తెలుగు భాషకు వరం – సురవరం

‘ఎందరి సురుల వరాల వల్లనో సురవరం ప్రతాపరెడ్డిగారిని తెలంగాణ నిజ గర్భశుక్తిముక్తాఫలంగా నోచింది’ అన్న వానమామలై వరదాచార్యుల వారి మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ జాతి, సంస్కృతి, భాషాభివృద్ధి కోసం శ్రమించిన వారిలో సురవరం ముఖ్యులు. తెలంగాణ వైతాళికులు, తేజోమూర్తుల్లో ముందు వరుసలో ఉండే సురవరం గురించిన సమగ్ర సమాచారాన్ని భావితరాలకు అందివ్వగలి గేదే ఈ ‘సురవరం -తెలంగాణం’. గోలకొండ పత్రిక సంపాదకులుగా, కవిగా, కథా రచయితగా, సాహిత్య విమర్శకులుగా, పరిశోధకు లుగా ఆయన రాసిన అనేక వ్యాసాలు, కవితలను ఈ గ్రంథం ద్వారా నేటి తరానికి అందిస్తున్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చిరస్మరణీయులైన వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ గ్రంథాన్ని వెలువరిస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర అంటే, కేవలం ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఆయన జీవిత చరిత్ర అంటే… తెలంగాణ చరిత్ర. ఆనాటి అనేక రంగాల పరిణామాల చరిత్ర అని ఈ గ్రంథం తెలి యజేస్తుంది.

హైదరాబాద్లో తెలుగు, మాట్లాడేవారే అరుదైన ఆ కాలంలో తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని తన రచనల్లో అద్భుతంగా చూపించారు సురవరం. పొద్దుగాల మా గొల పోరి బలది పెర్గు దెస్తదిలే దాతో నాస్త జేసి’ అని, అంటారు అచ్చ హైదరాబాదీ గ్రామ్యంలో. “పోరి గిట్లింద్కొ పెట్టింది పూరలొల్లి. దాని తుప్పలు వట్టి తన్నండ్రి బాగ’ అని, అంటారు ‘పాలమూరు పటేండ్ల భాష’లో. గోలకొండ పత్రిక సంపాదకులుగా ఆయన రాసిన వ్యాసాలు, నిజాం రాష్ట్రంలోని ఆంధ్ర సంస్థానాల చరిత్ర, అప్పటి తెలుగు ప్రజల పరిస్థితులను కండ్లకు కట్టినట్లు చూపుతాయి. తెలంగాణ చరిత్ర, హైదరాబాద్ రాష్ట్రంలో విద్యా సమస్యలు, వాటి పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఈ వ్యాసాల్లో చర్చించారు. సరోజినీ నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ, సీఆర్ రెడ్డి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వావిలాల గోపాల కృష్ణయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మలాంటి అనేక మంది మహానుభావులు సురవరం గారికి రాసిన ఉత్తరాలు, వాటికి ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరాలనూ ఈ గ్రంథంలో పొందుపర్చారు. ‘ఇటికలపాడు లోన జనియించిననేమి ప్రతాపరెడ్డి’ అంటూ డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘విద్వన్మణి’ కవిత, సురవరం గురించిన సమగ్ర విశేషాలను తెలియజేస్తుంది. వాన మామలై వరదాచార్యుల ‘ప్రతాపం ప్రశంస’, డాక్టర్ దాశరథి ‘యశోరాశి’, కాళోజీ నారాయణరావు ‘సురవరం ప్రతాపరెడ్డి’ కవితలు కూడా సురవరం కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, గ్రంథాల యోద్యమము, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, మొగలాయి కథలు, సంఘోద్ధరణము, ఉచ్ఛల విషాదము, యువజన విజ్ఞానం మొదలైన సురవరం రచనల గురించీ ఈ పుస్తకంలో చర్చించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా.. శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషా నిలయం, వేమన ఆంధ్ర భాషానిలయం, హిందీ ప్రచార సభ మొద లైన అనేక ప్రతిష్టాత్మక సంస్థల ఉన్నతికి కవిగా, గోలకొండ పత్రిక సంపాదకుడిగానే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ సురవరం ప్రముఖ పాత్ర పోషించారు. 1952 శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించిన సురవరం, అప్పటి రాజకీయాలు అంతగా రుచించక పోవడంతో వాటికి దూరంగానే ఉండిపోయిన స్వాభిమాని. త్యాగం, దేశభక్తి, భాషాభిమానం, ప్రజా శ్రేయస్సే పర మార్గంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాపాటవానికి గుర్తుగా ఈ గ్రంథం నిలిచిపోనుంది. “ముఖ్యంగా, తెలంగాణలో కవులే లేరన్న ఆంధ్రుల అహంభావానికి తనదైన శైలిలో సమాధానం చెప్పిన స్వాభిమాని. కేవలం నాలుగు నెల లోనే 354 మంది కవుల కవితలు, వారి జీవిత విశేషాలతో ‘గోల్కొండ కవుల సంచిక’ను ప్రచురించిన ధీశాలి. ఆయన రచించిన ‘ఆంధ్రులు సాంఘిక చరిత్ర’కు తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం తెలంగాణ గడ్డ చేసుకున్న అదృష్టం” అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, ఈ పుస్తకానికి శుభాకాంక్షలు చెబుతూ రాసిన ముందుమాటలు అక్షర సత్యాలు.
-రమణారావు

సురవరం-తెలంగాణం
ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
పేజీలు: 411, వెల: 600/ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,
చిరునామా: 85-6, వల్లభనగర్, వనపర్తి-509109

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap