పత్రికలను దారికి తెచ్చిన దంపతులు

వెంకటేశ్వర రావు అనే పేరును తెలుగు రాని వారు ఆంగ్లంలో చదివి వెంకతేశ్వర రావు అంటే మీకెలా అనిపిస్తుంది? తేలప్రోలు ను టేలప్రోలు అని ఉచ్చరిస్తే మీరు ఏమి చేస్తారు? ముందుగా ఎదుటి వారి తెలియని తనానికి ఒకింత నొచ్చుకుంటారు. ఆ పైన ఆ పలికిన తీరును సరిచేయ ప్రయత్నిస్తారు.

ఇదే పొరపాటును తెలుగు దిన పత్రికలు, టీ.వీ. చానళ్ళ వారు చేస్తేనో? అది పెద్ద అపరాధమే అవుతుంది. పత్రికలు రాసేది, టీవీల వారు చదివేది సరైన రూపమే అని ప్రజలు నమ్ముతారు. జన మాధ్యమాల ప్రభావం ప్రజలపై అపారం కనుక — వ్యక్తులు, ప్రాంతాల పేర్లనూ తామూ అలాగే పలకడం అలవాటు చేసుకుంటారు. పత్రికలూ, టీవీల పుణ్యమా అని ఇప్పటికీ మన దేశ ప్రధానిని తెలుగు వారు ‘నరేంద్ర మోడీ’ గానే వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కు వెళ్లి అలా పలికితే అక్కడి వారు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. దేశ ప్రధాని పేరునే సరిగా పలకటం లేదేమిటి? ఇంత అజ్ఞానమా? అని వారు విస్తు పోవచ్చు. మన ప్రధానిని ఉత్తర భారతీయులు ‘మోదీ’ అని రాస్తారు పలుకుతారు…

ఆంగ్లం నుంచి తర్జుమా చేసే క్రమంలో భాషా పరంగా జన మాధ్యమాల్లో దొర్లుతున్న పొరపాట్లను చక్కదిద్ద టానికి ఆ దంపతులు ఏకంగా పదేళ్ళ పాటు పరిశ్రమించాల్సి వచ్చింది. ఇందు కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఉన్న అనురక్తే చోదక శక్తిగా పట్టు వదలకుండా ప్రయత్నించి పత్రికలను, చానళ్లనూ భాషాపరంగా దారికి తేగలిగారు.

2014 నవంబర్ 3వ తేదిన ఆ దంపతులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ ‘ఈనాడు’ లో వ్యక్తుల పేర్లు, నగరాల పేర్ల ఉచ్చారణ మారింది. పదేళ్ళ కృషి ఫలించిన రోజది. మోడీ కాస్తా మోదీ అయ్యారు. ఢిల్లీ దిల్లీ అయింది. లక్నో లఖ్నవ్ గా మురిసింది. మీరట్ మేరఠ్ గా మెరిసింది. జార్ఖండ్ ఝార్ఖండ్ గా ఠీవి ఒలక పోసింది. సినిమా పేజీలలో నిత్య మీనన్ పేరు నిత్యా మేనన్ గా కొత్త హొయలు పోయింది…. క్రీడా పుటల్లో సచిన్ టెండూల్కర్ కాస్తా సచిన్ తెందుల్కర్ అయ్యాడు.

‘ఈనాడు’ తో మొదలైన ఈ మార్పు ఇతర పత్రికలకూ, చానెళ్ళకూ పాకింది. వారు కూడా సరైన రూపం లోనే రాయటం మొదలు పెట్టారు. ఐతే ఈ దంపతులు ప్రతిపాదించిన పదాలన్నీ మాధ్యమాలలో చోటు దక్కించు కోలేదు. పరిమితి స్థాయిలోనే వాటిని సవరించి వాడుతున్నారు.

“నిజానికి, టీవీ చానళ్ళ వారు మనసు పెడితే, తమకున్న విస్తృత యంత్రాంగం సహాయంతో ఏ ప్రాంతంలో ఏ పేర్లను ఎలా పలుకుతారో క్షణాల్లో సేకరించి ఆచరణలో పెట్టవచ్చు. విభేదాలు ఉన్న చోట భాష శాస్త్ర వేత్తల అభిప్రాయాలను ఆహ్వానించవచ్చు. భాషాపరంగా అనుసరించాల్సిన విధి విధానాలపై శైలీ పత్రాలను రూపొందించు కోవచ్చు. ఈ దిశగా స్వచ్చంద కృషి చేయాల్సింది పోయి, మీన మేషాలు లెక్కించడం విచారకరం”.

పత్రికలూ, చానళ్లలో భాషా పరివర్తనకు కృషి చేసిన ఈ దంపతులు చేయి తిరిగిన సాహితీవేత్తలు కారు. భాష శాస్త్ర వేత్తలు అంత కంటే కాదు. ఇంతకీ ఎవరు వారు? భాష కోసమని ఎందుకని అంతగా ఆరాట పడుతున్నారు?

_______________________________________________________________

పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన సత్తి సునీల్ రెడ్డి 1975 లో కేంద్ర గూఢచార సంస్థలో చేరి 2012 లో జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తండ్రి లక్నో లో వైమానిక దళంలో పని చేసేవారు. తండ్రి దగ్గర ఉండి ఎం.కాం. చదువుకున్నారు.

ఉద్యోగ బాధ్యతల రీత్యా సునీల్ రెడ్డి నేపాల్, భూటాన్, మయన్మార్ సరిహద్దుల తో సహా దేశమంతటా వివిధ రాష్ట్రాలలోని నగరాలలో నిధులు నిర్వర్తించారు. దిల్లీ, ఆగ్రా, గాంగ్టక్, ఇంఫాల్ ఇలా ఒకటేమిటి ఆయన పని చేయని ప్రాంతమంటూ లేదు. ప్రముఖుల భద్రతా విభాగంలో రెండేళ్ళు పనిచేసినప్పుడు కే.ఆర్. నారాయణన్ తో అమెరికా, జర్మనీ, బ్రెజిల్, పెరు, ఫ్రాన్స్ దేశాలను చుట్టి వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేయడం, విదేశాల్లో పర్యటించడం తో స్థానికంగా ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు, ఉచ్చారణా రీతులు ఆయన కళ్ళకు కట్టాయి. భాషకు సంబంధించిన ఆలోచనలకు ఇలా బీజం పడింది.

Sunil Satti and Smt. Lalita

“అర్ధాంగి చేదోడు” …

సత్తి సునీల్ రెడ్డి అర్థాంగి శ్రీమతి లలిత. బీ.ఎస్సి, బీ.ఎడ్. చేసిన ఆమె దిల్లీ కాన్వెంట్ లో టీచర్ గా ఉద్యోగం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ భవన్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు అవుతుండే వారు. అక్కడ ఆకాశవాణి కి చెందిన ఏడిద గోపాలరావు గారు పరిచయం అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో దిల్లీ ఆకాశవాణి తెలుగు వార్తా విభాగంలో వార్తా ప్రవాచకురాలు – అనువాదకురాలుగా పరీక్ష రాసి ఎంపిక అయ్యారు. ఆమె దిల్లీ ఆకాశవాణిలో తొమ్మిదేళ్ళ పాటు తెలుగు వార్తలు చదివారు. వృత్తి ధర్మ నిర్వహణలో భాగంగా విధిగా వార్తా పత్రికలను క్షుణ్ణంగా చదివేవారు.

ఆకాశవాణి (దిల్లీ)లో ఇతర ప్రాంతీయ భాషా విభాగాలు కూడా ఉండేవి. ఆయా భాషలకు సంబంధించి ఏవైనా ఉచ్చారణ సంబంధ సందేహాలు తలెత్తితే ఆ విభాగాల వారిని సంప్రదించి నివృత్తి చేసుకునేవారు. అలాగే ఆకాశవాణిలో ప్రత్యేకంగా ఉచ్చారణ విభాగం ఉండేది… విదేశీ నేతల పేర్లు, ప్రాంతాల పేర్లూ ఎలా పలకాలో రాయబార కార్యాలయాలకు ఫోను చేసి తెలుసుకుని, 16 భారతీయ భాషా విభాగాల వారికి తెలియ జేసేవారు.

భాషా విషయకంగా ఆకాశవాణిలో జరుగుతున్న కృషి, తీసుకుంటున్న శ్రద్ధాసక్తులు ఆ దంపతులపై ప్రభావం పడింది. పేర్లు ప్రాంతాల ఉచ్చారణ పై ఇంట్లో దంపతులు చర్చించుకునేవారు. రేడియోలో ఫలానా వ్యక్తి పేరు ఇలా చెబుతుంటే పత్రికల వారేంటి ఇలా రాస్తున్నారు? అనే మథనం వారిలో మొదలైనది. ఈ లోటు పాట్లను సవరించేందుకు తమ వంతుగా ఎంతో కొంత కృషి చేయాలనుకున్నారు… తప్పుగా రాస్తున్న పదాలను సేకరించడం మొదలు పెట్టి “సరియైన ఉచ్చారణ” అనే పేరుతో చిన్న పుస్తకాన్ని వెలువరించారు. అంతటితో ఆగకుండా 2004-05 నుంచి ‘మాధ్యమాలలో మెరుపులు – మరకలు’ శీర్షికతో నెల నెలా సమాచార లేఖను తయారు చేయటం ప్రారంభించారు. ఆ నెలలో పత్రికలూ, చానళ్ళలో వచ్చిన దోషాలను గుర్తించి, వాటిని పొందు పరుస్తూ, సరియైన ఉచ్చారణ ఏమిటో వివరిస్తున్నారు. దాని కంపోజ్ చేయించి, యాభై నకళ్ళని తీయించి తెలుగు దిన పత్రికలు, టీవీ చానళ్ళూ, జర్నలిజం విభాగాలకు, భాషా ప్రేమికులకూ పంపుతూ వస్తున్నారు.. ఈ పని కోసం ఎంతో సమయాన్ని, వ్యయాన్ని ఆనందంగా భరిస్తున్నారు. ప్రస్తుతం, రోజు వారీ సమీక్షలను ఇంటర్ నెట్ ద్వారా ఏ రోజు కా రోజు పంపుతున్నారు. ఏదైనా పదం విషయంలో అనుమానం ఏర్పడితే నివృత్తి కోసం హిందీ వార్తా పత్రికలను చూసేవారు …. ఎవరైనా ఉత్తరాది వారు, విదేశీయులు తారస పడితే ఆసక్తిగా వారితో మాట కలిపి వారి పేరును ఎలా పలకాలో ఓపిగ్గా అడిగి తెలుసుకుని రాసి పెట్టు కునేవారు…. కేవలం పదాలకే పరిమితం కాకుండా పత్రికా రచయితలకు లోతైన అవగాహన కల్పించడం కోసం కూడా వారు ఆరాట పడుతున్నారు …. ఉదా… సాయుధ దళాల్లో ఎయిర్ కమోడోర్, వింగ్ కమాండర్ హోదాలుంటాయి. కమోడోర్ పదాన్ని తప్పుగా రాస్తున్నప్పుడు ఆ విషయాన్ని పట్టి చూపుతూనే త్రివిధ దళాల్లో వివిధ హోదాలను పట్టిక రూపంలో తెలియ జేసే బాధ్యతను వీరు తీసుకున్నారు.

“ఉత్తర భారత దేశంలో పని చేసే టప్పుడు ఏ దుకాణానికి వెళ్లి మాట్లాడితే ఆ దుకాణదారు ఉచ్చారణ తేడా పసి గట్టి ‘మద్రాసి హై ?’ అని అడిగే వారు. ఇది తలవంపులుగా అని పించేది” అంటారు సునీల్ రెడ్డి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.

“తెలుగు యువతీ యువకులు అనేక మంది యు.పీ.ఎస్.సి. వంటి ఉద్యోగ నియామక పరీక్షలు రాసి, దిల్లీ లో మౌఖిక ఇంటర్వ్యూ లకు హాజరు ఔతున్నారు. తెలుగు మాధ్యమాల ప్రభావంతో ఆయా వ్యక్తులు, ప్రదేశాల పేర్లను మన వారు తప్పుగా పలుకుతున్నారు. దీనితో మన వారి పై సదభిప్రాయం కలగడం లేదు. ఇంటర్వ్యూ లో మార్కులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది.” అంటూ సునీల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సునీల్ రెడ్డి దంపతులు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఈ దంపతుల కృషిని గుర్తించిన ఒకటి రెండు చిన్న పత్రికల వారు అభినందన పూర్వక లేఖలు రాశారు. పెద్ద పత్రికలు మాత్రం పెదవి విప్పలేదు. అయినా నిరుత్సాహ పడకుండా, ఏమీ అశించకుండా తెలుగు భాషపై ప్రేమతో ఈ దంపతులు తమ కృషి ను మాత్రం నిరంతరం సాగిస్తూనే వస్తున్నారు.

సరియైన ఉచ్చారణ పై సమగ్రంగా ఒక పుస్తకాన్ని వెలువరించే కృషిలో లలితా సునీల్ దంపతులు నిమగ్నమై ఉన్నారు. తప్పులను ఎంచి చూపడం మెరుగైన పత్రికా రచన కోసమేనని సవినయంగా మనవి చేసుకునే వీరి కృషిని భాషా ప్రేమికులు, మాధ్యమాలు సరైన గుర్తింపు నిచ్చి ప్రోత్సహించవలసిన అవసరం లేదంటారా?

-గోవిందరాజు చక్రధర్

అమ్మ నుడి (తెలుగు మాస పత్రిక) మే 2016 సంచిక నుండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap