
దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం, తంజావూరు (South Zone Cultural Centre, Thanjavur) మరియు భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురభి నాటక మహోత్సవం”
తేదీ: మార్చి 15, 2025 నుండి మార్చి 20, 2025 వరకు, వారం రోజుల పాటు.
వేదిక: ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆడిటోరియం, విజయవాడ
సమయం: ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం, తంజావూరు (SZCC) వారు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆడిటోరియం, విజయవాడ నందు నిర్వహించబోయే సురభి నాటక మహోత్సవానికి మీ అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. South Zone Cultural Centre, Thanjavur ఈ ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి మార్చి 15 నుండి మార్చి 20, 2025 వరకు వారం రోజుల పాటు నిర్వహించనుంది. ఈ ఉత్సవంలో ప్రముఖ సురభి బృందాలచే ఏడు నాటకాలు ప్రదర్శించబోతున్నారు. ఇది 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సురభి నాటకాన్ని కాపాడుకోవడానికి మనం చేస్తున్న చిరుప్రయత్నం.

140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సురభి నాటకం పాశ్చాత్యీకరణ మరియు ఆధునీకరణ వల్ల నేడు అంతరించుకుపోయే పరిస్థితులలో ఉంది. కోవిడ్ సంక్షోభం మరియు ప్రస్తుత ఆర్థిక ఒత్తిడుల కారణంగా మరింత సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం, తంజావూరు వారు సురభి నాటక మహోత్సవంను నిర్వహించేదుకు తలపెట్టారు. ఆదేవిధంగా ఇలాంటి సాంస్కృతిక సంపదను సంరక్షించడానికి మనందరం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తోంది.
సురభి థియేటర్ యొక్క మూలాలను 1885 నుండి గుర్తించవచ్చు, కడప జిల్లాలోని సురభి రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వనారస గోవిందరావు మరియు వనారస చిన్న రామయ్య ఒక నాటకాన్ని ప్రదర్శించడానికి చొరవ తీసుకోవటంతో సురభి నాటకం పురుడుపోసుకుంది.
సుమారు 140 సంవత్సరాల నాటి సురభి అనే సంప్రదాయ నాటకం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఇది నీడ తోలుబొమ్మలాట (తోలు బొమ్మలాట) సంప్రదాయం నుండి ఉద్భవించింది. గోవిందరావు ఒక వివాహ సమయంలో మొట్టమొదటిసారిగా దీనిని ప్రదర్శించడానికి సాహసించినప్పుడు, తెలుగు నాటక రంగంలో సౌందర్య విప్లవానికి నాంది పలికారు. ఆయన పొరుగు గ్రామాన్ని వారి తాత్కాలిక నివాస ప్రాంతంగా ఎంచుకుని దాని పేరును సురభిగా మార్చారు. తోలుబొమ్మలాట కళాకారుడైన గోవిందరావు ఒక ట్రావెలింగ్ థియేటర్ గ్రూపును ఏర్పాటు చేసి దానికి ఆ గ్రామం పేరు పెట్టారు. ఆ విధంగా ఆయన ప్రదర్శించిన మొదటి సురభి నాటకం ‘కీచకవధ’ ఇది మహాభారతంలో కీచకుణ్ణి సంహరించే ఘట్టం. నాటకాల్లో స్త్రీ పాత్రలను స్త్రీలచే నటింపచేయడం ఒక ప్రత్యేక అంశం, ఇది ఆ కాలాల్లో అసాధారణం.
40 నుండి 50 మందితో కలిసి ఉండే ఈ బృందం ప్రదర్శనల కొరకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంది. ప్రజల స్పందనను బట్టి, ఈ బృందం ప్రతి ప్రదేశంలో మూడు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉండి ప్రదర్శనలిస్తూ ఉండేది. సురభి నాటకంలో ఉండే పద్యాలు, పాటలు, ఎఫెక్టులు, రంగాలంకరణ మొదలగు అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసేవి. అలా సురభి నాటకం ప్రాచుర్యం పొందడంతో వందలాది సురభి నాటక సంస్థలు పుట్టుకవచ్చాయి.
భారతీయ నాటక రంగంలోని గొప్ప వ్యక్తులు సైతం ముఖ్యంగా బి.వి. కారంత్ వంటివారు సురభి థియేటర్ సంస్థలతో కలిసి పనిచేశారు. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నాటకాలను ప్రదర్శించారు. ఇది తెలుగు కళాకారులకు జాతీయ నాటకరంగంలో సురభి థియేటర్ ద్వారా లభించిన ఒక మైలురాయి. సురభి బాబ్లీ అని పిలుచుకునే, ఆర్. నాగేశ్వరరావును కేంద్రప్రభుత్వం పద్మశ్రీ (2013) అవార్డుతో సత్కరించింది.
-కళాసాగర్ యల్లపు
డోంట్ మిస్! నాటకాలు అద్భుతమైన ప్రదర్శనలు. నా మాట విని చూసి వచ్చిన వారు తప్పక ఆనందించగలరు. ముఖ్యంగా స్టేజి మీద సినిమా ఎఫెక్ట్ తెప్పించి అబ్బురపరుస్తారు. వీరి నటన కౌశలానికి ఒంగిసలాము చేయాల్సిందే! మీ పిల్లలని కూడా తీసుకెళ్లండి. కళల పట్ల అభిమానాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం ఇది