సంకల్పం గొప్పదైతే అది సానుకూలమవడానికి మానవ ప్రయత్సానికి దైవమూ సహకరిస్తుందని చరిత్ర చెప్పిన విషయం. ఓ మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఆ మనిషి పెరిగిన వాతావరణం, కుటుంబ మూలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విద్యావంతులైన తల్లితండ్రుల పరిరక్షణలో, బాబాయి పిన్నిల సంరక్షణలో పెరిగి ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా, అత్యున్నత పదవినలంకరించినా, తాను పుట్టిన మూలాలను మరిచి పోకుండా పుట్టిన ఊరికి, తానున్న అమెరికాలోని భారతీయులకు తన సేవలందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలందుకుంటున్నారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి.
కృష్ణాజిల్లా పెదఅవుట్ పల్లిలో లావు సాంబశివరావు, శివరాణి దంపతులకు జన్మించిన లావు అంజయ్య చౌదరి తండ్రి ఉద్యోగ నిమిత్తం బాబాయి, పిన్ని లావు రంగారావు, కోటేశ్వరమ్మల దగ్గర చిన్నతనంలో పెరిగారు.
ప్రాధమిక విద్యాభ్యాసం గన్నవరం సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ గౌతమి రెసిడెన్షియల్ కాలేజీ లోనూ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ బళ్ళారిలోని విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ, ఎమ్.టెక్. గుల్బర్గాలోనూ పూర్తి చేశారు. తరువాత వివాహం, అమెరికా పయనం, ఉద్యోగం, పిల్లలు వగైరా బాధ్యతలతో సతమతమౌతున్నప్పటికీ తనలోని సేవాదృక్పధం నిలకడగా వుండనీయ లేదు. దాని పర్యవసానమే అంచెలంచెలుగా ఎదిగిన అంజయ్య చౌదరికి లభించిన తానా అద్యక్ష పదవి.
ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ముందుగా ఉన్నతమైన మనసుండాలి. సమాజ హితం కోరుకునే మంచి మనసుతో పాటుగా, కష్టంలో వున్న పదిమందికి ఏ ప్రతి ఫలం ఆశించకుండా సాయపడే గుణముండాలి. పదవులను, పేరుని, ప్రతిష్టను ఆశించకుండా తనకు చేతనైన రీతిలో పదిమందినీ కలుపుకుంటూ ఆపదలోనున్న వారిని ఆదుకుంటూ తన మంచి మనసును చాటుకున్నారు. పరాయి దేశంలో ఇబ్బందులు పడేవారి కోసం, అనుకోకుండా ప్రమాదాలకు గురైన వారిని వారి స్వస్థలాలకు చేర్చడంలో చాలా కృషిచేశారు.
ప్రతి ఒక్కరికి ఆహారం, విద్య, వైద్య సదుపాయాలు అందించాలన్న సదుద్దేశ్యంతో పలు సంస్థలతో కలిసి తన సేవలను విస్తృత పరిచారు. దశాబ్దం పైగా తన సేవలతో తానా సంస్థలో తానా టీమ్ స్క్వేర్ డైరెక్టర్ గా అందించిన సేవలకు కొనసాగింపుగా మరెన్నో పదవులు ఆయన్ని వరించాయి. ఈనాడు తానా అధ్యక్షుడిగా ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఏకైక తానా అధ్యక్షుడు, మన తెలుగువాడు, కృష్ణాజిల్లా బిడ్డడు లావు అంజయ్య చౌదరి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఖరీదైన కాన్సర్ మహమ్మారి బారి నుండి సామాన్యులను ఆదుకోవడానికి, కాన్సర్ అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలను తానా సంస్థ అమెరికాలోనూ, భారతదేశంలోనూ ఎంతో విజయవంతంగా చేయగలిగింది. ఆ విజయంలో అంజయ్యచౌదరి కీలక పాత్ర పోషించారు. అన్ని రకాలుగా తన సొంత ఊరిని అభివృద్ధి చేయడంతో పాటు, పిల్లలకు, వికలాంగులకు, వృద్ధులకు అవసరాలకు సాయపడడంతో పాటుగా మరెన్నో ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా నిర్వహిస్తూనే వున్నారు.
ఉన్నత శిఖరం చేరుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. సమాజసేవకు కుటుంబం కూడా సహకరించాలి. వీరి విజయం వెనుక కాకుండా వీరి విజయంలో జత కలిసిన సతీమణి నటాషా గొట్టిపాటి. కన్న తలిదండ్రులనే పట్టించుకోకుండా అనాధలుగా వదిలివేస్తున్న ఎందరో ప్రవాసులు, స్వదేశీయులకు కనువిప్పుగా లావు అంజయ్య చౌదరిగారు తను పుట్టిన ఊరికి చేస్తున్న సేవలు చెంపపెట్టు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సమాజ హితానికి పనిచేస్తున్న లావు అంజయ్య చౌదరిని అత్యున్నత తానా అధ్యక్ష పదవి వరించడం ప్రాంతాలకతీతంగా ప్రపంచ తెలుగు వారికందరికి గర్వకారణం. ప్రపంచ చరిత్రలో తానా అధ్యక్షుడిగా తనదంటూ ప్రత్యేక ముద్ర వేయాలని, ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని హృదయపూర్వకంగా 64కళలు పత్రిక కోరుకుంటోంది.
-కళాసాగర్