సురభి బాబ్జీ గారు ఇకలేరు…

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు.

ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ ఒకే తెరపైన చూపిస్తున్నారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సురభి సంస్థ. ఈ సురభి పౌరాణిక నాటకాలు పెట్టింది. 135 ఏళ్లు గడిచినా తనదైన పంథా నిరాఘాంటంకంగా సాగిపోయే ఏకైక నాటక సంస్థగా ఆకాశాన్నంటే ఎత్తులకు ఎదిగింది. దీన్ని వనారస గోవిందరావు మొదలుపెడితే ఈ సంస్థ కాస్తా ఉమ్మడి కుటుంబంగా పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించింది.

అప్పట్నుంచి ఇప్పటివరకు సురభి పద్యనాటకాలు, లేదా పౌరాణిక నాటకాలు ఒరవడికి పేర్గాంచింది. అలాంటి సురభి కుటుంబంలో రెకెందర్ కుటుంబం ఒకటి. వనారస గోవిందరావు కుమార్తె రెకెందర్ సుభద్రమ్మ. ఈమె కుమారుడే రెకెందర్ నాగేశ్వరరావు. ఈ కుంటుంబాల పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన తెలుగు నాట వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. మొదట్లో వీరు బ్రిటీష్ వారి వద్ద సైనికులుగా పనిచేశారు. వీరి వాడుక భాష ఆరె.

ఆయన 1949లో విజయనగరం జిల్లా గజపతి నగరంలో జన్మించారు. హెచ్.ఎల్.సీ వరకు చదువుకున్న నాగేశ్వరరావు 4 సంవత్సరాల వయస్సులోనే బాల నటునిగా రంగస్థల ప్రవేశం చేశారు.

శ్రీరామ, శ్రీకృష్ణ, వీరబ్రహ్మం, నక్షత్రక, కార్యవర్థి, మొదలైన పాత్రలు పోషించి ప్రేక్షకులను తన నటనతో రజింపచేశారు. వీరి గురువులు గరిమెళ్ల రామమూర్తి, పద్మశ్రీ బి.వి. కారత్‌లు. ఈయన నటనతో పాటు రంగస్థల నిర్వహణ కూడా చేపట్టి విజయవంతమైన నాటకాలు ప్రదర్శింప చేసి కీర్తి గడించారు.

Babji with Surabhi family

సురభి పరంపరకు చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్యమండలికి 42 సంవత్సరాలుగా కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాక అయిదు సురభి ఫెడరేషన్ ఉమ్మడి బ్యానర్ అయిన సురభి నాటక కళా సంఘానికి 24 సంవత్సరాల నుండి కార్యదర్శిగా కొనసాగుతునే ఉన్నారు. నాగేశ్వరరావు దర్శకత్వంలో రామరాజ్యం, శ్రీకృష్ణ లీలలు, వీర బ్రహ్మం, బాలనాగమ్మ, జై పాతాళ భైరవి కాక దేశవ్యాప్తంగా వివిధ నాటక సంస్థలకు, కళాకారులకు వీరు సుపరిచితులు. చైన్నై, ముంబై, బెంగుళూరు, గోవా తదితర నగరాలల్లోనే కాక అనేక రాష్ట్రాలల సురభి నాటకాలను విజయవంతంగా ప్రదర్శించారు.

నాగేశ్వరరావు కృషిని ప్రతిభను గుర్తించిన అనేకమంది ప్రముఖులు జ్ఞాని జైల్‌సింగు, పి.వి. నరసింహారావు, ఎన్.టి.ఆర్. వంటి ఎందరో అభినందనలు అందచేశారు. 2000 సంవత్సరంలో రాష్టస్థ్రాయి ఉత్తమ నాటక రంగ నిర్వాహకునిగా పురస్కారం 2004లో బళ్లారి రాఘవ పురస్కారం పొందారు. కుటుంబ సభ్యులతో అక్కడే నిరాడంబరంగా జీవిస్తూ అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో కూడిన అద్భుతమైన పౌరాణిక నాటకాలను ఇప్పటికీ ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ప్రదర్శింప చేస్తూ రంగస్థల కళ అయిన నాటకాన్ని జీవనదిలా ప్రవహింప చేశారు.ఈటీవల ప్రభుత్వ నిర్ణయాలవల్ల ప్రభుత్వం తరపున నిర్వహించే నాటక నిర్వహణ నిలిచిపోవుతా విచారకరం.
సురభిసంస్థ ఆవిర్భవించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా ఢిల్లీలో 2011 నిర్వహించిన సురభి ధియేటర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు ఇటీవల సంగీత నాటక అకాడమీ వారు అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. వీరిని భారత ప్రభుత్వం 2013 లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది..ఈ రోజు శివైక్యం చెందిన మహామనిషి,నటులు,దర్శకులుసమాజ నిర్వహుకులు..పద్మశ్రీ రేకందర్ నాగేశ్వరరావు గారికి మా 64కళలు.కాం పత్రిక నివాళులర్పింస్తోంది.

నాగేశ్వరరావు మరణం సురభి సంస్థకే కాకుండా యావత్తు నాటకరంగానికి తీరని లోటంటూ సీఎం కేసీఆర్ సంతాపం ప్రక టించారు. నాగేశ్వరరావు మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య కిషన్ రావు, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర తదిత రులు సంతాపం ప్రకటించారు.
బాబీ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం లింగం పల్లి శ్మశానవాటికలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


-కళాసాగర్

SA: