తెలుగు నాటక రంగ మూల స్తంభాలు

(234 మంది తెలుగు రంగభూమికి సేవాపరాయణులైన, కీర్తిశేషులూ అయిన నాటక రంగంలో ఉద్దండులైన కళాకారుల సంక్షిప్త పరిచయ గ్రంథం)

నిన్న సాయంత్రం(21-02-2023) గుంటూరులో ఒక గొప్ప పుస్తకం మీద సభ జరిగింది. నిజానికి ఆ పుస్తకం మీద హైదరాబాదులో రవీంద్ర భారతి లాంటి పెద్ద సమావేశ మందిరంలో వందల మంది వీక్షకుల సమక్షంలో జరగవలసిన సభ. కానీ విలువైన వ్యక్తులతోనే ఐనా చిన్న సమావేశ మందిరంలో సభ జరిగింది.
‘తెలుగు నాటక రంగ మూల స్తంభాలు’ అనే 1000 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించిన సభ ఇది. ఈ సభ ఇంత చిన్న ప్రదేశంలో జరగటం. అదొక లోటు కాదు గాని ఈ 1000 పేజీల పుస్తకం దీని వెనుక ఉన్న కృషి తెలుగు జాతి జనులందరి దృష్టికి తేవలసిన అవసరం ఉంది. దీని గురించి ప్రచురణకర్త అప్పాజోస్యుల సత్య నారాయణ గారు ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో ఇలా ఉంది.

” ప్రస్తుతం గ్రంథం తెలుగు నాటక రంగ వికాస దశ నుంచి నేటి వరకు తమ వంతు సేవలందించిన దివంగతులైన మహనీయమూర్తుల సంక్షిప్త పరిచయాల వ్యాస సంకలనం. తెలుగు నాట ‘తెలుగు నాటక రంగం మూల స్తంభాలు’ అన్న పేరుతో వెలువడిన ఈ బృహత్ గ్రంథంలో మొదటి భాగం 116 మంది నాటక కర్తల గురించి, 99 మంది దర్శకులు, నటుల గురించిన పరిచయ వ్యాసాలు పొందుపరచబడ్డాయి. మరో 19 వ్యాసాలు నాటక ప్రసిద్ధులైన సాంకేతిక నిపుణులను గురించి అనుబంధంగా పుస్తకంలో చివరి భాగంలో కూర్చారు. వెరసి ఈ గ్రంథం 234 మంది తెలుగు రంగభూమికి సేవాపరాయణులైన, కీర్తిశేషులూ అయిన నాటక రంగంలో ఉద్దండులైన కళాకారుల సంక్షిప్త పరిచయం.
ఈ అన్ని వ్యాసాలకు కర్తలు, కర్మలు, క్రియలు ఇద్దరే ఇద్దరు. వారు వర్తమాన తెలుగు నాటక రంగంలో ఉద్దండులైన సర్వ శ్రీ కందిమళ్ల సాంబశివరావు, వాడ్రేవు సుందర్రావు గారలు. ఈ రచయితల ద్వయం 230 మంది కళాకారుల ఛాయాచిత్రాలను పూర్తి పేజీకి సరిపడా సాధించి పుస్తకానికి అదనపు ఆకర్షణ చేకూర్చారు. కందిమళ్ల, వాడ్రేవుల కృషి అనన్య సామాన్యం, అనితర సాధ్యం. ఈ పుస్తకం భావితరాల్లో తెలుగు నాటక సాహిత్య చరిత్రలో సముచిత స్థానాన్ని సంపాదించి, నాటక ప్రియులకు, చరిత్రకారులకు, పరిశోధకులకు కరదీపిక కాగలదు.”
ఇంతవరకు తెలుగులో ఇటువంటి పుస్తకం రాలేదు. నాటక రంగం గురించి గొప్ప పరిశోధన చేసి, దాదాపు ఐదు సంవత్సరాలు పాటు అదే పనిగా కృషి చేసి వెలువరించిన మొదటి పుస్తకం ఇదే. అని సభలో కూడా వారు చెప్పారు. మిగిలిన వక్తలు దీర్ఘాసి విజయభాస్కర్ గారు నాటకానికి సంబంధించి రచయిత గా ప్రయోక్త గా మారిన ప్రతీ వ్యక్తి అదే జీవింతంగా ఎలా జీవిస్తారో స్వానుభవం తో ఉదాహరించారు. నాటకం ఆయా రచయితల కు తమ జీవితం కన్న ఎక్కువఅని చెప్పారు.
తెలుగు నాటక రంగంలో శాస్త్రంలోనూ, రంగస్థలం మీదా సమానమైన ప్రతిభ కలిగిన డాక్టర్ డి. ఎస్. ఎన్ మూర్తి గారు మనకి చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటేషన్, ప్రిజర్వేషన్ లేకపోవడం మీద ఆవేదన చెందుతూ ఎంతో సాధికారమైన ప్రసంగం చేశారు. దాని అవసరాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఈ పుస్తకం ఆ విధంగా చాలా విలువైనది అన్నారు. దీన్ని ఎంతో శ్రమతో కూడిన పరిశోధన నుంచి వచ్చిన గొప్ప పుస్తకంగా పేర్కొన్నారు.
కందిమళ్ల సాంబశివరావు గారు ఈ పుస్తక రచనలో రచయితల, నటుల ఛాయాచిత్రాల కోసం పడిన శ్రమ గురించి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే చెప్పగలిగారు. సమయాభావం కారణం. ఇక కొందరు నాటక రచయితల, నటుల వివరాలను విశ్వవిద్యాలయాలు కూడా ఇవ్వలేకపోయాయని ఆయానటుల, రచయితల కుటుంబ సభ్యులను ఎక్కడున్నారో పట్టుకుని వారి ద్వారా వివరాలను సేకరించడానికి ఎన్ని రోజులు తిరిగారో కూడా వివరించి చెప్పారు. అప్పా జోశ్యుల సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభ రెండు గంటలు మరువలేని విధంగా అనిపించింది.
అదే సమయం లో సంస్థలు, విశ్వవిద్యాలయాలు చెయ్యని పనిని ఇద్దరు వ్యక్తులు కందిమళ్ల సాంబశివ రావు గారు, వాడ్రేవు సుందర్రావు గారూ తమ ధనాన్ని, సమయాన్ని కూడా ఖర్చుపెట్టి చేశారని, ఇంతటి పరిశోధనాత్మక గ్రంధాన్నితెలుగు జాతికి అందించారని విని , అలాంటి ఈ ఉద్గ్రంధాన్ని మాతృభాషా దినోత్సవం నాడు ఆవిష్కరించడం ద్వారా నిజమైన భాషోత్సవం జరుపుతున్నట్లు గా అనిపించింది. అందువల్ల కూడా మరువలేనిసభ.

అంతేకాదు ఎన్నో శ్రమలకోర్చి ఎప్పటెప్పటి నటులవో, నాటక రచయితలవో, దర్శకులవో మూడునాలుగు తరాల తరువాత కూడా వారి కుటుంబసభ్యులను కలిసి వారి వివరాలు, చిత్రాలు, ఇంకా మనకు తెలియని విషయాలన్నీ శ్రమకోర్చి సేకరించి ఇందులో పొందుపరచటం మాములు విషయం కాదు.
మూడు, నాలుగు సంవత్సరాల పాటు వీరు పడ్డ శ్రమ తెలుగు నాటకరంగ వైశిష్ట్యాన్ని తరువాతి తరాలకు అందించటం కోసమే అని అన్నప్పుడు సంతోషంతో కన్నీళ్ళొచ్చాయి నాకు. ఇలాంటి వారినే కదా ‘కారణజన్ములు’ అంటారు అనిపించింది. ఒక నాలుగైదు పీహెచ్డీ లకు సరిపడిన విషయ సేకరణ శ్రమా కూడి ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇందులో వారు పేర్కొన్న ప్రతీ కళాకారుల చిత్రాలు ఉంచటానికి వారుపడ్డ శ్రమ అంతాఇంతా కాదు.

విశిష్ట అతిధి ప్రఖ్యాత నాటక రచయిత శ్రీ దీర్ఘాశి విజయ భాస్కర్ గారు మాట్లాడుతూ ఇంత గొప్పకార్యం తలపెట్టిన శ్రీ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారిని అభినందించారు. వాడ్రేవు వారి కుటుంబం ధన్యులని, అక్కవాడ్రేవు వీరలక్ష్మి గారూ, వారి తమ్ముళ్లు శ్రీ సుందరరావుగారు, శ్రీ చినవీర భద్రుడు గారి సాహీతీ సేవలను కొనియాడారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రీయ విద్యాలయ రంగస్థల కళల శాఖ విశ్రాంత ఆచార్యులు శ్రీ డి ఎస్ ఎన్ మూర్తి గారు మాట్లాడుతూ, అనేక మంది మహాకవులు రచయితల కాలాలు మనకు తెలియవని, వారికీ సంబంధించిన వివరాలు గ్రంధస్థం చేయకపోవటం వల్ల వారి వివరాలు తెలియటం లేదని బాధపడ్డారు.
అటువంటి తప్పుజరగకుండా తెలుగు నాటకరంగానికి సంబంధించి అందరిగురించిన సమాచారం పొందుపరచిన ఈ మహా గ్రంధాన్ని ప్రచురించటం తమ సామాజిక ధర్మంగా భావించిన అజో విభో ఫౌండషన్ వారికి ఈ సందర్భంగా నమోవాకాలు అర్పించాలి. భవిష్యత్తులో తెలుగు నాటకరంగం గురించి తెలుసుకోదలచిన ఔత్సాహికులకు ఈ పుస్తకం ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

Book inauguration at Guntur

ఏ ఫోర్ సైజులో ఉన్న ఈ 950 పేజీల హార్ట్ బౌండ్ పుస్తకం వెల 1200 రూపాయలు మాత్రమే. అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ దొరుకుతుంది ఒకసారి కళ్ళతో ఈ పుస్తకాన్ని చూస్తే దీని వెనుక ఉన్న కృషి అర్థమవుతుంది తప్ప నోటి మాటతో ఎంత చెప్పినా దీని మహత్వాన్ని, భారవత్వాన్ని పాఠకులకు అందించడం కష్టం.
-పద్మజ కుందుర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap