సాహస వీరుడు – సుభాష్ చంద్రబోస్

స్వాతంత్ర్య సంగ్రామంలో సాహస వీరుడు అతడే

“సాబ్ నా పేరు జియావుద్దీన్ ఎంపైర్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ని. మా దగ్గర మీ సిబ్బందికి పనికొచ్చే చక్కటి జీవిత బీమా పథకాలు ఉన్నాయి దయచేసి కాస్త సమయం కేటాయిస్తే వాటిని మీకు మనవి చేస్తాను” అన్నాడు ఓ అగంతకుడు ఇంగ్లీష్ లో. మారువేషంలో దేశం నుంచి తప్పించుకుని వెళ్లిన సుభాష్ చంద్రబోస్ మాటలివి. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత గాథ తెలియజేస్తూ ప్రముఖ రచయిత ఎం.వి.ఆర్.శాస్త్రి గారి కలం నుండి వెలువడిన సుభాష్ చంద్రబోస్ గ్రంథంలోని “గ్రేట్ ఎస్కేప్” అనే అధ్యాయంలోని ఒక ఘట్టం ఇది.
మాటల్లో చెప్పలేని ఓ మహోజ్జ్వల సాహసం, అంతకు మించి సమయస్ఫూర్తి, అచంచల దేశభక్తి, అద్భుతమైన మేధస్సు కల నిజమైన స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. ఆయన వీరోచిత చరిత్ర చదవడం మొదలు పెడితే మన నేత్ర జవనాశ్వాలు ఆ అక్షరాల వెంట అలుపెరగకుండా పరుగెడతాయి. బోస్ జీవితంలోని కీలక ఘట్టాలను మన కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన “సుభాష్ చంద్రబోస్” గ్రంథాన్ని సీనియర్ పాత్రికేయుడు, చరిత్ర పుస్తకాల రచనలో తనదైన ముద్రవేసిన ఎం.వి.ఆర్.శాస్త్రి గారు రచించారు. అందుకే ఈ పుస్తకానికి అంత ప్రామాణికత ఏర్పడింది.

బోస్ అనగానే మన మనసులో యూనిఫామ్ ధరించిన ఓ మూర్తి ప్రత్యక్షమవుతుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, తెల్లదొరలు ఈ దేశం నుంచి నిష్క్రమించేలా చేసిన ధీరోదాత్త నేత సుభాష్ చంద్రబోస్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో చదవవచ్చు.
నిలువెల్లా నిఘా కన్నులున్న బ్రిటిష్ పాలకుల కళ్లలో కారం కొట్టి అందరూ చూస్తుండగానే మారువేషంలో పరాయి దేశానికి తప్పించుకుపోగల సాహసవీరుడు బోస్. అలా తప్పించుకు వెళ్లడానికి అతను వేసిన పక్కా ప్రణాళిక ఎంత బాగా పని చేసిందో తెలియజేసే “గ్రేట్ ఎస్కేప్” అధ్యాయంతో ఈ పుస్తక రచనను ప్రారంభించడం వల్ల పాఠకుల్లో ఆసక్తి పెరుగుతుంది.

ప్రపంచ చరిత్రలో ఇటువంటి సాహస కృత్యంతో పోల్చదగినది ఔరంగజేబు నుండి ఛత్రపతి శివాజీ తప్పించకుపోయిన సంఘటన మాత్రమేనని ప్రసిద్ధ చరిత్రకారుడు రమేష్ చంద్ర పేర్కొనడం గమనార్హం. న్యాయానికి కళ్ళులేవన్నట్లు ఒక్కొక్కసారి చరిత్రలో అబద్దాలు నిజాలుగా చలామణి అవుతాయి. నిజాలు అబద్దాలుగా మారురూపాలు ధరిస్తాయి. అలాగే భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో గాంధీ, నెహ్రూలు తప్ప వేరే నాయకులే లేరన్నట్లు ప్రచారం చేశారు.
చరిత్రను ఎంత వక్రీకరించినా భారతదేశ ప్రజల హృదయాల్లో నేతాజీకి ఉన్న స్థానం ఎవరికీ లేదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు నేతాజీ విగ్రహం కనిపిస్తుంది. నేతాజీ పేరిట ఇప్పటికీ యువజన సంఘాలు పనిచేస్తున్నాయి. బోస్ అనగానే మనకు ఆజాద్ హింద్ ఫౌజ్ గుర్తుకు వస్తుంది.

తెల్లవాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎన్నో ఏళ్లు సాగింది. దీనిలో భాగంగానే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం చేశారు. బ్రిటిష్ వారు ఈ ఉద్యమాన్ని ఘోరంగా అణచి వేశారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు తెల్లవారికి వ్యతిరేకంగా పోరాడిందే లేదు. గాంధీ, నెహ్రూలు చేష్టలుడిగి ఉండిపోయారు. వారిలో జవసత్వాలు నశించాయి. అయినా ఇంగ్లీషు వాళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు పారిపోయారు అనే ప్రశ్న వేసుకుంటే బోస్ కార్యకలాపాలకు భయపడే అనే జవాబు వస్తుంది. మనకు స్వాతంత్ర్యం తెచ్చింది బోస్ మాత్రమే. కానీ సత్యాహింసలనే ఆయుధాలుగా చేసుకున్న మహాత్ముడి వలనే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రచారం చేశారు. ఈఉద్యమంలో మహా అయితే నెహ్రూ పేరు కలుపుతారు కానీ బోస్ పేరు ఎక్కడా ఎత్తరు.

కాంగ్రెస్ నేతలు బోస్ పోరాటానికి సహకరిస్తే 1947కు ముందే మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేది. ప్రపంచమంతా ఆరాధించే మహాత్ముడు బోస్ పట్ల వ్యతిరేక భావంతో ఉండడం, నిర్బంధం నుంచి తప్పించుకొని విదేశాలకు బోస్ వెళ్లి పోవడం, రాజకీయాల్లో కూడా వివేకానందుని భావాలను, ఆదర్శాలను గౌరవించి నిజజీవితంలో ఆచరించడం, దేశమంతా జైలు నుంచి జైలుకు వెళ్లడం, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం వంటి ఎన్నో సాహస ఘట్టాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. గాంధీని ధిక్కరించి ఎన్నికల్లో గెలిచిన ఏకైక నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఎందరో కలలు కనే ఐపీఎస్ లో సీటు వచ్చినా ఉద్యోగంలో చేరితే తెల్ల ఆఫీసర్లు చెప్పినట్లు వినాలని ఆ సీటును తిరగ కొట్టిన ధీశాలి బోస్. అప్పటి నుంచి ఆయన అంటే తెల్లవారికి సింహస్వప్నం. స్వాతంత్రోద్యమం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినా యూరప్ వెళ్ళినప్పుడు ఏమిలీ షంకల్ తో  ప్రేమలో పడ్డాడు. బోస్ గొప్పతనం ఏమిటంటే ప్రేమలో పడ్డా అతడు స్వాతంత్ర్య ఉద్యమాన్ని విస్మరించలేదు. తన జీవితంలో రెండంటే రెండే ళ్లే ఆమెతో కలిసి ఉన్నాడు. స్టాలిన్ కోసం వెళ్లాలనుకుని హిట్లర్ వద్దకు వెళ్లడం, జర్మనీలో కొంతకాలం ఉండడం వల్ల బోస్ నాజీలను సమర్థించాడు అన్న అపనింద రావడం, గాంధీ బోస్తో విభేదించినా బోస్ మాత్రం గాంధీని గౌరవించడం, భారతదేశంలో ఉంటే తెల్లవాళ్ళు అరెస్టు చేసి జైల్లో పెడతారని, అప్పుడు తన పోరాటం ఆగిపోతుందని విదేశాలకు వేళ్ళయినా స్వాతంత్ర్య ఉద్యమం నడపాలని మారువేషంలో విదేశాలకు వెళ్లడం, యూరప్ లో బోస్ ప్రవాస జీవితం, ఇవన్నీ ఈ పుస్తకంలో అడుగడుగున ఆసక్తి గొలిపే ఘట్టాలు.
ఇటలీ నియంత ముస్సోలిని “స్వాతంత్ర్యం ఎలా సాధించాలనుకుంటున్నారు.. సంస్కరణ మార్గంలోనా, విప్లవాత్మకంగానా” అని బోస్ ను అడిగినప్పుడు ముమ్మాటికీ విప్లవ పంథాలోనే అని బోస్ ఇచ్చిన జవాబు, జర్మనీలో భారతీయులను అవమానపరిచినప్పుడు అక్కడ వారిని తిరగబడమని చెప్పడం, ఇలాంటి ఘటనలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటాయి.

బ్రిటిష్ వారితో యుద్ధానికి సొంత సైన్యాన్ని తయారు చేయాలనే ఉద్దేశం బోస్ కి కలగడం, సైనికులు ఎదురైనప్పుడు “జైహింద్” అని అభివాదం చేసుకోవాలని చెప్పడం, మన జాతీయ పతాకంలో చరఖా స్థానంలో ముందుకు దూకుతున్న పులిని పెట్టించడం, ఇటువంటి కుతూహలకరమైన ఎన్నో విషయాలు పాఠకులను కన్ను మరల్చకుండా చదివింపజేస్తాయి. మహాత్ముడి లీల, మాండలే యమలోకం, అనధికార భారత రాయబారి, నాడు కైక – నేడు గాంధీ, గుండెలదిరిన తెల్ల వాళ్ళు, నాటకాలరాయుళ్లు, మొదలగు ఆకట్టుకునే శీర్షికలతో ఆసక్తికరంగా చదివించే ఈ పుస్తకానికి కొనసాగింపుగా త్వరలో రెండో భాగం రాబోతుంది. మామూలుగా చరిత్ర అంటే తారీఖులతో, నిస్సారంగా, నిస్తేజంగా ఉంటాయి. కానీ ఈ పుస్తకం మాత్రం ఒక సస్పెన్స్, థ్రిల్లర్ నవలలాగా నేటి తరానికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన ఘటనలతో ఉద్విగ్న భరితంగా చదివింప చేస్తుంది.
చరిత్రలో స్వాతంత్ర్య సమర నాయకులుగా గాంధీ, నెహ్రూలు నిలిచినా, స్వాతంత్ర్య సంగ్రామ వీరునిగా ప్రజల గుండెల్లో కొలువైన బోస్ ధీర చరిత్ర ఎప్పటికీ చెరగనిది అని ఈ పుస్తకం మరింత గాఢంగా నిరూపిస్తుంది. ఎంతో మందికి ఇప్పటికీ ప్రేరణాత్మకంగా నిలుస్తుంది.

-మందరపు హైమావతి (9441062732)

1 thought on “సాహస వీరుడు – సుభాష్ చంద్రబోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap