రంగస్థల సాంకేతిక నైపుణ్యంలో తిరుగులేని వీర సురభి పూర్ణ!
ఆరేళ్ళ క్రితం శోభానాయుడు మేనేజర్ నాగయ్యతో కలసి హైదరాబాద్ శేరిలింగంపల్లి సురభి కాలనీ వెళ్లాను. అందరూ సురభి కళాకారులే తెలిసిన వాళ్లే కాబట్టి అందరినీ పలకరిస్తూ సురభి వనారస పూర్ణ చంద్రశేఖర్ ఇంటి ముందు ఆగాను! వాళ్ళబ్బాయి సురభి కిషోర్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. పూర్ణ చంద్రశేఖర్ నాటక రంగంలో రంగోద్దీపనం (లైటింగ్స్), సెట్ డిజైనింగ్ లో తిరుగులేని నైపుణ్యధీరుడు! ఇదే ఆర్ట్ లో తండ్రికి తగ్గ తనయుడు కిషోర్.
ఆ ఇంట్లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయాను! మొత్తం వెరైటీ లైటింగ్స్! నాటక రంగంలో సురభి పూర్ణ చేసే ప్రయోగాలన్ని అక్కడ నిండిపోయి ఉన్నాయి. వాటి మధ్యలో వున్న చిన్న జాగాలో కూర్చుని క్రోమింగ్ వర్క్ చేసుకుంటూ కనిపించారు సురభి పూర్ణ! వయసులో నాకన్నా చాలా పెద్ద అయినా ఆయన ఇట్టే కలసిపోతారు. ఇద్దరిదీ పాతికేళ్లకు పైగా అనుబంధం! ఎంతో ప్రేమగా పలకరిస్తారు. ఆత్మీయంగా మాట్లాడతారు. చిన్న పిల్లాడిలా తన ప్రయోగలన్నీ పూస గుచ్చినట్లు చెబుతారు! ఆరోజు అంతే! అలా మాట్లాడుతున్నారు! చెప్పుకుంటున్నారు. నాలుగు గంటల పైనే. సమయం కూడా తెలియలేదు. సురభి పూర్ణ అంతే! అంత ప్రేమ చూపిస్తారు! అతనికి నాటక రంగం అంటే పిచ్చి ప్రేమ! ప్రయోగాలు చేయడం ఇష్టం! 60 ఏళ్ల నాటక అనుభవంలోనూ ఇంకా ఏదో చేయాలని తపన. అతని అంకితభావం, క్రమశిక్షణ, ప్రేమ, ముక్కు సూటితనం ఇవన్నీ నాకు ఎంతో ఇష్టం.
అయితే ఇప్పుడు సురభి పూర్ణ లేరు. నాకు చివరి చూపు కూడా చిక్కకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలో నేను తిరువునంతపురంలో వున్నాను. కిషోర్ ఫోన్ చేసి చెప్పారు. 22-8-25, శుక్రవారం, ఉదయం గుండెపోటుతో సురభి పూర్ణ చనిపోయారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆ ముందు రోజు రాత్రి కూడా హుషారుగానే వున్నారట! ఉదయాన్నే ఐదున్నర గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లారట. అందరినీ పలకరించడం అలవాటులో భాగంగా మాట్లాడి ఇంటికొచ్చారు. నలత గా ఉందని కాసేపటికే వాంతి చేసుకుని కుప్ప కూలినట్లు కుమారుడు కిషోర్ కుమార్ తెలిపారు.
ఆత్మీయ మిత్రులు సురభి పూర్ణతో నాకు మంచి అనుబంధం వుంది. నాటకోత్సవాల ప్రభుత్వ నంది హైదరాబాద్ వదలి పట్టణాలకు మళ్ళినప్పుడు నాకు, జిఎల్ఎన్ మూర్తికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందేది. ఆ వారం రోజులు నాటకాలు చూసి వార్తలు రాసే వాళ్ళం! మా టీమ్ లో టెక్నికల్ పర్సన్ గా సురభి పూర్ణ ఉండేవారు. ఆయనకు కాస్త తీరిక దొరికినప్పుడు మా హోటల్ కు వచ్చి ఆయా నాటకాల గురించి విశ్లేషిస్తుండే వారు. అలా స్నేహం పెరిగింది. నంది నాటకోత్సవాలు జరిగిన ప్రతి ఆడిటోరియానికి సురభి పూర్ణ టెక్నీకల్ సపోర్ట్ ఇచ్చారు! లైటింగ్, కర్టెన్స్ సెట్ చేశారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆడిటోరియం అభివృద్ధిలో సురభి పూర్ణ పాత్ర వుంది!

అతను సెట్ డిజైనర్, లైటింగ్ ఎక్స్ పర్ట్ మాత్రమే కాదు మంచి నటుడు, మేకప్ ఆర్టిస్ట్ కూడా! 140 ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన సురభి జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇక్కడే కాదు దేశ విదేశాల్లో తన ముద్ర వేశారు. అమెరికాలో గుమ్మడి గోపాలకృష్ణ బృందంతో ప్రదర్శనలు ఇచ్చారు. తానా మహాసభల్లో అభినందనలు అందుకున్నారు. లండన్, సింగపూర్, స్విజ్జర్లాండ్, టర్కీ, ఫ్రాన్స్, గ్రీస్, సిరియా, స్కాట్ల్యాండ్, మయన్మార్, సౌత్ కొరియా తదితర దేశాల్లో ఐసీసీఆర్ తరఫున ప్రదర్శనలు ఇచ్చారు. నాటకంలో ప్రత్యేక ఎఫెక్ట్స్ సృష్టించి వన్నె తీసుకురావడంలో, నాటకానికి సహజత్వం అద్దడంలో తనకు తానే సాటి. నృత్య రూపకాలకు లైటింగ్ సెట్ డిజైన్ చేయడంలో తనకు తానే మేటి! వందలాది నృత్య రూపకాలు, వేలాది నాటకాలకు సేవలు అందించిన సురభి పూర్ణకు ఏడు ప్రభుత్వ నంది అవార్డులు, ఐదు గరుడ పురస్కారాలు, ప్రభుత్వ ఉగాది పురస్కారాలు లభించాయి.
సంగీత నాటక అకాడమి అవార్డు, పద్మశ్రీ మా వరకు ఎందుకు రావు అని ఈమధ్య నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు! నా దగ్గర జవాబు ఎక్కడిది? నవ్వి ఊరుకునే వాడ్ని! నిజానికి సురభి పూర్ణ నూటికి నూరు పాళ్ళు అర్హుడే! కానీ, అతని స్వరం కేంద్రం వరకు వినిపించేది ఎవరు? అలా ప్రతి యేటా అతనికి నిరాశే ఎదురవుతూ వచ్చింది. ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పుడు అతనే లేడు!
సురభి పూర్ణ చేసే ఆరం క్రోమ్ వర్క్ అద్భుతంగా ఉంటుంది! సినిమా నాటక రంగంలో ఉపయోగించే ఆభరణాలను ధగధగా మెరిపించే వర్క్ అది. ఈమధ్య ఫోన్ చేసి ఉత్సాహంగా చెప్పారు! మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాకు క్రోమ్ వర్క్ చేసినట్లు తెలిపారు. అలాగే కార్తికేయ 3 సినిమాకు కూడా చేసినట్లు చెప్పారు. ‘అకాడమి ఆఫ్ సురభి ఆర్ట్స్’ సంస్థను ఏర్పాటు చేసి క్రోమ్ వర్క్ లో కొంతమంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాథి అవకాశం కూడా కల్పించారు సురభి పూర్ణ. నాటక రంగానికి ఆయన లేని లోటు తీరనిది! ఒక మంచి గొప్ప సాంకేతిక నిపుణుడ్ని కోల్పోయాం. వారి కుమారుడు కిషోర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాడనే నమ్మకం వుంది! సురభి పూర్ణ కు అశ్రు నివాళి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
–డా. మహ్మద్ రఫీ
