శిలల్లో శివుని స్థాపించే స్థపతి- వేలు

“ఉలి దెబ్బకు తాళలేని రాయి గుడి ద్వారానికి మెట్టయితే, దెబ్బలన్నింటికీ ఓర్చి నిలిచిన బండరాయి పూజలందుకునే దైవంగా నిలిచింద”న్న చందంగా ఓ మనిషి జీవితంలో నిరూపితమై, మనకు అనుభవశాస్త్రంగా నిలిస్తే అదే వేలు ఆనందాచారి జీవితం! ఎన్నెన్ని కష్టాలు, కరువులు, దిగుళ్ళు, విచారాలు, విషాదాలు!! అయినా ఆయిన ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఒంగి నడవలేదు. విథి వెక్కిరింతలను పాఠాలుగా మలచుకున్నారు. తనను సమాజం శిల్పకళాబ్రహ్మగా, చిత్రకళారత్నంగా ప్రసంశించేలా, పద్మశ్రీ అవార్డు తనను వరించేలా అహిర్నిశలు పనిచేసారు. పనినే దైవంగా – దైవమే పనిగా సంవత్సరాలు క్షణాలుగా గడిపేశారు. భారతదేశంలోని వందలాది ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణంలో స్థపతిగా శ్రమించి ఘనత వహించారు. తెలంగాణలో పూర్తి కృష్ణశిలా నిర్మతమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రధాన స్థపతిగా నిర్మాణ బాధ్యతలు నిర్వహించి ఘనతవహించారు.

జూన్ 1, 1952లో చిత్తూరు జిల్లా వెన్నెంపల్లి గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో డా. వేలు ఆనందాచారి జన్మించారు. బాల్యం నుండే కులవృత్తిపట్ల శ్రద్ధ భక్తులతో ఆశక్తిగా తండ్రి వద్ద నేర్చుకుని ఎదిగారు. శిల్ప, చిత్రకళలను రెండుకళ్ళుగా చేసుకుని సమాజాన్ని దర్శించారు. విద్యార్థి దశలోనే నాన్నను, అన్నను కోల్పోయి, ఇంటి పట్టున ఉండే తల్లి పోషణ బాధ్యతలను తనవిగా తీసుకున్నారు. పైచదువులు చదువుకోవాలన్న ఆసక్తి బలంగా ఉన్నప్పటికీ తోటివారిలా సాధారణ డిగ్రీని కొనసాగించలేకపోయారు. పేదరికం వేధించినా ఆనందాచారి తనలోని ప్రతిభకు పదును పెట్టడం మాత్రం ఆపలేదు. నిరుత్సాహం, అసహాయత వంటివి దరిచేరకుండా ఆశావాదంతో ముందుకు అడుగు వేశాడు. ప్రతి అడుగులోను తనదైన ప్రతిభను చూపారు.

తిరుపతి టి.టి.డి శిల్పకళాశాలలో చేరి 4 సంవత్సరాల డిప్లమోను అభ్యిసించారు. చిత్రకళను ఎన్.వి. కృష్ణన్ గారి గురుత్వంలో నేర్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ (హైదరాబాద్ హిమాయత్ నగరులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం) తరపున విదేశాలకు పంపే వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహాల నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. వేలు ఆనందాచారి 7 రూపాయల దినజీతపు కూలీగా, శిలలు చెక్కుతూ జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ కు చేరిన కొద్దిరోజులకే దేవాదాయ శాఖ శిల్పకళాశాలలో అధ్యాపకుల కొరకు చేసిన ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకొని 1975 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కష్టేఫలి అన్న చందంగా కృషిచేసిన వ్యక్తికి విజయం వెన్నంటి ఉంటుందని నిరూపించబడింది. ఆనందాచారి జీవితంలో చిరు ఆనంద ఛాయలు వెల్లివిరిసాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు.

1980లో సహాయ స్థపతిగా పదోన్నది పొందారు. శ్రీశైలం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, విజయవాడ, అన్నవరం, కాణిపాకం, శ్రీకాళహస్తి, సింహాచలం, బాసర, వేములవాడ దేవాలయాల పునర్నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.
1990లో ఉపస్థపతిగా పదోన్నతి పొంది ద్వారక తిరుమల, తిరుపతి బుగ్గమఠం, హథొరంజీ మఠం ఆలయ నిర్మాణాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టులో పనిచేశారు. ఆ తర్వాత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన స్థపతిగా నియమింపబడి 2010లో పదవీ విరమణ చేశారు. దాదాపు 45 ఏండ్లు అవిశ్రాంతంగా రాత్రింబవళ్లు పనిచేస్తూ… ఏనాడూ విశ్రాంతి కోరుకోలేదు. వృత్తి, ప్రవృత్తి కలగలిసిన జోడెడ్ల బండి ప్రయాణం వారిది.

సామాజిక స్పృహ…
చదువుకునే రోజుల్లోనే సామాజిక బాధ్యత మెండుగా ఉన్న ఆనందాచారి తన శక్తి మేరకు తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉన్న వారాంతపు రోజుల్లో అవసరాలున్న చోట క్యూలైన్లను నడిపే స్కౌటరుగా సేవలందించేసేవారు.
ఉద్యోగం చేస్తున్న సమయంలోనే డిగ్రీ చదివి, పి.జి చేసి, పదవీ విరమణ తర్వాత తన చిరకాల కోరియైన పిహెచ్.డి. డిగ్రీని సాధించారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

మెడిసినల్ పెయింటర్ గా…
వర్ణాలను కొనేందుకు ఖర్చుకు వెనుకాడిన వేలు కాలం చెల్లిన ఔషదాలలో నూతన వర్ణాలను వెదుకుకున్నారు. వివిధ ప్రయోగాలుచేసి వాటిని రంగులుగా మలుచుకున్నారు. అలా రూపొందించిన వర్ణాలతో వేసిన చిత్రాలనే కళావిమర్శకులు మెడిసినల్ పెయింటింగ్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా చిత్రాలను వేయడం ఆనందచారికి వెన్నతో పెట్టిన విద్యగా ఆ తరువాతి కాలంలో పరిణమించింది. ఈ విధానంలో వందలాది బొమ్మలను వేసి ఎన్నో అవార్డులను అందుకున్నారు.

ప్రపంచ రికార్డుల విజేతగా…
2002లో మెడిసినల్ వర్ణాలతో 25 గంటల్లో 101 చిత్రాలను చిత్రించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. లిమ్కా బుక్ అఫ్ రికార్డ్, గ్లోబల్ ఇండియా రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డులతో పాటు మరో 100 రికార్డులు అందుకున్నారు.

చిత్రకళ వ్యాసాలు – రచనలు
చిత్ర,శిల్పకళలపై పత్రికల్లో ఎన్నో వ్యాసాలను రాశారు. దేవాదాయ ధర్మదాయశాఖ నేతృత్వంలో వెలువడిన ‘కాశ్యప శిల్ప శాస్త్రము’ అనే గ్రంధాన్ని K. బ్రహ్మాచారి, సుందర్ రాజన్ లతో కలసి Dr. వేలు స్థపతి తెలుగులో మొట్ట మొదట ప్రచురించారు. ‘మయమత శిల్పం’ అన్న Dr. పెదపాటి నాగేశ్వరావు అనువాద గ్రంధానికి చిత్రకళను జోడించి Dr. వేలు స్థపతి, సుందర రాజన్ ల సయ్యుక్త ఆధ్వర్యంలో ప్రచురించారు.

‘కాశ్యప శిల్ప శాస్త్రము’ అనగా…
కాశ్యప శిల్పశాస్త్రంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, ఇందులో 307 రకాల శిల్పాల గురించి, వివిధ రకాలయిన దేవాలయాలు, కట్టడాల గురించిన వివరాలు సంస్కృత భాషలో ఉన్నాయి. ఇందులో భారతదేశంలోని పురాతన ఆర్కిటెక్చరల్ సివిల్ ఇంజనీరింగ్ సిద్ధాంతాల అభ్యాసంపై ప్రత్యేకమైన వివరణలు ఉన్నాయి.

మయమతం తన మతంగా…
విశ్వకర్మ కుమారుడు మయబ్రహ్మ. పాండవులకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చిన శిల్పి. వీరు రచించిన శిల్పకళాశాస్త్రమే అతి ప్రాచీనమైనది. ప్రామాణికమైనది. దేవాలయ నిర్మాణంలో స్థపతులకు శిరోధార్యమైన గ్రంథం మయమత శిల్పం. శిల్పకళలో ఉన్న వివిధ లక్షణాలను, రహస్యాలను మయబ్రహ్మ వివరించారు. ఆలయ ప్రాకారాలపైనా కనిపించే వివిధ దేవతాప్రతిమల నిర్మాణ కొలతలు, స్థానప్రతిష్ట, బ్రహ్మ మొదలు సర్వ దేవతా దేవీ లక్షణాలను మయబ్రహ్మ క్షుణ్ణంగా వివరించాడు. దీనినే స్థూలంగా మయమతం అంటారు.

పదవీ విరమణ జీవితం…
పదవీ విరమణ తర్వాత కూడా తెలంగాణలోని యాదగిరి గుట్ట నిర్మాణంలో పూర్తిసమయాన్ని వెచ్చించి తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తరువాత కూడా పనినే పరమావధిగా భావించిన వేలు నూతనాభిలాషియై యూట్యూబరుగా అవతరించారు. సమాజంలో జరుగుతున్న దేవాలయ నిర్మాణ పనుల్లో సహకరిస్తూనే తనకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందికి పంచుతూ నిత్యవిద్యార్థిగా, నూతనోత్సాహంతో కళాకారులకు మార్గదర్శిగా జీవితాన్ని సాగిస్తున్నారు.

అవగతం…
వీరి గతాన్ని, అవగతాన్ని వారి మాటల్లో వినాలనుకున్న మనకు తరచు వినిపించే ఆ నాలుగు మాటలు “నా బాల్యమంతా పేదరికం, ఆకలి మధ్యనే గడిచింది. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో గంజి తాగి పెరిగాను. పేద పరిస్థితుల్లో ఎదురైన ప్రతీ అవకాశాన్ని దేవుడిచ్చిన కార్యంగా భావించి అంకితభావంతో పనిచేశాను. శిల్పకళలో నా ముద్ర కోసం కొత్తగా ఆలోచించాను. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం వరించడం చాలా సంతోషంగా ఉంది. చేసే పనిని అంకితభావంతో, క్రమశిక్షణతో, పదిమందికి నచ్చాలనే ఆకాంక్షతో చేయడం వల్ల సత్ఫలితాలను సాధించాను” అంటారు పద్మశ్రీ వేలు ఆనందాచారి.

ఆత్మకూరు రామకృష్ణ (కవి,చిత్రకారుడు) 94934 05152

7 thoughts on “శిలల్లో శివుని స్థాపించే స్థపతి- వేలు

  1. వ్యాసకర్త ఎంతో అందంగా శిల్పి పద్మ శ్రీ గ్రహీత వేలు స్థపతి గారి గురించి వారు పడిన శ్రమ గురించి మంచి అక్షరకూర్పు చేశారు. అందరికీ ధన్యవాదాలు.

  2. చాలా మంచి వ్యాసం రాశారు రామకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap