
చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ లాంటి చారిత్రక సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన వీరనారీల పోరాట స్పూర్తి, తెలంగాణ వ్యవసాయ వారసత్వ సంపదకు ప్రతీకగా, సాధారణ సాంప్రదాయ మహిళామూర్తిని పోలినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఇరవై అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు కలిగిన కాంస్య విగ్రహాన్ని డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో, గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా సహచర మంత్రివర్గం సమక్షంలో, సకల జనుల సాక్షిగా 9 డిసెంబర్ 2024 నాడు ఆవిష్కరించబడింది.
తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల అస్థిత్వం. తెలంగాణ తల్లి విగ్రహం, యావత్ తెలంగాణ ప్రజల మాతృమూర్తి, తెలంగాణ చరిత్ర అరుదైన పోరాటాల చరిత్ర, దశాబ్దాల పోరు తెలంగాణ, తొలి మలిదశ ఉద్యమాలలో వేలాది అమరుల త్యాగాలతో, సోనియమ్మ ఆశీర్వచనాలతో సాధించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవన విద్యార్ధులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సకల బహుజనులు సాధించిన విజయం.
తెలంగాణ రాష్ట్రం విశిష్ట సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక, బోనాలు, బతుకమ్మ, సమక్క సారాలమ్మ, సదర్ పండుగలతో, అబ్బురపరిచే శిల్ప సంపద. చేతివృత్తులు, చేనేత ప్రతిభలతో విరజిమ్ముతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నూతన తెలంగాణ తల్లి సాంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకుట్టుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్పూర్తిని వ్యక్తపరుస్తుంది.
విగ్రహ పీఠభాగం వందలాది పిడికిళ్లు ఉద్యమానికి చిహ్నంగా మరియు సాధించిన తెలంగాణ ప్రజల చేతులమీదుగా తెలంగాణ మాతృమూర్తిని అవిష్కరించుకొని అందలానికి ఎత్తినట్టుగా రూపొందించడం జరిగింది.

నాటి తెలంగాణ తల్లి ఆనాటి ఉద్యమ అవసరాల రీత్యా ఏర్పర్చుకున్న ఆకృతి. ఒక రాజమాతగా, దేవతామూర్తిగా, రాచరికపు హావభావాలతో, వాస్తవ ప్రజానీకం సంస్కృతికి భిన్నంగా, ధనిక స్త్రీగా చిత్రీకరించడం జరిగింది. నూతన తెలంగాణ తల్లి ఒక సాధారణ మహిళగా, సకలజనుల మాతృమూర్తి రూపాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిన ఈ విగ్రహం రాష్ట్ర సాంస్కృతిక సారాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ, ప్రతియేటా సంబరాల చేసుకోవడం ఈ విగ్రహ రూపకల్పన లక్ష్యమని ప్రభుత్వం ఉద్ఘాటించింది.
తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర ధరించి, తెలంగాణ శ్రేయస్సుకు ప్రతీకగా మరియు వ్యవసాయ సమృద్ధిని సూచిస్తుంది. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర, మెడలో కంటీ, కాళ్లకు కడాలు, రాష్ట్ర వ్యవసాయ మూలాలు, సారవంతమైన భూములను సూచిస్తూ చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. ఆమె మరో చేత్తో భావితరాలకు అభయ ముద్ర చూపిస్తూ. రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి నట్టుగా ఉంది. ఆమె చీర నడుము దగ్గర బిగించి ఉంది, ఇది పని చేయడానికి లేదా పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఒక స్త్రీలా మహిళల చారిత్రక భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. సాంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడిన తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ప్రొఫెసర్ గంగాధర్ రూపకల్పన చేయగా, శిల్పి రమణా రెడ్డి కాంశ్య విగ్రహంగా మలిచారు. పూర్వ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా ప్రొఫెసర్ గంగాధర్, ఎం.వీ. రమణారెడ్డిగార్లే సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్మారక ‘అమరజ్యోతి’ రూపకర్త మరియు రాజీవ్ గాంధీ విగ్రహ రూపశిల్పి కూడా వీరే.
ఎం.వి. రమణా రెడ్డి
(పునాస పత్రిక సౌజన్యంతో…)