
ఈ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం తెలుగు భాషకు మరుపురాని రోజుగా మిగిలిపోయేలా భాషాపరమైన అంశాలకు ప్రభుత్వం నుండి ఆశావహమైన స్పందన ఉంటుందని తెలుగు భాషాభిమానులు ఎదురు చూస్తున్నారు. జీవోలన్నీ తెలుగులో ఉండాలని ఉత్తర్వులిచ్చి ‘తెలుగులో పాలన’కు తొలి అడుగు వేసినందుకు ప్రపంచ తెలుగు రచయితల సంఘం హర్షం ప్రకటిస్తోంది.
నెల్లూరు తెలుగు పీఠానికి స్వతంత్ర ప్రతిపత్తి:
2004 నుండీ ఐదేళ్ళపాటు తెలుగు భాషోద్యమం చేసిన పోరాటం ఫలితంగా 2008లో తెలుగు భాషకు ప్రాచీనతా ప్రతిపత్తి లభించింది. 2011లో మైసూరు భారతీయ భాషా కేంద్రంలో ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం ఏర్పరచారు. రాష్ట్ర విభజన తరువాత నాటి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడుగారి పూనికతో 2020లో ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కానీ, ఇది మైసూరు భారతీయ భాషా కేంద్రం (CIIL) ఆధిపత్యంలో ఉంది. ఆ సంస్థ తన పూర్తి సమయాన్ని దీనికి కేటాయించలేక పోవటం వలన తెలుగు భాషకు ప్రాచీనతా హోదా సాధించుకున్న ప్రయోజనాలు నెరవేరలేక పోతున్నాయి. మనతో పాటే ఏర్పడిన ‘కన్నడ శాస్త్రీయ అత్యున్నత అధ్యయన కేంద్రం’ పరిస్థితి కూడా ఇదే! అయితే, కన్నడ సాహితీ వేత్తల అభ్యర్థన మేరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపటంతో ఈ కన్నడ కేంద్రాన్ని భారతీయ భాషా కేంద్రం పరిధి నుండి తప్పించి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వటానికి, దాన్ని మైసూరు నుండి బెంగుళూరుకు తరలించటానికి అంగీకరిస్తూ కేంద్ర విద్యామంత్రి ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‘ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని సాధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.
తెలుగు ప్రాథికార సంస్థ ఏర్పాటు:
2016లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధి కోసం నియమించిన అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా జీవో యం.యస్ నెం. 40 ద్వారా ఏర్పరచిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు జీవం పోయాల్సిన సమయం ఇది. శిక్షించే అధికారాలతో పాటు అధికార భాషగా తెలుగు అమలు, విద్యారంగంలో తెలుగు భాషాభివృద్ధి, ‘ఇ- తెలుగు’, అనువాదాలు మరియు ప్రచురణలు, ప్రపంచభాషగా తెలుగు అభివృద్ధి లాంటి బాధ్యతల్ని అప్పగించారు. ఈ సంస్థ పటిష్ట నిర్మాణాన్ని అభ్యర్థిస్తున్నాం.
అకాడెమీలకు అర్హుల ఎంపిక:
సమగ్రమైన లక్ష్యాలతో, విధులతో, నిధులతో, నిష్ణాతులతో వివిధ అకాడెమీలను నిర్మాణ ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయటానికి అకాడెమీలు ఎంతగానో తోడ్పడతాయి.
తెలుగు అకాడెమీకి పూర్వవైభవం :
ఆరు దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన తెలుగు అకాడెమీని ‘తెలుగు-సంస్కృత అకాడెమి’గా పేరు మార్చటం వలన దాని ఔన్నత్యం దెబ్బతింది! ఈ తప్పిదాన్ని సరిచేసి, దాని లక్ష్యం నెరవేరేలా పరిపుష్టి కలిగిస్తారని ఆశపడ్తున్నాము.
తెలుగు విశ్వవిద్యాలయాన్ని బతికించండి:
విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. మన రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం పరిస్థితి విశ్వామిత్ర సృష్టి అయ్యింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పునఃస్థాపన గురించి ప్రకటన కోసం అందరం ఎదురు చూస్తున్నాం.
సాంస్కృతిక విశ్వవిద్యాలయ స్థాపన:
2024 విజయవాడ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో కోరిన విధంగా కళల పరిక్షణ, పరిశోధన, పరివ్యాప్తి కొరకు రేపటి తరాలకు సాంస్కృతిక వారసత్వం అందించేలా ‘సాంస్కృతిక విశ్వవిద్యాలయం’ ఏర్పాటు ప్రకటనను కోర్తున్నాము.
మన పరిశోధనా సంస్థలు:
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు తరలి రాకుండా నిలిచిపోయిన స్టేట్ లైబ్రరీ, స్టేట్ ఆర్కియాలజీ, స్టేట్ మ్యూజియం, స్టేట్ ఆర్కీవ్స్ లాంటి పరిశోధనా సంస్థలను, వాటి ద్వారా మనకు సంబంధించిన అమూల్య చారిత్రక సంపదను రాష్ట్రానికి తరలించేందుకు విధాన నిర్ణయ ప్రకటన రాగలదని ఆశిస్తున్నాం.
విద్యారంగంలో మార్పులు:
కులమతాలకు అతీతంగా తెలుగు పిల్లలందరికీ ప్రాధమిక విద్యవరకూ తెలుగు మాధ్యమంలో బోధన చేయడి, ఆ పై తరగతులలో చాలినంత తెలుగు నేర్పమనేదే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో పెద్దలు చేసిన విఙ్ఞప్తి, ఇంటర్మీడియట్ కోర్సులలో పూర్తిగా తెలుగును కోనసాగించమని అభ్యర్థిస్తున్నాం.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం తెలుగుని ప్రపంచ తెలుగుగా తీర్చిదిద్దేందుకు మనల్ని కంకణధారుల్ని చేసే ఒక అవకాశం. ప్రభుత్వం ఈ సందర్భాన్ని భాషాపరమైన నిర్ణయాల ప్రకటనకు సద్వినియోగపరచగలదని భావిస్తున్నాము.
డా. జి వి పూర్ణచందు
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధానకార్యదర్శి, 9440172642