(ఆగస్ట్ 15 వ తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన…)
తూనీగల రెక్కల చప్పుళ్ళెప్పుడైనా విన్నారా? ఎనభయ్యో జనాల అవతలినుండి గాలి మోసుకొచ్చిన మువ్వల సంగీతం.
మీ గుండెల్ని తాకి ఎన్నాళ్ళయ్యి ంది? వెయ్యేళ్ళనాటి పురాస్మృతులు తట్టిలేపిన స్పర్శననుభవించారా ఎన్నడైనా?
ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావ్ నలభై ఏళ్ళ జీవితం ధారపోసిసేకరించిన జానపద, ఆదివాసీ కళాకృతులూ, సంగీతవాయిద్యాల ప్రదర్శన మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతోంది. ఒకసారటు వెళ్ళండి. మన తాతముత్తాతల జీవితాలతో కలిసి ప్రవహించిన ఆది ధ్వనులు వినవచ్చు. ఒకనాటి మట్టి మనిషి గాలినీ, నీటి గలగలలనీ ఒడిసి పట్టుకున్న తీరు చూడవచ్చు. మన శిష్టసంగీత, చిత్ర, శిల్పకళా సంప్రదాయాలమూలాలను వెదుకుతూ చరిత్రలోకి నడిచెళ్ళొచ్చు.
రెండేళ్ళక్రితం తెలంగాణా నలుమూలలనుండీ, కొండకోనల నుండీ జానపదకళాకారులని ఒక్కచోటుకి చేర్చి ‘మూలధ్వని’ పేరుతొ కనీవినీ ఎరుగని రీతిలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యక్రమం నిర్వహించారు తిరుమలరావ్ గారు. అంతకుముందునుండే జానపద, ఆదివాసీ వాయిద్యాలను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈసారి ‘ఆద్యకళ’ అన్న పేరుతో చేస్తున్న ఈ ప్రదర్శన మరింత విస్తృతమైనది. ‘ఆది అక్షరం’, ‘ఆది ధ్వని’, ‘ఆది చిత్రం’, ‘డోక్రా’ అన్న నాలుగు విభాగాల ఈ ప్రదర్శనలో రెండువేలకు పైబడి కళాకృతులున్నాయి. చెరియాల్, కళంకారీ చిత్రపటాలున్నాయి. కాలగర్భంలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్న తాళపత్రాలు లక్షకు పైగా ఉన్నాయి. తెలుగు లిపి ప్రాచీనతనీ, పరిణామం చెందిన తీరునీ నిరూపించే ఋజువులున్నాయి. హరప్పా నాగరికతకు కొనసాగింపుగా వచ్చిన లోహపు బొమ్మలూ, కొయ్యబొమ్మలూ ఉన్నాయి.
ఎందుకోగానీ తెలుగురాష్ట్రాలలో ఉన్నంత సాంస్కృతిక దారిద్ర్యం మరెక్కడా కనిపించదు. మన సాంస్కృతిక సంపదలో ఎందుకోగానీ సాహిత్యానికి తప్ప మరో కళకి చోటే లేదు.మనకి చిత్రకళగానీ సంగీతం గానీ వొట్టి వినోదాత్మక సాధనాలేతప్ప మేధోజనితాలు కావు. చిత్రకళనీ, శిల్పాన్నీ అర్ధం చేసుకోవటానికీ,అనుభవించటానికీ అవసరమైన ఈస్థటిక్స్ ని ఎందుకో మనం దగ్గరికి రానివ్వలేదు. జానపద కళలమీదా, విజ్ఞానం మీదా మనదింకా చిన్న చూపు.
ఆదివాసీ బొమ్మల్లో కనిపించే distortion ని మనం అవలక్షణంగానే చూస్తాము. ప్రాచీనుల విజ్ఞానం, సంప్రదాయం మనకు మూఢనమ్మకాలుగా, సంస్కరించి తీరవలసిన వెనుకబాటుతనంగా మాత్రమే కనిపిస్తాయి. యూరోపియన్ వలసవాదులు తెచ్చి పెట్టిన విలువలతో మనల్ని మనం తూకం వేసుకోవటం వల్ల సంక్రమించిన జాడ్యమిది.
నిజానికిది వలసవాదం వ్యాపించిన ప్రతిచోటా జరిగింది.ఆసియా,ఆఫ్రికా,అమెరికా, ఆస్త్రేలియాలలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మూలవాసులందర్నీ ఆటవికులుగానే పరిగణించించిన యూరోపియన్లకి సహజంగానే వారి సంస్కృతీ, జీవనం కుడా అనాగరికంగానే కనిపించాయి.అప్పుడప్పు డేజరిగిన scientific revolution వల్ల అబ్బిన కొత్త జ్ఞానం సత్యాన్ని చూడనివ్వలేదు. తామింకా గొర్రెలకాపర్లుగా ఉన్న కాలంలోనే పశ్చి మాసియా, భారత ఉపఖండం,చైనా, మధ్య అమెరికాలలో కళ్ళు చెదిరే నాగరికతలు వెలుగొందాయనీ, శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రగతి సాధించాయనీ గ్రహించలేకపోయారు.ఆయా ప్రాంతాలలో శతాబ్దాలతరబడి జరిగిన సాంస్కృతిక పరిణామాలనీ, వాటి వెనకున్న తాత్విక పునాదులనీ విస్మరించారు. మానవ శరీర నిర్మాణంపై అవగాహన లేకపోవటమే భారతీయ శిల్పంలో కనిపించే distortion కి కారణమని తమకి తోచిన భాష్యం చెప్పు కున్నా రు. Perspective లోపించించిందన్నారు. మూడో డైమెన్షన్ గానీ, డెప్త్ గానీ తెలియదు మీకన్నారు. ఆదిమ సమాజాలలో మనిషికీ ప్రకృతికీ మధ్య కనిపించే శక్తివంతమైన అనుబంధం nothging more than metaphysical nonsense అని కొట్టిపారేశారు.
త్వరలోనే చరిత్ర మారింది. ఆనాడు ప్రబలంగా ఉన్న రియలిజం విధించే పరిమితులని అధిగమించి కొత్త గొంతునీ, కొత్త కళా దృక్పధాన్నీ వెదుక్కునే క్రమంలో పంతొమ్మిదో శతాబ్దం చివరి దశాబ్దాలనాటికి యూరోపీయన్ కళాకారులు ఆసియా,ఆఫ్రికా సంస్కృతులవైపు చూడటం మొదలుబెట్టారు. సామ్రాజ్యవాదులు ఆటవికమన్నచోట కళాకారులు అద్భుతాలు కనుగొన్నారు. మోడర్న్ అర్ట్ ఉద్యమానికి పునాదులేసిన విన్సెంట్ వాంగో,సెజేన్, గాగిన్,పికాసో వంటివారు. తూర్పు దేశాలూ, ఆదిమ సంస్కృతులలోని రంగులూ, రూప వైవిధ్యం చూసి వెర్రెక్కిపోయారు. వాంగో జపనీస్ బొమ్మలని మక్కికి మక్కీ కాపీ చెయ్యటం మొదలుబెట్టాడు. పారిస్ లోని Ethnographic museum లో ఆఫ్రికన్ మాస్కులు చూసిన పికాసో దృక్పధమే సమూలంగా మారిపోయింది.అన్నాళ్ళూ తాను గీసింది బొమ్మలే కాదనుకున్నాడు.’ What art is all about ‘ అన్న సత్యం తెలుసుకున్నాడు. కళా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘క్యూ బిజం ‘ కనిపెట్టాడు.పికాసో మళ్ళీ పుట్టాడు.
మరోవైపు సంగీతం లోనూ ఇటువంటి పరిణామాలే జరిగాయి. ఉదాహరణకి, నల్లజాతి బానిసల ద్వారా అమెరికాలోకి ప్రవేశించిన ఆఫ్రికన్ సంగీతం కాలక్రమంలో నేటివ్ అమెరికన్ సంగీత రీతుల్నీ, ఇంగ్లీషు సాహిత్యాన్నీ ,యూరోపియన్
వాయిద్యా లనీ జతచేసుకొని పునరుజ్జీవం పొంది జాజ్ మ్యూజిక్ గా అవతరించింది.అమెరికాని జయించింది.
సంగీతం లో ఇటువంటి folk revivals ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నా యి, రాజ్యాన్నీ , సాంఘిక దుర్మార్గాలనీ ధిక్కరిస్తూ జరిగేప్రజా పోరాటాలలో ముఖ్యమైన భాగమౌతున్నాయి.
చెవులొగ్గి వింటే ఆద్యకళ ఇటువంటి కతలెన్నో చెబుతుంది. Bagpipe అంటే అదేదో స్కా ట్లాండ్ కే పరిమితమైన వాయిద్యమనుకుంటామా, కాదంటారు తిరుమలరావ్ గారు.మనదైన తిత్తివాయిద్యం చూపిస్తారు. తంత్రీవాయిద్యాల పరిణామక్రమం వివరిస్తూ అన్నిటికీ మూలమైన ‘విల్లు ఘట వీణ ‘ . చూపిస్తారు.మనమెప్పుడో హిస్టరీ పుస్తకాలలో చూసి మర్చిపోయిన హరప్పా బొమ్మలు అదిలాబాద్ అడవుల్లోకినడిచొచ్చిన వైనం వినిపిస్తారు. పికాసోని పుట్టించిన ఆఫ్రికన్ మాస్కు లకేమాత్రం తీసిపోని మనవైన కొయ్య మాస్కు ల కతలేంటో చెబుతారు.ముంజేతి కడియాలనీ,కాలి గజ్జెలనీ సంగీత వాయిద్యా లుగా మార్చు కున్న గిరిజనుల బతుకులెంత అందమైనవో చూడమంటారు.
చిత్రంలోనూ,శిల్పంలోనూ మానవ నేత్రం విధించే భౌతిక పరిమితుల్నధిగమించి తమకంటూ ఒకస్వంత శైలి ఏర్పరచుకోవటంలో ఉన్న అమాయకమైన ధిక్కారం చూడమంటారు.
అయితే మనమెందుకు తెలుసుకోవాలిదంతా? భవిష్యత్తు కదా ముఖ్యం,గతం తవ్వు కుంటూ కూర్చు ంటే ఒరిగేదేంటి?
శాస్త్రసాంకేతిక రంగాలలో ఎంతో గొప్ప ప్రగతి సాధించిన ఈ ఆధునిక యుగంలో విల్లంబులనీ, చెక్క బొమ్మల అందాలనీ కీర్తిస్తూ నెరవేర్చే ప్రయోజనమేముంది?
నిజానికి చరిత్ర ఒక నిరంతర ప్రవాహం.’ అంటరానివసంతం’ రచయిత కళ్యాణరావన్నట్టు గతమెప్పటికీ గతించిపోదు. జ్ఞాపకంగా మనలో సజీవంగా ఉంటుంది.మన కలలనీ, విలువలని తీర్చిదిద్దుతుంటుంది. మన
దిశనీ,గమ్యాన్నీ నిర్దేశిస్తూ ఉంటుంది. ఏ దిక్కు కెళ్ళాలో, ఎంత దూరం నడవాలో తెలియాలంటే, ఎక్కడినుండొచ్చామో తెలిసుండటం తప్పనిసరి.అయితే గతాన్ని స్మరించుకోవాలంటే భవిష్యత్తునీ,అభ్యు దయాన్నీ ఫణంగా పెట్టవలసిన అవసరం లేదు.ఒకనాటి మనిషి ఎంత అందంగా బతికాడో తెలుసుకోవాలంటే లోతులేని మన బతుకుల్ని ఈసడించుకోవాలన్న నియమమేమీ లేదు. వెనక్కి చూడాలంటే ముందున్న దారులు మూసెయ్యాలన్న నిర్బంధమేమీ లేదు.
వేలాదిసంవత్సరాలుగా ప్రవహించిన దేశీయకళల పరంపర మన కళ్ళముందే ఆగిపోతోంది.చివరి జానపద సంగీతకారులొక్కొక్కరే మాయమైపోతున్నారు. అక్కడక్కడా మిగిలున్న కళాకృతులొక్కటొక్కటే కాలగర్భంలో
కలిసిపోతున్నాయి. మనకోసం, మన బిడ్డల కోసమైనా కాపాడుకోవాలి. ఎవరు చూడొచ్చారు,రాబోయే రోజుల్లో ఏమైనా అద్భుతం జరగవచ్చు. అంపశయ్యమీదున్న మన సాంస్కృతిక స్పృహకిజీవం రావొచ్చు. కొంచెం ఆత్మా భిమానం, కొంచెం వెన్నెముకా కలిసొచ్చి మనమూ నిటారుగా నిలబడొచ్చు. మన బతుకులే సినిమాలకి కథలవ్వొచ్చు. ఆరోజున జానపదసంగీతమే సినిమాల్లాంటి మెయిన్ స్ట్రీం మాధ్యమాలకిదిక్కై జనానికి చేరువ కావొచ్చు. మనలోనుండి ఒక పికాసో పుట్టవచ్చు. అట్లా జరిగిననాడు వెదుక్కో వటానికి మనవైన మూలాలేమైనా మిగిలుండాలి. ఆరోజుకోసం, ఒక కల కోసం నలభై ఏళ్ళ జీవితం ధారపోసినందుకు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావుకు వెయ్యి దండాలు.
-మోసే డయాన్
వ్యాస రచయిత పరిచయం లేదు కాని చాలాబాగా వ్రాశారు.
జయధీర్ తిరుమలరావుగారి తొవ్వముచ్చట్లు రెండు భాగాలూ చదివాను. ఆయనో విలక్షణ మైన మనిషి. ఆయన కన్నుకున్న సుాక్ష్మదృష్టి భూతకాలంలోకి శరవేగంగా చొచ్చుకుని వెళ్ళి గత వైభవాన్ని కళ్ళముందుంచుతాయి.
ఆయన జ్ఞాపకాలే పంచారనుకున్నా. కాని వస్తు సేకరణకూడా చేశారని తెలియదు. తెలిస్తే హనుమకొండలో వారిని ఎప్పుడో క లిసి , అవన్నీ చూసి ఉండేవాణ్ణి.
నామట్టుకు ఈ మేగజైన్ లో వచ్చిన విలువైన వ్యాసాలలో ఇదొకటి.
రచయితకూ, ప్రచురణ కర్తలకూ శుభాభినందనలు
నేను భద్రాచలం ITDA లో పని చేసిన రోజుల్లో ప్రొఫసర్ జయధీర్ తిరుమల రావ్ గారు కోయ లిపి సంస్కృతి గురించి చేసిన ఒక వర్క్ షాప్ ని నేను చూసాను .అంతరించిపోతున్న మన ఆదిమ కళలను వెలికి తీయడానికి ఆయన చేస్తున్న కృషి నిజంగా ఎంతో గొప్పది .వారి కృషిని గురించి ఆదిమ కళ ల ప్రాశస్త్యం గురించి ఈ వ్యాస రచయిత అంతే గొప్పగా రాసారు రచయితకు ప్రొఫసర్ జయధీర్ తిరుమల రావు గారికి అభినందనలు