృష్ణ గారు ఇంతటిమహావ్యక్తితోకలిసికొంతకాలమైనాపనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను

 8. Introduced such a great stage artist Krishna garu. I wish him to a great future. Thanks to editor of 64kalalu.com.

 9. I appreciate to Krishna garu for great service in the field of Telugu Padya Natakam. I see the Sri Krishna Rayabharam Padaka seen below this link it’s wonderful experiment. Unbelievable performance the youth talented guys. I proud of you. Please give me your contact no.

 10. తెలుగు పద్య నాటకం నిజంగా తెలుగు వారికి మాత్రమే దక్కిన గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని నిలబెడుతున్న కృష్ణ గారి లాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిది.

 11. అటు వృత్తి లోను(పోలీస్)…ఇటు ప్రవృత్తి లోను(నాటక రచయిత,నటులు,)లోను…అ”ద్వితీయం”గా రాణించి,లెక్కలేనన్ని అవార్డులు సాధించి,అవార్డుకే సరైన నిర్వచనం గా మారి,నిత్య కృషివలురు, అటు విద్యా పరంగా,ఇటు కళల పరంగా,ఎంతో మంది యువతీ, యువకులలో, అంతర్గతంగా ఉన్న అంశాలకు మెలకువలు చెప్పి,వారి అభివృద్హి కి బాటలు వేసిన డాక్టర్ పి.వి.ఎన్ కృష్ణ గారు…వ్యక్తి మాత్రమే కాదు,నిత్య చైతన్య శక్తి…
  హృదయ పూర్వక అభినందనలు బాబాయ్ గారు..
  కె.వి.లక్ష్మణరావు

  1. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు ఒక అధ్యాపకుడు గా పిల్లల సాహిత్యం మీద ఎంతో కృషి చేసి మంచి కథకుడిగా ఎన్నో బహుమతులు అందుకున్న మీరు స్పందించడం, అభినందించడం ఆనందదాయకం

 12. డా || P.V.N కృష్ణ గారికి కళాభి వందనములు,
  నేను సాంస్కృతిక విలేకరిగా గతం లో ఎన్నో వార్తలు, విశేషాలు , వ్యాసాలు రాసాను. కానీ , ఒక వ్యక్తి ” ఒక సూర్యుOడు సమస్త జీవులకు తానొక్కటై తోచు ” అన్నచందాన – నా దృష్టి లో నాటక రంగం లో పలు శాఖల్లో విపరీతమైన ప్రజ్ఞ , పాటవాలను ప్రదర్శిస్తున్న మీగురించి విశేషణాలు, విశేషాలు రాయలేకపోయినా , ఉన్న వాస్తవాన్ని , పరిస్థితిని రాసాను. సూర్యుడు గురించి, చంద్రుడు గురించి వారి శక్తి యుక్తుల గురించి రాసేంత శక్తి నాకు లేదు. ” కృషి తో నాస్తి దుర్భిక్షం ” అన్నట్లు గా, “పద్య నాటక రంగ” అభివృద్ధి కి కృషి చేస్తున్న మీలాంటి సహృదయులు , కళాకారుల గురించి రాయటం నా అదృష్టం. 64 కళలు web magazine అధినేత కళాసాగర్ కృతజ్ఞేతలు.
  “కళామిత్ర” అడివి శంకరరావు, మేకప్ ఆర్టిస్ట్ , సాంస్కృతిక విలేఖరి , హైదరాబాద్. +91 – 6301002268 .

 13. నమస్తే శంకర్ గారు
  “నడిచే నాటకరంగం” గా పిలువబడే మీరు నా గురించి రాయడం నా అదృష్టం. మీలాగా జీవితం మొత్తాన్ని నాటక రంగానికి అంకితం చేసిన వ్యక్తిని కాదు నేను. . ఉడతా భక్తిగా నాటక రంగానికి నాకు తోచిన సాయం అంతే. అది కూడా నాకు తెలిసిన కళను ఆనందిస్తూ ఆ ఆనందాన్ని భావితరానికి కూడా అందించాలని ఒక చిన్న ఆశ. ఆ ఆశకు మీలాంటి వారి రాతలు మరింత జీవంపోసి బ్రతికి స్తాయి. కళాసాగర్ గారు ఇలాంటి విషయాలు ప్రచురించడం ద్వారా చేస్తున్న కళాసేవ మిక్కిలి కొనియాడదగినది
  ఇద్దరికీ ధన్యవాదాలు .

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link