యస్వీఆర్ నాకు స్ఫూర్తి – చిరు

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నటనకు భాష్యం చెప్పింది ఎస్వీ రంగారావు అని చిరంజీవి కొనియాడారు.
“మా నాన్నగారికి రంగారావుగారంటే ఎంతో ఇష్టం. ఆయనతో రెండు చిత్రాల్లో నటించారు. ఎస్వీఆర్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చి చిరంజీవిగా మీ అందరి అభిమానం పొందుతున్నా, మహా నటుడి విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘ఎస్వీఆర్ తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం, అయితే తెలుగు నటుడిగా పుట్టడం ఆయన దురదృష్టమ’ని గుమ్మడి తరచూ అంటుండేవారు. అది అక్షరాల నిజం. ఆయన తెలుగువాడు కాకుండా ఉంటే హాలీవుడ్ స్థాయికి వెళ్లేవారు. ‘నర్తనశాల’లో కీచకుడిగా ఆయన నటనకు అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. అది మనకు గర్వకారణం. నేను నటించిన ‘సైరా’ సినిమా ఆయన చూసుంటే తప్పకుండా మెచ్చుకునేవారు. ఆయన ఎక్కడున్నా వారి ఆశీస్సులు నాకు ఉంటాయి” అని చిరంజీవి అన్నారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎస్వీఆర్ మనుమడు రంగారావు, మేనల్లుడు బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత సొంత జిల్లాలకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని తెలిసి ఆయనను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అద్భుతంగా ఉందంటూ అభిమానులు జేజేలు పలికారు.

SA:

View Comments (2)