2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ – 520 010, ఆంధ్రప్రదేశ్
“మాతృభాషను కాపాడుకుందాం-స్వాభిమానం చాటుకుందాం” అని నినదిస్తూ, 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేయు భాషాభిమానులైన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నాం.
తూర్పు దేశపు ఇటాలియన్ భాషగా పాశ్చాత్యులు, సుందరమైన తెలుగు అని ఇతర భాషా ప్రముఖులు తెలుగు భాషను ప్రశంసించటానికి ప్రధాన కారకులు మన సాహితీమూర్తులే!
భాషోద్యమాలను నిర్వహించి ప్రతి యుగంలోనూ తెలుగు భాష మధురిమను ఇనుమడింపచేసిందీ, వాడుకభాషకు పట్టంగట్టి, భాషను ప్రజాపరం చేసిందీ రచయితలే! కలం యోధులూ, గళం యోధులూ చేసిన కృషి ఫలితంగానే భాషోద్యమాల నిర్మాణం జరిగి. తెలుగు మాధుర్యం విశ్వపరివ్యాప్త మయ్యింది. భాషాజాతిగా తెలుగు వారిలో జాత్యభిమానం కలిగించిన మహాకవులందరూ చిరస్మరణీయులే!
కవులూ కళాకారులూ మరోసారి సంఘటితమై భాషోద్యమాన్ని బలోపేతం చేయవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమయ్యిందని భావిస్తున్నాం. ఈ సాంకేతిక యుగంలో తెలుగును ‘ప్రపంచ తెలుగు’గా ఆంగ్లంతో సమానంగా తీర్చి దిద్దే కార్యాచరణ నేటి అవసరం కూడా!
2019వ సంత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగుసహా, తెలుగు నేలపైన అన్ని మాతృభాషలను పరిరక్షిస్తూ, ప్రజలలో మాతృభాషానురక్తిని రేకెత్తిస్తూ తెలుగు ప్రజల గుండె తలుపులు తట్టే లక్యంతో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు రూపకల్పన జరిగింది.
దేశ విదేశాల నుండి ప్రతినిధులుగా నమోదయిన 1500 మంది సాహితీ సాంస్కృతిక మూర్తులు, భాషా సాంకేతిక నిపుణులు ఈ మహా సభలకు తరలి వస్తున్నారు.
తెలుగు భాష కోసం పొట్టి శ్రీరాములుగారు చేసిన ఆత్మబలిదానం, వంగభాష కోసం ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేసిన ప్రాణత్యాగాల నుండి ఈ నాటి తరం స్పూర్తిని పొందటానికి ఈ సభలు దోహద పడాలని ఆశిస్తున్నాము.
కొమర్రాజు లక్ష్మణరావు సభా ప్రాంగణంలో గిడుగు రామమూర్తి భాషా సాంస్కృతిక వేదిక మరియు సురవరం ప్రతాపరెడ్డి భాషా పరిశోధన వేదికల పైన 15 సదస్సులు, అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగనున్నాయి.
తెలుగు భాష పరిరక్షణకు, అభివృద్ధికీ, ఆధునీకరణకు అంతర్జాతీయ స్థాయిలో అంకితమై పనిచేసే సంస్థగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాలలో మీరూ భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం.
గుత్తికొండ సుబ్బారావు, అధ్యక్షుడు
డా. జి వి పూర్ణచందు, కార్యదర్శి