హేట్సాఫ్ టు రమణారెడ్డి గారు…..!

“మే 20” తేదీన తెలుగు కార్టూన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం…

తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం రోజున మనం తలుసుకోవాల్సిన వారిలో మరో పెద్దాయన కూడా వున్నారు. వారే యం.వి.రమణారెడ్డి గారు. ఎవరీ రమణారెడ్డి..?, తెలుగు కార్టూనిస్టుల దినోత్సవానికి ఈయనకి సంబంధం ఏమిటి…? తెలుసుకోవాంటే … మనం పదేళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే … !

అది 2010 సంవత్సరం… ఒక రోజు ఓ పెద్దాయన దగ్గరనుండి ఫోనొచ్చింది.

హలో… కళాసాగర్ గారేనా.. నేను యం.వి.రమణారెడ్డి నండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అంటూ పరిచయం చేసుకున్నారు. మీ దగ్గర తలిశెట్టి రామారావు కార్టూన్లేమన్నా వున్నాయా? ప్రశ్న. ఏదెనిమిది కార్టూన్లున్నాయన్నాను. నా దగ్గర ఏభై కార్టూనులున్నాయి అన్నాడాయన. అప్పటికే తెలుగు కార్టూనిస్టుల గురించి ఒక పుస్తకం ప్రచురించిన నేనే పట్టుమని పది కార్టూన్లు కూడా సంపాదించలేక పోయాను, ఈయనెవరబ్బా? అని ఆనందపడ్డాను.

కట్ చేస్తే 2011 సంవత్సరానికి ఏభైని వంద చేసుకొని పుస్తకం ప్రచురించడానికి సన్నద్ధం అయిపోయాడు. పుస్తకప్రచురణ భాద్యతను శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారికి అప్పగించారు, ఆయన కార్టూన్లన్నీ ప్రింటింగ్లో బాగా రావాలని వాటిని కంపూటర్లో సరిదిద్దే పని నాకప్పగించారు. సాక్షి శంకర్ గారు ముచ్చటయిన తలిశెట్టి గారి కేరికేచర్ తో, కార్టూనిస్టులు సర్వశ్రీ జయదేవ్ బాబు, మోహన్, శ్రీధర్, బాలి, శ్రీరమణ, బ్నిం లాంటి వారి ఆప్తవాక్యాలతో అందంగా అచ్చయిన పుస్తకాన్ని, అంత కంటే అద్భుతంగా కార్టూనిస్టులు సర్వశ్రీ మోహన్, సురేంద్ర, శేఖర్, శంకర్, కళాసాగర్ సమక్షంలో ఏప్రియల్, 2011 విజయవాడలో “సాహితీ మిత్రులు” ఆధ్వర్యంలో తెలుగు కార్టూనిస్టుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించుకొన్నాం. తెలుగు కార్టూన్ రంగానికి పునాదులు వేసిన తలిశెట్టి రామారావు గారి జన్మదినమైన ‘మే 20’ తేదీను తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకొని తీరాలని ఆనాటి సభలో తీర్మానిచ్చుకున్నాం. ఆ పుస్తకం మార్కెట్లోకి వెళ్ళింది. అద్భుతమైన స్పందన. సాక్షాత్తు తలిశెట్టి గారి కుమారుడు డా. జయరాం గారే ఫోన్ చేసి, మేము చెయ్యలేని పని మీరు చేసారు రమణారెడ్డి గారూ… థాంక్స్ అంటూ వారింటికి ఆహ్వానించారు. అభిమానంతో. దీనితో 74 ఏళ్ల నవయువకుడికి ఉత్సాహం వచ్చేసింది. వెంటనే ఒరిస్సాలోని ఉమర్ కోట వెళ్ళి డా. జయరాం గారిని కలిసారు. రమణారెడ్డి గారికి ఆత్మీయ ఆతిధ్యమిచ్చి, “మా తండ్రి గారి గురి ఇంతటి శ్రమకోర్చిన మీ రుణం తీర్చుకోలేనిది” అంటూ, మరొక పుస్తకం తీసుకురావడానికి కార్టూన్లు, చిత్రాలు, ఫొటోలు ఇవ్వడమే కాకుండా కొంత ఆర్థిక సహాయం కూడా చేసారు.

ఆటుపిమ్మట  కాలంలో రమణారెడ్డి గారి గురించి అనేక పత్రికలలో, టీవీ ఛానళ్ళలో ఎన్నో కథనాలు వచ్చాయి. ఎందరో  కార్టూన్ ప్రేమికులు స్పందించారు. ఆ ఈ రెండవ పుస్తకం. తలిశెట్టి రామారావు గారు కార్టూనిస్టు మాత్రమే కాదు, చిత్రకళావిమర్శకుడు కూడా అని , ప్రచురించాం ఈ పుస్తకంలో.

ఆ పుస్తకంలో ప్రచురించిన కార్టూన్లు, చిత్రాలు భారతి, ఆనందవాణి, వాణి పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కార్టూన్లలో సినీతారలు, జంతువులు, పెళ్ళిళ్ళు, గవతులు, ఉద్యమాలు, సంగీతం ఇలా ఏ ఒక్కటిని విడిచి పెట్టలేదు. ‘ఆడవారి అలంకరణ గురించి వేసిన కార్టూన్ చూడండి, వారి అతి ముస్తాబుపై సునిశిత విమర్శకు పరాకాస్ఠ ఈ కార్టూన్. సినిమా ప్రారంభానికి ముందు అతిగా టైటిల్ను పొడిగిస్తే, ప్రేక్షకుడి పరిస్థితి ఎలా వుంటుందో ఎంత చక్కగా చూపించారో మరొక కార్టూన్లో, సంగీత ప్రదర్శన కార్టూన్ల్నో గాయకుని హావభావాలు చూస్తే నవ్వకుండా వుండలేము. అలానే ‘సౌందర్యమునకు హర్షించనివాడు పంది’ కార్టూన్లో మానవాకృతి పందిగా రూపాంతరం చెందే విధానాన్ని చూపించిన తీరు అద్భుతం. ఇది నేటి యానిమేషన్ స్టోరీబోర్డుకి ఏ మాత్రం తీసిపోని విధంగా వుందంటే అతిశయోక్తి కాదు. –

చిత్రకారుడుగా రామారావు గారు వందకు పైగా చిత్రాలు వేసినట్లు తెలుస్తుంది. ప్రియా సంగమం, కామిని కాముకులు, విరహిణి లాంటి చిత్రాలు సన్నటి గీతల్లో మనోహరంగా గీసారు. వారు రాసిన అనేక వ్యాసాలకు వారే స్వయంగా చిత్రాలు చిత్రించుకొనేవారు. కొన్ని కథలకు కూడా చిత్రాలు గీసారు.

చిత్రకళావిమర్శకునిగా అనేక పత్రికలలో వీరి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1945 ఆనందవాణి ఉగాది సంచికలో కాని, ఒక్క మనవి’ అంటూ తలిశెట్టి గారు రాసిన వ్యాసము ఇందులో ప్రచురించాము. ఈ వ్యాసములో కార్టూనిస్టు ఆలోచన ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలపై కార్టూన్లు వేయాలో వివరంగా సూచించారు. భారతీయ చిత్రకళ యొక్క ప్రాచీనత, వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ, అజంతాకళాలయములు పేరుతో భారతిలో చక్కటి వ్యాసాలు రాసారు.

ఇంతటి బహుముఖీయమైన ప్రతిభతో తెలుగు కార్టూన్ రంగానికి పునాదులు వేసిన తలిశెట్టి రామారావు గారి జన్మదినమైన ‘మే 20’ తేదీను తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకోవడం గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ వేదికగా జరుగుతుంది… ఈ యేడు కరోనా కారణంగా అటంకం కలిగింది.

ఇది మన రమణారెడ్డి గారి కథ, సో… తలిశెట్టి వారి వంద కార్టూన్లను సేకరించి ఒక పుస్తకంగా ప్రచురించి, తెలుగు కార్టూన్ దినోత్సవం … ఆవిర్భావానికి కారకులయిన రమణారెడ్డి గారికి హేట్సాఫ్ చెప్పాల్సిందే ….

-కళాసాగర్

4 thoughts on “హేట్సాఫ్ టు రమణారెడ్డి గారు…..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap