మనిషిని మనీషిగా మలచే శక్తి సాహిత్యానిదేనని శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ నైతిక విలువల కమిటీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మార్చి 12, గురువారం విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగుశాఖ, కామ్రేడ్ జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో మీడియా సెంటరులో మొండెపు ప్రసాద్ రచన భాగవతం నుండి సుభాషితాలు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆకాశంలో పక్షులను మించి, నీళ్లలో చేపల కన్నా వేగంగా ప్రయాణిస్తున్నాడని, అయితే మనిషి దురదృష్టం కొద్దీ మనిషిగా నిలబడలేక పోతున్నాడన్నారు. మానవీయ విలువలు దర్పణం భాగవతం అన్నారు. సాంస్కృతిక సమితి వ్యవస్థాపకులు గోళ్ల నారాయణరావు సభకు అధ్యక్షత వహించగా, తెలుగు విభాగాధిపతి డాక్టర్ సశ్రీ పుస్తక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా గ్రంథకర్త మొండెపు ప్రసాద్ ను సతీసమేతంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేశ్, డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, వి.జి.ఎస్. పబ్లిషర్స్ అధినేత శిరం రామారావు, ఐలాపురం హోటల్ ఎండి రాజా తదితరులు పాల్గొన్నారు.
