సీనియర్ రంగస్థల నటులు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ ది. 13-10-20 న కన్నుమూసారు. వారి కళాసేవ గురించి, వారి నటన గురించి వాడ్రేవు సుందర రావు గారి జ్ఞాపకాలు మీ కోసం…
నిజం ….. ఇది నిజం ….. గొప్పనటుడు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ నిజంగా… నిస్సందేహంగా గొప్పనటుడు.
కేవలం గొప్పనటుడు మాత్రమే కాదు. మనసా, వాచా, కర్మణా నటనకు అంకితమైన నటుడు. నాటకాన్ని హృదయంతో ప్రేమించిన నటుడు, రంగస్థలాన్ని అనురాగంతో జీవనవేదిక చేసుకొన్న మహానటుడు. తన ఏభై సంవత్సరాల నటనాప్రస్థానంలో వందలాది పాత్రలకు ప్రాణం పోసిన మహాకళాకారుడు జానకీనాథ్. మహారాజుగా దర్శనమిచ్చినా, నిరు పేదగా కన్పించినా, ఆంగ్లేయ అధికారిగా నటించినా, అశోకచక్రవర్తిగా కన్పించినా, నిత్యాగ్ని ఘోత్రుడైన సద్ర్బహ్మణుడి పాత్రలో జీవించినా, క్రీస్తు నామాన్ని ప్రచురపరిచే మత పెద్దగా మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసినా… అదంతా జానకీనాథ్ కే చెల్లింది. నవరసాలు నిండిన ఎన్నో పాత్రల్ని, జానకీనాథ్ అభినయించి చూపించినా, ప్రధానంగా కరుణరసపాత్రల్లో ఆయన నటన నిరుపమానం. సాత్త్వికాభినయంలో ఆయన ప్రతిభ ప్రశంసనీయం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాలలో, అత్యుత్తమ నటనకు లభించే నంది పురస్కారం రెండుమార్లు ఆయనను వరించింది.
1950వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో, జానకీనాథ్ జన్మించారు. వెంకటనరసింహారావు, సరస్వతీదేవిల ప్రియపుత్రుడు ఆయన. తండ్రిలోని క్రమశిక్షణ, తల్లి నుండి ప్రేమాభిమానాలు, ఆయనకు జన్మతః అబ్బిన సుగుణాలు. అందుకే ఎంత ఎత్తుకెదిగినా, అందరితోనూ అంత ఇష్టంగానూ, ఆప్యాయంగానూ మాట్లాడుతారు. జానకీనాథ్ లోని కళాభిరుచి విద్యార్థిదశలోనే మొగ్గ తొడిగింది. తెనాలి దగ్గరున్న మున్నంగి గ్రామంలో, జానకీనాథ్ బాల్యం గడిచింది. అక్కడే వల్లభాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో కావ్యశ్రీ రచించిన నిరుద్యోగి నాటకంతో, రంగస్థల ప్రవేశం జరగడం, తొలి ప్రదర్శనలోనే బహుమతిని అందుకోవడం జరిగింది. అది జరిగింది 1962. అప్పటికి ఆయనకు పన్నెండేళ్ళ వయసు. సరిగ్గా ఇప్పటికి యాభై ఏళ్ళ క్రిందటి సంఘటన అది. అంటే ఈ 2012 జానకీనాథ్ కి నట స్వర్ణోత్సవ సంవత్సరం. గుంటూరులోని హిందూ కళాశాలలో బి.ఎ. చదువుతున్న రోజుల్లో, ఎన్నో నాటికల్లో మంచి పాత్రలు పోషించే అవకాశం ఆయనకు లభించింది. ఈనాడు నటుడిగా, దర్శకుడిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందిన ఎందరికో, కళాశాలలే. వారి నటజీవితానికి అవే అసలైన పునాదులు. హిందూకళాశాలలో “మానవుడు, మారీమారని మనుషులు, దేవుడూ… నిద్రలే” వంటి ఎన్నో నాటికలలో నటించి, ఉత్తమనటనకు బహుమతులందుకొన్నారు కూడా!
హిందూకళాశాల అనుభవంతో ఆతరువాత తెనాలిలోని అభ్యుదయకళాసమితి, గుంటూరు వసంతవనీ ధియేటర్లలో సభ్యుడై, ఆసంస్థల తరపున ఎన్నో నాటికలలో నాటకాలలో, చెప్పుకోదగ్గ పాత్రల్ని పోషించారు. కాలక్రమంలో జానకీనాథ్ జీవన ప్రయాణం గోదావరీ తీరాన్ని చేరింది. ఒక గూటి పక్షులన్నీ ఒక్కచోటే చేరినట్లు, నాటకాభిమానులు, నటులు, దర్శకులలో ఎందరో రాజమండ్రి చేరడం, గోదావరీతీరంలో తమ ప్రతిభకు పట్టంకట్టుకోవడం అనూచానంగా వస్తున్నదే. జానకీనాథ్ జీవితంలోనూ అదే జరిగింది.
రాజమండ్రి వచ్చీరాగానే, ఆయనను రైల్వే ఇన్స్టిట్యూట్ నాటక సమాజం ఆహ్వానించింది. భీశెట్టి లక్ష్మణరావు రచించిన “దేవుడూ నిద్రలే” నాటకంతో, రాజమండ్రిలో ఆయన నటప్రస్థానం ఆరంభమైంది. అప్పుడే, జానకీనాథ్ కు కీర్తి శేషులు తమ్మారెడ్డి జానకీరామనాధం పరిచయభాగ్యం కలిగింది. ఇనుపముక్క అయస్కాంత క్షేత్రంలోకి చేరగానే అయస్కాంతమైనట్లు, ఎలాంటివాడైనా, రామనాధం స్పర్శతగిలితే మహానటుడు అవుతాడని పెద్దలంటారు. సహజంగానే జానకీనాథ్ మంచినటుడు. మరింక చెప్పేదేముంది? రామనాథం నిర్వహణలో మొదటిగా “నాగులు తిరిగే కోనలో” నటించాడు జానకీనాథ్. ఆ తరువాత రామనాథం ఆలోచనల్లో రూపుదిద్దుకొన్న అద్భుత దృశ్యకావ్యం “నన్నయభారతరచన”లో, జానకీనాథ్ కు ద్రోణాచార్యుడి వేషం లభించడం ఒక ఎత్తైతే, ఆ నాటకానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే అదృష్టం కలగడం మరొక ఎత్తు. మద్రాసు (నేటి చెన్నై) మహానగరంలో, నటసార్వభౌముడైన ఎన్టీఆర్ ఎదుట నన్నయభారతరచన ప్రదర్శించి, ఆ మహానుభావుడి ప్రశంసలందుకోవడం నిజంగా జానకీనాథ్ అదృష్టమేననాలి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోనూ ఆనాటకం ప్రదర్శించడం, జానకీనాథ్ వ్యాఖ్యానానికి అందరి ప్రశంసలు లభించడం, ఆయన జీవితంలో ఒక మధురఘట్టం. ఆయన ఆకాశవాణిలో “ఎ” గ్రేడ్ కళాకారుడు. దూరదర్శన్లో గుర్తింపు తెచ్చుకొన్న ప్రతిభావంతుడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన తిక్కన సోమయాజి కథలో, తిక్కన తండ్రిగా నటించి పదిగురి చేత శభాష్ అనిపించుకున్న బుల్లితెర కళాకారుడు. ఆధునిక నాటకరంగానికి ఒక అదృష్టదీపకుడు కీ.శే. ప్రసాదమూర్తి.
రామనాధం శిష్యరికంలో ఎంతో నేర్చుకొని, తన స్వయంకృషితో, సమర్థతతో, నిరంతర దీక్షాదక్షతలతో తెలుగు నాటకరంగాన్ని ఒక దశాబ్దకాలం శాసించిన మహనీయుడు ప్రసాదమూర్తి. ఆయన స్థాపించిన నాటకసంసే “కళావాణి”. తెలుగు నాటకరంగంలో ఒక సంచలనాత్మకమైన చరిత్రను సృష్టించిన మహానాటకసంస్థ ఈ కళావాణి.
జానకీనాథ్, ప్రసాదమూర్తిల సంబంధం మాటలకందనిది. ఒకసారి వారిద్దరూ గురుశిష్యులు, మరోవేళ వారిద్దరూ మహారాజు, మహామంత్రి, ఇంకొక సందర్భంలో వారిద్దరూ ఆత్మీయసహచరులు.
జానకీనాథ్ నటప్రయాణంలో ప్రసాదమూర్తితో అనుబంధం ఓ దివ్యానుభావం. ఓ అద్భుత సన్నివేశం. కళావాణితోనే జానకీనాలోని ప్రజ్ఞ, బహుముఖీనంగా విస్తరించింది. ఎన్నో గొప్ప పాత్రలు అందుకోగలిగారు ఆయన. వీరపాండ్య కట్టబ్రహ్మనలో, ఆంగ్లేయ అధికారి బానర్ మెన్ పాత్రతో జీవించినా, అలరాస పుట్టిల్లులో వృద్ధుడిగా కన్పించినా, అమరజీవిలో బులుసు సాంబమూర్తిగా రాణించినా, అదంతా ప్రసాదమూర్తి కృషికి ఫలితమే. కళావాణి ప్రతిష్టాత్మక నాటకాలు, “అప్పాజీ, తెలుగువెలుగు, ముద్రారాక్షసం, నరకం మరెక్కడో లేదు” అన్నిటికీ మించి, “మహాత్మా జ్యోతిరావు పూలే” ఇలా ఎన్నో నాటకాలలో జానకీనాథ్ గొప్పనటనను చూపించాడు. అమరజీవి నాటకానికి ఎంతో హృద్యంగా వ్యాఖ్యానం అందించాడు.
మద్దాలి జానకీనాథ్ కు వందలాది పురస్కారాలు లభించాయి. ఎన్నో పరిషత్తులలో ఉత్తమనటుడిగా, సహాయనటుడిగా… ఎన్నో బహుమతులందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు రెండుమార్లు లభించింది. 2008లో “శాంతియాత్ర” నాటకంలో “షేర్ ఖాన్” పాత్రకు ఉత్తమసహాయనటుడిగా, 2010లో “మహాత్మా జ్యోతిరావు పూలే” నాటకంలో “జ్యోతిరావు పూలే” పాత్రకు ఉత్తమనటుడిగా, రెండునందులందుకొన్నారు.
నాటకం ఓ గొప్ప ప్రక్రియ. మహాకవి కాళిదాసు నాటకాన్ని “చాక్షూషమైన యజ్ఞం” అని గౌరవించాడు. యజ్ఞం చేసే ఋత్విక్వుల వంటివాడు నటుడు. అందరూ సుఖంగా భార్యాపిల్లలతో నిద్రపోయే ఎన్నోరాత్రులు, నటీనటులు నాటకనిర్మాణంలో, వ్యయపరచి, తమ సుఖాన్ని సంతోషాన్ని వదలుకొని, చెప్పలేనంత కష్టాన్ని, చెప్పుకోలేనంత శ్రమను ధారపోస్తారు. అప్పుడే ఓ నాటకం పుడుతుంది. పుట్టినబిడ్డను పదిమందికీ చూపించడానికి, పది ఊళ్ళూ తిరుగుతారు. చివరికి జనులా ప్రదర్శన చూసి, చప్పట్లు కొడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు నటులు. ఎందుకోసం ఇదంతా? ఎవరికోసం ఇదంతా? ఈ జనం కోసమే. ఈ జనానందం కోసమే. అలా తమని తాము కొవ్యొతిలా కరిగించుకొంటూ, లోకానికి వెలుగునిచ్చే, నాటక కళాకారుల్లో, నిస్వార్థ నాటకకళాకారుల్లో అగ్రశ్రేణి కళాకారుడు మద్దాలి జానకీనాథ్. ఇంతకన్నా తపస్సు ఇంకేముంది ? ఇంతకన్నా దేశ సేవ మరేముంది ?
బ్రతికినంత కాలం లోకానికి నాటకాన్ని చూపిస్తూ, ఆనందంగా ఆత్మసంతృప్తితో బ్రతికారు. స్వస్తి.
-వాడ్రేవు సుందర రావు
( ‘గరుడ అవార్డు’ గ్రహీత)
mob: 9396473287