‘ఘటోత్కచుడి ‘ కి – రజతోత్సవం

దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డిలో కథలు ఎన్నుకోవడంలోనూ, సినిమా రూపొందించడంలో కొన్ని విలువలు పాటించే అలవాటు ఉంది. వాటికి తోడు ఓ పసిపిల్లాడి మనస్తత్వం ఉందని అన్పిస్తుంటుంది. పసిపిల్లలు కేరింతలు కొట్టే హాస్యం, అద్భుతమైన ఊహలు (ఫాంటసీ) కృష్ణారెడ్డిగారి సినిమా కథల్లో ఉంటాయి. మొదటి సినిమా (నిర్మాతగా, రచయితగా) కొబ్బరి బొండాం’లో ఇలాంటి ఫాంటసీ ఎలిమెంట్ కి శ్రీకారం చుట్టారు. ఓ తాయత్తు మీద నడిపిస్తూ, ఆత్మవిశ్వాసం పెంచుకున్న హీరో చుట్టూ కథ అల్లారు.. హిట్..
దర్శకుడిగా మొదటి సినిమా రాజేంద్రుడు-గజేంద్రుడు’లో పిల్లలకి నచ్చేలా ఏనుగు మీదే కథ. రెండో సినిమా ‘మాయలోడు’ గారడీవాడి కథ.. సూపర్ హిట్. నైజాంలో రికార్డ్ కలెక్షన్లు సృష్టించింది. సూపర్ స్టార్ కృష్ణ గారితో తీసిన ‘నెంబర్ వన్’ చిత్రంతో ఫ్యామిలీ చిత్రాల్లో తనదైన సంతకం చేశారు. ఆ తర్వాత వచ్చిందే ‘యమలీల’ మొదట ఆ సినిమా పేరు ‘యమస్పీడ్’ అనుకున్నారు. మహేష్ బాబుని హీరోగా ఆ సినిమాతో పరిచయం చేద్దామనుకున్నారు. కానీ వీలు కాలేదు. అలీని హీరో చేసి, ‘యమలీల’ తీశారు. బ్లాక్ బస్టర్ హిట్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి ఇక్కడ ఓ చిన్న కమర్షియల్ ఫార్ములా రహస్యం చెప్పుకోవాలి. పసిపిల్లల్ని రంజింపజేసేలా సినిమా తీస్తే, వాళ్ళ కెరీర్లో లాంగివిటీ ఉంటుంది. ఆ సినిమాల్లో యాక్షన్ ఉండొచ్చు కానీ వయలెన్స్ ఉండకూడదు. ఫ్యామిలీ ఉండొచ్చు. ఆప్యాయతలు, అనుబంధాలు ఉండొచ్చు కానీ ఏడుపులు, పెడబొబ్బలు ఉండకూడదు. హీరో క్యారెక్టరైజేషన్ లో కావాల్సినంత సరదాతనం ఉండాలి.. ఇలాంటి సినిమాలు చేశారు. కాబట్టే అమితాబ్ బచ్చన్, చిరంజీవిగారి లాంటి గ్రేట్ లెజెండ్స్ దశాబ్దాల తరబడి ప్రేక్షకుల ఇళ్ళల్లో ఓ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. కె.వి.రెడ్డిగారు ఈ ఫార్ములాకి ఆద్యులు అయితే విఠలాచార్యగారు, ఆ తర్వాత రాఘవేంద్రరావుగారు, ఇప్పుడు రాజమౌళిగారు ఈ ఫార్ములాని బాగా అర్ధం చేసుకున్నారు, ఆచరించారు. రాఘవేంద్రరావుగారి తర్వాత ఈ ఫార్ములాని పట్టకుంది, బాక్సాఫీస్ దగ్గర గట్టిగా హిట్లు కొట్టింది. కృష్ణారెడ్డి గారే. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి ఫాంటసీ ఎలిమెంట్స్ జోడిస్తూ, తన ప్రత్యేకత నిలబెట్టుకున్నారు కృష్ణారెడ్డి, ‘యమలీల’ తర్వాత ‘శుభలగ్నం’ లాంటి సూపర్ హిట్ ఫ్యామిలీ సినిమాలు తీశారు. ఒకవైపు నాగార్జున గారితో ‘వజ్రం’, మరోవైపు బాలకృష్ణగారితో ‘టాప్ హీరో లాంటి సినిమాలు తీస్తూనే తన అభిరుచికి అనుగుణంగా ‘ఘటోత్కచుడు’ సినిమా ప్లాన్ చేశారు. ‘యమలీల’ సూపర్ హిట్ కాంబినేషన్ అలీ-సత్యనారాయణ గార్లతో తీస్తూ, రోజాని హీరోయిన్‌గా జత చేశారు. సరిగ్గా ‘యమలీల’ విడుదలయిన (28 ఏప్రిల్ 1994) ఏడాదికి ‘ఘటోత్కచుడు’ 1995 ఏప్రిల్ 27న విడుదలయింది. అంటే ఈ ఏడాదికి పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. ‘మాయా బజార్’ సినిమా ఘటోత్కచుడు లేకుండా ఊహించలేం. కానీ ఘటోత్కచుడు క్యారెక్టర్ తో సినిమా తీయాలనే బడియాతోనే సగం హిట్ కొట్టేశారు. కృష్ణారెడ్డి. అన్నట్లు ఈ కథ ఎస్. వి. కృష్ణారెడ్డిగారు కె. అచ్చిరెడ్డి గార్లు కలిసి అల్లింది. అలాగే అప్పటి సినిమా వారపత్రికల్లో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఫుల్ పేజి కథనాలుగా వస్తుండేవి. అవన్నీ ‘ఘటోత్కచుడు’ సినిమా మీద క్రేజ్ పెరగడానికి కారణాలయ్యాయి. ముఖ్యంగా స్వర్గీయ ఏ.వి.ఎస్ చేత రచయిత దివాకర్ బాబు గారు పలికించిన ‘రంగుపడుద్ది’ అనే మాట తెలుగునాట ఓ ఊతపదం అయ్యింది. అంటే ‘సాహసం శాయరా డింభకా’, ‘జంబలకడి పంది’, ‘జూలకిడక’.. ఇలాంటి కొన్ని సినిమా డైలాగ్స్ తెలుగు వారి జీవితాల్లో భాగం అయ్యాయి. ‘రంగుపడుద్ది’ కూడా అలాగే నిలిచిపోయింది.
– తోట ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap