విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 19
భారతీయ ఆధ్యాత్మికతలోని ఆధునికతను ప్రపంచా నికి ప్రబోధించిన ప్రపంచ ప్రసిద్ధుడు’ నరేంద్రుడు. తన వివేకంతో యావజ్జగతికి ఆనందం పంచిన కర్మ యోగి స్వామి వివేకానందుడు. సందేహాలతో మొదలైన వివేకానందుని జీవితం సందేశాలతో ముగిసి ఆధ్యాత్మిక ఆకాశానికి ఎగిసింది. భారతీయ యువతకు ప్రగతి’ నేర్పింది వివేకానందుని ప్రబోధం. భారతీయులు స్వతంత్రులై ముందుకు సాగడానికి తగిన స్ఫూర్తినిచ్చింది. వివేకానందుని జీవితం. చికాగోలో జరి గిన సర్వధర్మ సమ్మేళనంలో వీరు చేసిన ప్రసంగం చిరస్థాయిగా నిలిచి పోతుంది. సాదరంగా అమెరికావాసులను ఆయన ‘సోదర సోదరీమణులారా!’ అంటూ పలకరించి పులకరింపచేసిన తీరు చిరస్మరణీయం. ఆయనలోని భారతీయతకు, సౌభ్రాతృత్వానికి ముగ్గులైన అమెరికావాసులు, సభా ప్రాంగణాన్ని కరతాళధ్వనులతో మారుమ్రోగేలా చేశారు. ఈ సంఘటనతో మన భారతీయుతకు, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రపంచ వేదికపై అత్యున్నత స్థానం లభించింది. ఈ ఆధ్యాత్మిక సింహం చేసిన ప్రసంగాన్ని నాటి విదేశీ పత్రికా రంగం సువర్ణాక్షరాలతో లిఖించి విస్తృత ప్రచారం చేసింది. తన గురువు రామకృష్ణునికి ఇష్టమైన శిష్యునిగా నరేంద్రుడు వివేకానందునిగా మారి, తన జీవితాన్ని భారతీయ యువతకు ఆదర్శంగా మలచుకున్నాడు. ఆధ్యాత్మిక చింతనే అభివృద్ధికి వంతెన అని భారతీయ యువతకు, ప్రపంచ యువతకు చాటి చెప్పాడు. మనదేశం స్వతంత్రించడానికి వివేకానందుని మంత్రముగ్ధ భాషణలు ఎంతో ఉపకరించాయి. మనం సన్మార్గంలో నడవడానికి సహకరించాయి. రామకృష్ణ పరమహంసకు అధ్యాత్మిక వారసుడైన స్వామి వివేకానంద నేటికీ మన ధృవతార.
(స్వామి వివేకానందుడు జన్మదినం 12 జనవరి 1863)