‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

బొట్టా భాస్కర్ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా….

తెలుగు సాంఘిక నాటకరంగం లో నాలుగు దశాబ్దాలుగా విశేషమైన కృషిసల్పిన నటుడు బొట్టా ఉదయ్ భాస్కర్ జూలై 27 న సోమవారం, ఉదయం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు.  

పౌరాణిక నాటక రంగంలో కృష్ణుడు పాత్రధారిగా పేరొంది, నటుడిగా రాణించిన కీ.శే. సుబ్రమణ్య యాదవ్ గారి కుమారుడు బొట్టా ఉదయ్ భాస్కర్ విజయవాడలో నవంబర్ 8, 1954లో జన్మించారు. చిన్నతనం నుండే నటన పై ఆశక్తి కలిగి తండ్రి బాటలోనే పయనించారు. తొలుత తండ్రి ప్రోత్సాహంతో ‘కాటమ రాజు ‘ పౌరాణిక నాటకంలో చిన్న పాత్ర ద్వారా ప్రవేశించి, 1975 సంవత్సరంలో  ‘గమ్యం ‘ అనే నాటకంతో ప్రారంభించి,  సాంఘిక నాటకాలల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రంగస్థలం పై   పలుపాత్రలతో ప్రేక్షకులను రంజింపజేసారు.  ‘ఊరుమ్మడి బతుకులు ‘ నాటకం వీరికి బాగా పేరుతెచ్చింది. ‘అశ్వద్దామ ‘ పాత్రలో కూడా అద్భుత నటన ప్రదర్శించారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ‘ఏ’ గ్రేడ్ కళాకారుడిగా గుర్తింపుపొంది ఆనేక నాటకాల్లో పాల్గొన్నారు.

గురజాడ కళామందిరం ‘ నాటక సమాజంలో ఎం. సంజీవి గారి దర్శకత్యంలో రాజ్యహింస, మను ధర్మం, గబ్బిలం, క్విట్ ఇండియా వంటి నాటకాలలో తన కంచుకఠంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తర్వాత ‘రసఝరి అసోసియేషన్ ‘ లో దర్శకుడు, రచయిత, నటుడు వై.యస్.కృష్ణేశ్వర రావు గారితో కలసి అనేక నాటకప్రదర్శనలిచ్చారు. ముఖ్యంగా ‘త్రిజుడు ‘ నాటకంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఎందరో నాటక ప్రయోక్తల ప్రశంసలందుకున్నారు ఉదయ్ భాస్కర్.

‘మద్రాసు కల్చరల్ క్లబ్ ‘ వారి నాటక పోటీల్లో తన నటనకు గాను గోల్డ్ మెడల్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా అందుకున్నారు భాస్కర్. ‘యువ కళావాహిణి ‘ వారి నాటక పోటీల్లో కూడా బహుమతి పొందారు.

భాస్కర్ జనశ్రేణి -విజయవాడ నాటకసమాజాన్ని స్థాపించి తొలుత ‘దత్త స్వీకారం ‘ నాటకం ప్రదర్శించారు. తర్వాత ‘గుర్తు తెలియని శవం ‘ నాటకం ప్రొడక్షన్ కు బంగారు నంది అవార్డ్ అందుకున్నారు. ‘జనశ్రేణి ‘ నాటక సమాజాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, రంగాలంకరణ, మేకప్ వంటి అంశాలలో కూడ నేర్పు సంపాదించారు. వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యుడిగా(BHMS) తన పరిది మేర వైద్య సేవలందించేవారు. వీరికి భార్య ధనలక్ష్మి గృహిణి, కుమార్తె రోహిణి ఉద్యోగి, కొడుకు హలిదేవ్ కృష్ణ డిల్లీ జె.ఎన్.యు. లో రీచర్చ్ స్కాలర్ గా  వున్నాడు. ఆర్ధికంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పిల్లల చదువుల విషయంలో ఎంతో శ్రద్ద వహించి వారిని ప్రయోజకులుగా తెర్చిదిద్దారు ఉదయ్ భాస్కర్.

ఉదయ్ భాస్కర్ గారు మేము కొన్నేళ్ళు పక్కపక్కనే వుండేవారం విజయవాడ మధురానగర్లో, మితభాషి అయిన భాస్కర్ ఎప్పుడు తను నటున్నినని చెప్పలేదు నాకు, హనుమతరాయ గ్రంథాలయం లో ఒక నాటక ప్రదర్శనలో కలిసినప్పుడు తెలిసింది వారు నటులని. అక్కన్నుంచి ఎక్కడ ప్రదర్శన వున్నా చెప్పేవారు. వారి కుమార్తె – మా అమ్మాయి క్లాస్ మేట్స్. అలా రెండు దశాబ్ధాల పరిచయం మాది. ఇటీవలే నటుడిగా 64కళలు.కాం లో మీ పరిచయం ప్రచురిస్తాను వివరాలు ఇవ్వండి అంటే, ముందుగా మా ఫాదర్ అర్టికల్ వేయండి అని వారి వివరాలు పంపారు. అర్టికల్ రాసే భాద్యతను శంకర రావు గారికి అప్పగించారు. ఇంతలోనే ఉదయ్ భాస్కర్  ‘నివాళి ‘ ఆర్టికల్ వేయాల్సి వస్తుందని ఊహించలేదు…

-కళాసాగర్ యల్లపు

సంతాపం :
ఉదయ్ భాస్కర్ అకస్మిక మృతికి పలువురు నాటకరంగ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. ‘రసఝరి అసోసియేషన్ ‘ స్థాపకుడు దర్శకుడు, రచయిత, నటుడు వై.యస్.కృష్ణేశ్వర రావు ‘నా అత్మీయ మిత్రున్ని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు, మా అసోసియేషన్ కు తీరని లోటని తెలియజేసారు.

సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అడవి శంకర రావు ‘నా చిరకాల మిత్రున్ని, సౌమ్యున్ని కోల్పోవడం భాదాకరమని’ తెలిపారు.
_______________________________________________________________________
నాకు అత్యంత మిత్రుడు మంచి నటుడు, దర్శకుడు డాక్టర్ బి. ఉదయ భాస్కర్ ఈరోజు ఉదయం స్వర్గస్తుడై నటరాజ సాన్నిధ్యం చేరుకున్నాడని తెలియజేయడానికి చాలా విచారిస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
PVN కృష్ణ , రంగస్థల నటులు(రామన్ అకాడెమీ)
_______________________________________________________________________
హఠాత్తుగా గుండెను కుదిపేసే వార్త… భాస్కరుడు అస్తమించాడు. మేము కలసి చేసిన నాటకాలు ఎంతో విజయవంతమయ్యాయి. ఈ మధ్య భాస్కర్ గొంతుకలో పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి కథలు విన్నాను.. అద్భుతం. ఇలా జరగడం దారుణం … దారుణం…
ఎం.సంజీవి, నటులు సినీ రచయిత.
_______________________________________________________________
భాస్కర్ నా అదాలత్ నాటకంలో ‘సముద్రాలు ‘ గా 50 ప్రదర్శనలు చేసాడు. రేడియోలో కలసి చాలా చేసాం.నేను సినిమాకి వెళ్ళిపోయాను. వచ్చి నాటకాలు చేశాం. చేస్తూనేవున్నాం… వుంటాంకుడా. కాలం కల్లెం వేసి కర్కశంగా లాక్కుపోతుంటే ఏమి చేయగలం సంతాపం చెప్పటం తప్ప. పోయినోళ్లందరు గొప్పోళ్ళు.
హృదయ రాజు, రచయిత, నటులు, దర్శకులు.
_______________________________________________________________________
ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.పాండురంగ గారు, సుమధుర కళానికేతన్ కార్యదర్శి పి.వి. భాస్కర్ శర్మ గారు,  వ్యవస్థాపకుడు హెచ్.విఆర్.ఎస్.ప్రసాద్ గారు ఉదయ్ భాస్కర్ మరణానికి సంతాపం ప్రకటించారు.
________________________________________________________________________
కరోనా కాలంలో కూడా కధలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 10రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, ‘అతడు అడివిని జయించాడు’ అనే రేడియో నాటిక కావాలి అని అడిగారు.ఒకే పాత్ర కలిగిన నాటిక.అది చెయ్యాలని ఉంది.అనిఅడగటంతో మిత్రుడు సూర్యప్రకాష్ సహకారంతో విశాఖపట్నం నుండి నాటికను తెప్పించి ఉదయభాస్కర్ కు పంపించాను. చాలా సంతోషపడ్డాడు.త్వరలోనే స్టేజీపై చూస్తామనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.
రేడియోలో నేను చేసిన దాదాపు అన్ని నాటికల్లోనూ నటించాడు. మిత్రుని మరణం చాలా బాధాకరం…..
డా. జయప్రకాష్ బొక్కిన
_______________________________________________________________________
మాలాంటి ఎదుగుతున్న ఎంతో మంది యువతకు ఆయన చక్కని మార్గదర్శకాలు చేసేవారు. పోలవరపు కోటేశ్వరావు గారు చనిపోయాక ఆయన ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో కోటేశ్వరావు గారు రచించిన కృష్ణవేణి అనే ఓ చిన్న నాటకాన్ని ఆయన దర్శకత్వం వహించి మా అందరి చేత ప్రదర్శన చేయించారు. నా జీవితంలో ఈ ఘట్టాన్ని ఎప్పుడు మర్చిపోను.
మిత్రులారా పరిస్థితులు చక్కబడ్డాక డాక్టర్ ఉదయ భాస్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన గురించిన విషయాలన్నీ మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేద్దాం
మీ రాజేష్ రంగం (9949507623)
______________________________________________________________________
పిడుగు లాంటి వార్త! వారి తండ్రితో, ఉదయభాస్కర్ తో కూడా పని చేశాను. చాలా ఉత్తముడైన స్నేహశీలి. వారి ఆత్మకు శాంతి కలుగు గాక!
సూర్యనారయణ కుమార, గాయకులు

1 thought on “‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap