వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన

కార్టూన్ కొన్ని కళల సమాహారం. ఒక చిన్న కార్టూన్ వేసి నవ్వించడానికి ఒక కార్టూనిస్టు కి చిత్రకళలో ప్రవేశం, భాష మీద పట్టు, మన సంస్కృతి, చరిత్ర, సమకాలెన జీవన సమస్యల మీద అవగాహన వీటితోపాటు సామాజిక స్పృహ కూడా ఉండాలి. ఇలాంటి భావుకత కలిగిన వంద మంది కార్టూనిస్టుల ఆలోచనల నుండి పుట్టిన చిత్రాల సమాహారంతో ‘తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ‘ విజయవాడ లో నిర్వహిస్తున్న తొలి ప్రదర్శన నేడు(18-08-2019) జరుగనుంది.
ఈ ప్రదర్శనలో తొలి తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి, బాపు, జయదేవ్, బాలి, రాగతి పండరి, చంద్ర, బాబు లాంటి సీనియర్ కార్టూనిస్టు లే కాకుండా నేటి వర్ధమాన కార్టూనిస్టులు నాగిశెట్టి ధీరజ సంతోష్ కౌటం, హరికృష్ణ, రవి ప్రసాద్, కిరణ్ ల కార్టూన్లు ఇందులో ప్రదర్శిస్తున్నారు.
నేటి ఉదయం ప్రారంభమైన ఈ ప్రదర్శన సాయంత్రం వరకు జరుగుతుంది. తుర్లపాటి కుటుంబరావు గారి అధ్యక్షతన జరిగే ముగింపు సభలో డెక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్ ‘సుభాని ‘ గారికి ఆత్మీయ సత్కారం జరగనుంది. మల్లెతీగ పత్రిక – శ్రీమతి ఘంటా ఇందిర స్మారక కార్టూన్ పోటీ విజేతలకు బహుమతి ప్రధానం జరుగనుంది. రెండు రాష్ట్రాలనుండి సుమారు వంద మంది కార్టూనిస్టుల సభకు హాజరు కానున్నారు. ఈ సభలో కార్టూనిస్టుల సమస్యల గురించి, వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రముఖ సీనియర్ కార్టూనిస్టుల సలహాలు, సూచనలు ఉంటాయి.
కార్టూన్ ప్రేమికులు, హాస్య ప్రియులు విచ్చేసి ప్రదర్శనను విజయవంతం చేయాలని తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ కార్యదర్శులు కలిమి శ్రీ కళాసాగర్ లు ఆహ్వానం పలుకుతున్నారు.

వేదిక బుక్ ఫెస్టివల్ సొసైటీ కాన్ఫరెన్స్, హాల్ కోర్ట్ ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ.

SA: