హాస్యపు జల్లుల ఆనందం! సుమధుర నాటక పోటీలు!!

హాస్యబ్రహ్మ జంధ్యాల స్మారక పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్

నాటకేషు హాస్య! నాటకం రమ్యాతి రమ్యం!…
అని భావించి విజయవాడ నగర కళాప్రియులు మనసారా నవ్వుకోవాలని, ఆనందంగా ఉండాలని సుమధుర భావన. సుమధుర కళానికేతన్ 50వ వార్షికోత్సవం, 26వ తెలుగు హాస్య నాటికల పోటీలు 1 నుండి 4 ఫిబ్రవరి 2024 తేదీలలో విజయవాడ, ముమ్మనేని సుబ్బారావు సిధ్ధార్ధ కళాపీఠం వారి సిద్ధార్ధ ఆడిటోరియంలో జరిగాయి. నాలుగు రోజుల నవ్వుల పండుగలో పండు క్రియేషన్స్, కొప్పోలు వారి “పక్కింటి మొగుడు” ఉత్తమ ప్రదర్శనగా నిలిచి, ఉత్తమ దర్శకుడిగా బాలినేని నాగేశ్వరరావు, ఉత్తమ రచయితగా గోవిందరాజుల నాగేశ్వరరావు, ఉత్తమ నటుడిగా ఉన్నం వెంకట శేషయ్య నిలిచి ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. ఇందులో స్నేహితురాలి చేజారిపోతున్న ఆస్థిని కాపాడటం కోసం తన మొగుడిని స్నేహితురాలి మొగుడుగా చూపి నాటకమాడటం ద్వారా నవ్వులు పూయించారు.

ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా యువభేరి ధియేటర్ ఆర్గనైజేషన్, హైదరాబాదు వారు అక్కల తామేశ్వరయ్య రచన, వడ్డాది సత్యనారాయణ దర్శకత్వంలో “బూడిద” నాటిక నిలిచింది. తాము తినక, ఇతరులకు పెట్టక, ఉన్నదాంతో సంతృప్తి చెందక అడ్డదారుల్లో సంపాదించి అందలం ఎక్కాలనుకునే మనస్థత్వం కలిగిన భార్యాభర్తల ప్రవర్తనే బూడిద నాటిక.

తృతీయ ఉత్తమ ప్రదర్శనగా “ఏడున్నాడో… ఎక్కడున్నాడో” యస్.కె. షఫీ దర్శకత్వంలో, అమెచ్యూర్స్ యూనిట్ రచనను ది అమెచ్యూర్స్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట వారు బహుమతి పొందారు. స్వార్థపరుడైన మేనమామ తన సంరక్షణలో ఉన్న స్థితిమంతురాలైన మేనకోడలి ఆస్థి కాజేస్తే, మరొక మేనల్లుడు ఎలా అడ్డుకుని బుద్ది చెబుతాడో ఈ నాటికలో చూపారు. ఉత్తమ రంగాలంకరణకు నాగేశ్వర, సంగీతంతో సాయితేజ, ప్రత్యేక ప్రశంస ఎ. హరిబాబు అందుకున్నారు.

ప్రత్యేక బహుమతి పొందిన హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి “ట్రీట్ మెంట్” కత్తి శ్యాం ప్రసాద్ దర్శకత్వంలో కీ.శే. డాక్టర్ పి. బ్రహ్మానందరావు రచనను ప్రదర్శించి, చక్కని హావభావాలతో సి.హెచ్. ఆరాధ్య బాలనటిగా, బహుమతి అందుకుంది. పనీ-పాట లేకుండా తిని కూర్చుంటే జబ్బులు దరిచేరతాయనే భయం పోగొట్టి ఎప్పుడూ ఏదో ఒక పనికల్పించు కుంటే జబ్బులు రావని డాక్టర్ ఇచ్చిన ట్రీట్ మెంట్.

మాతృశ్రీ కళానికేతన్, విశాఖపట్నం వారు చూపులు కలవని శుభవేళ రావి నాగేశ్వరరావు రచనను, పి.ఎన్.వి. సత్యనారాయణ దర్శకత్వంలో ప్రత్యేక ప్రశంస, అర్జున్ కు ప్రశంసా బహుమతి పొందారు. భద్రం పౌడేషన్ వెల్ఫేర్ సొసైటి, విశాఖపట్నం వారి కలిసుంటే నాటికలో కె.ఎస్. ప్రకాష్ ప్రత్యేక ప్రశంస, ఉత్తమ ఆహార్యం కుమారి పొందారు.

యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ రంగు పడుద్ది నాటికలో జాహ్నవి ఉత్తమ నటిగా నిలిచింది.
శ్రీకృష్ణా ఆర్ట్స్ & కల్చరల్ అసోసియేషన్, గుడివాడ వారు నాన్నా నేనే గెలిచా ప్రదర్శించారు. కళాకారులందరూ చక్కని హాస్యాన్ని ప్రదర్శిస్తూ నవ్వించే ప్రయత్నం చేసారు.

నవ్వించడం తేలిక కాదు:
హాస్యనటనతో మెప్పించడం చాలా కష్టం. నవ్వించడానికి కళాకారులు చాలా ప్రయత్నం చేసారు. కానీ రచన, సటన, సంభాషణ ఉచ్ఛారణ ఇంకా మెరుగు పడాలి. సమీష్టి కృషి పెరగాలి. పరిషత్ నిర్వాహకుల ఆశయం నెరవేరాలి. భవిష్యత్ లో మంచి హాస్యాన్ని పండించే నాటికలు రావాలి.
యువతరాన్ని ప్రోత్సహిస్తూ…

కళారంగం-యువత పాత్ర:
కళా రంగం-యువతలో సృజనాత్మకత అంశాలపై సదస్సులు నిర్వహించి… యువతలో బిడియం పోగొట్టి, నటనలో శిక్షణ ఇచ్చి వారి సొంత రచన, దర్శకత్వంలో లఘు నాటికలు ప్రదర్శింప చేయడం విశేషం.

యువజనోత్సాలు:
యువత సృజనాత్మకత వెలుగులోకి తెచ్చే పలు కార్యక్రమాలు చేపట్టారు. సభ ప్రారంభానికి ముందు మహిళ చైతన్యవంతురాలు కావాలని ప్రభోదిస్తూ ఎస్.డి.ఎం. సిద్దార్ధ కళాశాల విధ్యార్దినులు ఇంకానా నాటిక వాసు దర్శకత్వంలో, నారాయణబాబు రచన ప్రదర్శించారు. అనంతరం బి. స్టుడియొ, హైదరాబాదు వారి “న్యూ బాంబే టైలర్స్” నాటిక వినూత్నంగా సాగి ఆకట్టుకుంది.

ప్రత్యేక ప్రదర్శనగా న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ వారిచే డాక్టర్ ఎం.ఎస్. చౌదరి రచన, దర్శకత్వంలో కపిరాజు నాటిక ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రావణ-విభీషనుల మద్య అహంకారం, వాలి-సుగ్రీవుల మద్య అధికారం చిచ్చుపెట్టగా, ఆ రెండింటిని వదలి అడవుల బాట పట్టిన రామ-లక్ష్మణులు భగవంతులుగా నిలబెట్టిన ధర్మం, ఇలా ఇతి హాసాల్లో నిక్షిప్తమైన అనుబంధాల మచ్చుతునక కపిరాజు ప్రదర్శన. చక్కని ఆహార్యం, దుస్తులు, రంగాలంకరణ ఆకట్టుకున్నాయి. పాల్గొన్నవారిలో ఎక్కువ మంది యువత కావడం అభినందనీయం.

పురస్కార ప్రదానం:
ఈ సభల్లో రావి కొండలరావు, రాధాకుమారి స్మారక పురస్కారం ప్రముఖనటి గుడివాడ లహరికి, శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ కు ప్రదానం చేయటం జరిగింది.

ఫిబ్రవరి 4 సాయంత్రం హాస్యబ్రహ్మ జంధ్యాల స్మారక పురస్కారం, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ కు అందించి ఘన సత్కారం చేసారు. ప్రముఖ సినీ హీరోల చిత్రాలకు సంభాషణలు అందించి చిత్రవిజయానికి కారకులు సాయి మాదవ్ అని వక్తలు ప్రశంసించారు. పురస్కార గ్రహీత సాయి మాధవ్ ప్రతి స్పందిస్తూ హాస్యబ్రహ్మ జంధ్యాల పురస్కారం అందుకోవడం అదృష్టం అన్నారు. నాటక రచనే తనకు తృప్తినిస్తుంది అన్నారు. నాటకరంగ అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తాను అన్నారు.

సభల్లో పాల్గొన్న వక్తలు జీవితంలో హాస్యప్రాధాన్యతను వివరించి, ఇంకా బాగా నవ్వించే ప్రదర్శనలు రావాలి అన్నారు. ఈ సభల్లో సీనియర్ రంగస్థల, సినీ నటుడు ప్రసంగిస్తూ మంచి నాటక ప్రదర్శన ఇవ్వని సమాజాల వారిని ప్రశ్నించండి, నచ్చని కళాకారులపై కోడిగ్రుడ్లు, టమాటాలు విసిరి నిరసన తెలియచేయండి అన్న మాటలు కొంతమంది కళాకారుల మనస్సు గాయపరిచింది. ఇంకా..ఇంకా… మంచి హాస్యప్రదర్శనలు తయారవ్వాలని ఆయన ఆశయం.

ఉదయం జరిగిన యువజనోత్సవ సంబరాల్లో బాగంగా ప్రముఖ యువ గాయని భమిడిపాటి శ్రీలలిత మధుర మధుర మీనాక్షి, భరత వేదమున పాటలను శ్రావ్యంగా వినిపించారు. కీర్తనా శ్రీనివాస్, ప్రణీత, బి. రాజశేఖర్, మల్లిక్ మనోరంజకంగా గానం చేసారు. లేఖ్యాభరణి బృందం, శృతి సమన్వి, సాయి వర్షిత వర్మ, సింగారమణి అజయ్, వాసు, సంస్కార భారతి బృందాల నృత్యప్రదర్శనలు అలరించాయి. ముత్యాల చెరీ స్వరూప్, చెకిత్ ప్రణయ్, వైష్ణవి వాయిద్య విన్యాసం అబ్బురపరిచింది. పిండిప్రోలు కృష్ణ కుమారి బృందం వాయిద్య విన్యాసం, గానం ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాయి. పసుమర్తి శివరామ్ కుమార్ చిన్నారులను ఉత్సాహపరుస్తూ వ్యాఖ్యానం అందించారు.

వ్యాఖ్యాతగా డాక్టర్ డి. కైలాసరావు, ప్రెస్ రిలేషన్స్ బి. ఆంజనేయ రాజు, కళామిత్ర అడివి శంకర్ ప్రశంసనీయులు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల, సినీ నటులు ఎస్.కె. మిశ్రో, సుబ్బరాయశర్మ, కోట శంకరరావు వ్యవహరించగా, ప్రాధమిక పరిశీలకులుగా ముఖ్యప్రాణ్, ఇ.వి. సాగర్ వ్యవహరించారు.
ఈ నాలుగు రోజుల ఉత్సవాలలో పాల్గొన్న కళాకారులకు, అతిధులకు అందించిన వసతి, భోజనం ఏర్పాట్లు మరువలేం. భోజనశాల పర్యవేక్షకులుగా కె.ఎం.ఆర్.కె. శాస్త్రి, పసుమర్తి సాంబశివరావు ఆప్యాయతలు ప్రశంసనీయం.

ఈ నాలుగు రోజుల కార్యక్రమాలను సమన్వయ పరుస్తూ తమ భుజస్కంధాలపై నడిపిన గౌరవాధ్యక్షులు యం.సి. దాస్, అధ్యక్షులు సామంతపూడి నరసరాజు, చైర్మన్ ఎన్. మురళీకృష్ణ, వ్యవస్థాపక సభ్యులు హెచ్.వి.ఆర్.ఎస్. ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి పి. సూర్యనారాయం మూర్తి, కోశాదికారి డి.వి. శివరాం అభినందనీయులు.

బి. ఆంజనేయ రాజు (రచయిత)

SA: