
నేడు అలనాటి నటి సూర్యకాంతం పుట్టినరోజు సందర్భంగా….
రొష్టుపెట్టు ఆలిగా, దుష్టు నోటి కాళిగా, నటించుటామె కేళిగా- గయాళిగా నాతిగాని నాతి- లేక గొప్ప చుప్పనాతిగా ‘’ఏయ్! అబ్బీ!! ఏవిట్నీ బేహద్బీ అని?, తలుపుచాటు కోడల్లా పెద్దమాటల్చాటున్నిలబడి తిడితే తెలీదనీ- తెలిస్తే తెగబడి తిడతారనీ కదూ? నేను కోడళ్ళనీ వాళ్ళనీ వేపుకు తింటున్నాననీ, దుష్టునోరు దాన్ననే కదూ నువ్వన్నదీ? అబ్బీ! ఔగానీ నా దుష్టునోరు లేకపోతే నీలోని జాలి, వాళ్లలోని గుణం, ఎంత అట్టడుగునపడి అఘోరించేవనీ!’’ … ఈ మాటలు అన్నది ప్రముఖ రచయిత, నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ. ఇప్పటికే మీకు అర్ధమై వుంటుంది ఆ శాల్తీ సురేకారం లాంటి సూర్యకాంతమని. ఆమె దురుసునోటి పలుకుబడికి పంతులమ్మ. బాక్సాఫీసు సూత్రావళికి పలుపుతాడు. సూర్యకాంతం లేని బయస్కోపు ఉప్పులేని చారులాంటిది. అలనాటి తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో గయ్యాళి అత్తగా, అక్కగా, తల్లిగా తనదైన శైలిలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకున్న మహానటి సూర్యకాంతం 97వ జయంతి సందర్భంగా, కొన్ని విశేషాలు.
సూర్యకాంతం పుట్టింది 28, అక్టోబర్ 1924 న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో. ఆమె తల్లిదండ్రులు పొన్నాడ వెంకటరత్నమ్మ, అనంతరామయ్య. వారి కుటుంబంలో సూర్యకాంతం పద్నాలుగవ సంతానం. వారికి పుట్టిన పద్నాలుగురు సంతానంలో పదిమంది చనిపోయారు. ఆరోజుల్లో సరైన టీకాలవంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాలారిష్టాలవలన శిశుమరణాలు ఎక్కువగా వుండేవి. చివరికి అనంతరామయ్య సంతానంలో మిగిలినవారు నలుగురు మాత్రమే. వారిలో కడగొట్టు సంతానం సూర్యకాంతం. చిన్నతనం నుంచి సూర్యకాంతం కాస్త గారాబంగానే పెరిగింది. ఆమెకు చిన్నతనం నుంచే నటనమీద, సంగీతంమీద ఆసక్తి మెండుగావుండేది. పైగా డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదవడంతో ఆమెకు వస్తుతహ గడుసుతనం అలవాటయింది. స్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతుండగా తండ్రి అనంతరామయ్య చనిపోయారు. పాఠశాల వార్షికోత్సవాలలో సూర్యకాంతం నాటకాలలో పాల్గొనేది… పాటలు పాడేది. ఆమెకు హిందీ పాటలమీద మోజు ఎక్కువ. కాకినాడలో బాలాంత్రపు ప్రభాకరరావు హనుమాన్ నాట్యమండలి పేరిట కేవలం ఆడపిల్లలతోనే నిర్వహించే సతీసక్కుబాయి, చింతామణి, శ్రీకృష్ణతులాభారం వంటి అనేక నాటకాల్లో సూర్యకాంతం పాల్గొంటూ రంగస్థలి నటిగా మంచి పేరుతెచ్చుకుంది. 1945 ప్రాంతంలో జెమిని సంస్థ వారు ‘చంద్రలేఖ’ చిత్రాన్ని భారీ తారాగణంతో తమిళం, హిందీ భాషల్లో సమాంతరంగా నిర్మిస్తూ, నటనమీద ఆసక్తిగల కళాకారులను, నృత్యకారులను పత్రికాముఖంగా స్వాగతించారు. ఆ ప్రకటనకు ఆకర్షితులైన హనుమాన్ నాట్యమండలిలో సభ్యులైన దాసరి సుభద్ర, యండమూరి సుభద్ర మద్రాసుకు ప్రయాణం కడుతూ సూర్యకాంతానికి కూడా ఆహ్వానం పలికారు. వారితో కలిసి సూర్యకాంతం మద్రాసు చేరి జెమినీ స్టూడియోలో డాన్సర్ గా నెలజీతానికి చేరింది. అలా ‘చంద్రలేఖ’ (1948) సినిమాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డ్రమ్ డాన్స్ సన్నివేశంలో సూర్యకాంతం ఆ నృత్యంలో పాల్గొన్న 500 మందిలో ఒకరుగా నటించింది. మొదటినుంచి ఆమెకు హిందీ సినిమాలలో నటించాలనేకోరిక వుండడంతోనే జెమినీ స్టూడియోలో చేరింది. హిందీ సినిమాలు కొన్ని ఎక్కువగా జెమినీ స్టూడియోలోనే ఆరోజుల్లో నిర్మితమౌతూ వుండేవి. అక్కడ సూర్యకాంతంకు నృత్య తారగా బృంద గానాల్లోనే అవకాశాలు రాసాగాయి. గాయని పి.లీలతో సూర్యకాంతంకు జెమినీ స్టూడియోలో పరిచయమైంది. ఆమె సిఫారసుతో సూర్యకాంతం 1946లో ఫేమస్ ఫిలిమ్స్ వారు పి. పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘నారద నారది’ చిత్రంలో ఒక చిన్న వేషంలో కనిపించింది. దాంతో జెమినీ సంస్థలో అప్పటివరకు నెలజీతానికి కాంట్రాక్టు లోవున్న సూర్యకాంతం అందులోనుంచి తప్పుకుంది. 1946లో సారథి స్టూడియోస్ వారు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన ‘గృహప్రవేశం’ చిత్రంలో పోషించిన సహాయనటి పాత్రకు సూర్యకాంతంకు కాస్త గుర్తింపు వచ్చింది. 1949లో స్వస్తిక్ బ్యానర్ మీద హెచ్.వి. బాబు దర్శకత్వంలో హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన ‘ధర్మాంగద’ చిత్రంలో సూర్యకాంతం ఒక మూగపిల్ల పాత్రను పోషించింది. 1950లో సాధనా వారు నిర్మించిన ‘సంసారం’ సినిమాలో రేలంగి తల్లిగా, నిర్దయ కలిగిన అత్తగారి పాత్రలో సూర్యకాంతం తొలిసారి నటించి ఆ పాత్రలో జీవించింది. కేవలం పాతిక సంవత్సరాల వయసులో అరవై యేళ్ళ అత్తగారి పాత్రను పోషించడం చిన్న విషయం కాదు. ఆ పాత్రకు సూర్యకాంతానికి మంచి పేరొచ్చింది. ఆదేసంవత్సరం పెద్దిభొట్ల చలపతిరావుతో ఆమెకు ద్వితీయ వివాహం జరిగింది. గుంటూరుకు చెందిన చలపతిరావు మద్రాసు హైకోర్టులో వకీలుగా ప్రాక్టీస్ చేసేవారు. ఆయనకు నాటకాలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం. అలా సూర్యకాంతంతో పరిచయమై, ఆ పరిచయం వారి వివాహానికి దారితీసింది. 1951లో రాజరాజేశ్వరి ఫిలిమ్ కంపెనీ నిర్మాత కె.బి. నాగభూషణం నిర్మించిన ‘సౌదామిని’ చిత్రంలో సూర్యకాంతం హీరోయిన్ పాత్రకు ఎంపికైంది. దురదృష్టవశాత్తూ ఆమె ఒక కారు ప్రమాదంలో గాయపడి ముఖానికి పెద్ద దెబ్బలు తగులగా, ఆ పాత్ర ఎస్. వరలక్ష్మి పరమైంది. ఆమెకు స్వస్తత చేకూరిన తర్వాత ఆదే చిత్రంలో రూప పాత్రను పోషించింది.
సూర్యకాంతంకు మొదటినుంచి హిందీ సినిమాలలో నటించాలనే బలీయమైన కోరిక వుండేది. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించక ప్రయత్నాలు విర్మించుకుంది. దీపావళి పండుగరోజుల్లో హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సూర్యకాంతంకు అవకాశం వచ్చింది. ఒప్పుకున్న కొద్దిరోజులలోనే ఆ పాత్ర మరొకరితో చిత్రీకరించి కారణాంతరాలవలన ఆమెను తొలగించి సూర్యకాంతంను బుక్ చేశారని తెలిసి తప్పుకుంది. మానవత్వం ఆమెను ఈ నిర్ణయం తీసుకునేందుకు ఉపకరించింది. ‘ఒకరిని బాధపెడుతూ తను సంతోషంగా వుండలే’నని నిర్మాతకు ఆమె తెగేసిచెప్పేసింది. తరువాత ‘కోడరికం’ సినిమాలో అత్తగా ఆమె స్థిరపడిపోయింది. పెళ్ళిచేసి చూడు చిత్రంలో చుక్కాలమ్మగా, అమ్మలక్కలు చిత్రంలో శేషమ్మగా, చక్రపాణి చిత్రంలో మనోరమగా గయ్యాళి పాత్రలు పోషించింది. దొంగరాముడు, కన్యాశుల్కం, చిరంజీవులు, చరణదాసి, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మాంగల్యబలం, వెలుగునీడలు, భార్యాభర్తలు, ఇద్దరుమిత్రులు, ఆత్మబంధువు, కులగోత్రాలు, దాగుడుమూతలు వంటి సినిమాలలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను చూరగొంది. సూర్యకాంతం ఎంతటి గయ్యాళి పాత్రలు పోషించిందంటే… ఆమె పేరును ఆడపిల్లలకు పెట్టుకోవడానికి తల్లిదండ్రులు సంశయించేవారు. ‘’మీరు నిర్మించే సినిమాలో సూర్యకాంతం వుందా’’ అని పంపిణీదారులు నిర్మాతలను అడిగేవారంటే, ఆలోచించండి ఆమెకు ఎంతటి ఫాన్ ఫాలోయింగ్ వుందో అనే విషయం. విఠలాచార్య కన్నడంలో నిర్మించిన ‘మనే తుంబిద హెణ్ణు’ సినిమా హక్కులను విజయా సంస్థ కొనుగోలు చేసి, కథకు కొన్ని మార్పులు చేసి, నరసరాజు చేత డైలాగులు రాయించి ‘గుండమ్మ కథ’(1962) పేరిట సినిమా నిర్మించారు. అందులో అగ్రనటులు అక్కినేని, ఎన్టీఆర్ హీరోలైనా సినిమా టైటిల్ మాత్రం సూర్యకాంతం పోషించిన ‘గుండమ్మ’ పాత్ర పేరు పెట్టారు. అది సూర్యకాంతం సినీచరిత్రలో ఒక కలికి తురాయిగా మిగిలింది. అసలు గుండమ్మ తెలుగు పేరు కాదు. అయినా ప్రేక్షకులు ఆ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. సూర్యకాంతంకు దయాగుణం, దాతృత్వగుణం మెండు. ఆమె ఎందరో అనాధ పిల్లలకు, విద్యాసంస్థలకు, గ్రంధాలయాకు ధనసహాయం చేసింది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి సంతృప్తికరంగా భోజనం పెట్టి, ఆదరించి సాగనంపేది. స్టూడియోలో షూటింగుకు వెళ్ళేటప్పుడు పిండివంటలతోబాటు వివిధ వంటకాలతో చేసిన వాటిని పెద్ద క్యారియర్లనిండా తీసుకెళ్లి సహ నటీనటులకు ఆప్యాయంగా వడ్డించేది. ఆమెకు చదువుమీద యెంతో ఆసక్తి. చిన్నవయసులోనే చదువుకు స్వస్తి చెప్పడంతో గ్యాడ్యుయేట్ కావాలనే కోరిక అలాగే వుండిపోయింది. అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు చిత్రంతో మొదలెట్టి చివరిదాకా వారి సినిమాలలో సూర్యకాంతం నటించింది. భరణీ వారి సినిమాలలో కూడా ఆమెకు వేషం తప్పనిసరిగా వుండేది. ‘బహుత్ దిన్ హుయే’, ‘దో దుల్హనే’ వంటి హిందీ సినిమాలలో సూర్యకాంతం నటించింది. ఇక 50 కి పైగా తమిళ చిత్రాలలో వైవిధ్య పాత్రలు పోషించింది. ఆమె దాదాపు ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడేది. బొంబాయిలో కొన్ని సినిమా షూటింగులకు హాజరైనప్పడు, ఆ స్వల్ప వ్యవధిలోనే మరాఠీ భాషను నేర్చుకుంది. యాభైయేళ్ల వయసులో ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం ఆమెకు భాషమీద వున్న ఆసక్తికి తార్కాణమని చెప్పుకోవాలి. ఆమె వంటలమీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు కూడా. జీవిత చరమాంకంలో ఆమెకు తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించారు. సూర్యకాంతం మంచి వ్యాపార పటిమగల మహిళ. ఆవిడ పాత ఇళ్ళు కొనుగోలుచేసి, వాటిని ఆధునీకరించి మంచి ధరకు అమ్మేవారు. అంతేకాదు, పాత కార్లను కొని వాటికి రేపేర్లు చేయించి, రంగులు వేసి సెకండ్ హ్యాండ్ బజార్లలో అమ్మకానికి వుంచేవారు. ఇది కేవలం ధనార్జనకోసం చేసిన ప్రవృత్తి కాకపోయినా, వ్యాపార సరళి మీద ఆమెకు వున్న ఆసక్తికి గుర్తు మాత్రమే. 1993 ప్రాంతంలో సూర్యకాంతం మధుమేహవ్యాధితో బాధపడ్డారు. ఆ వ్యాధి ముదిరి మూత్రపిండాలను దెబ్బతీసింది. చివరిసారి ఆమె నటించిన సినిమా ‘ఎస్.పి. పరశురామ్’. 750 సినిమాలకు పైగా నటించిన సూర్యకాంతం 1994 డిసెంబర్ 18 న తన 70 వ యేట చెన్నైలో కన్నుమూశారు.
-ఆచారం షణ్ముఖాచారి
64కళ లు నేను ప్రతి సంచికా చదువుతాను. పత్రిక ఉద్దేశ్యం మంచిదే కాని ఎందుకనో వ్యాసాలకు పరిమితి విధించుకున్నారేమో, విశేషాలు తక్కువగా ఉండి ముక్తసరిగా ముగించేవారు. ఈ తరహా ఏ ఒకటి రెండు వ్యాసాల కు మినహాయింపు.
కాని ఈసారి ఆచారం గారి వ్యాసం కొంత పరణితితో, సాధ్యమైనంత ఎక్కువ సమాచారంతో సూర్యకాంతం గారిని ఆవిష్కరించిందనిపించింది.