వర్ణాల వసంతోత్సవం

గ్యాలరీల గడప దాటిన ‘అమరావతి చిత్రకళా వీధి-2026’

మానవుడు తన భావాలను, ఆలోచనలను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అక్షరాలు పుట్టకముందే వ్యక్తపరిచిన మొట్టమొదటి మాధ్యమం ‘చిత్రకళ’. గుహల్లో గీసిన బొమ్మల నుండి నేటి ఆధునిక సాంకేతిక చిత్రకళ వరకు చిత్రకళ ఎన్నో వందల మార్పులు చెందింది. ఒక చిత్రం వెయ్యిపదాలతో సమానం అని అంటారు. మనిషి అంతరంగాన్ని, సమాజ స్థితిగతులను, ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టినట్లు చూపించగల అద్భుతమైన శక్తి చిత్రకళకు ఉంది. ఇది కేవలం రంగుల కలయిక మాత్రమే కాదు, అది ఒక సంస్కృతికి ప్రతిబింబం, ఒక జాతిచరిత్రకు సజీవ సాక్ష్యం.

ఘనమైన చరిత్ర: భారతదేశంలో, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రకళకు, హస్తకళలకు అత్యంత ఘనమైన చరిత్ర ఉంది. అమరావతి శిల్పకళ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అలాగే శ్రీకాళహస్తి, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన ‘కలంకారీ’ చిత్రకళ రంగుల అద్దకంలో భారతీయ పురాణ ఇతిహాసాలను అత్యంత రమణీయంగా ఆవిష్కరిస్తుంది. కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలాట, లేపాక్షి కళా సంప్రదాయాలు మన రాష్ట్ర విశిష్ట కళా వారసత్వానికి నిలువెత్తు నిదర్శనాలు.

సాధారణంగా ఇటువంటి గొప్ప కళాఖండాలు లేదా చిత్రలేఖనాలు కేవలం మూసి ఉన్న కళామందిరాలకు, ప్రదర్శనశాలలకు లేదా సంపన్నుల ఇళ్లకే పరిమితం అవుతుంటాయి. సామాన్య ప్రజలకు ఈ కళా వైభవం చేరువ కావడం తక్కువే అని చెప్పాలి. ఈ అంతరాన్ని చెరిపివేసి, కళను కళామందిరాల నాలుగుగోడలమధ్య నుండి బయటకు తీసుకువచ్చి, విశాలమైన వీధుల్లో సామాన్యుల కళ్లముందు ఉంచాలనే బృహత్తర సంకల్పంతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంజరిగింది. అదే ‘అమరావతి చిత్రకళా వీధి’. గత సంవత్సరం 2025 ఏప్రిల్ 4న రాజమహేంద్రవరంలో మొదటిసారిగా నిర్వహించిన ‘అమరావతి చిత్రకళావీధి’ అఖండ విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా సుమారు 550 మందికి పైగా చిత్రకారులు ఇందులో పాల్గొన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, వేలాది మంది ప్రజలు విచ్చేసిన ఈ కార్యక్రమం అతిపెద్ద రాష్ట్ర స్థాయి వీధి కళాఉత్సవంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

అమరావతి చిత్రకళా వీధి-2026-ఒక జాతీయ స్థాయి మహోత్సవం: రాజమహేంద్రవరంలో సాధించిన స్ఫూర్తితో, ఈ అద్భుతమైన సృజనాత్మక ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తూ ‘అమరావతి చిత్రకళా వీధి-2026’ కు సన్నాహాలు జరిగాయి. ఈసారి దీనిని రాష్ట్ర స్థాయికి పరిమితం చేయకుండా ఒక ‘జాతీయ స్థాయి కళా మహోత్సవం’ గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. ఈ అపూర్వమైన కళా జాతర 2026 ఆగస్టు 8(శనివారం), 9 (ఆదివారం) తేదీలలో రెండురోజుల పాటు జరిగింది. గుంటూరు నగరంలోని కోరిటపాడు – విద్యానగర్ ప్రధాన వలయ రహదారి ఈ వర్ణోత్సవానికి వేదిక అయింది. శ్రేయాస్ ప్రసార సంస్థ భాగస్వామ్యంతో ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది.

ప్రత్యేక ఆకర్షణలు: ఈ కళా మహోత్సవంలో సందర్శకులను కట్టిపడేసే ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు. సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదచారుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన వీధిలో ఈ సాంస్కృతిక కళా మార్గం ఏర్పాటయింది. ఈ వీధి పొడవునా ఏర్పాటు చేసే కళాకృతుల ప్రదర్శన సందర్శకులకు ఒక కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతిని కలిగించాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు వెయ్యిమందికి పైగా చిత్రకారులు, కళా విద్యార్థులు, శిల్పులు పాలుపంచుకొన్నారు. వీరి కళాఖండాలను ప్రదర్శించడానికి ఎనిమిదివందలకు పైగా ప్రత్యేక ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి నిర్వహించడానికి తొమ్మిది వేదికలు సిద్ధం అయ్యాయి. చిత్రకారులు అక్కడికక్కడే బొమ్మలు గీసే ప్రత్యక్ష చిత్రలేఖనం, కళారూపాల ఏర్పాటు, యువతను ఆకట్టుకునేలా ఛాయాచిత్రాలు దిగే ప్రత్యేక కేంద్రాలు ఈ ఉత్సవంలో విశేషంగా అలరించాయి. ఆధునిక చిత్రకళతో పాటు సంప్రదాయ, జానపద, గిరిజన కళలకు, శిల్పకళా ప్రదర్శనలకు ఇది వేదిక అయింది. కళ, సంగీతం, ఆహారం, సంస్కృతి ఇలా అన్నీ ఒకేచోట సందర్శకులకు కనువిందు చేశాయి. అమరావతి చిత్రకళావీధి కేవలం ఒక ప్రదర్శన మాత్రమేకాదు, ఇది కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక ఆర్థిక, సామాజిక వేదిక. చాలామంది ప్రతిభావంతులైన కళాకారులకు సరైన విపణి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ మహోత్సవం ద్వారా కళాకారులు తమ ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రదర్శించుకొన్నారు. దేశ నలుమూలల నుండి వచ్చే కళాఖండాల సేకరణదారులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజలు ఈ కళాఖండాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీనివల్ల కళాకారులకు తగిన ఆర్థిక ప్రోత్సాహం లభించింది. వారి కృతులకు తగిన గుర్తింపు, ప్రాచుర్యం పెరిగి, స్వయం ఉపాధి అవకాశాలు ఈ ప్రదర్శన ద్వారా మెండుగా మెరుగుపడతాయని చెప్పవచ్చు.

వేలాది మంది సందర్శకులు గుంటూరు నగరానికి రావడం ద్వారా స్థానిక వ్యాపారాలకు, వసతి గృహాలకు, రవాణా రంగానికి ఆర్థిక ఊతం లభించింది. గుంటూరు నగరం ఒక సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. యువతలో, విద్యార్థులలో కళల పట్ల ఆసక్తి పెరిగి, వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.

ఈ కార్యక్రమం వెనుక ఉన్న అత్యంత గొప్ప ఉద్దేశం దీని సామాజిక దృక్పథం. కళాకారుల నుండి సేకరించిన నమోదు రుసుమును ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు చిత్రలేఖన సామగ్రి పంపిణీ చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఉచిత చిత్రకళా శిక్షణా శిబిరాలు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో కళా చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ నిధులను వెచ్చించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

ప్రభుత్వ సంకల్పం-భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వం: ఈ అపూర్వమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి కళామహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి నిర్వహిస్తోంది. ప్రభుత్వం కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, ఒక జాతి మూలాలను, కళలను బతికించుకోవాల్సిన బాధ్యతను భుజాన వేసుకోవడం ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది. అంతరించిపోతున్న ఎన్నో జానపద కళారూపాలకు ఊపిరిపోయడం, యువతకు ఒక గొప్ప దిశానిర్దేశం చేయడం ఈ సమితి ముఖ్య ఉద్దేశం.

సాంస్కృతిక పునరుజ్జీవనం: నేటి ఆధునిక కాలంలో, యాంత్రిక జీవన విధానంలో పడిపోయి మన సంప్రదాయాలకు దూరమవుతున్న తరుణంలో, ఇలాంటి ఉత్సవాలు ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలుకుతాయి. ప్రాచీన కళలు, ఆధునిక సృజనాత్మకత ఒకే వేదికపై కలవడం వల్ల కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వీధిలో నడుస్తూ మన రాష్ట్రం సాధించిన సాంస్కృతిక విజయాలను కళ్లారా చూసి ఆనందించారు.

ఈ ‘అమరావతి చిత్రకళా వీధి’ భవిష్యత్తులో దేశానికే తలమానికంగా మారనుంది. ఏటా ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ఒక విశిష్ట గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసేలా దీన్ని ఒక వార్షిక పండుగగా స్థిరపరచనున్నారు.

ప్రజల భాగస్వామ్యం-మన బాధ్యత: రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషిచేసినా, ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమమూ సంపూర్ణ విజయం సాధించదు. విద్యాసంస్థలు తమ విద్యార్థులను ఈ ఉత్సవానికి తీసుకురావడం ద్వారా వారిలో కళాత్మక విలువలను పెంపొందించవచ్చు. స్వచ్ఛంద సేవకులు, కళాభిమానులు ఈ వేడుకలో భాగస్వాములై, మన కళాకారులను అక్కున చేర్చుకోవాలి. మన కళలను ఆదరించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే.

గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యుల వారి నాయకత్వంలో, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కందుల దుర్గేష్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖ కళా, సంస్కృతి, సృజనాత్మకతకు కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సి.ఎం. సాయికాంత్ వర్మ, ఐ.ఏ.ఎస్.లు విశేష కృషి చేశారు. చిత్రకళను ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగం చేసి, వీధినే ఒక పండుగ ప్రాంగణంగా మార్చిన ‘అమరావతి చిత్రకళా వీధి-2026’ కళాకారుల పాలిట ఒక వరం.

రేగుళ్ళ మల్లికార్జునరావు,
సంచాలకులు, భాషాసాంస్కృతికశాఖ,
ఆంధ్రప్రదేశ్

Share via
Copy link
Powered by Social Snap