అభినవ సత్యభామ ‘స్థానం నరసింహారావు’

నాటకాల్లో స్త్రీ పాత్రలను అత్యంత అద్భుతంగా, సహజంగా పోషించి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న నటనా దిగ్గజం స్థానం నరసింహారావు గారికి జయంతి నివాళి!

తెలుగు నాటకరంగ చరిత్రలో స్త్రీ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి, ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు, సుప్రసిద్ధ రచయిత స్థానం నరసింహారావు గారు. హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు 1902 సెప్టెంబర్ 23న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన ఆయన, తన అద్భుతమైన నటనా కౌశలంతో ‘అభినవ సత్యభామ’గా అపారమైన కీర్తిగడించారు. ఒక పురుషుడైనా కూడా స్త్రీ సహజమైన హావభావాలు, నడక, పలకరింపులు, ఒయ్యారం అత్యంత సహజంగా ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి.

‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో ఆయన పోషించిన సత్యభామ పాత్ర తెలుగు నాటక చరిత్రలో ఒక అపూర్వ మైలురాయిగా నిలిచిపోయింది. గర్వం, ఈర్ష్య, ప్రణయకోపం కలగలిపిన ఆ పాత్రలో ఆయన నటన అత్యంత అజరామరం. నాటకంలో “మీరజాల గలదా నా యానతి”, “నల్లనివాడను నారాయణుడే” అనే పద్యాలను ఆయన పలికిన తీరు, అభినయం ఇప్పటికీ నాటకాభిమానులకు మధురస్మృతి. దానికి తోడు కన్యాశుల్కంలో చమత్కారభరితమైన మధురవాణి, చింతామణిలో వలపుల చింతామణి, రోషనారలో గంభీరమైన రాజసం ఉట్టిపడే రోషనార, విప్రనారాయణలో నర్తకి దేవదేవి, సారంగధరలో చిత్రాంగి తదితర వైవిధ్యమైన, నవరసాలు కలిగిన స్త్రీ పాత్రలకు ఆయన సజీవ రూపం పోశారు. దరిదాపు 3000 సార్లకు పైగా పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో ప్రదర్శనలిచ్చిన ఆయన అపార ప్రతిభకు జనం నీరాజనాలు పట్టారు.

స్త్రీ వేషధారణ కోసం ఆయన పడిన తపన, కఠినమైన శిక్షణ అనన్యం. తెనాలిలోని శ్రీ రామ విలాస సభలో చేరి శాస్త్రీయ సంగీతంలో తర్ఫీదు పొందారు. అద్దం ముందు గంటల తరబడి స్త్రీల కనుబొమ్మల కదలికలు, నవ్వు, కోపం ప్రదర్శించే తీరును సాధన చేసేవారు. ఆనాటి కాలంలో స్వయంగా మేకప్ వేసుకోవడం, ఖరీదైన పట్టుచీరలు, నిజమైన నగలను పోలిన ప్రత్యేక ఆభరణాలు సేకరించి ధరించడం వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను చూపుతాయి. నటనకు ముగ్ధులైన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయనను ప్రత్యేకంగా కొనియాడారు. నాటకాల్లో సత్యభామగా మెరిసిన స్థానం వారు, సినిమా రంగంలో ‘రాధాకృష్ణ’ (1939), ‘సత్యభామ’ (1942) చలనచిత్రాల్లో మాత్రం పురుష పాత్ర అయిన నారదునిగా నటించి మెప్పించడం విశేషం.

ఆయన అమోఘమైన కళా సేవలకు గొప్ప గుర్తింపుగా 1956లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న మొట్టతొలి ఆంధ్రుడు, రంగస్థల కళాకారుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతకుముందే 1938లో రంగూన్ (మయన్మార్) ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించి బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సమయస్ఫూర్తిని, విశిష్టతను గౌరవిస్తూ పదవ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠ్యాంశంగా చేర్చింది. 1956లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

తన నలభై ఏళ్ల సుదీర్ఘ నాటక ప్రస్థానాన్ని, అపూర్వ అనుభవాలను వివరిస్తూ ఆయన స్వయంగా రాసిన ఆత్మకథ “నటస్థానం”. దీనిని 1974లో ఆయన అల్లుడు నేలకంటి వేంకటరమణమూర్తి గారు అధికారికంగా ప్రచురించారు. నాటకరంగ నిబద్ధత, స్త్రీ పాత్రల వెనుక ఉన్న కళాత్మకత, మహిళగా భ్రమపడిన ప్రేక్షకుల వల్ల ఎదురైన వింత అనుభవాలను ఇందులో ఆయన అద్భుతంగా పంచుకున్నారు.

తన జీవితకాలం అంతా నాటక కళకే అంకితం చేసి, 1971 ఫిబ్రవరి 21వ తేదీన తుదిశ్వాస విడిచిన స్థానం నరసింహారావు గారి అద్భుతమైన నటనా ప్రస్థానం భావితరాలకు సదా ఆదర్శనీయం. అభినయ సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందిన ఆయన చేసిన సేవలు ఎన్నటికీ చిరస్మరణీయం.

-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap