“తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ” మరియు “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” సంయుక్తంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల “తెలంగాణ యువ నాటకోత్సవం-6” 21వ తేది సాయంత్రం రవీంద్రభారతిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ గారు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, సినీ దర్శకులు దశరథ్ గారు, కేవీఆర్ మహేంద్ర గారు, డా. ఖాజా పాషాగారు, నాటకరంగ ప్రముఖులు బి.ఎం. రెడ్డి గారు, డా. వెంకట్ గోవాడ గారు, శ్రీధర్ బీచరాజు గారు, తెర అధ్యక్షకార్యదర్శులు సిహెచ్. నటరాజ్ గారు, డా. మల్లేష్ బలాస్ట్ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో నాటకోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా…
దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… ప్రాచీన కాలం నుండి నాటకానికి గొప్ప గౌరవం ఉందని, ఆనాటి నుండి నేటివరకు నాటక కళ సజీవంగా కొనసాగుతూ వస్తుందని అన్నారు. నాటకం ప్రజల్లో తన ప్రభావాన్ని ప్రాభవాన్ని చూపిస్తూ, ప్రాధాన్యతను సంతరించుకుంటోందని పేర్కొన్నారు. నాటకానికి కావలసిన మంచి సాహిత్యం, నవలలు, కథలు తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణ ఉద్యమకాలంలో మాభూమి నాటకం ప్రజల్లో చొచ్చుకోపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో, సంచాలకులు హరికృష్ణ గారి ప్రోత్సాహంలో భాషా సాంస్కృతిక శాఖ తరపున అనేక కథలు నాటకాలుగా మలిచి ప్రదర్శించబడుతున్నాయని పేర్కొన్నారు. నాటకకళ వ్యాపారానికి అతీతంగా ఉంటూ వాస్తవికత ద్వారా ప్రజలకు మరింత చేరువౌతుందని, యువ నాటకకర్తలు నిరంతరం సామాజిక సంఘటల ఆధారంగా మానవ విలువలు పెంపొందించేలా నాటకాలు వేయాలని, అందుకు భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం అండగా ఉంటుందని అన్నారు.
మామిడి హరికృష్ణగారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటినుండి తెలంగాణ నాటకరంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందని, స్వరాష్ట్రంలో గత ఏడేళ్ళుగా జరుగుతున్న నాటక కార్యక్రమాల్లో ఏదోఒక రూపంలో ప్రభుత్వం సహకారం అందించబడుతూనే ఉందన్నారు. గత ఏడేళ్ళకాలంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుండి 173 కొత్త నాటికలు/నాటకాలు ప్రదర్శించబడ్డాయని, శాఖ తరపున అనేక నాటక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ, ఆయా శిక్షణ శిబిరాల ద్వారా అనేకమంది కొత్తవారికి నాటకాన్ని పరిచయం చేస్తూ వారికి నటన, రచన, సాంకేతిక సహకారం మొదలైన అంశాలలో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా భాషా సాంస్కృతిక శాఖ తరపున తెలంగాణ నాటకరంగంలో టెక్నిక్ పరంగా, రచనల పరంగా, ప్రదర్శనల పరంగా న్యూ వేవ్ థియేటర్ ను తీసుకొచ్చామని, ఐదు సీజన్ల యువ నాటకోత్సవంలో యువ నాటక కళాకారులచే 55 కొత్త నాటికలను ప్రదర్శించి, సీజన్-6లో భాగంగా 21, 22, 23, 24 తేదీలలో నాలుగు రోజులపాటూ మరో 10 నాటికలను మీ ముందుకు తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శlను, నాటకోత్సవాలను నిర్వహిస్తూ తెలంగాణ నాటకరంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో భాషా సాంస్కృతిక శాఖ కృషిచేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం, తెలంగాణ రంగస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ నటులు, దర్శకులు మోహన్ సేనాపతి గారికి అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. విచ్చేసిన అతిథులు… తెలంగాణ రంగస్థల సమాఖ్య కార్యవర్గానికి, ప్రదర్శనల బృందాలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం… హైదరాబాద్ కర్టెన్ కాల్ థియేటర్ వారి “పెట్రోమాస్ పంచాయితీ” (హిందీ కథ: ఫనీశ్వర్ నాథ్ రేణు, నాటకీకరణ: డా వెంకట్ గోవాడ, దర్శకత్వం: సురభి సంతోష్), ఆర్ట్ ఫామ్ క్రియేషన్స్ వారి “మీకోసం నేను” (రచన: పి.టి. మాధవ్, దర్శకత్వం: వై.వి.ఎస్. మూర్తి) నాటికల ప్రదర్శన జరిగింది.