జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం

సెప్టెంబర్ 5 – జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలతో…

“ఉపాధ్యాయులు ఒక జాతిని నిర్మిస్తారు” అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక విశాలమైన ప్రదేశంలో నివశించే విభిన్న వర్గాల ప్రజల సమూహాన్నే ఒక జాతి అంటారు.అంటే ఉపాధ్యాయులు భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు విద్యార్థులలో సోదరభావం, ఐక్యత, జాతీయ సమగ్రత వంటి అంశాలు నేర్పితేనే ఒక జాతి పటిష్టంగా ఉంటుంది. విచాకర విషయం ఏమిటంటే కులాన్ని కూడా కొందరు ఒక జాతిగా పరిగణించడం.

సమాజంలో ఎన్ని వర్గాలయితే ఉంటాయో, పాఠశాలలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల విద్యార్థులు వుంటారు. అందుకే పాఠశాలని ఒక సమాజం అనవచ్చు.

ఒకప్పుడు ఉపాధ్యాయుడిని బతకలేక బడి పంతులనేవారు.ఆరోజుల్లో వారికి జీతాలు తక్కువగా ఉండేవి. ఉపాధ్యాయుల కొచ్చే జీతాల కంటే వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. ఉపాధ్యాయుడు గ్రామానికి కేంద్రంగా ఉండేవాడు. స్థానికంగా నివశించేవాడు.పంచాంగం తానే చూసేవాడు. వైద్యం తానే చేసేవాడు.

అనేక ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఈ రోజు ఉపాధ్యాయులకి జీతాలు పెరిగాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ఇప్పుడు ఉపాధ్యాయుడిని బతక నేర్చిన బడిపంతులని అంటున్నారు. పెరిగిన జీతంతో పాటు వారికి బాధ్యతలు కూడా పెరిగాయి. ఎన్నికల విధులు, జనాభా లెక్కలు వారికెప్పుడూ ఉంటాయి. ఇవి గాకుండా ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఉపాధ్యాయుల ద్వారా ఈ పథకాలు విజయవంతంగా అమలుచేయబడుతున్నాయి.

ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఉపాధ్యాయుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే విద్యార్థులలో అసలైన వికాసం జరుగుతుంది. నేటి విద్యార్థి రేపటి పౌరుడు అవుతాడు. ఏ వృత్తి వారైనా పాఠశాల నుంచి రావాల్సిందే. ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ పొందాల్సిందే. కరోనా కాలంలో ప్రత్యక్ష బోధనకు అవకాశం లేక విద్యార్థులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాము.

కార్పొరేట్ పాఠశాలలని మినహాయిస్తే చాలా ప్రయివేటు పాఠశాలల యజమానులు తాము ఉపాధి పొందుతూ, మరికొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. కరోనా ప్రయివేటు ఉపాధ్యాయులని కాటు వేసింది. వారికి ఉపాధి లేకుండా చేసింది. వారిని ఆదుకోవాల్సి ఉంది.

ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పటిష్ట పర్చాలి.దేశంలో విద్యాభివృద్ధికి పాలకులు ఏమి చేయాలో పలు కమిటీలు సూచనలు చేశాయి. ఒక బలమైన సమాజం ఉండాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. విద్యకు కేంద్రం పాఠశాలే కాబట్టి, పాలకులు విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులని బోధనకే పరిమితము చేయాలి. సరైన బోధనతోనే విద్యార్థులు పరిశోధన చేసే స్థాయికి చేరుకుంటారు.

పాఠ్య పుస్తకాలు విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంచే విధంగా ఉండాలి. అప్పుడే వారు పరిశోధనా రంగంవైపు ఆసక్తిని ప్రదర్శిస్తారు. సావిత్రి బాయి పూలే, జ్యోతిరావు పూలే, షేక్ ఫాతిమా బేగం, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల కృషితో దేశంలో విద్యా పునాదులు ఏర్పడ్డాయి. విద్య సమానత్వాన్ని నేర్పాలి. అందరికీ సమాన అవకాశాలని కల్పించాలి. ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది.మంచి ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తూనే, బద్దకించే ఉపాధ్యాయులని పాలకులు హెచ్చరిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ నియామకాలని చేపట్టాలి. ఉపాధ్యాయులని సముచితంగా గౌరవించాలి. పాలకులు వారిని గౌరవిస్తే, దేశాన్ని గౌరవించే బలమైన జాతి ఆవిర్భవిస్తుంది.
అప్పుడే సమాజం పటిష్టంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap