తెలుగు భాషోద్యమ సమాఖ్య

తెలుగు భాషోద్యమ సమాఖ్య విస్తృత సమావేశానికి ఆహ్వానం ఫిబ్రవరి 20వ తేదీన, ఆదివారం.

తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003 ఫిబ్రవరి 21న స్థాపించినప్పటి నుండి తెలుగు భాష రక్షణ కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోను, ఇతర ప్రాంతాలలోను నిర్వహించుకొన్నాము. మిత్ర సంఘాలను కూడా ప్రోత్సహించాం. పాలన, బోధన రంగాల్లో తెలుగు అమలు కోసం ఉద్యమాలను నడిపి, న్యాయస్థానాలను కదిలించి అనేక సానుకూల ఉత్తర్వులను సాధించాం. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపుకై ముందుగా జాతిని మేల్కొల్పి ప్రభుత్వాలను కదిలించి గుర్తింపును తెచ్చుకున్నాం. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసమూ, తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థ కోసమూ పోరాడి, వాటికై ప్రభుత్వ ఉత్తర్వులను సాధించుకోగలిగాం. అయినా పాలకుల్లో నిజాయితీ లేకపోవడంతో అదంతా అమలులో నీరుగారిపోయింది. ఇంతేగాక గత రెండు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో విపరీతంగా చోటుచేసుకున్న కార్పొరేటీకరణ విధానాల వల్లా, పాలక పార్టీలు బోధనామాధ్యమంగా తెలుగును అణిచివేసినందువల్లా మాతృభాష ప్రగతికి ఎంతో నష్టం వాటిల్లింది. ఈ అనేక పరిణామాల ఫలితంగా భాషోద్యమంలో ప్రాథమ్యాలను, విధివిధానాలను తిరిగి నిర్ణయించుకోవలసివుంది. ఇందుకోసం తెలుగు భాషోద్యమసమాఖ్యలోకి అనుభవజ్ఞులైన వారినీ, యువతరాన్నీ, విద్యార్థి ఉపాధ్యాయ ప్రతినిధులను, వివిధ రంగాల నిపుణులను మరికొందరిని స్వాగతించి, సంస్థను మరింత చైతన్యవంతంగా, ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించాము. ఒక కేంద్ర విధాననిర్ణయ మండలిని కూడా మనం ఏర్పాటు చేసుకోవలసియున్నది.

ఇందుకోసం సమాఖ్య విసృత సమావేశం 2022 ఫిబ్రవరి 20 ఆదివారం నాడు జరుగుతుంది.
వేదిక : బిషప్ ఇగ్నేషియస్ ముమ్మడి హాల్ (ఓల్డ్ సెమినార్ హాల్), ప్రధాన లైబ్రరీ వెనుక, ఆంధ్ర లొయోలా కళాశాల, గుణదల, విజయవాడ – 520008
సమాఖ్య అధ్యక్షుడు డా. సామల రమేష్ బాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడిని కొత్తగా ఎన్నుకోవలసియున్నది. ఇందుకోసం ఈ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాం. సమాఖ్య సభ్యులతో పాటు, ఇంతవరకు సమాఖ్యతో కలసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారూ, ఇకపై పాల్గొనాలనే ఆసక్తి కలిగినవారూ ఈ సమావేశంలో పాల్గొనగోరుతున్నాము.

ఈ సమావేశంలో పాల్గొనదలచేవారు ఫిబ్రవరి 15లోపుగా 98480 16136 / 92994 56678 లకు వాట్సాప్ ద్వారా గానీ మెసేజ్ ద్వారాగానీ మీ చిరునామాను, ఫోన్ నెం., మెయిల్ ఐడిలను తెలుపగోరుతున్నాము. ఇంకా వివరాల కోసం సంప్రదించ కోరుతున్నాము.

కార్యక్రమం: ఉదయం గం.9.30 నుండి ప్రతినిధులు నమోదు
మొదటి సభ: 10.30 గం. నుండి మధ్యాహ్నం 1 గం. వరకు:
అధ్యక్షుని ప్రసంగం, నివేదిక సమర్పణ, ప్రతినిధుల ప్రసంగాలు, కొత్త అధ్యక్షుని ఎన్నిక, అభినందనలు.
గం 1 నుండి గం 2.30 వరకు భోజనవిరామం .
రెండవ సభ: మధ్యాహ్నం 2.30 గం. నుండి 5 గం. వరకు తీర్మానముల ప్రతిపాదన, చర్చ, ఆమోదం. తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యులు తప్పకుండా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.

  • డా. వెన్నిసెట్టి సింగారావు సమావేశకర్త సెల్: 93930 15584
    • తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆశయ లక్ష్యాలను, విధివిధానాలను ఆమోదించేవారు మాత్రమే సభలో పాల్గొనగోరుచున్నాము.
    •కరోనా వైరస్ నుండి రక్షణ కొరకై ‘ముసుగు'(మాస్క్)ను తప్పనిసరిగా ధరించాలి. వ్యాక్సిన్ చేయించుకున్నవారు మాత్రమే పాల్గొనాలి.

గౌరవాధ్యక్షుడు
డా. చుక్కా రామయ్య

అధ్యక్షుడు
డా. సామల రమేష్ బాబు
ఫోన్: 9848016136

SA: