తెలుగు సినిమా స్థాయి పెరిగిందా ?

నలభై ఏళ్ళక్రితం ఒక భారీ సినిమాకు పాతిక లక్షలు బడ్జెట్ అంటే వామ్మో అనుకునేవారు. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని లాంటి టాప్ హీరోల సినిమా బడ్జెట్ కూడా పది, పదిహేను లక్షల లోపే. ఆ తరువాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి యువతరం ప్రవేశం చేసినపుడు సినిమా బడ్జెట్ అయిదు కోట్లు, పదికోట్లు తాకింది. అంత డబ్బు తిరిగి వస్తుందా లేదా అని నిర్మాతలు , పంపిణీదారులు టెన్షన్ అనుభవిస్తుండేవారు. ఇక ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ వచ్చిన తరువాత సినిమా బడ్జెట్ ముప్పై నుంచి నలభై కోట్లు దాటింది. అప్పటినుంచి తెలుగు సినిమారంగం నుంచి రెగ్యులర్ నిర్మాతలు మాయమై పోయారు. జగపతి, అన్నపూర్ణ, రామకృష్ణ, సురేష్ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక బానర్లు మూసివేయబడ్డాయి. సినిమా నిర్మాణాన్ని జూదంగా భావించే నిర్మాతలు ఎక్కువ కావడంతో చిన్న నిర్మాతలు వీధిన పడ్డారు. ఇక రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చెయ్యడం మొదలైంది. అప్పటినుంచి తెలుగు సినిమా బడ్జెట్ వందకోట్లు దాటేసింది. ఒకప్పుడు నలభై ప్రింట్లతో విడుదల అయ్యే తెలుగు సినిమా వెయ్యి, రెండువేల స్క్రీన్స్ సామర్ధ్యాన్ని అందుకుంది.

తాజాగా మూడువందల యాభై కోట్ల బడ్జెట్ తో సాహో అనే సినిమా విడుదల అయింది. సినిమా నిర్మాతలకు అరవై కోట్లవరకు నష్టాలు మిగిల్చింది అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాక సినిమా కూడా దర్శకత్వపరంగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇక రేపు రెండో తారీకు మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” సినిమా విడుదల అవుతున్నది. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినబడిన ఈ సినిమాలో తొలిసారిగా హిందీ అగ్రనటుడు అమితాభ్ నటిస్తున్నారు. ఇంకా మలయాళం నుంచి విజయ సేతుపతి, కన్నడ నుంచి సుదీప్, ఇంకా అనేక ఇతరభాష రంగ నటులు నటించడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో తెలియాలంటే రెండోతారీకు మధ్యాహ్నం వరకు ఆగాలి.

ఇక అసలు విషయానికి వస్తే తెలుగు సినిమారంగం సుమారు ఇరవై ఏళ్ళక్రితమే వర్ణసంకరమై పోయింది. హీరో తెలుగువాడుంటాడు. హీరోయిన్, ప్రధాన విలన్, సంగీత దర్శకుడు, దర్శకుడు, కెమెరామన్, మరికొందరు నటీనటులు, సాంకేతికనిపుణులు ఇతరభాషలనుంచి తెస్తున్నారు. ఒక తరుణంలో నిర్మాత తప్ప సినిమాలో పనిచేసే అందరూ పరాయిభాషలకు చెందినవారే ఉండేవారు. తెలుగు భాష నుంచి ఒక కథానాయిక వచ్చి ఎన్ని దశాబ్దాలు అయింది? జయప్రద, జయసుధ, రమ్యకృష్ణ తరువాత తెలుగు అమ్మాయి ఒక్కరైనా హీరోయిన్ గా సినిమారంగంలో కనిపించారా? ఎందుకీ దౌర్భాగ్యం?

ఒక జమునను, ఒక వాణిశ్రీని, ఒక సావిత్రిని, ఒక కృష్ణకుమారిని, ఒక శారదను, ఒక జయసుధను, ఒక కన్నాంబను, ఒక శాంతకుమారిని ఎందుకు తయారుచేసుకోలేక పోయాము? ఎందుకు పరభాషావ్యామోహంలో పడి కొట్టుకుని పోతున్నాము? అదేమంటే తెలుగు సినిమా ప్రపంచమంతా విస్తరించింది కాబట్టి ఆయా భాషల ప్రేక్షకులు చూడాలంటె వారి భాషల నటీనటులు ఉండాలి అని వాదిస్తున్నారు నిర్మాతలు, దర్శకులు. ఓకె. ఒప్పుకుందాము. మన తెలుగులో మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, నట రత్న, నట సింహ, ప్రిన్స్, ఆ స్టార్…ఈ స్టార్ అంటూ చంకలు గుద్దుకుంటాము కదా. మరి మన మెగా స్టార్, పవర్ స్టార్లను దృష్టిలో పెట్టుకుని ఇతర భాషా సినిమాల్లో ఒక్క కారెక్టర్ అయినా సృష్టించబడుతున్నదా? మన చిరంజీవినో, మన మహేష్ బాబునో, పవన్ కళ్యాన్నో, వెంకటేష్ నో, మన పొరుగునే ఉన్న తమిళ, మలయాళ కన్నడ దర్శకులు, నిర్మాతలు ఎవరైనా వారి సినిమాల్లో నటించమని అడిగిన దాఖలా ఉన్నదా? వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని అలా నిలబెట్టుకుంటున్నారు. మనం మాత్రం చేవచచ్చి ఇరుగుపొరుగు కాళ్ళు పట్టుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్నాము. ఇతర భాషల నటులు లేకపోతె మన మెగా, పవర్, సూపర్ స్టార్ల సినిమాలు రాష్ట్రం హద్దులు దాటి ఆడవని మనమే చెప్పేసుకుంటున్నాము. ఇదీ మన తెలుగు సినిమారంగం సాధించిన ప్రగతి!!

కొన్నాళ్ల క్రితం దాసరి నారాయణ రావు సభాముఖంగా ఒక చక్కని మాట సెలవిచ్చారు. “నేను, రాఘవేంద్ర రావు ముప్ఫయి ఏళ్ళు మద్రాసులో ఉన్నాము. వంద సినిమాలకు పైగా దర్శకత్వం చేసాము. మేము తీసినవాటిలో ఎనభై శాతం హిట్స్. అయినప్పటికీ ఒక్క తమిళ నిర్మాత కూడా తమ సినిమాకు దర్శకత్వం చెయ్యమని మమ్మల్ని అడిగిన పాపాన పోలేదు” అన్నారు నిష్టూరంగా…భారతీరాజా, మౌళి, బాలచందర్, భాగ్యరాజా, బాలు మహేంద్ర లాంటి తమిళ దర్శకుల వెంట మన నిర్మాతలు వెర్రిగా పడటాన్ని దృష్టిలో పెట్టుకుని! తమిళ దర్శకులు తీసిన ప్రతి తెలుగు సినిమా అరవకంపుతో నిండిపోయినవే. తెలుగువాడి భావదాస్యం అంతులేని, చావులేని వింతకథ.

1 thought on “తెలుగు సినిమా స్థాయి పెరిగిందా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap