రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. స్వర్ణలత
విజయవాడ, 03 ఏప్రిల్: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా (పూర్తి అదనపు బాధ్యతలు) ఎల్. స్వర్ణలత మే 1వ తేదీన విజయవాడలోని కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు.
1992లో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా డీపీఆర్వోగా ఎంపికైన లింగం స్వర్ణలత … తొలుత గుంటూరులో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా (డీపీఆర్వో) గా తదనంతరం నెల్లూరులో విధులు నిర్వర్తించారు. రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులుగా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలో పనిచేశారు. ఆ తర్వాత ప్రాంతీయ ఉపసంచాలకులుగా విశాఖపట్టణం, విజయవాడలో విధులు నిర్వర్తించారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా పదోన్నతిపై విజయవాడ, ఒంగోలులో పనిచేశారు. కోస్తా తీరంలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా జోన్-1, జోన్-2, జోన్-3 లలో పనిచేసిన స్వర్ణలత విశేష అనుభవం గడించడమే కాక క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వహణలో మంచి పేరు సంపాదించారు. ఇటీవలే సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులుగా పదవీ విరమణ పొందిన డి.శ్రీనివాస్ స్థానంలో స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో, విపత్తులు, వరదల సమయంలో, రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ పోటీలు తదితర కార్యక్రమాల్లో విశేష సేవలందించిన స్వర్ణలత అదనపు సంచాలకులుగా మరిన్ని సేవలందించాలని ఈ సందర్భంగా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు.