సుస్వరాల ‘ఠీవి’రాజు

(టి.వి. రాజు 50 వ వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)

చలువ మడతలు నలగని ప్యాంటు షర్టుతో కూర్చొని, బూజుపట్టిన పాత సంప్రదాయాలను పక్కనపెట్టి, రోజురోజుకి మారుతుండే ప్రేక్షకుల మోజును మదినెంచి, మట్లుకట్టి రికార్డులుగా వదిలితే అవి ఆనాడే కాదు, ఈ నాటికీ వాటిని పదేపదే వింటూ ఆనందించే సంగీతాభిమానులను సంపాదించుకున్న సుస్వరాల రాజు టి.వి. రాజు అనబడే తోటకూర వెంకట రాజు. సాయంత్రమైతే గ్లాస్గో పంచెకట్టి, జుబ్బా ధరించి, వేళ్ళ సందున సిగరెట్ బిగించి పాండీ బజార్లో నడుస్తూ వుంటే, కబుర్లాడడానికి ఎదురుచూసే మిత్రులకు ఆ నడకలో సరిగమలు వినిపించేవి. హిందీ, ఇంగ్లీష్ సినిమాలు మద్రాసులో ఆడుతుంటే అవి టి.వి. రాజు చూడకుండా వెళ్ళేవికావు. మద్రాసులో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటే, ముందు సీట్లో కూర్చునేది ఆయనే. ఎన్టీఆర్ ని “భాయీ” అని పిలిస్తే, ఆయన “ఏమిటి బ్రదర్” అనకుండా “గురూ” అని పిలిచింది ఈ ‘ఠీవి’ రాజు ఒక్కరినే. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే సంగీత దర్శకుడెవరో చెప్పాల్సిన అవసరంలేని పేరది. చరిత్ర మరువని “జయ కృష్ణ ముకుందా మురారీ” పాటను అజరామరం చేసిన టి.వి. రాజు, భౌతికంగా ఈ లోకాన్ని విడిచి ఫిబ్రవరి 20 నాటికి 50 యేళ్ళు. ఆ సుస్వరాల రాజును గురించిన జ్ఞాపకాలు కొన్ని..

బాలరాజు:

టి.వి. రాజు పుట్టింది రాజమండ్రికి సమీపంలోని రఘుదేవపురం గ్రామంలో. ఆరేళ్ళ ప్రాయంలో తండ్రి చనిపోవడంతో చదువు సాగలేదు. శ్రీనల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచారి వద్ద మూడేళ్లపాటు సంగీతం నేర్చుకొని, సంగీత పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటకాలు వేసేవారు. కృష్ణుడు, నారదుడు, కనకసేనుడు, భక్తకబీరు, లోహితాస్యుడు వంటి పాత్రల్లో రాణిస్తూ, సురభి కంపెనీకి, అంజనీకుమారి(అంజలీదేవి) నృత్య ప్రదర్శనలకు హార్మోనియం వాయించేవారు. అలా 1946 వరకు ఆంధ్రా, ఒరిస్సా ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక నాటకాలకు, నృత్య ప్రదర్శనలకు సంగీత సహకారమందించారు. మద్రాసు శోభనాచల స్టూడియోలో రమాజోషి అనే ఆవిడ టి.వి. రాజు కు పరిచయం. ఆ స్టూడియోలో హార్మనిస్టు వుద్యోగం ఖాళీ అవడంతో రాజును రమ్మని ఆమె టెలిగ్రాం పంపింది. రాజు మద్రాసు చేరడం ఆలస్యమవడంతో ఆ పోస్టు భర్తీ అయిపోయింది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తుంటే సంగీత దర్శకులు నాళం నాగేశ్వరరావు పనిచేస్తున్న ‘చంద్రవంక’ సినిమా యూనిట్ లో పనిచేసే అవకాశం దొరికింది. సీనియర్ కాంచన, రఘురామయ్య, టిజి కమలాదేవి నటించిన ఈ సినిమాకు నాళం నాగేశ్వరరావుతోబాటు ఘంటసాల, కళ్యాణరామన్ కూడా పనిచేసారు. అప్పుడే ఘంటసాలతో రాజుకు పరిచయమయింది.

టింగు రంగాతో బ్రేకు:

ఎన్టీఆర్, యస్వీఆర్ లతో కలిసి రాజు మాంబళంలో వుండేవారు. వారి సాయంతో బియ్యే సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేసారు. ఆ సమయంలోనే నిర్మాత పియస్ శేషాచలం సుబ్బారావు దర్శకత్వంలో తెలుగులో ‘టింగు రంగా’ పేరుతో, తమిళంలో ‘శ్యామల’ పేరుతో సినిమాగా నిర్మిస్తూ టి.వి. రాజును సంగీత దర్శకునిగా నియమించారు. యస్ బి దినకరరావు రాజుకు సహాయ సహకారం అందించారు. తెలుగులో హీరోయిన్ శ్యామలగా యస్ వరలక్ష్మి, హీరోగా శ్రీరామమూర్తి నటించగా తమిళంలో నాటి ప్రసిద్ధ కర్నాటక విద్వాంసుడు, సూపర్ స్టార్ యంకె త్యాగరాయ భాగవతార్ హీరో పాత్ర ధరించారు. అందులో టి.వి.రాజు ‘ఉసేని’(కరహరప్రియ జన్య)రాగంలో స్వరపరచిన “రాజా మహారాజా రవికోటి విభ్రాజ సురలోక భూజా” పాటను ఘంటసాల పాడగా, అదే పాటను తమిళంలో “రాజన్ మహారాజన్ తిరువెట్రియూర్ గూర్మేవు తిరువాళల్ త్యాగరాజన్” అంటూ త్యాగరాయ భాగవతార్ పాడడమే కాదు తెలుగు మాతృకలో టి.వి. రాజు స్వరపరచిన విధానాన్ని కొనియాడారు. తమిళ చిత్రానికి జి రామనాథన్ సంగీతం సమకూర్చారు. ఇదే సినిమాలో “శ్యామలా…శ్యామలా…లోకప్రియా హే శ్యామలా” అనే ఘంటసాల పాటకూడా చాలా పాపులర్ అయింది. ఈ పాటకు ప్రభావితమైన ఘంటసాల తన కూతురుకు ‘శ్యామల’ అని పేరుపెట్టారని ఆరోజుల్లో చెప్పుకునేవారు. ఈ సినిమా విడుదలయ్యాక టి.వి.రాజుకు మంచి పేరొచ్చింది. తరవాత ఎన్టీఆర్ స్వంత బ్యానర్ నేషనల్ ఆర్ట్స్ స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘పిచ్చిపుల్లయ్య’(1953) నిర్మిస్తే దానికి సంగీతం టి.వి. రాజు సమకూర్చారు. ఆ తరవాత వచ్చిన ‘నిరుపేదలు’, ఎన్టీఆర్ సొంత సినిమాలు ‘తోడుదొంగలు’(1954), ‘జయసింహ’(1955)కు ఆయనే పనిచేసారు. ఇందులో పాటలు ముఖ్యంగా “ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి” సూపర్ హిట్ గా నిలిచి టి.వి. రాజు పేరును పాపులర్ చేసింది. ‘బేగడ’ రాగంలో సుశీల పాడిన జావళి “నడిరేయి గడిచేనే” మరింత పాపులర్ అయింది. 1957లో వచ్చిన ఎన్టీఅర్ సొంత సినిమా ‘పాండురంగ మహాత్మ్యం’ లో రాజు అందించిన సంగీతం అజరామరమై నిలిచింది. ముఖ్యంగా “జయ కృష్ణా ముకుందా మురారీ”, “అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా”, “కనవేరా మునిరాజ మౌళీ”, “తరం తరం నిరంతరం ఈ అందం”, “వన్నెల చిన్నెల నెరా” పాటలకు జనం పట్టం కట్టారు. “జయ కృష్ణా ముకుందా మురారీ” పల్లవి బాణీని త్యాగరాయ భాగవతార్ తన ‘హరిదాస్’ సినిమాలో ఉపయోగించు కోవడం రాజు సంగీత కిరీటంలో ఒక కలికి తురాయిగా మిగిలింది. టి.వి. రాజు పేరు ఎంతలా ప్రభావిత మైనదంటే ఆయన సంగీత దర్శకత్వంలో సినిమా తీస్తున్నామని నిర్మాత చెబితే చాలు ఎన్టీఆర్ కాల్షీట్లు ఇచ్చేవారట. టి.వి. రాజు వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు, నిర్మాతగా(స్లీపింగ్ పార్టనర్) ‘బాలనాగమ్మ’ సినిమా నిర్మించారు, ‘పల్లెటూరిపిల్ల’, ‘పిచ్చిపుల్లయ్య’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా వేసారు. ప్రముఖ సంగీత దర్శకులు సత్యం, జోసఫ్ కృష్ణమూర్తి టి.వి. రాజు వద్ద చాలా కాలం సహాయకులుగా పనిచేసారు. 1971లో మదుమేహ వ్యాధి తిరగబెట్టి ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది. 1973లో హృద్రోగంతో హఠాత్తుగా మరణించిన టి.వి. రాజు భౌతికంగా మనముందు లేకున్నా అజరామరమైన ఆయన పాటలు నిరంతరం మనకు రాజు ఉనికిని గుర్తుచేస్తూనే వుంటాయి.

తండ్రితో సూర్యనారాయణరాజు అనుభవాలు :

టి.వి. రాజు పెద్దకుమారుడు వెంకట సత్యసూర్యనారాయణరాజు. ‘పెదరాజు’ అని ముద్దుగా పిలుచుకొనే సూర్యనారాయణ రాజు మంచి గిటార్ ప్లేయరు. ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే:
“మా తల్లిదండ్రులకు నేను, తమ్ముడు సోమరాజు ఇద్దరమే సంతానం. మమ్మల్నిద్దరినీ బాగా చదివించాలని నాన్నగారు మద్రాసులో పేరుమోసిన హోలీ ఏంజెల్స్, కేసరి హైస్కూళ్ళలో చేర్పించారు. మాకు చదువు వంటబట్టలేదు. గుంటూరు రవి ట్యుటోరియల్ కాలేజి అధిపతి ‘సివియన్ ధన్’ నాన్నకు మంచి స్నేహితుడు. ఆయన ప్రోద్బలంతో నన్ను గుంటూరు పంపారు. అక్కడి వాతావరణం నాకు గిట్టక మద్రాసు వచ్చేసాను. నాన్న లంచ్ కోసం ఇంటికి వస్తే ఆ కారులో నేను, తమ్ముడు రికార్డింగు స్టూడియోలకు వెళ్ళేవాళ్ళం. అక్కడే ఆటా పాట! చదువు వంటబట్టదని తెలిసి నాన్న మమ్మల్ని ధనరాజ్ మాస్టర్ వద్ద పియానో శిక్షణకు చేర్చారు. మా తమ్ముడు నాన్న అంచనాలకు మించి స్కూల్ ఫైనల్ పాసవ్వడంతో డాక్టరీ చదించాలని వువ్వీళ్ళూరారు. ఎమ్మెస్ విశ్వనాథం సిఫారసుతో వివేకానంద కాలేజీలో చేర్చారు. తమ్ముడు మాత్రం కామర్సు కోర్సులో చేరేందుకు మొగ్గు చూపాడు. ఇదీ మా బాల్యం సంగతులు. ఇక నా విషయానికొస్తే దర్శకుడు హేమాంబరధరరావు వద్ద సహాయ దర్శకునిగా చేరాను. ‘ఇంటిదొంగలు’, ‘పరివర్తన’, ‘మనవూరి కథ’ ‘ముగ్గురు మూర్ఖులు’ సినిమాల్లో ఆయనవద్ద పనిచేసాను. తరవాత ‘జీవితంలో వసంతం’ సినిమాకు యుయస్వి పాణి వద్ద సహాయకునిగా, ‘ఏది పాపం ఏది పుణ్యం’ సినిమాకు కె వాసు వద్ద అసోసియేట్ గా పనిచేసాను. సంగీతం మీదవున్న అనురక్తితో సాలూరు రాజేశ్వరరావు వద్ద గిటారిస్టుగా కుదిరాను. నాసోదరుడు సోమరాజు, రాజేశ్వరరావు కుమారుడు కోటేశ్వర రావు కలిసి ‘రాజ్-కోటి’ పేరుతో సంగీత దర్శకులుగా ప్రస్థానం ప్రారంభించినప్పుడు వారి తొలి చిత్రం ‘ప్రళయ గర్జన’ నుంచి ‘హలో బ్రదర్’ సినిమాదాకా గిటారిస్టుగా పనిచేసాను. ‘పుట్టింటి పట్టుచీర’, ‘నాగాస్త్రం’ సినిమాల తమిళ డబ్బింగ్ రికార్డింగు నేనే చేసాను. మా తల్లిగారికి పల్లెటూరు నివాసమంటే ఇష్టం. అందుకే మారంపల్లి గ్రామంలో ఆమెవద్ద ప్రశాంత జీవనం గడిపేందుకు మొగ్గుచూపేవాడిని. సంవత్సరంలో యెక్కువ కాలం అక్కడే వుంటాను. ఇప్పుడు అడపాదడపా విద్యార్థులకు గిటార్ పాఠాలు నేర్పుతున్నాను.”

తండ్రితో సోమరాజు అనుభవాలు :

రాజ్-కోటి సంగీత ద్వయంలో ‘రాజ్’ గా కీర్తింపబడే వెంకట సోమరాజు సంగీత దర్శకుడిగా అద్వితీయుడు. ఆయన అనుభవాలు రాజ్ మాటల్లోనే:
నాన్నగారి ఆశయాలకు భిన్నంగా నేను బికాం చేసాను. సంగీతం మీద అభిమానంతో సాలూరు హనుమంతరావు, రాజేశ్వరరావుల వద్ద శిష్యరికం చేసాను. రాజేశ్వరరాకు నేను ప్రియశిష్యునిగా ఎదిగాను. హిందీ సంగీత దర్శకుడు సి రామచంద్ర సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం నాన్నకు తెలుసు. ఒకసారి నా పుట్టినరోజుకు సి రామచంద్రను మా ఇంటికి తీసుకొచ్చి నన్ను సర్ప్రైస్ చేసారు నాన్న. రామచంద్రతో కలిసి ఆరోజు ఓడియన్ థియేటర్లో జేమ్స్ బాండ్ సినిమా కూడా చూసాం. ఆ సంఘటన నాకు మరువలేని జ్ఞాపకంగా మిగిలింది. నాన్నగారి ప్రభావం నామీద ఎంతైనా వుంది. ఆయన యెటువంటి పాటకైనా సంప్రదాయబద్ధంగా స్వరాలు కూర్చేవారు. ముఖ్యంగా జావళీలు స్వరపరచడంలో నాన్నకు నాన్నే సాటి అని ఘంటాపదంగా చెప్పగలను. ‘జయసింహ’లో “నడిరేయి గడిచేనే”, ‘పాండురంగ మహాత్మ్యం’లో “కనవేర ముని రాజమౌళీ”, ‘రాజనందిని’లో “నీమీద మనసాయెరా”, ‘మంగమ్మ శపథం’లో “అందాల నారాజ అలుకేలరా” జావళీలు మచ్చుకు కొన్ని మాత్రమే. నాన్న మొదట్లో ఆదినారాయణరావు వద్ద ‘పల్లెటూరి పిల్ల’ సినిమా నుంచి సహాయకునిగా పనిచేసారు. పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా యెదిగాక సంగీత దర్శకుడు సత్యం నాన్న వద్ద పనిచేసారు. నాటి తమిళ సూపర్ స్టార్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాయ భాగవతార్ ‘శ్యామల’(తెలుగులో టింగ్ రంగా) తమిళ సినిమాలో “రాజన్ మహారాజన్” పాటను, “జయకృష్ణ ముకుందా మురారి”(హరిదాసులో) నాన్న స్వరపరచిన బాణీలోనే పాడారు. అదొక గొప్ప ప్రశంస. నాన్నస్నేహశీలి. మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. సాలూరు రాజేశ్వరరావు, మాస్టర్ వేణులతో యెంతో సన్నిహితంగా వుండేవారు. అందుకే కోటితో కలిసి ‘రాజ్-కోటి’ పేరుతో కొన్ని వందల సినిమాలకు నేను పనిచేయగలిగాను. మాస్టర్ వేణుగారి అబ్బాయి పియానో స్పెషలిస్ట్ మూర్తిచందర్ కూడా నాకు మంచి మిత్రుడు.

-ఆచారం షణ్ముఖాచారి

1 thought on “సుస్వరాల ‘ఠీవి’రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap