నీ దగ్గర కత్తులున్నాయా ..
సమాజాన్ని భయపెట్టే తూటాలున్నాయా.
ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధాలు, అణుబాంబులు ఉన్నాయా ..పర్వాలేదు కానీ మొనదేరిన, పదునెక్కిన కలాలు మాత్రం ప్రాణం పోసుకుంటే మరింత ప్రమాదం అని రాజులు, డిక్టేటర్లు భయపడి పోయారు. కలాలకు అంత బలమున్నది. అక్షర రూపం దాల్చిన “ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అన్నాడు ప్రజాకవి కాళోజి నారాయణ రావు. నిత్యం మెదళ్లతో కుస్తీ పడుతూ క్రియేటివిటీ కోసం తపన పడే వారిలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, గాయనీ గాయకులూ, ఆర్టిస్టులు, సృజనాత్మకతను కలిగినవారు ఉన్నారు. వీళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో చీకటి మయమై పోయేది. జీవితాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే రంగాలలో మొదటిది సినిమా రంగం. ఇక్కడ క్రియేటివిటీ కలిగిన వారికే ఎక్కువగా అవకాశాలు తలుపు తడుతాయి.
సినిమా అంటేనే 24 కళలు ఉండాల్సిందే. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసే మూవీ సక్సెస్ కావాలంటే వందలాది మంది ఏక కాలంలో కష్టపడాల్సిందే. వీరందరిని సమన్వయం చేసుకుంటూ సినిమాను నడిపించాలి. లేకపోతే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. సినిమా అన్నది పూర్తిగా రిస్క్ తో కూడుకుని ఉంటుంది. స్టోరీ తో పాటు డైలాగ్స్ , సాంగ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ తో సైరా సినిమాను తీశాడు. విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు మాటల రచయిత బుర్ర సాయిమాధవ్ తో పాటు సిరివెన్నెల సీతారామ శాస్త్రిలు. సాయి రాసిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. మరో వైపు సినిమాలోని పాటలకు ఆదరణ లభిస్తోంది.
సైరా అద్భుత విజయంతో, సినిమా యూనిట్ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ జరిగింది. ఇప్పటికే డైరెక్టర్స్, నటీనటులు సినిమాను చూసి తమ స్పందనను తెలియ చేశారు. ఈ సందర్బంగా సాయి మాధవ్ తో పాటు గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తమ అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు సిరివెన్నెల అద్భుతమైన పాటలను రాశారు. ఆ మూవీస్ సక్సెస్ లో ఈ పాటలు ప్రధాన పాత్ర పోషించాయి. తమ ఆనందాన్ని అభిమానులతో, సినిమా టీమ్ తో పంచుకున్నారు. ఎక్కడో ఒక పాలెగాడుగా ఉన్న వ్యక్తి తనకు జరిగిన వ్యక్తిగత అవమానాన్ని కాకుండా జాతి మీద జరుగుతున్న అత్యాచారాలుగా భావించి సాగించిన పోరాటం గొప్పదన్నారు సిరివెన్నెల. ఈ సినిమాకు అఖండమైన విజయం అందించిన చిరంజీవి అభిమానులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మెగాస్టార్ ఆట పాటలతో అలరించడం అన్నది కొత్త విషయం కాదు. గత 8 ఏళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ తాను ఏం చేయగలరో ఈ సినిమా ద్వారా చిరంజీవి నిరూపించారని సిరివెన్నెల కొనియాడారు. మొత్తం మీద సినిమాలకు కలాలే బలాన్ని ఇస్తాయన్న వాస్తవం నిరూపితమైంది.
Bothe are great writers.