చరిత్రలో నిలిచిపోయే ’86 వసంతాల తెలుగు సినిమా’

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు  తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి నేటి దాకా 86 సంవత్సరాల చరిత్రను సంక్షిప్తంగా ఆసక్తికరంగా అక్షరీకరించిన ” 86 వసంతాల తెలుగు సినిమా ” పుస్తకం 1932 నుండి 2018 వరకు తెలుగు సినిమాకు ఎన్‌ సైక్లోపీడియా వంటిది.

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి నేటి దాకా 86 సంవత్సరాల చరిత్రను సంక్షిప్తంగా ఆసక్తికరంగా అక్షరీకరించిన గ్రంథం ’86 వసంతాల తెలుగు సినిమా’. తెలుగు చిత్ర రంగంలోని నటీనటులు, గాయనీ గాయకులు, నిర్మాతలు, దర్శకులు, వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు, తదితరుల వివరాలను వందలాది ఫోటోలతో, ఒక క్రమపద్ధతిన ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో తెలుగు సినిమా కళాకారులు సంపాదించిన అవార్డుల వివరాలు ఇందులో ఉన్నాయి. సుప్రసిద్ధ చిత్రాలకు, సినిమా ప్రముఖులకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలను వెల్లడించే ఈ పుస్తకం నటరత్న డా, అక్కినేని, దర్శకరత్న, డా. దాసరి, మూవీ మొఘల్, డా. డి. రామానాయుడు వంటి తెలుగు సినిమా లెజెండ్స్ ప్రశంసలు చూరగొన్నది. ఇంత సమగ్రంగా, విపులంగా తెలుగు సినిమా చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారం పుస్తక రూపంలో ఇంత కుముందు రాలేదని చెప్పవచ్చు. దీర్ఘకాలం ఎంతో శ్రమపడి రూపొందించిన ఈ గ్రంథం రచన, సేకరణ, సంకలనం చేసిన వారు ‘సంస్కృతిరత్న” డాక్టర్ కె. ధర్మారావు.

ఈ సందర్భంగా ‘సంస్కృతి రత్న’, డా. ధర్మారావును.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు..

డా. ధర్మారావుగారి కి.. మీ అమూల్య రచన, సంకలనం ’86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని నాతో పంచుకోవడమే కాకుండా, నాపై అభిమానంతో మీరన్న మాటలకు సదా కృతజ్ఞుణ్ని. వివిధ సంవత్సరాల్లో కథానాయకులు, ఇతర నటులు, కథానాయికలు, ఇతర నటీమణులు నటించిన సినిమాల పేర్లను క్రోడీకరించడమే కాక, 1932 నుంచి 2018 వరకూ వెండితెరను ఉజ్వలింపజేసిన నిర్మాతలు, సినీ దర్శకులు, సంగీత దర్శకులు, కథారచయితలు, స్టంట్ మాస్టర్లు, మేకప్, కాస్ట్యూమ్స్ కళాకారులు పని చేసిన సినిమాల పట్టికల్ని క్రోడీకరించి తెలుగు సినీ చరిత్రను గ్రంథస్థం చేశారు. మీ కృషి అసాధారణమైనది, ప్రశంసించదగినది. ఎన్నో తరాల సినీ పరిశోధకులకు, సినీ అభిమానులకు కరదీపిక కాగలిగిన ఈ పుస్తకాన్ని వెలువరించిన మీరు ధన్యులు.” అంటూ అభినందించారు.

200 ప్రతులు ‘మా’ నటీనటుల సంఘంకు బహూకరణ మహోత్సవం హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపి మురళీమోహన్‌, మా అధ్యక్షులు నరేష్‌ వి. కె, ప్రముఖ సినీ రచయిత డా. పరుచూరి గోపాల కృష్ణ, సినీ విజ్ఞానవిశారద ఎస్‌. వి. రామారావు, ప్రముఖ సినీ నటులు, రచయిత రావి కొండలరావు, డా. కే. వి. రమణ చారి పాల్గొన్నారు. ముఖ్య అతిధులను ఫాస్‌ అధ్యక్షుడు కె ధర్మారావు శాలువాలతో సత్కరించారు.

SA: