తెలుగు సినిమాకు కొత్త ఊపిరి – ఆ రెండు సినిమాలు

అగ్ర కథానాయకుల చిత్రాలు సైతం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం, చిన్న చిత్రాలు కనీస ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడంతో గత కొంతకాలంగా నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎగ్జిబిటర్స్ ఖాళీగా ఉన్న థియేటర్లను చూసి కలత చెందడం మొదలెట్టారు. సినిమా టిక్కెట్ రేట్లను పెంచడం వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదేమోననే సందేహంతో స్వచ్చందంగా వాటిని తగ్గించి, తక్కువ రేట్లకే తమ చిత్రాలను ప్రదర్శిస్తున్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. అయినా ఫలితం శూన్యం. జూన్ లో అనువాద చిత్రం ‘విక్రమ్’, అడవి శేషు సినిమా ‘మేజర్’ కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. జూలైలో అనువాద చిత్రాలతో కలిపి 31 సినిమాలు విడుదలయ్యాయి. అంటే సగటున రోజుకు ఒక్కటి. ఈ ఏడాదిలో అత్యధికంగా సినిమాలు విడుదలైన మాసం కూడా ఇదే! ఇందులో ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా బ్రేకీవెనక్కు రాలేదు.

ఇదే సమయంలో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు ఆందోళన మొదలు పెట్టారు. కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించే సరికీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ లో చలనం మొదలైంది. ఓ పక్క విజయాలు లేక సతమతమౌతుంటే ఇప్పుడీ వేతనాల పెంపు నిర్ణయానికి ఎలా ఆమోదముద్ర వేయాలో అర్థం కాలేదు. ఛాంబర్ దిల్ రాజుతో ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుంది. ఇదే సమయంలో స్టార్ హీరోలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాలు, వారి మంది మార్బలం ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని నిర్మాతలు గ్రహించారు. దీనికి తోడు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయనే విమర్శ గత కొంతకాలంగా వినిపి స్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నీ పరిష్క రించుకోవాలంటే కొంతకాలం షూటింగ్స్ రద్దు చేసు కుని, ఒక్కొక్క విభాగంతోనూ చర్చించాల్సిందే అనే నిర్ణయానికి మెజారిటీ నిర్మాతలు వచ్చారు. ఫలితంగా ఆగస్ట్ ఒకటి నుండీ షూటింగ్స్ ఆగిపోయాయి. ఓ రకమైన సంకట స్థితిలో ఉన్న నిర్మాతలకు ఆగస్ట్ 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. నిజానికి ఈ రెండు సినిమాల విడుదలకు ముందే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో, రారో తెలుసుకోవడానికి ఇదో పరీక్ష లాంటిదని సినిమా రంగం భావించింది. అందులో వీరికి విజయం లభించిందనే అనుకోవాలి. మరి ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ రెండు సినిమాల్లో ఏముంది?

సీనియర్ నిర్మాత అశ్వినీదత్, హను రాఘవపూడి దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘సీతారామం’. అనాథ అయిన రామ్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా పని చేస్తాడు. 1965లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోకి వెళ్లి అక్కడి టెర్రరిస్టులను మట్టుబెట్టే రహస్య ఆపరేషన్లో పాల్గొంటాడు. ఆ సమయంలో ఓ పాపను రక్షించి తాను బందీ అయిపోతాడు. దానికి ముందు రామ్ ను ఇక్కడ సీత అనే అమ్మాయి ప్రేమిస్తుంది. తన కుటుంబాన్ని వదులుకుని రామ్ కోసం కశ్మీర్ కు వచ్చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చేతిలో చనిపోవడానికి ముందు రామ్… సీతకు ఓ లేఖ రాస్తాడు. ఇండియాను ద్వేషించే పాకిస్తానీ అమ్మాయి అఫ్రీను ఇరవై యేళ్ల తర్వాత అంటే 1985లో ఆ లేఖ భారత్ లో ఉన్న సీత చేతికి అందించాల్సిన పరిస్థితి కలుగుతుంది. భారత్ ను ద్వేషించే అఫ్రీన్.. సీత, రామ్ జీవితాన్ని గురించి ఏం తెలుసుకుంది? ఈ క్రమంలో ఆమెకు భారతదేశం పట్ల, ఇక్కడి సైనికుల పట్ల ఎలాంటి గౌరవం ఏర్పడింది? అనేది ఈ చిత్ర కథ. యుద్ధం నేపథ్యంలో తీసిన ప్రేమకథా చిత్రమిది.

ఇక రెండోది కల్యాణ్ రామ్ వశిష్ఠను దర్శకుడిగా పరిచయం చేస్తూ నటించి, నిర్మించిన సినిమా ‘బింబిసార’. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలో మొదలయ్యే ఈ టైమ్ ట్రావెల్ మూవీ ప్రస్తుత కాలంలోనూ కొనసాగుతుంది. కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అతని నటనలోని వైవిధ్యాన్ని జనం మెచ్చారు. మదగజం లాం ఓ చక్రవర్తి మానవత్వం నిండిన మనిషిగా ఎలా మారాడు? అనేది ఈ చిత్ర కథ. ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కల్యాణ్ రామ్ గతంలో చేసినా ఈ కథ నేపథ్యం జనాలను ఆకట్టుకుంది. ఆయుర్వేద వైద్యంలోని గొప్పతనాన్ని, దాని విలువను ఇందులో చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. దాంతో ఈ రెండు సినిమాల తోనూ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. నిజానికి ఇవి రెండూ పరిశ్రమ ఊదరగొడుతున్నంత గొప్ప సినిమా లేమీ కావు. ఇందులో బోలెడు లోపాలూ ఉన్నాయి. అయితే, ఆయా దర్శక నిర్మాతలు ఈ రెండు సినిమాలను నిజాయితీతో తెరకెక్కించారు.

దానిని ప్రేక్షకులు గుర్తించారు. ఇండ్రస్టీ పెద్దలు సైతం ఈ రెండు సినిమాలను భుజానకెత్తుకుని ప్రచారం చేయడంతో ఓ రకమైన పాజిటివ్ వైబ్ మొదలైంది. ఈ మాత్రం ఆదరణ ఇటీవల కాలంలో ఏ సినిమాకూ లభించకపోవడంతో ఎడారిలో ఒయాసిస్సు మాదిరి ఈ రెండు సినిమాలు చిత్రసీమకు కనిపిస్తున్నాయి. మరి ఈ అనుకూల వాతావరణంలో, తమ సమస్యలను సత్వరమే పరిష్కరించుకుని నిర్మాతలు సినిమా షూటింగ్స్ ను తిరిగి ప్రారంభిస్తే అందరికీ మంచిది.

అరుణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap