లక్ష రూపాయల బహుమతులతో పోటీల కరపత్రం ఆవిష్కరణ
భాష ఒక జాతి జీవం అని నమ్ముతూ తెలుగు భాష దీప్తిని, తెలుగు కార్టూన్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు అంతర్జాతీయ కార్టూన్ల (వ్యంగ్యచిత్ర) పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వపు అధ్యక్షులు, ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా॥ ప్రసాద్ తోటకూర తెలియజేశారు. మంగళవారం ఉదయం విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ- తానా తొలిసారిగా అంతర్జాతీయ తెలుగు కార్టూన్ (వ్యంగ్యచిత్రాలు) పోటీలు-2023 నిర్వహస్తున్నట్లు తెలియజేశారు. ఈ పోటీలో ప్రపంచంలో ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా తెలుగు కార్టూనిస్టులు పాల్గొనవచ్చన్నారు. వ్యక్తులను, రాజకీయ పార్టీలను, మతాలను కించపరిచేలా కార్టూన్లు కాకుండా, వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తూ తెలుగు భాష, సంస్కృతుల గొప్పతనాన్ని సమాజానికి తెలియపరిచే విధంగా కార్టూన్లు పంపాలన్నారు.
కార్టూన్ పోటీ కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్ మాట్లాడుతూ లక్ష రూపాయల నగదు బహుమతులతో కార్టూన్ పోటీ నిర్వహించడం ఇదే తొలిసారని, కార్టూనిస్టులు ఈ అవకాశాన్ని మంచి కార్టూన్లు గీసి ఉపయోగించుకోవాలన్నారు. పొటీకి వచ్చిన కార్టూన్లలో బావున్న వాటితో ఒక ఈ-బుక్ తెస్తున్నామన్నారు.
బహుమతులు: పోటీకి వచ్చిన కార్టూన్ల నుండి 12 ‘అత్యుత్తమ’ కార్టూన్లుగా ఎంపిక చేసి, ఒక్కక్క కార్టూనుకు రూ.5,000/-లు, మరో 13 ‘ఉ త్తమ’ కార్టూన్లకు ఒక్కొక్క దానికి రూ.3.000/-ల చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
నిబంధనలు: కార్టూన్లు కలర్ లేదా బ్లాక్ & వైట్లో పంపవచ్చు. ఒక్కొక్కరూ మూడు కార్టూన్ల వరకూ పంపవచ్చు. 300 డిపిఐ రిజల్యూషన్ జె పెగ్ (JPG) పార్మాట్లో tanacartooncontest23@gmail.com ఈమెయిల్ కు 2022 డిసెంబరు 26వ తేదీలోగా పంపాలన్నారు. ఫలితాలను 2023 జనవరి 15 సంక్రాంతి రోజున ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్, కలిమిశ్రీ, జాకీర్లు పాల్గొన్నారు. ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాలకోసం 98852 89995, 9154555675 నెంబర్లలో సంప్రదించవచ్చు.
Very nice 👍